Jump to content

కుద్రేముఖ్ జాతీయ వనం

వికీపీడియా నుండి
గుర్రపు ముఖం అకారంలో ఉన్న కుద్రేముఖ్ పర్వతం

కుద్రేముఖ్ జాతీయ వనం కుద్రేముఖ్ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జిల్లాలో ఉన్నాయి. ఈ పర్వతాలను ఒక ప్రక్క నుండి చూస్తే అత్యంత ప్రకృతి రమణీయంగా గుఱ్ఱపు ముఖం ఆకారంగా కనిపించే కారణం చేత ఈ పర్వతాలకు కుద్రేముఖ్ అని పేరు వచ్చింది, కన్నడ భాషలో కుద్రే అనగా గుర్రం, ముఖ్ అనగా ముఖం. కార్కళకు 48 కి.మీ.లు, కలసకు 20 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల మీద ఒక చిన్న పట్టణం కూడా ఉంది. ఇక్కడ సమృద్ధిగా దొరికే ఉక్కు ముడిపదార్ధం వల్ల ప్రభుత్వం కుద్రేముఖ్ ఐరన్ ఓర్‌ కంపెనీ లిమిటెడ్ అనే ఒక ఉక్కు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఈ కర్మాగారంలో పనిచేసేవారి నివాస స్థలం కొరకు ఇక్కడ ఒక చిన్న పట్టణ నిర్మాణం జరిగింది. దట్టమైన అడవుల మధ్య, వైవిధ్య వృక్ష-వన్యమృగ సంపద ఉన్న ఈ పర్వతశ్రేణులను చేరే రహదారి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. తుంగ, భద్ర, నేత్రావతి నదుల జన్మస్థానం ఈ పర్వతశ్రేణుల మధ్య ఉన్నదని చెబుతారు. 1.8 మీటర్ల ఎత్తు ఉన్న భాగవతి, వరాహ విగ్రహాలు ఉన్న గుహ పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ.

తుంగ, భద్ర నదులు ఇక్కడ పారుతుంటాయి. కుద్రేముఖ్‌ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కదంబి జలపాతం చూసి తీరవలసిందే. ఇక్కడ కనిపించే వన్యమృగాలలో ముఖ్యమైనవి మలబార్ సివెట్, వేట కుక్కలు, స్లాత్ ఎలుగు బంటి, మచ్చలతో ఉన్న జింక.

భౌగోళిక ఉనికి

[మార్చు]

600 కి.మీ విస్తీర్ణంలో ఉన్న కుద్రేముఖ్, పశ్చిమ కనుమలలో ఉన్న సతత హరిత అరణ్యాలలో అతిపెద్ద సంరక్షిత స్థలం. ఈ సంరక్షిత స్థలం 75°00'55' నుండి 75°25'00" తూర్పు రేఖాంశాలు, 13°01'00" నుండి 13°29'17" ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. జంతు వైవిధ్యం ఉండి ప్రపంచం మొత్తం మీద సంరక్షిత స్థలాలుగా ఎన్నుకొనబడిన 25 ప్రదేశాలలో పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ ఒకటి. వన్యప్రాణి సంరక్షణా సంస్థ (వన్యప్రాణి కన్సర్వేషన్ సొసైటీ), వర్డ్ వైడ్ ఫండ్ చేత అవిష్కరించబడుతున్న ఈ కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం Global Tiger Conservation Priority-I క్రిందకు వస్తుంది.

సరిహద్దులు

[మార్చు]
కుద్రేముఖ్ జాతీయ వనం రమణీయ మైన దృశ్యం

కుద్రేముఖ్ ఉద్యానవనం పశ్చిమాన సోమేశ్వర వన్యమృగ సంరక్షణా స్థలానికి ఆనుకొని ఉన్నది, దక్షిణం వైపు సన్నటి రోడ్డుతో పుష్పగిరి వన్యసంరక్షణ స్థలానికి అనుసంధించబడి ఉంది. ఈ ఉద్యానవనం దక్షిణ-పశ్చిమ వైపులలో నిటారుగానున్న లోయప్రాంతాలు గలిగివున్నది. వీటి శిఖరపు ఎత్తులు 100 మీటర్లనుండి 1892 మీటర్ల వరకు ఉన్నాయి. వీటి ఉత్తర, మధ్య, తూర్పు భాగాలు, కొండల గొలుసులవలె యేర్పడివున్నవి. వీటి పచ్చికబయళ్ళతో ఈ ప్రాంతం పచ్చని తివాచీ వలె కానవస్తుంది. ఈ ప్రాంతపు సరాసరి వర్షపాతం 7000 మి.మీ. అందుకే ఈ ప్రాంతం సతత హరిత అడవులు గల ప్రాంతం.

పర్యాటకులకు దర్శనీయ స్థలాలు

[మార్చు]
హనుమాన్ గుండి జలపాతాలు

ఈ జాతీయవనంలో చాలా అకర్షణలు ఉన్నాయి. ముఖ్యమైన సందర్శనీయ స్థలాలు

హనుమాన్ గుండి జలపాతం

[మార్చు]

జలపాతం కలసకు 32 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ జలపాతం నుండి పడుతున్న నీటి వల్ల 100 అడుగుల ఎత్తుగల సహజ సిద్ధమైన శిలలు ఏర్పడ్డాయి. కొండలు అధిరోహించే ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. అక్టోబరు-మే నెలల ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైన నెలలు.

కుద్రేముఖ్ చరిత్ర

[మార్చు]

1916 సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం కుద్రేముఖ్ ని సంరక్షణ స్థలంగా నిర్ణయించి, అటవీ సంరక్షణను చేపట్టింది. ప్రముఖ వన్యసంరక్షణ నిపుణుడు, పులల మీద పరిశోధన చేసిన నిపుణుడు ఉల్లాస్ కరనాడ్ అంతరించిపోతున్న సింహపు తోక కోతి లేదా 'ప్రాచీన కాలపు కోతి' మీద 1983-84 సంవత్సరాల మధ్య పరిశోధన జరిపి తన నివేదికని కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించాడు.

తన పరిశోధనల్లో ఈ సింహం తోక కోతులు ఈ ప్రాంతంలో జీవించేవని, ఈ ప్రాంతంలోనే కాక పశ్చిమ కనుమలలో, మలబారు ప్రాంతంలో జీవించేవని సూచించాడు. ఇతని పరిశోధనలు, సూచనలను అనుసరించి కర్నాటక ప్రభుత్వం, కుద్రేముఖ్ జాతీయ వనం స్థాపించుటకు 1987లో ఆదేశాలిచ్చింది.

ఇవీ చూడండి

[మార్చు]