Jump to content

ఒయాసిస్సు

వికీపీడియా నుండి
(ఒయాసిస్ నుండి దారిమార్పు చెందింది)
సహారా ఎడారిలోని ఒయాసిస్సు.

ఎడారి ప్రాంతంలో మామూలుగా నీరు గానీ వృక్ష సంపద ఉండదు. కానీ ఎడారిలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నీరు, వృక్ష సంపద లభ్యమౌతాయి. ఇటువంటి ప్రాంతాల్నే ఒయాసిస్సులు అంటారు. ఇవి ఎక్కువగా నీటి బుగ్గలు ఉన్న ప్రదేశాల చుట్టూ తయారవుతాయి. ఎడారిలో ఇవి జంతువులకు, మానవులకు ముఖ్యమైన జలాధారాలు. ఎడారి చుట్టుప్రక్కల నాగరికత నిలబడడానికి, ఎడారులగుండా ప్రయాణాలకు ఒయాసిస్‌లు చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయి.

ఒయాసిస్‌ల ప్రాముఖ్యత

[మార్చు]

అనాదిగా ప్రపంచంలో వాణిజ్య ప్రయాణ మార్గాలలో ఒయాసిస్సులు ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి. వర్తక బిడారులు (Caravans) ఒయాసిస్సులున్న మార్గాలవెంట ప్రయాణించేవారు. మార్గమధ్యంలో తమకు కావలసిన నీరు, ఆహారం సమకూర్చుకోవడానికి ఇది చాలా అవసరం. కనుక ఒక ఒయాసిస్సు మీద రాజకీయ లేదా సైనిక ఆధిపత్యం ఉన్న వారికి ఆ మార్గంలో వర్తకాన్ని నియంత్రించే అవకాశం ఉండేది. ఉదాహరణకు ప్రస్తుతం లిబ్యా దేశంలో ఉన్న ఆవ్‌జిలా, ఘదమీస్, కుఫ్రా ఒయాసిస్సులు ఆఫ్రికాలో ఉత్తర దక్షిణ భాగాల మధ్య జరిగే సహారా ఎడారి వాణిజ్యంలో చాలా ముఖ్యమైనవిగా ఉండేవి .

హువకచినా ఒయాసిస్, ఇకా, పెరూ

ఒయాసిస్‌లు ఏర్పడే విధం

[మార్చు]

ఒయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడూ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి క్రింద, అనగా రాతి పొర క్రింద, ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్లా చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటలు ఒక చోటినుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile) (1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒకచోటినుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థానభ్రంశం చేస్తుంది. ఇలా ఇసుక మేటలు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం (water table) దగ్గరగా వస్తుంది. అలాంటిచోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు క్రింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఒయాసిస్‌గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు సహారా ఎడారిలోని "ఖర్గా ఒయాసిస్" సుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు అయినది.

అంటే ఒయాసిస్‌లో భూమి ఉపరితలం భూగర్భ జల ప్రవాహాలు లేదా జలాశయాలు (underground rivers or aquifers) కు చేరుకుంటుందన్నమాట. ఇలా భూగర్భంలో ఉన్న ప్రవాహాలను artesian aquifer అంటారు. ఇలాంటి జలాశయాలు గట్టి రాతిపొర దిగువన ఉండవచ్చును. లేదా పర్వతాల మధ్యనున్న పగుళ్ళలో ఉండవచ్చును. వలస పోయే పక్షులు ఇలాంటి నీటిని త్రాగి, అక్కడ వేసే రెట్టల కారణంగా విత్తనాలు పడి, మొలకెత్తి, అక్కడ వృక్ష సంపద పెరగడానికి దోహదం చేస్తాయి. జలాశయాల అంచులవెంట చెట్లు పెరగడం మొదలుపెడతాయి. ఒయాసిస్ లో ఒకటి లేదా ఎక్కువ ఊటలు (springs) ఉంటాయి. ఎడారిలో ఒయాసిస్‌ల పరిసరాలలో గ్రామాలు, లేదా పట్టణాలు లేదా నాగరికతలు అభివృద్ధి అవుతాయి.

ఒయాసిస్‌లో మొక్కల పెంపకం

[మార్చు]
లిబ్యాలోని సహారా ఎడారిలో ఒయాసిస్

ఒయాసిస్సులలో నివసించే ప్రజలు అక్కడ ఉండే అంగుళం స్థలాన్ని కూడా వదలకుండా వాడుకుంటారు. నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఖర్జూరం, అంజూరం, ఆలివ్, and apricots మొదలైన పంటలను పెంచడానికి అనువుగా భూమిని సారవంతం చేయాల్సి ఉంటుంది. ఖర్జూరపు చెట్లు ఒయాసిస్సులో పెరిగే చెట్లలో అతి ప్రధానమైనవి. ఇవి కొంచెం పెద్దవిగా ఉండటం చేత ఈ చెట్ల నీడలో చిన్న చెట్లైన మకరంద చెట్టు లాంటి చెట్లు పెరుగుతాయి. అంతేకాక నిప్పులు కక్కే ఎండలనుంచి చిన్న చెట్లను రక్షిస్తాయి. ఇలా చెట్లను వివిధ స్థాయిల్లో పెంచడం ద్వారా అక్కడి కర్షకులు నీటిని, భూమిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు.

ముఖ్యమైన ఒయాసిస్సులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]