Jump to content

ఎమెస్కో

వికీపీడియా నుండి
(ఎమెస్కో బుక్స్ నుండి దారిమార్పు చెందింది)
ఎమెస్కో చిహ్నం

ఎమెస్కో[1] అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. ఎమ్. శేషాచలం అండ్ కో (టూకీగా ఎమెస్కో) అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే బందరులో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్‌ సైజు పుస్తకాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన.[2] 1978లో ఎం.ఎన్‌.రావు మరణించడంతో ఆయన కుమారుడు శేషాచల కుమార్‌ ఎమెస్కో సంస్థనుండి ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్, సాహితీ ప్రియుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన ధూపాటి విజయకుమార్‌ 1989 లో సంస్థను కొన్నాడు. 11 కోట్ల టర్నోవర్‌తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40 మందికి పైగా పనిచేస్తున్నారు.

పూర్వ చరిత్ర

[మార్చు]

ఎమెస్కో ప్రచురణలు తొలుత పాఠ్యపుస్తకాలతో మొదలయ్యాయి. అందులో లీలావాచకం ప్రసిద్ధికెక్కినది.[3] 1970 ప్రాంతాల్లో "ఇంటింట గ్రంథాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించింది. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించింది. మనుచరిత్ర, వసుచరిత్ర, క్రీడాభిరా మం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్యం, శృంగార శాకుంతలం, శృంగార నైషధం, అహల్య సంక్రందనం, కళా పూర్ణోదయం, కాళహస్తి మాహత్మ్యం, పారిజాతాపహరణం, కన్యాశుల్కం, రాజశేఖరచరిత్ర, కృష్ణలీలలు పేరుపొందిన కొన్ని ప్రాచీన ప్రచురణలు. పాలంకి వెంకట రామచంద్రమూర్తి-బొమ్మల ఎమెస్కో పంచతంత్రం, వి.పాండురంగారావు-కొంగ డాక్టరు, గురజాడ అప్పారావు- ముత్యాలసరాలు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ-స్వీట్‌ హోమ్‌, భానుమతి-అత్తగారి కథలు, ముళ్ళపూడి -బు డుగు, యద్దనపూడి సులోచనారాణి-సెక్రటరీ, కోడూరి కౌసల్యాదేవి- శాంతినికేతన్‌, మునిమాణిక్యం-కాంతం కథలు, బాపు, రమణ - బొమ్మల రామాయణం చాలా మందికి గురుతు వుండే ప్రచురణలు.

ఇటీవల ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు

[మార్చు]
ఎమెస్కో అధినేత విజయకుమార్

వ్యక్తిత్వ వికాస రచనలు, ఆరోగ్యం, సాహిత్యం, వర్తమాన తరంగిణి, యాత్రా దర్శిని, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం వర్గాలలో అనేక ప్రచురణలు ఈ సంస్థ ద్వారా వెలువడినవి. దాశరధి రంగాచార్యులు -నాలుగు వేదాలు, బాపు-రమణ తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, పి.వి.ఆర్.కె ప్రసాద్ - సంభవామ్‌,, రచనలు, డి.ఆర్‌.కార్తికేయన్‌ -నిప్పులాంటి నిజం, అబ్దుల్‌కలాం- ఒక విజేత ఆత్మకథ, పి.వి.నరసింహరావు -ది ఇన్‌సైడర్‌ (లోపలి మనిషి), భాట్టం శ్రీరామమూర్తి -స్వేచ్ఛాభారతం, టంగుటూరి ప్రకాశం- నా జీవిత యాత్ర (1972), దాశరధి కృష్ణమాచార్య- యాత్రాస్మృతి, చంద్రబాబు నాయుడు- మనసులో మాట యాతగిరి శ్రీరామ నరసింహారావు, మేడిశెట్టి తిరుమల కుమార్ - మన వావిలాల, అరబిందో - సావిత్రి (అనువాదం: తంబిశెట్టి రామకృష్ణ) వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్ఠలను ఇనమడింప చేశాయి. డా.బి.వి.పట్టాభిరామ్, ఎ.జి.కృష్ణమూర్తి వ్రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు సంకలనంచేసిన పాకెట్ నిఘంటువులు ప్రజాదరణ పొందిన మరికొన్ని పుస్తకాలు. వీరి సైటు https://web.archive.org/web/20101216064421/http://emescobooks.com/

మూలాలు

[మార్చు]
  1. "ఎమెస్కో జాలస్థలి". Archived from the original on 2010-12-17. Retrieved 2010-12-04.
  2. "EMESCO Founder Sri Late M N Rao was inducted into Indian Publishing Hall of Fame". www.telugubhakti.com. Retrieved 2025-05-06.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-25. Retrieved 2009-12-17.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎమెస్కో&oldid=4560137" నుండి వెలికితీశారు