కదంబ రాజవంశం
కదంబ రాజవంశం (సా.శ 345 - 540) భారతదేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన ప్రాచీన రాజవంశం. వీరు బనవాసి కేంద్రంగా చేసుకుని ఉత్తర కర్ణాటక, కొంకణ్ ప్రాంతాలను పరిపాలించారు. ఈ రాజ్యాన్ని సుమారు సా.శ 345 సంవత్సరంలో మయూరశర్మ స్థాపించాడు. తరువాతి కాలంలో ఈ రాజ్యం మరింత పెద్దదిగా విస్తరించే అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ పాలకుల స్వయంప్రకటిత బిరుదులు, ఉత్తర భారతదేశంలోని వాకాటకులు, గుప్తులు వంటి ఇతర రాజ్యాలు, సామ్రాజ్యాలతో వారు కొనసాగించిన వివాహ సంబంధాల ద్వారా వారి సామ్రాజ్య స్థాపన ఆశయాలను సూచిస్తున్నాయి. మయూరశర్మ బహుశా కొన్ని స్థానిక తెగల సహాయంతో కంచి పల్లవుల సైన్యాన్ని ఓడించి సార్వభౌమత్వాన్ని ప్రకటించాడు. కాకుస్తవర్మ పాలనలో కదంబ శక్తి తారాస్థాయికి చేరుకుంది.
కదంబులు పశ్చిమ గంగ రాజవంశానికి సమకాలీనులు. వారు కలిసి స్వయంప్రతిపత్తితో భూమిని పాలించడానికి తొలి స్థానిక రాజ్యాలను ఏర్పరచుకున్నారు. ఈ రాజవంశం 6వ శతాబ్దం మధ్యకాలం నుండి పెద్ద కన్నడ సామ్రాజ్యాలు, చాళుక్య మరియు రాష్ట్రకూట సామ్రాజ్యాల సామంతులుగా ఐదు వందల సంవత్సరాల పాటు పాలన కొనసాగించింది. అదే సమయంలో వారు చిన్న రాజవంశాలుగా విభజించారు. వీటిలో గోవాలోని కదంబులు, హలాసి కదంబులు మరియు హంగల్‌లోని కదంబులు ముఖ్యమైనవి. కదంబులకు పూర్వం కర్నాటక ప్రాంతాన్ని నియంత్రించిన పాలక కుటుంబాలు, మౌర్యులు, వారి తరువాత శాతవాహనులు ఈ ప్రాంతానికి చెందినవారు కాదు. అందువల్ల అధికారం ప్రస్తుత కర్ణాటకకు వెలుపలే కేంద్రీకృతమైంది. కదంబులు ప్రాంతీయ భాష అయిన కన్నడను పరిపాలనా స్థాయిలో ఉపయోగించిన మొదటి దేశీయ రాజవంశం. కర్నాటక చరిత్రలో, కదంబుల యుగం ఒక శాశ్వత భౌగోళిక-రాజకీయ పాలనా విభాగంగా, కన్నడ ఒక ముఖ్యమైన ప్రాంతీయ భాషగా ఈ ప్రాంతపు అభివృద్ధిని అధ్యయనం చేయడంలో విస్తృత-ఆధారిత చారిత్రక ప్రారంభ బిందువుగా పనిచేస్తుంది.
చరిత్ర
[మార్చు]మూలపురుషులు
[మార్చు]కదంబుల మూలానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. అటువంటి పురాణాల ప్రకారం, ఈ రాజవంశానికి మూలకర్త త్రిలోచన కదంబ (మయూరశర్మ తండ్రి) అని పిలువబడే మూడు-కాళ్ళ నాలుగు-చేతుల యోధుడు. అతను కదంబ చెట్టు క్రింద శివుని చెమట నుండి ఉద్భవించాడు. మరొక పురాణం మయూరశర్మ స్వయంగా శివుడు మరియు భూదేవికి జన్మించాడని చెప్పడం ద్వారా దానిని సరళీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఇతర ఇతిహాసాలలో కదంబులకు ఉత్తర భారతదేశంలోని నాగులు, నందులతో ఎటువంటి సంబంధం కనిపించదు.[1] సా.శ 1189 సంవత్సరానికి సంబంధించిన ఒక శాసనం, ఈ రాజ్య స్థాపకుడు కదంబ రుద్రుడు కదంబ చెట్ల అడవిలో జన్మించాడని పేర్కొంది. అతని అవయవాలపై "నెమలి ఈక" వంటి ప్రతిబింబాలు ఉన్నందున, అతన్ని మయూరవర్మ అని పిలిచారు.[2] తలగుండ శాసనం నుండి, రాజవంశ వ్యవస్థాపకుడు మయూరశర్మను షణ్ముఖ దేవుడు (సుబ్రహ్మణ్యస్వామి) స్వయంగా పట్టాభిషేకం చేశాడని మరొక పురాణం తెలియజేస్తుంది.[3]
కదంబుల భౌగోళిక మూలంపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. వారు స్థానికులైనా అయ్యుండవచ్చు లేదా ఉత్తర భారతదేశం నుండి అంతకుముందు వలస వచ్చిన వారైనా అయ్యుండవచ్చు.[4] కదంబ కుటుంబ వంశ చరిత్ర కూడా చర్చనీయాంశంగా ఉంది. రాజ్య స్థాపకులు తలగుండ శాసనం ద్వారా వివరించినట్లుగా బ్రాహ్మణ కులానికి చెందినవారు, లేదా స్థానిక గిరిజన మూలానికి చెందినవారని అభిప్రాయాలు ఉన్నాయి. చరిత్రకారులు చోప్రా, ఇంకా ఇతరుల ప్రకారం కదంబులు, సంగం యుగంలో చేర సామ్రాజ్యం (ఆధునిక కేరళ)తో వైరుధ్యంలో ఉన్న కదంబు తెగ వారు. కదంబులు సంగం సాహిత్యంలో కదంబు చెట్టు, ఇంకా హిందూ దేవుడు సుబ్రమణ్యస్వామి ఆరాధకులుగా పేర్కొన్నారు. మరో చరిత్రకారుడు R.N నంది అందమైన కదంబ పుష్పాలను పూసే టోటెమ్ చెట్టును ఆశ్రయించడం ద్వారా కుటుంబానికి ఆ పేరు వచ్చిందని శాసనం పేర్కొంటున్నందున, వారు గిరిజనులై ఉంటారని అభిప్రాయపడ్డాడు.[5][6] అయితే చరిత్రకారులు శాస్త్రి, కామత్ కుటుంబం బ్రాహ్మణ కులానికి చెందినదని, వేదాలను విశ్వసించి, యజ్ఞక్రతువులను చేశారని పేర్కొన్నారు. తలగుండ మరియు గుడ్నాపూర్ శాసనాల ప్రకారం, వారు మానవ్యస గోత్రానికి చెందినవారు మరియు హరితిపుత్రులు ("హరితి వంశపు వారసులు"), ఇది వారిని శాతవాహన సామ్రాజ్య, వారి తరువాత వచ్చిన చాళుక్యులకు సామంతులుగా ఉండిన బనవాసి యొక్క స్థానిక చుటు వంశంతో అనుసంధానించింది.[7][8][9] రావు, మినాహన్ ప్రకారం, వీరు స్థానికులు కావడం వల్లనే, అధికారంలోకి రాగానే తమ కన్నడ భాషకు పరిపాలనా, రాజకీయ ప్రాముఖ్యతను ఇచ్చారు.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ Arthikaje, Mangalore. "History of Karnataka-The Shatavahanas-10, section:Origin of the Kadambas". 1998-00 OurKarnataka.Com, Inc. Archived from the original on 7 September 2006. Retrieved 2006-11-28.
- ↑ Majumdar (1986), p.237
- ↑ Mann (2011), p. 227
- ↑ Chaurasia (2002), p.252
- ↑ Chopra, Ravindran & Subrahmanian (2003), p. 161
- ↑ R.N. Nandi in Adiga (2006), p. 93
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;light
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Sastri (1955), p.99
- ↑ T. Desikachari (1991). South Indian Coins. Asian Educational Services. pp. 39–40.
- ↑ Rao, Seshagiri in Amaresh Datta (1988), p. 1717
- ↑ Minahan (2012), p. 124