కంపుకరడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంపుకరడులు ఉత్తరదక్షిణ అమెరికా ప్రాంతపు మెంఫిటిడే కుటుంబానికి చెందిన క్షీరదాలు. ఇవి ధ్రువపిల్లులు వలె ముంగిస కుటుంబానికి చెందినప్పటికీ, వీటికి ధ్రువపిల్లులకు కంటే, వీటికి కంపుబిజ్జులకు సంబంధమెక్కువ ఉంది. ఈ జంతువులు ఘాటైన అసహ్యకరమైన ద్రవాన్ని పిచికారీచేసే సామర్థ్యాన్ని కలిగివుంటాయి.  వివిధ జాతుల యీ కంపుకరళ్లు చూడటానికి నలుపు-తెలుపు, కపిల (బ్రౌన్) లేదా అల్లం రంగులతో ఉంటాయి కాని అన్నింటి శరీరాలపై హెచ్చరిక రంగులు ఉంటాయి.

రూపురేఖలు[మార్చు]

కంపుకరడి జాతులు 15.6 నుండి 37 అంగుళాలు, అంటే 40 నుండి 94 సెం.మీల పొడుగు, బరువులో దాదాపు అరకిలో నుండి ఎనిమిదిన్నర కిలోలవరకు ఉంటాయి. వాటి మధ్యస్థ  పొడువుతోనుంటూ, సాపేక్షంగా పొట్టిగా, దృఢంగానున్న కాళ్లతో ఉంటాయి. పొడవాటి ముందుకాలి గోర్లు మట్టిని తవ్వడానికి పనికి వచ్చేలాగ ఉంటాయి. సామాన్యంగా వాటి బొచ్చు నలుపు-తెలుపు  రంగులోనున్నప్పటికీ, కొన్ని జాతులు కపిలం లేదా బూడిదరంగులో ఉంటాయి. అన్ని కంపుకరడులు పుట్టుకతోనే చారలతో ఉంటాయి.  వాటికి ఒక్కోసారి వీపు, తోకమీద కేవలమొక మందమైన గీత (చుక్కల కంపుకరడికి అలావుంటాయి), కాళ్లపై గీతలుంటాయి.

ఆహారం[మార్చు]

కంపుకరడులు సర్వాహారులు అనగా ఇవి శాకాహారం, మాంసాహారం, రెండింటిని ఋతువుల ఆధారంగా తింటాయి. ఇవి కీటకాలు, పురుగులు, వానపాములు, కంబళి-గొంగళి పురుగులు, ఎలుకలు, బల్లులు, కప్పలు, పాములు, చిన్నపక్షులు, పందికొక్కులు, గ్రుడ్లు మొదలయిన మాంసాహారమును తింటూ, సామాన్యంగా నక్కెరలు (బెర్రీలు), దుంపలు, ఆకులు, అలములు, గడ్డిమొక్కలు, కుక్కగొడుగులు, గింజలు తింటాయి.

స్థిరపడిన ప్రాంతాలలో ఇవి మనుషులు వదిలిన చెత్తాచెదారాలను కూడా తింటాయి. తక్కువ తరచుగా, కంపుకరడులు పారిశుద్ధ్యజంతువులుగా మారి, పక్షి, ఇతర జంతు కళేబరాలను తింటూకనిపిస్తాయి. జంతువులను పెంచుకునేవారు తమ ఇంటిపెరటిలో తమ పెంపుడు జంతువులకాహారం పెట్టేచోట ఈ కంపుకరడులు రావడం చూస్తూంటారు. ఇవి సాధారణంగా వచ్చి పెరటిలో మట్టి తవ్వి పురుగులను, వానపాములను తింటుంటాయి.

కంపుకరడులకు దట్టమైన బొచ్చుండటం వలన వీటికి తేనెపట్లను దాడిచేసి తినడం సులభమైంది. అందువలన ఇవి ధైర్యంగా తేనెపట్లను తమ గోళ్లతో చీరి, కాపలాకాచే తేనెటీగలను చంపి తిని తేనెను త్రాగుతాయి. తల్లి కంపుకరడులు ఈ విధానాన్ని తమ పిల్లలకు నేర్పుతాయట. పైగా కాలిఫోర్నయాలో ఈ కంపుకరడులు  పసుపు కందిరీగల గూళ్లను వేసవికాలంలో దాడిచేసి తింటాయి.  ఆ పసుపు కందిరీగలు వేసవిలో ఎండిన సింధూర (ఓక్) వృక్షపు  వ్రేళ్లవద్దనున్న బెరడులో తమ గూళ్లను నిర్మించుకుంటాయి.

ప్రవర్తన[మార్చు]

కంపుకరడులు సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాలలో మాత్రమే క్రియాశీలంగా ఉంటాయి. ఇవి శృంగారము, సంతానోత్పత్తి సమయాలలో తప్ప సాధారణంగా ఒంటరిగా బ్రతికే ప్రాణులు. మంచుప్రాంతాలలో బ్రతికే కంపుకరడులు మాత్రం వెచ్చదనంకై సామూహికంగా బొరియలలో నివసిస్తాయి. రోజంతా అవి తమ పదునైన గోళ్లతో తవ్వుకున్న బొరియలలో ఉంటాయి. మగ-ఆడ కంపుకరడులు కలిసి నివసించే ప్రదేశం దాదాపు 2 నుండి 4 చదరపు కి.మీలు (0.77 నుండి 1.54 చదరపు మైళ్లు) ఉంటుంది.

కంపుకరడులు నిజానికి శీతలకాలపు దీర్ఘనిద్రను చేయవు కాని ఆయా సమయాలలో మాత్రం ఎక్కువ కాలం తమ బొరియలలోనే గడుపుతాయి. అదీకాక, అవి శీతాకాలంలో సజీవంగా ఉన్నా పెరుగుదల ఆగిపోయినట్లు తక్కువ ఆహారాన్ని తింటూ బ్రతుకుతాయి. శీతాకాలసమాప్తి వరకు, చాలా ఆడ కంపుకరడులు (పన్నెండు పైనవరకు) కుక్కుకొని ఒక బొరియలో నివసిస్తాయి. మగవి మాత్రం ఒంటరిగా ఉంటాయి. ప్రతి శీతాకాలానికీ, ఈ జంతువులు ఒకటే బొరియను నియమించుకుని అందులో ఆ కాలమంతా ఉంటాయి.

వాసనా, వినికిడి శక్తులు బాగా కలిగి ఉన్నప్పటికీ, కంపుకరడులకు దృష్టి అంతబాగా లేదు కాబట్టి, వీటికి రోడ్డుప్రమాదాలలో మరణించడానికి ఎక్కువ హాని ఉంది. ఈ ప్రాణులు అల్పాయుష్కులు, అడవిలో వీటి ఆయువు ఏడేళ్లుంటుంది కాని ఇవి మాత్రం కేవలం ఒక సంవత్సరమే బ్రతుకుతాయి. ఇళ్లలో, జూలలో పెంపకంలోనున్న కంపుకరడులు  మాత్రం పదేళ్ల వరకు బ్రతుకే అవకాశాలున్నాయి.

సంతానోత్పత్తి[మార్చు]

కంపుకరడులు వసంత ఋతువారంభకాలంలో సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. ఇవి సాధారణంగా బహుభార్యాత్త్వాలు అనగా ఒక మగజంతువుకు ఒకటికన్నా ఎక్కువ భార్యలుంటాయి.  ప్రసవానికి ముందు (సాధారణంగా మే నెలలో) ఆడ కంపుకరడులు (తమకు పుట్టబోయే నాలుగేడు పిల్లల పెంపకం కోసం) ఒక బొరియను ఆక్రమించి ఉంటాయి. ఈ జంతువులు  జరాయువు (మావి/మాయ) గలవి. వీటి గర్భధారణ కాలం దాదాపు 70 రోజులుంటుంది.

పుట్టిన పిల్లలు కన్నులు మూసుకుపోయి (దృష్టి లేకుండా), వినికిడి శక్తిలేకుండా, శరీరమంతా దట్టమైన బొచ్చుతో పుడతాయి. మూడు వారాల తర్వాత వాటి కన్నులు తెరుచుకునేంత వరకు  అవి అమ్మను ఆశ్రయించి ఉంటాయి. పిల్లలను  తల్లిజంతువులు రెండునెలల వరకు పోషించి ఆ తర్వాత వదిలేస్తాయి. కొన్నికొన్ని సార్లు మాత్రం పిల్లలు తమకు సంతానాన్ని కనే అర్హతవచ్చే వరకు (దాదాపు ఒక ఏడాది) తల్లితోనే కలిసి బ్రతుకుతాయి. తల్లి కంపుకరడులు తమ పిల్లలను కాపాడే ప్రయత్నంలో (ఆపద వేళలలో) దుర్గంధ ద్రవాన్ని తమ మలద్వారంనుండి శత్రువులమీదకు వెదజల్లుతాయి. తండ్రి కంపుకరడులు కూడా పిల్లలను రక్షించడంలో పెంచడంలో పాలుపంచుకుంటాయి.

మలద్వార గ్రంథులు[మార్చు]

కంపుకరడులు తమ మలం యొక్క కంపుకు చాలా ప్రసిద్ధి. ఆ దుర్గంధాన్ని అవి తమ రక్షణకు వాడుకుంటాయి. వాటి మలద్వారం లోపలవైపు రెండు గ్రంథులుంటాయి. అవి ఒక రకమైన  దుర్గంధపూరితమైన ద్రవాన్ని తయారుచేస్తాయి. ఆ ద్రవంలో గంధక రసాయనాలు, థియాల్లు (సాంప్రదాయబద్ధంగా మెర్కాప్టెన్లు) ఉండటం వల్ల ఆ కంపు వస్తుంది. ఒక కంపుకరడి చేసిన పిచికారీ ఎలుగుబంట్లనుపులులను తరిమేయడానికి సరిపోతుంది. మలద్వారానికి ఇరుప్రక్కలా ఉండే కండరాలు, ఆ గ్రంథుల ద్రవాన్ని బయటకు (దాదాపు మూడు మీటర్ల దూరం) చిమ్మేందుకు తోడ్పడతాయి. దుర్వాసన సంగతి అటుంచితే, ఆ ద్రవము వలన దురదలు, ఎర్రని పొక్కులు; కంటిలో పడితే తాత్కాలిక గుడ్డితనం, వస్తాయి. ఆ కంపును మనిషి ముక్కు 5.6 కి.మీల (3.5 మైళ్ల) దూరం నుండి పసిగట్టగలదు.

స్వరక్షణ భంగిమలో నిటారుగా కుచ్చులాంటి తోకతో దుర్గంధ ద్రవాన్ని వెదజల్లబోతున్న ఒక కంపుకరడి (మెఫిటిస్ మెఫిటిస్)

సాధారణంగా కంపుకరడులు ఈ ద్రవాన్ని ఉపయోగించడానికి ఇష్టపడవు. కాని అవి ఏకకాలంలో ఐదారు సార్లు పిచికారీ చేయడానికి సరిపడ ద్రవాన్ని తమ మలద్వారంలో దాచుకుంటాయి. అయిపోయిన  ద్రవాన్ని పునరుద్ధరించుకోవడానికి వాటికి పదిరోజుల సమయం పడుతుంది. నలుపు-తెలుపు చారలు వీపుమీద కలిగుండటం వలన వీటిని గుర్తించడం తేలిక. భయపడిన కంపుకరడులు దుర్గంధద్రవాన్ని చిమ్మడమే కాకుండా ముందుగా బుసలు కొట్టడం, లేదా ముందుకాళ్లపై నిలబడి వెనుక కాళ్లను పైకెత్తడం వంటిది సూచనలను చూపుతాయి.  సాధారణంగా ఒక కంపుకరడి మరొక కంపుకరడిపై కంపుద్రవాన్ని  జల్లదు కాని ఒక ఆడదానికోసం పోటీపడుతున్న లేదా గొడవపడుతున్న రెండు మగకంపుకరడులు మాత్రం ఒకదానిపై మరొకటి ఆ ద్రవాన్ని చిమ్ముకుంటాయి. ఒక బొరియకోసం పోటీపడుతున్న లేదా గొడవపడుతున్న రెండు కంపుకరడులు ద్రవాన్ని వాడకుండా కేవలం తమతమ గోళ్లతో, కోరలతో రక్కుకుంటాయి.

అమెరికా ప్రాంతపు వేటజంతువులైన తోడేళ్లునక్కలు, బిజ్జులు ఆ దుర్వాసనకు భయపడి చాలా అరుదుగా కంపుకరడులపై దాడి చేస్తాయి.  వేటకుక్కలు, మహాశృంగ గుడ్లగూబలు మాత్రం  ఆ కంపుకు భయపడకుండా దాడిచేసి కంపుకరడులను తింటాయి. ఒకానొకప్పుడు,  ఒక గుడ్లగూబ గూటిలో, ఏకంగా 57 కంపుకరడుల అస్థిపంజరాలు దొరికాయి.

ఈ కంపుకరడులు పల్లెప్రాంతాలు, ఉపపట్టణాలలో సాధారణంగా కనిపిస్తాయి. పెంపుడు లేదా వీధి కుక్కలు, పిల్లులపై ఇవి పిచికారీని చేస్తూండటం వలన, ఈ కంపుకరడి యొక్క దుర్గంధ  ద్రవ ప్రభావాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ కంపు యొక్క రసాయనిక కూర్పు ప్రభావంతమైనది. తత్కారణంగా ఇంటిచిట్కాలు విఫలమయ్యేవి. అమెరికా ఐక్యరాష్ట్ర  మానవసమాజం వారు హైడ్రోజెన్ పెరాక్సైడ్ (3 శాతం వరకు పల్చబడినది) +బేకింగ్ సోడా+అంట్లుతోమే సబ్బునీరు మిశ్రమాన్ని వాడి స్నానం చేస్తే ఆ కంపుపోతుందని కనిపెట్టారు.

కంపుకరడి యొక్క దుర్గంధద్రవంలో ముఖ్యంగా మూడు అల్పాణుభారం కలిగిన థియాల్ పదార్థాలున్నాయి. అవి- (ఈ)2-బ్యూటీన్-1-థియాల్, 3-మితైల్-1-బ్యూటేంథియాల్, 2-ఖ్వీనోలీన్ మీతేంథియాల్, పైన వాటియొక్క ఎసిటేట్ థియోఎస్టర్లు. ఈ రసాయనాలు బాగా దుర్వాసన పుట్టించే లక్షణంగలవి.  పైగా మనిషి ముక్కు ఈ పదార్థాలను త్వరగా పసిగడుతుంది.

కాటులు/మనుషులపై దాడులు[మార్చు]

ఆరోగ్యంగానున్న కంపుకరడులు చాలా అరుదుగా మనుషులను కొరుకుతాయి. దుర్గంధగ్రంథులు తొలగింపబడిన పెంపుడు కంపుకరడులు మాత్రం తమ రక్షణకోసం తమ గోళ్లను, పన్నులనుపయోగిస్తాయని కొన్ని ఆధారాలున్నాయి. కంపుకరడులు మనుషులను కరవడానికి ఒక కారణం-ర్యాబిస్ వ్యాధి. రోగనియంత్రణ కేంద్రమువారు అమెరికాదేశంలో 2006లో దాదాపు 1500 కంపుకరడులకు (యావదమెరికాలో అది 21.5శాతం కంపుకరడుల సంఖ్య) ర్యాబిస్ వైరసు సోకినట్లు వెల్లడిచేశారు. రాకూన్లు అనే జంతువుల ద్వారానే కంపుకరడులకు ర్యాబిస్ వైరసు సోకుతున్నట్లు ఆ అధ్యాయంలో తేలింది. రాకూన్లు ఎక్కువగా అట్లాంటిక సముద్రతీరం, మెక్సికోదేశ ఖాతానికి తూర్పుదిశలో నివసించగా, కంపుకరడులు మెక్సికోదేశ ఖాతానికి మధ్యపశ్చిమ- పశ్చిమప్రాంతాలలోనూ, కాలిఫోర్నియాలోనూ నివసిస్తాయి.

పెంపుడు జంతువులుగా[మార్చు]

పెంపుడు కంపుకరడి

మెఫిటిస్ మెఫిటిస్, క్షీరదకుటుంబానికి చెందిన రెండుతెలుపు చారలుగల కంపుకరడి, సాధారణంగా అధికంగా మనుషుల పెంపకంలో ఉండబడే కంపుకరడి. దానిని పెంపుడు జంతువుగా ఉంచుకోవడానికి దానియొక్క కంపుగ్రంథులను శస్త్రచికిత్సచేసి తీసివేస్తారు.  కంపుకరడులను చట్టబద్ధంగా పెంపుడు జంతువులుగా ఉంచుకోవడానికి యూ.కే అంగీకరించింది కాని జంతు సంక్షేమ చట్టం, 2006 దాని గ్రంథులను తీసివేయడం మాత్రం చట్టరీత్యా  నేరంగా పరిగణించింది. కంపుకరడులను చట్టబద్ధంగా పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం కొన్ని అమెరికా ఐక్యరాష్ట్రాలలో ఉన్నప్పటికీ, ఎక్కువ రాష్ట్రాలలో ఇంకా అది చట్టవిరుద్ధమే.

వర్గీకరణ[మార్చు]

ఒక క్రమంలో, ప్రస్తుతం జీవిస్తూన్న కంపుకరడుల యొక్క సమాచారపట్టిక:

యూ.ఎస్ అస్థిశాస్త్ర  సంగ్రహాలయంలో ఉన్న పడగల  కంపుకరడి అస్థిపంజరం
  • మెఫిటిడే కుటుంబం 
    • జన్యువు: కొనెపాటస్
      • కొనెపాటస్ చింగ – మొలీనాప్రాంతపు పందిముక్కు కంపుకరడి
      • కొనెపాటస్ హంబోల్టీ – హంబోల్టీ ప్రాంతపు పందిముక్కు కంపుకరడి
      • కొనెపాటస్ ల్యూకొనోట్స్ – అమెరికా పందిముక్కు కంపుకరడి
      • కొనెపాటస్  సెమిస్ట్రియాటస్ –  చారల పందిముక్కు కంపుకరడి
    • జన్యువు: మెఫిటిస్
      • మెఫిటిస్ మ్యాక్రౌరా– పడగల కంపుకరడి
      • మెఫిటిస్ మెఫిటిస్  – చారల కంపుకరడి
    • జన్యువు: స్పిలోగేల్
      • స్పిలోగేల్ యాంగస్టిఫ్రాంస్ –చుక్కలుగల దక్షిణ కంపుకరడి
      • స్పిలోగేల్ గ్రాసిలిస్– చుక్కలుగల పాశ్చాత్య కంపుకరడి
      • స్పిలోగేల్ ప్యుటోరిస్ – చుక్కలుగల తూర్పు కంపుకరడి
      • స్పిలోగేల్ పిగ్మాయే – చుక్కలుగల మరుగుజ్జు కంపుకరడి

ఇవి కూడా చూడు[మార్చు]

  • కాల్పనిక కంపుకరడుల జాబితా
  • కంపుకరడి నూనె

References[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కంపుకరడి&oldid=2884504" నుండి వెలికితీశారు