కూడవెల్లి
కూడవెల్లి, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన నిర్జన గ్రామం.[1] ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి సమీపంలో గొందిమళ్ళ, ఉప్పలపాడు గ్రామాలు ఉండేవి.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ఈ గ్రామం, దాని శివారు భూములు పూర్తిగా ప్రాజెక్టు జలాల్లో మునిగిపోవడం వలన గ్రామం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. ఈ గ్రామానికి చెందిన ప్రజలు సమీప ప్రాంతాలైన అలంపూర్, గొందిమళ్ళ, బుక్కాపూర్ మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలంపూర్ మండలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న మరో గ్రామం ఉప్పలపాడు.
గ్రామ చరిత్ర
[మార్చు]శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు 1976లో ప్రభుత్వం ఈ గ్రామ ప్రజలను ఖాళీ చేయించింది. 1981లో గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు.గ్రామం పునర్నిర్మాణం కాకపోవడం వలన గ్రామస్తులందరూ వారికి అనుకూలమైన గ్రామాలలో స్థిరపడిపోయారు. అట్లా సుమారు 75 గ్రామాలలో స్థిరపడినట్లు తెలుస్తుంది.[2]
గ్రామ దేవాలయం
[మార్చు]ఈ గ్రామంలో ప్రాచీన కాలం నాటి సంగమేశ్వర ఆలయం ఉండేది. గ్రామం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురికావడం, పునర్నిర్మాణం కాకపోవడం చేత ఆలయాన్ని 1979 పురావస్తు శాఖ వారు అలంపూర్కు తరలించారు. అలంపూరులో ఆలయ పునర్నిర్మాణం 1985లో మొదలుపెట్టి 1991లో పూర్తి చేశారు.
గ్రామస్తుల సమ్మేళనం
[మార్చు]వివిధ గ్రామాలలో స్థిరపడిపోయిన గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు అలంపూరులోని వారి గ్రామ ఆలయమైన సంగమేశ్వర ఆలయంలో కలుస్తుంటారు. వీరి కలయికకు గ్రామానికి చెందిన వారు ఏర్పాటుచేసిన కూడవెల్లి సంగమేశ్వర స్వామి సేవాసమితి సంస్థ కృషి చేస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "గ్రామము & పంచాయితీలు | జిల్లా జోగులంబా గద్వాల్, తెలంగాణ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2021-08-29.
- ↑ 2.0 2.1 ఊరు మునిగింది-శివరాత్రి కలపనుందిఈనాడు, జోగులాంబ గద్వాల; తేది:11-03-2021.