ఐజాక్ మెరిట్ సింగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐజాక్ సింగర్
ఎడ్వర్డ్ హారిసన్ మే గీచిన చిత్రం (1869)
జననం
ఐజాక్ మెరిట్ సింగర్

(1811-10-27)1811 అక్టోబరు 27
పిట్ట్స్‌టౌన్, న్యూయార్క్
మరణం1875 జూలై 23(1875-07-23) (వయసు 63)
జాతీయతఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
Engineering career
Institution membershipsసింగర్ సుయింగ్ మిషన్ కంపెని
Significant advanceకుట్టు మిషను

ఐజాక్ మెరిట్ సింగర్ (ఆంగ్లం: Isaac Merritt Singer) (అక్టోబరు 27, 1811 - జూలై 23, 1875) అమెరికా దేశానికి చెందిన ఆవిష్కర్త, నటుడు, పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన కుట్టు మిషను అనే విశిష్ట యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఈయన సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే కుట్టుడు యంత్రపు నమూనాలపై పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు[1][2]

తొలినాళ్ళు[మార్చు]

సింగర్ 1811 అక్టోబరు 27 న న్యూయార్క్ రాష్ట్రంలోని పిట్ట్స్‌టౌన్లో జన్మించాడు. ఐజాక్ ఎనిమిది మంది సంతానంలో చివరివాడు. ఈయన తండ్రి ఆడమ్ సింగర్ జర్మనీకి చెందిన యూదు మతస్థుల సంతతని నమ్మకం. ఆడం సింగర్ స్వస్థలమైన ఫ్రాంక్‌ఫర్టులో హంగేరీ నుండి వలసవచ్చిన రెయిజింగర్ అనే కుటుంబం ఉండేది.[3] ఐజాక్ చిన్నతనం నుండి యంత్రాలు, నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1821లో ఈయన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత, ఈయన తల్లి కొడుకును గాలికి వదిలేసింది.[4] 12వ యేటే ఇల్లు వదిలి చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు.[5] 19 యేళ్ల వయసులోను సహాయ యాంత్రికుడుగా పని ప్రారంభించాడు.[6]

1830లో ఐజాక్, 19 యేళ్ళ వయసులోనే పాల్మైరాకు చెందిన కాథరీన్ మరియా హేలీని పెళ్ళిచేసుకొన్నాడు. అప్పటికి ఆమె వయసు పదిహేనే. అత్తమామలతో పాటు కొన్నాళ్లు వెస్ట్‌చెస్టర్ కౌంటీలోని క్రోటన్స్ లాండింగ్లో నివసించాడు. 1834కల్లా ఐజాక్ కు ఒక కొడుకు (విలియం) పుట్టాడు, పోర్ట్ గిబ్సన్లో ఒక సొంత ఇల్లు కొనుకున్నాడు. పగలు వివిధ పనులు చేస్తూ, రాత్రిళ్ళు నాటకాలు వేసేవాడు. 1836 కల్లా కుటుంబంతో పాటు న్యూయార్క్ నగరంలో నివసించడం ప్రారంభించాడు.[2]

మొదటి ఆవిష్కరణలు[మార్చు]

1839 లో సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు. ఈ పేటెంటు హక్కును ఇల్లినాయ్ & మిషిగన్ కెనాల్ కంపెనీకి రెండువేల డాలర్లకు అమ్మాడు. అలా సమకూరిన డబ్బుతో తన నట జీవితాన్ని తిరిగి కొనసాగించాలని అనుకున్నాడు. ఆయన తన ఆశయం కోసం ఆయన ఒక నటీనటుల బృందాన్ని ప్రోగుచేసుకొని దేశమంతా పర్యటన ప్రారంభించాడు. ఈ బృందానికి "మెరిట్ ప్లేయర్స్" అనే పేరుపెట్టాడు. బృందం యొక్క ప్రదర్శనలలో సింగర్ "ఐసాక్ మెరిట్" అనే పేరుతో పాల్గొనేవాడు. ఈయన సరసన ఆ బృందంలో "మేరీ అన్న్" "మిసెస్ మెరిట్"గా ప్రదర్శనలిచ్చేది[ఆధారం చూపాలి]. ఆ బృందం యొక్క పర్యటనా ప్రదర్శనలు ఐదు సంవత్సరాల పాటు కొనసాగాయి.

సింగర్ చెక్కను, లోహాన్ని తొలిచే యంత్రాన్ని అభివృద్ధి చేసి ఏప్రిల్ 10, 1849 న దానిపై పేటెంటును నమోదుచేశాడు.

38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ , ఎనిమిదిమంది పిల్లలతో న్యూయార్క్ నగరానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్క బల్లలను కోసే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనుకున్నాడు. పూర్తిస్థాయిలో పనిచేసే నమూనా యంత్రాన్ని తయారుచేసేందుకు ఎ.బి.టైలర్ అండ్ కో వద్ద అడ్వాన్సును పుచ్చుకొని వాళ్ళ షాపులోనే ఒక నమూనా యంత్రాన్ని నిర్మించాడు. అక్కడే తన భవిష్యత్తు ఆర్ధిక భాగస్వామి, పెట్టుబడిదారుడు జి.బి.జీబర్ ను కలుసుకున్నాడు. అయితే నమూనా యంత్రం తయారైన కొంతకాలానికే ఆ షాపులో ఆవిరి బాయిలర్ పేలి, నమూనా యంత్రాన్ని కూడా నాశనం చేసింది. అప్పట్లో ముద్రణా వ్యాసంగానికి కేంద్రమైన బోస్టన్ నగరంలో తిరిగి పనిమొదలుపెట్టేందుకు సింగర్‌ను జీబెర్ ఒప్పించాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను ఆర్సన్ సి.ఫెల్ప్స్ యొక్క యంత్రసామాగ్రి షాపులో ప్రదర్శించాడు. అయితే సింగర్ రూపొందించిన చెక్క కోసే యంత్రానికి పెద్దగా ఆర్డర్లు రాలేదు.

ఫెల్ఫ్స్ దుకాణంలో లెరో అండ్ బ్లాడ్గెట్ కుట్టు యంత్రాలు తయారీ, రిపేరు చేయబడుతుండేవి. తయారుచేయటానికి, ఉపయోగించడానికి క్లిష్టంగా ఉన్న ఆ యంత్రాలను ఒకసారి పరిశీలించమని సింగర్ ను పురమాయించాడు ఫెల్ప్స్.[7] సింగర్ ఆయంత్రంలో షటిల్‌ను వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో కదిలేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాడు. సింగర్ కుట్టుయంత్రానికి చేసిన మెరుగులకు 1851 ఆగస్టు 12 లో యునైటెడ్ స్టేట్స్ నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.

సింగర్ రూపొందించిన ప్రయోగాత్మక నమూనా, దుస్తులు కుట్టుటకు మొదటి యంత్రంగా ప్రసిద్ధి చెందినది. ఈ యంత్రం ఒక నిమిషంలో 900 కుట్లను వేయగలదు. ఈ యంత్రంతో సులువుగా పరిపూర్ణ దుస్తులు కుట్టవచ్చు.[7]

ఐ.ఎం.సింగర్ & కంపెనీ[మార్చు]

1856 లో కుట్టు యంత్రాల తయారీదారులైన గ్రోవెర్ అండ్ బేకర్, సింగర్, వీలర్ అండ్ విల్సన్ లు పరస్పర పేటెంట్ హక్కులను ఉల్లంఘించారని ఒకరినొకరు ఆరోపిస్తూ, తమ వాదాన్ని పరిష్కరించుకునేందుకు న్యూయార్క్ రాష్ట్రపు రాజధాని, ఆల్బనీలో కలుసుకొన్నారు. న్యాయవాది, గ్రోవర్ అండ్ బేకర్ కంపెనీ అధ్యక్షుడైన ఓర్లాండో బి. పోటర్, తమతమ వ్యాపార లాభాలను పరస్పర వ్యాజ్యాలపై విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా, అందరి పేటెంటు హక్కులను సమీకరించుకోవాలని ప్రతిపాదించాడు[ఆధారం చూపాలి]. ఈ పేటెంటు హక్కుల సమీకరణ విధానం, పేటెంటు హక్కులపై వ్యాజ్యాల గొడవలు లేకుండా, క్లిష్టమైన కుట్టు యంత్రాల ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తుంది. అలా ఆ బృందం కుట్టు యంత్రాల సంయుక్త ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే ఈ పత్రిపాదన పూర్తిగా ఫలించాలంటే వీరికి, అదే రంగంలో కొన్ని కీలక నిరాటంకమైన పేటెంటు హక్కులు కలిగి ఉన్న ఎలియాస్ హౌ యొక్క సహకారం అవసరం. అలా హౌతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతిఫలంగా హౌకు తయారైన ప్రతి కుట్టుయంత్రం పై కొంత రాయల్టీ ఇచ్చారు.[ఆధారం చూపాలి]

కుట్టుపని యంత్రాలు చాలా అధిక సంఖ్యలో తయారు కావడం మొదలైంది. 1856 లో ఐ.ఎం.సింగర్ అండ్ కంపెనీ 2564 యంత్రాలను తయారుచేసింది. 1860 లో 13,000 యంత్రాలను న్యూయార్క్ లో గల మోట్ స్ట్రీట్ వద్ద గల కర్మాగారంలో తయారుచేశారు. తర్వాత ఎలిజిబెత్, న్యూజెర్సీలో పెద్ద కర్మాగారం ప్రారంభమైనది.[8] అప్పటి వరకు కుట్టు యంత్రాలను దుస్తులు, బూట్లు, బ్రిడిల్స్, టైలర్స్ కొరకు తయారుచేయబడిన పారిశ్రామిక యంత్రాలు. కానీ 1856 లో గృహ వినియోగానికి అవసరమైన చిన్న కుట్టు యంత్రాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. ఈ యంత్రపు ధరను $100 గా నిర్ణయించారు. కొన్ని అమ్మబడినవి[9] సమ్యూల్ కోట్స్, ఎలి వైట్నీలు వారి తుపాకీలలో ఉపయోగించుటకు అభివృద్ధి చేసిన మార్చుకునే వీలున్న యంత్రభాగాల భావనను ఉపయోగించి కుట్టు యంత్రాలలో కూడా మార్చుకొనే విడిభాగాలను తయారుచేయుటకు సింగర్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అదే సమయంలో తన లాభం 530% పెరుగుతున్న సమయంలో, సగం ధర కోత చేయగలిగింది[9] మార్కెట్లో కుటుంబం ఉపయోగించు యంత్రం "ద టర్టిల్ బేక్"ను సింగర్ మొట్టమొదట తయారుచేశాడు. దాని ధర పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రకారం $10.కు తగ్గినది. ఆయన భాగస్వామి ఎడ్వర్డ్ క్లార్క్ అమ్మకాలను పెంచడానికి వాయిదాల కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేశాడు."[7]

ఐ.ఎం.సింగర్ తన వ్యాపారాన్ని ఐరోపాకూ విస్తరించాడు. ఆయన గ్లాస్గో వద్ద క్లైడ్ బాం వద్ద కర్మాగారాన్ని నెలకొల్పాడు. మాతృ సంస్థ నియంత్రణలో మొదటి అమెరికన్ ఆధారిత బహుళజాతి సంస్థలు పారిస్, రియో డి జనైరో లలో నెలకొల్పబడ్డాయి.

వివాహాలు, విడాకులు , పిల్లలు[మార్చు]

ఆర్థిక విజయంతో సింగర్, న్యూయార్క్‌లోని ఐదవ ఎవెన్యూలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. స్టీఫెన్ కెంట్ తో అక్రమ సంబంధముందన్న ఆధారంతో సింగర్ తన మొదటి భార్య క్యాథరిన్ కు విడాకులు ఇచ్చాడు. మేరీ అన్న్ తో సహజీవనం యధాతథంగా కొనసాగించాడు. ఒక రోజు అనుకోకుండా మేరీ అన్న్‌కు, ఐజాక్ తన వద్ద పనిచేస్తున్న మేరీ మెక్‌గోనిగల్ అనే ఒక ఉద్యోగి పక్కన కూర్చుని ఐదవ ఎవెన్యూలో వివహరిస్తూ కనపడేవరకు ఈ సహచర్యం కొనసాగింది. మేరీ అన్న్‌కు అంతకు మునుపే మేరీ మెక్‌గోనిగల్‌పై ఉన్న అనుమానం ఋజువైంది. అయితే అప్పటికే, మెక్‌గోనిగల్ సింగర్ యొక్క ఐదుగురు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (ఇంకనూ మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) తన భర్తను రెండవ వివాహం నకు అరెస్టు చేయించింది. సింగర్ బెయిలుపై విడుదలై, 1862 లో మేరీ మెక్ గోనియల్ తో సహా లండన్ పారిపోయాడు. ఆ తరువాత ఈ విషయపు దృష్టాంతంలో ఐజాక్‌కు లోవర్ మన్‌హాటన్లో మేరీ ఈస్ట్‌వుడ్ వాల్టర్స్ అనే మరో భార్య ఉందని వెలికివచ్చింది. ఆమెతో పుట్టిన కుమార్తె ఆలిస్ ఈస్ట్‌వుడ్, మెరిట్ ను యింటిపేరుగా స్వీకరించింది. 1860 లో ఐజాక్ తనకు మొత్తం నలుగురు స్త్రీలతో పద్దెనిమిది మంది సంతానం (అప్పటికి 16 మంది జీవించి ఉన్నారు) ఉన్నట్టు అంగీకరించాడు.

ఐజాక్ లండన్లో ఉండగా, మేరీ ఆన్, ఐజాక్ ఆస్తులన్నింటి మీద ఆర్థిక హక్కులను సాధించేందుకు ఐజాక్ యొక్క అక్రమసంబంధాలను వివరిస్తూ దస్తావేజులను పంపించింది. తనకు ఐజాక్ తో సాంప్రదాయకంగా ఎప్పుడూ పెళ్ళి జరగకపోయినా, ఉమ్మడి చట్టం ప్రకారం ఐజాక్ తన మొదటి భార్య కాథరిన్‌కు విడాకులిచ్చిన తర్వాత తనతో ఏడునెలలు కలిసి ఉండటం వలన భార్యాభర్తలైనట్టు న్యాయస్థానంలో దరఖాస్తు పెట్టుకుంది. తుదకు న్యాయస్థానం ఈ విషయంపై ఒక ఒప్పందం కుదిర్చింది కానీ విడాకులు మంజూరు చేయలేదు. తను ఎవరినైనా పెళ్ళిచేసుకునేందుకు స్వతంత్రురాలినని ప్రకటించుకొని జాన్ ఈ.ఫాస్టర్ ను వివాహమాడింది. ఇదిలా ఉండగా ఐజాక్ 1860 లో పారిస్ నివసిస్తున్నప్పుడు పరిచయమైన ఫ్రెంచి వనిత ఇసబెల్లా యూజీన్ బోయర్ ను తిరిగి సంబంధమేర్పరచుకొన్నాడు. ఆమె తన భర్తను వదిలి 1863 జూన్ 13న ఇసబెల్లా యూజీన్ సోమర్‌విల్ల్ అనే పేరుతో గర్భవతిగా ఉన్నప్పుడే ఐజాక్ ను పెళ్ళిచేసుకొంది. ఇసబెల్లాతో ఐజాక్ కు ఇద్దరు కూతుర్లు, నలుగురు కుమారులు కలిగారు. ఐజాక్ మరణం తర్వాత ఈమె 1879లో ఈమె విక్టర్ ర్యూబ్సెట్ (మ.1887) ను, ఆ తర్వాత 1891 లో పాల్ సొహేజ్ ను పెళ్ళిచేసుకొంది.

ఐరోపాలో చివరి రోజులు[మార్చు]

టార్క్వే శ్మశానవాటికలో సింగర్ సమాధి

1863 లో ఐ.ఎం.సింగర్ అండ్ కో పరస్పర అంగీకారం ద్వారా రద్దు చేసుకొని 1887 లో "ది సింగర్ తయారీ కంపెనీ"గా తన వ్యాపారాన్ని కొనసాగించింది.

1871 లో సింగర్ ఇంగ్లండ్ లో పెయింటన్ వద్ద ఒక ఎస్టేటును కొనుగోలు చేశాడు. తాను ఓల్డ్ వే మాన్షన్ ను తన వ్యక్తిగత నివాసంగా ఏర్పాటుచేసుకున్నాడు. దానిని ఆయన మూడవ కుమారుడు, పారిస్ సింగర్ వెర్సెయిల్స్ ప్యాలెస్ శైలిలో పునర్నిర్మించాడు.

వారసులు[మార్చు]

ఐజాక్ యొక్క ఇరవైయ్యో సంతానం, విన్నరెట్టా సింగర్ (ఇసబెల్లా బోయెర్ కూతురు) తన 22వ యేట 1887లో ప్రిన్స్ లూయీ దే స్కీ-మాంట్‌బెలిర్డ్ ను వివాహమాడింది. 1891లో ఈ వివాహం తెగతెంపులైన తర్వాత, ఈమె 1893లో ప్రిన్స్ ఎడ్మండ్ దే పొలినాక్ ను పెళ్ళిచేసుకొంది. ఆ తర్వాత కాలంలో ఈమె ఫ్రెంచి అవాంట్ గార్డ్ సంగీతానికి ప్రముఖ పోషకురాలైంది. మచ్చుకు ఎరిక్ సేటీ తన సొక్రాటే అనే సంగీత ఖండాన్ని ఆమె పురమాయింపుతోనే సృష్టించాడు. లెస్బియనుగా ఈమెకు 1923 నుండి ఇంగ్లీషు రచయిత్రి వయొలెట్ ట్రెఫూసిస్ తో సంబంధం ఉంది.

ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), జాన్ డూక్ దే డెకాజెస్ ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో ఆత్మహత్య చేసుకొంది.

ఐజాక్ యొక్క పెద్ద కుమారుడు, 1914లో మరణించిన విలియం సింగర్, సారా సింగర్ వెబ్ తో వివాహం ద్వారా విలియం సువర్డ్ వెబ్‌కు స్వయానా బావమరిది. విలియం వెబ్ భార్య వాండర్బిల్ట్ వంశానికి చెందిన ఎలీజా వాండర్బిల్ట్. విలియం సింగర్ కూతురు, ఫ్లోరెన్స్ సింగర్ (ఆ తర్వాత కాలంలో కౌంటెస్ వాన్ డిర్న్), తన మేనత్తలు విన్నరెట్టా , ఇసబెల్‌ల మాదిరిగానే ఐరోపా సాంప్రదాయ రాజకీయ కుటుంబంలో పెళ్ళిచేసుకొంది.

ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. పెర్త్ ఆస్ట్రేలియా, 1867 జూన్ 6; మ. పెయింటన్, 1951 మార్చి 7).

వాష్టింగన్ సింగర్, (ఇసబెల్లా బోయెర్ కుమారుడు) ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. విశ్వవిద్యాలయంలో ఒక భవనానికి ఈయన పేరే పెట్టారు.

సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. పెయింటన్, 1888 జూన్ 22; మ. లండన్, 1941 నవంబరు 3), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. లండన్, 1889 జూలై 16; మ. న్యూయార్క్, 1954 జనవరి 28 ), పారిస్ గ్రహామ్ సింగర్, జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 1892 ఫిబ్రవరి 28; మ. డేటోనా బీచ్, ఫ్లోరిడా, 1955 జూలై 19) మరి కొందరు.

మూలాలు[మార్చు]

నోట్సు
 1. "Все о швейных машинах -История создания корпорации Зингер". Archived from the original on 2008-06-12. Retrieved 2013-10-22.
 2. 2.0 2.1 telugu, NT News (2022-02-15). "పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు కొనివ్వ‌లేక కుట్టు మిష‌న్ క‌నిపెట్టాడు." Namasthe Telangana. Retrieved 2022-02-26.
 3. http://www.sewalot.com/singer_history.htm
 4. Hunter, Clare (2019). Threads of life : a history of the world through the eye of a needle. London: Sceptre (Hodder & Stoughton). pp. 256 – 266 269 –271. ISBN 9781473687912. OCLC 1079199690.
 5. PBS Who made America Series - Isaac Singer Profile
 6. http://www.britannica.com/EBchecked/topic/545806/Isaac-Merrit-Singer
 7. 7.0 7.1 7.2 "Isaac Merritt Singer". PBS. Retrieved March 10, 2011.
 8. [1]
 9. 9.0 9.1 "Inventor of the Week / Isaac Merrit Singer (1811-1875)". Lemelson-MIT Program. Archived from the original on 2003-03-02. Retrieved March 10, 2011.
ఇతర పఠనాలు
 • Brandon, Ruth, Singer and the Sewing Machine: A Capitalist Romance, Kodansha International, New York, 1977.
 • Glander, Angelika, SINGER-Der König der Nähmaschinen, Die Biographie, Norderstedt, 2009 (book, German biography)
 • Hawthorne, Paul Oldway Mansion, historic home of the Singer family Torbay Books, Paignton, 2009 ISBN 978-0-9551857-6-2hi

ఇతర లింకులు[మార్చు]