మయూరశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మయూరశర్మ (కన్నడ: ಮಯೂರಶರ್ಮ) (మయూరశర్మన్ లేదా మయూరవర్మ (కన్నడ: ಮಯೂರವರ್ಮ) ) (r.345–365 C.E.), శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, కాదంబ రాజవంశ స్థాపకుడు. బ్రాహ్మణ పండితుడైన మయూరశర్మ, బనవాసి రాజధానిగా పశ్చిమ దేశాన్ని పాలిస్తూ, క్షత్రియత్వానికి చిహ్నంగా తన పేరుని ‘మయూరవర్మ’గా మార్చుకున్నాడు.

జననం[మార్చు]

తాళగుంద స్తంభ శాసనం మయూర శర్మ జీవితం, వంశావళిని వివరిస్తుంది

కాదంబ వంశం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు ముక్కంటి, నాలుగుచేతులు కలవాడైన ‘త్రిలోచన కాదంబు’ని వంశస్థులు. కదంబ వృక్షంవద్ద, శివుని నుదుటి నుండి జారిపడిన చెమట చుక్కల నుండి ఈ ‘త్రిలోచన కాదంబుడు’ ఉద్భవించాడు. మరొక కథ ప్రకారం, ముక్కంటి ఐన మయూరశర్మ రుద్రునికీ, భూమికీ ఒక కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇంకొక కథ ప్రకారం, ఒక జైన తీర్థంకరుని సోదరికి కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇవన్నీ మయూరశర్మకి దైవత్వాన్ని ఆపాదించే కథలే.[1] సా.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం[2] ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని కుమారుడు. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు. కన్నడ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు తెలుగు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ కోనసీమకి చెందిన వేదపండితుడు. పల్లవ రాజ్యంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, మయూరశర్మ కత్తిపట్టినట్టు తెలుస్తున్నది.

సామ్రాజ్య స్థాపన[మార్చు]

తాళగుంద శాసనం ప్రకారం, మయూరశర్మ వేదవిద్య తన తాత, గురువు అయిన వీరశర్మతో కలిసి పల్లవపురాన్ని (కంచి లేదా పల్లనాడులోని మరొక నగరం కావచ్చును) సందర్శించినపుడు, పల్లవ అశ్వికుల వలన అవమానింపబడ్డాడు. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వేదవిద్యని వదిలిపెట్టి, కత్తి చేతబట్టాడు.

మయూరశర్మ తొలుతగా పల్లవుల అంతరపాలులని ఓడించి, శ్రీపర్వతం (శ్రీశైలం లేదా నాగార్జునకొండ) వద్దనున్న దట్టమైన అటవీప్రాంతాన్ని ఆక్రమించాడు. కోలార్ పాలకులైన బాణులనుండి కప్పాన్ని కూడా వసూలు చేసాడు. పల్లవుల రాజు స్కంధవర్మ, ఇతనిని నియంత్రించలేక, అమరసముద్రం (అరేబియా సముద్రం) నుండి ప్రేహర నది (మలప్రభ) వరకు ఉన్న ప్రాంతాలకి స్వతంత్ర పాలకుడిగా గుర్తించాడు.

కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ పల్లవుల సైన్యంలో దండనాయకునిగా ఉండినాడు. పల్లవ విష్ణుగోపుడు సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్రలో ఓడిపోవడంతో (అలహాబాద్ శాసనం), మయూరశర్మ బనవాసి రాజధానిగా స్వతంత్ర పాలన ప్రారంభించాడు.

మయూరశర్మ వేయించిన చంద్రవల్లి శాసనం (చిత్రదుర్గ) లో త్రైకూటులను, అభీరులను, సేంద్రకులను, పల్లవులను, పరియాత్రకులను, శకస్థానులను, మౌఖరిలను, పున్నాటులను ఓడించినట్టు తెలుస్తున్నది. తన విజయానికి గుర్తుగా అశ్వమేధయాగాన్ని చేసినట్టు, బ్రహ్మదేయంగా 144 గ్రామాలను బ్రాహ్మణులకు దానమిచ్చినట్టు తెలుస్తున్నది.

బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టేందుకు, రాజక్రతువులను జరిపేందుకు, అహిఛత్రం నుండి వైదిక బ్రాహ్మణులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. కేరళకు చెందిన నంబూద్రీ బ్రాహ్మణులు, ఇలా గోదావరి తీరంనుండి వలసవెళ్ళినవారేనని, కొందరు పరిశోధకుల అభిప్రాయము. వీరి ఇండ్లపేరులలో కళింగపల్లి, సర్పవరం వంటి ఊళ్ల పేర్లు కనిపిస్తాయి.[ఆధారం కోరబడినది]

సమకాలీన సంస్కృతిలో[మార్చు]

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ చారిత్రాత్మక నవల "కడిమి చెట్టు", మయూరశర్మ జీవితం ఆధారంగా వ్రాయబడింది. స్థాన కోడూరు గ్రామానికి చెందిన మయూర శర్మ చిన్నతనంలో, పల్లవులు అతని తల్లి, తండ్రి, అక్క, తాతలను చంపేస్తారు. ఆతనిని రామశర్మ పెంచుతాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పల్లవులపైన పగబడతాడు, మయూరశర్మ.

మయూర శర్మ జీవితం ఆధారంగా కన్నడ నటుడు రాజ్ కుమార్ కథానాయకుడుగా ‘మయూర’ అనే కన్నడ చిత్రం 1975లో నిర్మించబడింది. కంచిలోని పల్లవులతో మయూరశర్మ సంఘర్షణ మొదలుకుని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేంతవరకు మయూరశర్మ జీవితాన్ని చిత్రీకరించారు.

రచనలు[మార్చు]

  1. Moraes (1931), pp7-8
  2. [1] puratattva.in. Retrieved on 2015-11-13.

రిఫరెన్సులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మయూరశర్మ&oldid=3501205" నుండి వెలికితీశారు