టి.కె.మూర్తి
టి.కె.మూర్తి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | థాను కృష్ణమూర్తి |
జననం | 1922 ఆగస్టు 13 |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వాయిద్యాలు | మృదంగం, కొనక్కోల్ |
క్రియాశీల కాలం | 1934–ప్రస్తుతం |
వెబ్‌సైటు | T K Murthy |
టి.కె.మూర్తిగా పిలువబడే థాను కృష్ణమూర్తి ఒక కర్ణాటక సంగీత మృదంగ వాద్య కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతడు 1922 ఆగష్టు 13 వ తేదీన కేరళ రాష్ట్రంలోని నయతంగరై గ్రామంలో థాను భాగవతార్, అన్నపూర్ణి దంపతులకు జన్మించాడు. ఇతడు ఎటువంటి శిక్షణ లేకుండా తన 8వ ఏట మృదంగ వాద్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. తంజావూరు వైద్యనాథ అయ్యర్ ఒక కచేరీలో ఇతని మృదంగ వాద్యాన్ని విని ఆకర్షితుడై, మృదంగంలో మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఇతడిని తనతో పాటు తంజావూరు తీసుకువెళ్ళాడు. ఇతడు వైద్యనాథ అయ్యర్ వద్ద పాల్గాట్ మణి అయ్యర్, తంబుస్వామిలతో కలిసి మృదంగం నేర్చుకున్నాడు.[1]
ఇతని పూర్వీకులు అందరూ ఆస్థాన సంగీత విద్వాంసులు. ఇతడు ఐదవ తరానికి చెందిన సంగీత విద్వాంసుడు. ఇతనికి కుమారుడు టి.కె.జయరామన్ ఆకాశవాణిలో సంగీత స్వరకర్త, మనుమడు కార్తికేయ మూర్తి సినిమా సంగీత దర్శకుడు.[2][3]
వృత్తి
[మార్చు]మూర్తి తన 11వ యేట కోయంబత్తూరులో ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గాత్ర సంగీత కచేరీలో మొట్టమొదట నైపుణ్యం కలిగిన మృదంగ విద్వాంసునిగా తన ప్రదర్శన ఇచ్చాడు. ఇతడు 15000లకు పైగా కచేరీలలో మృదంగ సహకారం అందించాడు. ఇతడు 80 సంవత్సరాలకు పైగా అనేక తరాల సంగీత విద్వాంసులతో కలిసి కచేరీలు చేశాడు.[1] ఇతడు మృదంగ సహకారం అందించిన వారిలో హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మదురై ఎస్.సోమసుందరం, డి.కె.జయరామన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కున్నక్కూడి వైద్యనాథన్, లాల్గుడి జయరామన్, టి.వి.శంకరనారాయణన్, మాండొలిన్ శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. మృదంగంలో ఇతని శైలి తంజావూరు బాణీకి చెందినప్పటికీ ఇతడు పళని సుబ్రహ్మణ్యం పిళ్ళైకి చెందిన పుదుక్కోటై శైలి పట్ల ఆకర్షితుడయ్యాడు. తంజావూరు శైలినీ, పుదుక్కోటై శైలినీ మిశ్రమం చేసి ఇతడు తనదైన ప్రత్యేకమైన మృదంగ శైలిని అలవరచుకున్నాడు.
గుర్తింపు
[మార్చు]ఇతడికి అనేక పురస్కారాలు, సన్మానాలు లభించాయి. వాటిలో కొన్ని:
- ఋషీకేశ్ శివానంద సరస్వతి స్వామి వారిచే "లయరత్నాకర" బిరుదు.
- "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే కళైమామణి పురస్కారం
- చెంబై వైద్యనాథ భాగవతార్ గారిచే "మృదంగ భూపతి" బిరుదు.
- కాంచీపురం శంకరాచార్యచే "మృదంగ భూషణం" బిరుదు.
- 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- పెర్కూసివ్ ఆర్ట్స్ సెంటర్, బెంగళూరు వారిచే "పాల్గాట్ మణి అయ్యర్ అవార్డు"
- సుర్ సింగార్ సంసద్, ముంబై వారిచే "తాళ విలాస్" అవార్డు.
- కేరళ సంగీత నాటక అకాడమీ వారి ఫెలోషిప్
- మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి పురస్కారం.
- 2010లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి ఫెలోషిప్.
- 2017లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం[4]
ఇతడు త్రివేండ్రం ప్యాలెస్‌లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. ప్రసార భారతి ఇతడికి "జాతీయ కళాకారుడి"గా గుర్తించింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 K. T. P., Radhika (2019-08-08). "T.K. Murthy looks back at a rhythm-filled life". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-08-09.
- ↑ Ganesh, Deepa (2015-01-29). "Sparrow's monstrous talent". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-08-09.
- ↑ Raghavan, Nikhil (2015-01-24). "Tunes from the third generation". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-08-09.
- ↑ "PadmaAwards-2017" (PDF). Archived from the original (PDF) on 2017-01-29. Retrieved 2021-03-12.
బయటి లింకులు
[మార్చు]- "T K Murthy". Official website.
- Dr. T. K. Murthy at Allmusic
- CS1 Indian English-language sources (en-in)
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1922 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- మృదంగ వాద్య కళాకారులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- కళైమామణి పురస్కార గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన కేరళ వ్యక్తులు
- 100 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తులు