Jump to content

కాడు(కన్నడ సినిమా)

వికీపీడియా నుండి

కాడు (కన్నడ:ಕಾಡು) 1973లో నిర్మించబడిన కన్నడ సినిమా. ఈ సినిమాకు గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

కథాసంగ్రహం

[మార్చు]

కిట్టి ఎనిమిదేళ్ళవాడు. అతని తల్లిదండ్రులు పట్నంలో వుంటారు. అతను మాత్రం పినతండ్రి గారి గ్రామం 'కొప్పల్‌'లో పెరుగుతున్నాడు. పినతండ్రి చంద్రగౌడాకు పిల్లలు లేరు. పినతల్లి కమలి అంటే, కిట్టికి చాలా ఇష్టం. కొప్పల్ నుంచి కిట్టి రోజూ హోసూరులో వున్న బడికి వెళ్తూ వుంటాడు.

చంద్రగౌడ ప్రతి రాత్రి హోసూరు వెళ్తూవుంటాడు అక్కడ వున్న బసక్క కోసం. అది చూసి కమలి రోజూ కుమిలిపోతూ వుంటుంది.

ఒకరాత్రి చంద్రగౌడ మామూలుగా హోసూరు వెళ్ళగానే కమలి కిట్టినీ, నౌకరునూ తీసుకుని కాడు (అడవి)లోకి వెళ్ళింది. అడవిలో వున్న ఒక మాంత్రికుడు చంద్రగౌడకు, బసక్కను మరచి పోయి ఇంటి పట్టున ఉండడానికి గాను మంత్రం వేశాడు.

రెండు రోజుల తర్వాత, కిట్టి బడి నుంచి వస్తూ పొదలచాటున ఇద్దరు ప్రేమికులను చూశాడు. వాళ్ళ్లలో ఒకరు పినతండ్రి చంద్రగౌడ; ఆమె ఎవరో అతనికి తెలియలేదు. తను చూసినదేమిటో ఇంటికి వెళ్ళి నౌకర్లతో చెప్పాడు కిట్టి. అది విన్న చంద్రగౌడ కిట్టిని కొట్టాడు.

ఆ రోజు రాత్రి గ్రామ పెద్దలంతా కలిసి ఒక పంచాయితీ జరుపుతున్నారు. కెంచె అనే అతను, ఇంకొకని భార్యను లేవదీసుకు వెళ్ళాడు. దాని మీద న్యాయనిర్ణయం జరుగుతున్నది. కెంచ కొప్పల్ గ్రామవాసే. కాని, అతను శివగంగ అనే అతని దగ్గర హోసూరులో పనిచేస్తున్నాడు. న్యాయనిర్ణయం జరుగుతున్న సమయానికి శివగంగ కూడా అక్కడికి వచ్చాడు. తన వ్యక్తికి న్యాయం జరగాలని పట్టు పట్టాడు. ఆ విధంగా సంబంధం లేని వ్యక్తి తమ సభలో జోక్యం కలిగించుకోవడం చూసి అందరూ మండిపడ్డారు. చంద్రగౌడ శివగంగను బెత్తంతో చావబాదాడు. 'న్యాయసభ'లో గంద్రగోళం చెలరేగింది. ఆ రాత్రి చంద్రగౌడ హోసూరు వెళ్ళలేదు. ఇంట్లోనే పడుకున్నాడు. 'మంత్రం' పని చేసిందని, కమలి తృప్తిపడింది.

మర్నాడు కిట్టి బడి నుండి వస్తూ తాను కిందటి రోజు చూసిన విశేషాన్ని మళ్ళీ చూడడానికి చూశాడు. అక్కడ ఎవరూ లేరు గాని, చెవిరింగు మాత్రం అతనికి దొరికింది. ఆ రాత్రి, మళ్ళీ మామూలుగా చంద్రగౌడ హోసురు బయలుదేరాడు. కమలి నిర్ఘాంతపోయింది.

శివగంగకూ చంద్రగౌడకూ మధ్య పచ్చగడ్డి భగ్గున రగిలింది. కిట్టి పెంపుడు కుక్క వున్నట్టుండి చచ్చిపోయింది. చంద్రగౌడ ఇంట్లో వాళ్ళంతా ఏదో నాటకం చూడ్డానికి వెళ్ళినప్పుడు పెరట్లో వున్న ధాన్యం కుప్పలు తగలడి పోయాయి.

గ్రామ పెద్దలు ఆ విషయాల మీద ఆరా తియ్యలేదు. శివగంగను అడగనూ లేదు; పోలీసులకు చెప్పనూ లేదు. అలా చేస్తే తామూ శివగంగతో పాటు అతనిస్థాయికి దిగజారినట్టే అని వాళ్ళ నమ్మకం.

ఈ వ్యవహారం హోసూరు ప్రజలను కూడా కలవరపరిచింది. రెండు గ్రామాలూ కలిసి మెలిసి వుండడానికి వాళ్ళు ప్రయత్నించారు. హోసూరులో ప్రతియేడు నీటి పందాలు జరుగుతాయి. అందులో పాల్గొనడానికి కొప్పల్ వాసులను హోసూరు ఆహ్వానించింది. విరోధాలు సమసిపోవచ్చునన్న భావనతో చంద్రగౌడ మొదలైన వాళ్ళు, ఆ పందెంలో పాల్గొనడానికి అంగీకరించారు. ఐతే ఆ పందెంతో విరోధాగ్ని మరింత ప్రజ్వరిల్లింది. చంద్రగౌడకు బాగా దెబ్బలు తగిలాయి. అతను మళ్ళీ హోసూరు వస్తే ప్రాణానికి ముప్పు వస్తుందని అందువల్ల రావద్దనీ బసక్క చంద్రగౌడకు కబురు చేసింది. చంద్రగౌడ తాను ఎవరికీ భయపడననీ, ఆ రాత్రే హోసూరు వస్తున్నాననీ కబురు చేశాడు. కమలి భయపడింది. తన భర్త ఎలాగైనా ఇంటిపట్టున వుండేట్టు చెయ్యడానికి మళ్ళీ మాంత్రికుని శరణు వేడాలని కమలి బయల్దేరింది. దారిలో శివగంగ మనుషులు ఆమెను ఎదిరించి, చంపేసారు.కొప్పల్ గ్రామం ఉడికిపోయింది. గ్రామం అంతా కలిసి, చంద్రగౌడ నాయకత్వంలో హోసూరును ఎదిరించింది. ఆ యుద్ధంలో శివగంగ మరణించాడు. పోలీసులు అలజడికి కారకులైన యువతరాన్ని నిర్భందించారు. కొత్త పోలీస్ ఔట్ పోస్ట్ నెలకొల్పారు. కొప్పల్ గ్రామంలో వున్న న్యాయ సంఘానికి ఇక ఎటువంటి అధికారాలు లేవు. పైగా హోసూరు, కొప్పల్ గ్రామస్తులు చేసిన నేరానికి ఫలితంగా పోలీస్ స్టేషన్‌కు అయ్యే ఖర్చులను ఆ రెండు గ్రామాలు భరించాలి.

కిట్టి తల్లిదండ్రులు అతన్ని తమ వూరుకు తీసుకు వెళ్ళడానికి మైసూరు నుంచి వస్తున్నారు. కిట్టి తను నిత్యం ఆహ్లాదంగా విహరించే అడవిని తుదిసారిగా చూడాలనుకున్నాడు. అడవిలోకి పరిగెత్తాడు. అంతే మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి అతన్ని వెతకడానికి వెళ్ళిన వాళ్ళకు అతని జాడ ఏమాత్రమూ తెలియలేదు.[1]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1973[2] 21వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ద్వితీయ సినిమా గిరీష్ కర్నాడ్ గెలుపు
1973[2] 21వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నటి నందిని భక్తవత్సల గెలుపు
1973[2] 21వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ బాలనటుడు జి.ఎస్.నటరాజ్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 September 1974). "కాడు". విజయచిత్ర. 9 (3): 13, 29.
  2. 2.0 2.1 2.2 వెబ్ మాస్టర్. "Twenty First National Awards for Films" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 28 సెప్టెంబరు 2011. Retrieved 25 June 2017.

బయటి లింకులు

[మార్చు]