ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ
మామిళ్ళపల్లి సూర్య బాలసుబ్రహ్మణ్యశర్మ | |
---|---|
![]() ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | మామిళ్ళపల్లి సూర్య బాలసుబ్రహ్మణ్యశర్మ |
జననం | 1929 సెప్టెంబరు 17 |
మూలం | రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం |
మరణం | 2002 నవంబరు 20 | (వయస్సు 73)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ కర్ణాటక సంగీత విద్వాంసుడు. 1997లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక గాత్ర సంగీతం విభాగంలో అవార్డు లభించింది[1].
విశేషాలు[మార్చు]
ఇతడు 1929 సెప్టెంబరు 17వ తేదీన రాజమండ్రిలో మామిళ్ళపల్లి సోదెమ్మ, కొండయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు[2]. ఇతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించగా అన్నగారి పోషణలో పెరిగాడు. చాలా చిన్నవయసులోనే నాదస్వర విద్వాంసుడు జి.పైడిస్వామి వద్ద గాత్రాన్ని అభ్యసించాడు. అతి స్వల్ప కాలంలోనే సంగీతవిద్యను సాధించి స్వశక్తితో స్వయంగా సాధన చేసి కీర్తి గడించాడు. కచేరీలు చేసే ప్రథమ దశలోనే ఇతడు తిరుపతి వెంకట కవులచే "ఆంధ్రబాల గాయకరత్న" అనే బిరుదును, క్రోవి సత్యనారాయణచే "మధుర గాయక" అనే బిరుదును సంపాదించాడు[3].
ఇతడు తిరుచునాపల్లి, మద్రాసు, విజయవాడ, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రాలనుండి కొన్ని దశాబ్దాలపాటు సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలు, గ్రామాలలోని సంగీత సభలలో కచేరీలు చేశాడు. ఇతడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్, టి.కె.మూర్తి, మారెళ్ళ కేశవరావు, వి.కమలాకరరావు వంటి విద్వాంసుల సహకారంతో మద్రాసు, కలకత్తా, ఢిల్లీ వంటి అనేక నగరాలలో తన సంగీత ప్రదర్శన కావించాడు. చెంబై వైద్యనాథ భాగవతార్ ఇతని ప్రతిభను గుర్తించి ప్రశంసించాడు. హరి నాగభూషణం ఇతనికి "ప్రౌఢ గాయకశిఖామణి" అనే బిరుదును ఇచ్చాడు. ఇతడు గురుకుల పద్ధతిలో అనేక మంది శిష్యులను తయారు చేసి వారికి ఉచితంగా సంగీత విద్యను నేర్పించాడు. తరువాత ఇతడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్యకళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత శాఖలకు అధిపతిగా పనిచేశాడు. ఇతని శిష్యులలో ఎస్.జానకి, ఎ.పి.కోమల, కె.వి.బ్రహ్మానందం, సీతా వసంతలక్ష్మి, పెమ్మరాజు సూర్యారావు, పింగళి ప్రభాకరరావు, జి.మధుసూధనరావు, కె.లలిత కళ్యాణి, పిప్పళ్ళ మీరాదాసు,కదిరి నరసింహం వంటి అనేకులు ఉన్నారు.
కర్ణాటక సంగీతంలో ఇతని సేవలకు గుర్తుగా 1997లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఉగాది పురస్కారం మొదలైన ఎన్నో పురస్కారాలను పొందాడు.
ఇతడు తన 73వ యేట 2002, నవంబరు 20వ తేదీన మరణించాడు[2].
మూలాలు[మార్చు]
- ↑ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డ్ సైటేషన్[permanent dead link]
- ↑ 2.0 2.1 నందనవనం శివకుమార్ (20 July 2020). "సంగీత సమ్రాట్ స్వర్గీయ ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ 'సంగీత సాహితీ వైశిష్ట్యం '". గానకళ సంగీత మాసపత్రిక: 1–7. Retrieved 7 February 2021.
- ↑ బుగ్గా పాపయ్యశాస్త్రి (1 March 1963). "ప్రౌఢగాయక శిఖామణి శ్రీ ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ". గానకళ సంగీత మాసపత్రిక. 1 (10): 16–18. Retrieved 7 February 2021.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2022
- Articles with permanently dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2021
- Date of birth not in Wikidata
- 1929 జననాలు
- రాజమండ్రి వ్యక్తులు
- తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి కళాకారులు
- తూర్పు గోదావరి జిల్లా గాయకులు
- సంగీత విద్వాంసులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- సంగీత గురువులు