కె.ఎ. మునిసురేష్ పిళ్లె
కె.ఎ.మునిసురేష్ పిళ్లె | |
---|---|
జననం | 13 డిసెంబరు 1972 శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
జీవిత భాగస్వామి | అన్నపూర్ణ |
పిల్లలు | ఆదర్శిని భారతీకృష్ణ ఆదర్శిని శ్రీ |
తల్లిదండ్రులు | ఆరంబాకం ఎల్లయ్య భారతమ్మ |
వెబ్‌సైటు | http://sureshpillai.com/ |
కె.ఎ. మునిసురేష్ పిళ్లె పాత్రికేయుడు, తెలుగు రచయిత. పూర్వ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగారు. ఆదర్శిని పత్రికా సంపాదకులు ఆరంబాకం ఎల్లయ్య, భారతమ్మ వీరి తల్లిదండ్రులు. వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆదర్శిని మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, సినిమా రచయితగా కొనసాగుతున్నారు.
నేపథ్యం
[మార్చు]శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం తరువాత, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి కళాశాలలో బీఎస్సీ చదివారు. ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం (ఎంసీజే) చేశారు. తిరుపతి అంబేద్కర్ లా కాలేజీలో బి.ఎల్. చదివారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో పిహెచ్.డి. చేస్తున్నారు.
పాత్రికేయ ప్రస్థానం
[మార్చు]తన తండ్రి 1970లో స్థాపించిన ఆదర్శిని వారపత్రికలో పనిచేస్తూ వ్యాసాలు, కథలు, కవితలు రాస్తూ చిన్నతనంలోనే పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు.
తిరుపతి గోవిందరాజస్వామి కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉదయం దినపత్రికలో 1991లో ఎన్ఎంఆర్ సబ్ ఎడిటర్ గా ప్రధాన స్రవంతి పత్రికలలో ప్రస్థానం ప్రారంభించారు. 1993లో ఈనాడు దినపత్రికలో చేరారు. 1994 ఈనాడు జర్నలిజం స్కూలులో డిప్లమో చేసిన తర్వాత తిరుపతిలోనే కొనసాగుతూ వచ్చారు. ఈనాడు చిత్తూరు జిల్లా అనుబంధానికి ఇన్చార్జిగా పనిచేశారు. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్, ఆదివారం అనుబంధం బాధ్యతలు చూశారు. 2006 తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఆదర్శిని మీడియా సంస్థను స్థాపించి.. మీడియారంగంలో బహుముఖ సేవలు అందిస్తున్నారు.
జర్నలిస్టుగా..
[మార్చు]అక్షర సాక్షి
[మార్చు]సాక్షి దినపత్రిక.. వయోజనులకు 30 రోజుల్లో తెలుగు భాష చదవడం నేర్పడానికి సంకల్పించిన బృహత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్వహించారు. తెలుగు అక్షరమాలను నేర్పే పద్ధతిలోనే సరికొత్త క్రమం తీసుకువచ్చి.. ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికతో ‘అక్షర సాక్షి’ కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగురాష్ట్రం అంతటా నిర్వహించారు. లక్షలాది మంది ఈ కార్యక్రమం ద్వారా.. తెలుగు చదవడం నేర్చుకున్నారు.
నా వార్తలు నా ఇష్టం
[మార్చు]ఎన్ టీవీ న్యూస్ చానెల్ లో ప్రసారం అయ్యే ‘నా వార్తలు నా ఇష్టం’ వ్యంగ్యాత్మక కార్యక్రమానికి 2007లో రూపకల్పన చేశారు.
హరిలోరంగహరీ
[మార్చు]ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో 2012లో ‘హరిలోరంగహరీ’ శీర్షికతో రాజకీయ వ్యంగ్యాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు.
వెలువరించిన పుస్తకాలు
[మార్చు]కథలు 1 : పూర్ణమూ నిరంతరమూ
[మార్చు]ఈ సంపుటిలో మొత్తం 19 కథలు ఉన్నాయి. 2.0, అనాది-అనంతం, ఆ రోజు, ఆ 5 నిమిషాలు, ఇక్కడే ఉన్నాడేమిటీ, ఈగ, కొత్తచెల్లెలు, గడ్డి బొగ్గులు, గార్డు వినాయకం భజే, తోటకాడ బావి, తపసుమాను, నా నూకలు మిగిలే ఉన్నాయ్, పశువుల కొట్టం, పులినెక్కిన గొర్రె, పూర్ణమూ- నిరంతరమూ, పేరు తెలియని ఆమె, మా ఆయన అపరిచితుడు, రుచుల జాడ వేరు, వరాలత్త గాజులు కథలు ఇందులో ఉన్నాయి. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర ఈ కథాసంపుటికి ‘సాహిత్య పాత్రికేయం’ అనే శీర్షికతో ముందుమాట రాశారు. ‘న వినుతి.. నా వినతి..’ పేరుతో రచయితగా తన నేపథ్యాన్ని సురేష్ పిళ్లె వివరించారు. అనాది- అనంతం, గార్డు వినాయకం భజే, రాతి తయారీ, పూర్ణమూ నిరంతరమూ నాలుగు కథల గురించి నెమలికన్ను మురళి రాసిన వ్యాసం కూడా ఇందులో ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రంతో పాటు, ప్రతికథకు బొమ్మలు గీశారు.
కథలు-2 : రాతి తయారీ
[మార్చు]ఈ సంపుటిలో మొత్తం 19 కథలు ఉన్నాయి. అలియాస్, కుక్కానక్కల పెళ్లి, చమించేయండి, జిందగీ, తడిచిన సోఫా, తోడు, థియరీ ఆఫ్ యాక్టివిటీ, దిద్దుబాట, దొరకానుక, నవ్వు మొలిచింది, నాన్నకు ప్రేమతో, బదిలీ, రాతి తయారీ, రిరంస, లచ్చిమి, వేరుపాత్రలు ఒకటే కథ, శివమ్, సెవెన్త్ ఫ్లోర్, సేవ బాధ్యత కథలు ఇందులో ఉన్నాయి. న్యూస్ చానెళ్ల పోటీ ప్రపంచంలో ఉండే పోకడల గురించి రాసిన రాతితయారీ కథపై చోరగుడి జాన్సన్ ‘న్యూస్ చానెల్ గొట్టాల మీద మట్టి కొట్టిన కథ’ అనే శీర్షికతో రాసిన వ్యాసం ఇందులో ఉంది. రాతి తయారీ కథ గురించి రచయిత సురేష్ పిళ్లె ఆకాశవాణి తిరుపతి రేడియో స్టేషన్ లో చేసిన ప్రసంగం కూడా ఇందులో ప్రచురించారు. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రంతో పాటు, ప్రతికథకు బొమ్మలు గీశారు. తనను కథారచయితగా దిద్దిన గురువు స్వర్గీయ మధురాంతకం రాజారాంకు ఈ పుస్తకం అంకితం ఇచ్చారు.
కథలు-3 : గారడీవాడు
[మార్చు]ఈ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఆంజమ్మ బస్సు ప్రయాణం, ఇఫ్తార్, కుడిపైట, గారడీవాడు, గేణమ్మ, టీనా, పడమటిల్లు, బర్రెర మునెమ్మ, లడ్డూ పెడతా గోవిందా, రిఫ్రెష్ ఫ్రం టియర్స్, వితండం మామ, సర్కిల్, స్కోర్ అయిటమ్, హైవే, @18 కథలు ఇందులో ఉన్నాయి. ‘టీనా’ కథ గురించి ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం ‘గుప్పెడు ప్రేమకు భరోసా టీనా’ కూడా ఇందులో ఉంది. ‘ఇఫ్తార్ కథ వెనుక కథ’ అంటూ రచయిత సురేష్ పిళ్లె రాసిన మరో వ్యాసాన్ని కూడా ప్రచురించారు. సుప్రసిద్ధ రచయిత, కవి, సినీనటుడు తనికెళ్ల భరణి ఈ కథాసంపుటికి ‘తిరుపతి లడ్డూలు!!’ అనే శీర్షికతో ముందు మాట రాశారు. ‘ఈ కథలు తిరుపతి లడ్డూల్లాంటివి. వీటిల్లో తగుమాత్రంగా తీపి ఉంది. కావాల్సినంత పచ్చ కర్పూరపు ఘాటు ఉంది. అన్నిటినీ మించి మానవత్వపు పరిమళం వంటి పవిత్రత ఉంది! అంచేతే ఈ కథల్లో చాలా మనసుకు హత్తుకునేవే గాక కళ్ళకి అద్దుకునేవి కూడా’ అని భరణి ముందుమాటలో పేర్కొనడం విశేషం. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రం గీశారు. ఈ కథాసంపుటికి శివేగారి దేవమ్మ కథా పురస్కారం 2023 లభించింది.
కవిత్వం : షష్ఠముడు
[మార్చు]మనువు నిర్వచించిన చాతుర్వర్ణాలు, పంచములు అనే కుల వ్యవస్థలను ధిక్కరించి.. ఈ అయిదు వర్గాల్లోకి, వర్ణాల్లోకి ఇమడకుండా.. వీటిని ధిక్కరించి, నేను ఆరో వర్ణానికి చెందిన వాడిని అని చెప్పుకోవడమే ‘షష్ఠముడు’ కవితలో సురేష్ పిళ్లె ప్రతిపాదించిన ఆలోచన. ఈ కవితకు అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) సంస్థ కవితల పోటీలో ప్రథమ బహుమతి అందించింది. అదే శీర్షికతో, మొత్తం 42 కవితలతో ‘షష్ఠముడు’ కవితా సంకలనం వెలువడింది. ప్రారంభకవితలు, క్రోధ కెరటాలు, దుఃఖశకలాలు అనే మూడు విభాగాలుగా ఈ కవితలను ఇందులో వర్గీకరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కవి కె.శివారెడ్డి.. ‘తమలపాకు తీగ సురేష్’ అనే శీర్షికతో ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ‘He is a dangerous poet. గజగజలాడాల్సిందే. పద్యం మొదలెట్టి ముగిసేసరికి శరీరం, మనసు తన్మయమవటం అటుంచి గజగజలాడాల్సిందే. వస్తువేదయినా కొత్తగా ట్రీట్ చేయడం, కొత్త స్ట్రక్చర్ యివ్వటం అతని స్వభావం’ అంటూ కె.శివారెడ్డి తన ముందుమాటలో ప్రస్తావించడం విశేషం. ‘ఆధునిక తూకపురాళ్లు’ అనే శీర్షికతో ప్రముఖ కవి, రచయిత ఎమ్వీ రామిరెడ్డి రాసిన వ్యాసం, ‘అగ్నిమాపకం’ శీర్షికతో మునిసురేష్ పిళ్లె రాసుకున్న పరిచయం కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. పినిశెట్టి నరసింహారావు ఈ పుస్తకానికి ముఖచిత్రం గీశారు.
నవల-1 : సుపుత్రికా ప్రాప్తిరస్తు
[మార్చు]1999లో స్వాతి వారపత్రిక నిర్వహించిన 16 వారాల సీరియల్ పోటీలలో బహుమతి పొందిన నవల ఇది. 2001లో 17 వారాల పాటు స్వాతి లో సీరియల్ గా ప్రచురితమైంది. అప్పట్లో భారతీకృష్ణ అనే కలంపేరుతో రాసిన సీరియల్ ఇది. ఇది రచయిత రాసిన మొదటి నవల. కొడుకు, కూతురు ఎవరు కావాలి? అనే విషయంలో ఇప్పుడున్నంత ఉదారంగా అప్పటి సమాజం లేదు. కొడుకే కావాలని కోరుకునే, కూతురు కడుపులో పడ్డదని తెలిస్తే అబార్షన్ చేయించుకునే దురాచారాలు చాలా ఉండేవి. చుట్టూ ప్రపంచంకూడా అదే భావనల్ని నూరిపోసేది. కొత్త దంపతులు ఎవరు ఎదురైనా ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అనే దీవెనలే కనిపిస్తుండేవి. పూజలు, యాగాది క్రతువుల్లో పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు.. అంటూ మగనలుసుకోసం ఆరాటాన్ని పెంచే మంత్రాలే వినిపించేవి. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమే అయినా.. అప్పటి సామాజిక వాతావరణాన్ని ధిక్కరిస్తూ, కూతురు కాస్త ఎక్కువ సమానం అనే భావనను బలంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ నవల. ప్రఖ్యాత చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ఈ కథా సంపుటికి ముఖచిత్రం గీశారు.
నవల-2 : పుత్రికా శత్రుః
[మార్చు]2002లో స్వాతి వారపత్రిక నిర్వహించిన 16 వారాల సీరియల్ పోటీలలో బహుమతి పొందిన నవల. జర్నలిస్టులు అందరి కథలనూ రాస్తుంటారు. వారి కథలు ఎవరు రాస్తారు? అనే ఆలోచన నుంచి పుట్టిన నవల ‘పుత్రికా శత్రుః’! చాలా కథల్లో జర్నలిస్టు ఒక పాత్రగా ఉంటాడు. ఎక్కడైనా కొన్ని కథల్లో, కొన్ని సినిమాల్లో జర్నలిస్టు ప్రధాన పాత్ర లేదా హీరో అయినప్పటికీ.. అతని హీరోయిజం పాత్రికేయేతర విషయాలలో ఎక్కువగా వ్యక్తం అవుతూ సాగుతుంది. ‘పుత్రికాశత్రుః’ అలాంటిది కాదు. ఇందులో ప్రధానపాత్ర జర్నలిస్టు. కథ పూర్తిగా- ప్రారంభం నుంచి చిట్టచివరి వరకు జర్నలిజం చుట్టూతా తిరుగుతుంది. ఆ మాటకొస్తే జర్నలిజమే ఈ నవలకు హీరో. జర్నలిజం మీద సీరియస్ చర్చ, సమాజం పట్ల జర్నలిజం నిర్వర్తించవలసిన బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం ఈ నవలలో ప్రధానంగా ఉంటాయి. ఈ నవలకు ముఖచిత్రాన్ని కూడా మునిసురేష్ పిళ్లె గీశారు. ఈ పుస్తకానికి కుప్పం రెడ్డమ్మ సాహితీ అవార్డు 2023 (నవలా విభాగం) లభించింది.
సంపాదకీయ కథనాలు : మునివాక్యం
[మార్చు]మునిసురేష్ పిళ్లె రాసిన సంపాదకీయ వ్యాసాల సంకలనం ‘మునివాక్యం’! వార్తల్లోని సామాజికాంశాలను తీసుకుని, వాటిని మానవీయ కోణంలో విశ్లేషిస్తూ రాసినవి. గ్రేట్ ఆంధ్ర వారపత్రిక, వెబ్ సైట్ లలో ప్రచురితమైన కథనాలు. ‘విలక్షణత- వార్తకు మౌలిక లక్షణం. విలక్షణమైన, లోకరీతికి భిన్నమైన, చాలా అరుదైన కొన్ని సంఘటనలు తారసపడినప్పుడు వాటికి సార్వజనీనత ఉందనిపిస్తుంది. వాటినుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఉందనిపిస్తుంది. మనం నేర్చుకునే పాఠాన్ని ఇతరులతోనూ పంచుకోవాలని కూడా అనిపిస్తుంది. దైనందిన వార్తాంశాలలో అలాంటివి కనిపించినప్పుడు నాకున్న దృక్కోణానికి, పరిమితమైన జ్ఞానానికి అవగాహన అయినంత మేరకు అందరితోనూ పంచుకునే ప్రయత్నం ఈ కథనాలు. ఇవి కేవలం వ్యాసాలు కాదు.. నేను నేర్చుకున్న పాఠాలు’ అని రచయిత తన ముందుమాట ‘బిట్వీన్ ది లైన్స్’లో చెప్పుకున్నారు. ఈనాడు జర్నలిజం స్కూలు లో గురువులు బూదరాజు రాధాకృష్ణ, తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి లకు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు.
అనువాద రచయితగా..
[మార్చు]యుగద్రష్ట భగత్ సింగ్
[మార్చు]భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం వెనుక ఉన్న అగణ్యమైన ప్రాణత్యాగాలలో ఎన్నదగిన మహనీయుడు భగత్ సింగ్ జీవిత ఘట్టాలను స్పృశించే పుస్తకం- ‘యుగద్రష్ట భగత్ సింగ్’. ఈ పుస్తకాన్ని భగత్ సింగ్ సోదరుడి కుమార్తె వీరేంద్ర సింధు ఈ పుస్తకాన్ని హిందీలో రాశారు. సురేష్ పిళ్లె దీనిని హిందీనుంచి తెలుగులోకి అనువదించారు. షహీద్ భగత్ సింగ్ సేవా సమితి వారు ప్రచురించారు. భావిపౌరులకు భగత్ సింగ్ బలిదానం గురించి సదవగాహన కల్పించడం లక్ష్యంగా వందేమాతరం ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని దాదాపు 30 వేల కాపీలకు పైగా అనేక ముద్రణలుగా ప్రచురించి.. పంచిపెడుతూఉంది. భగత్ సింగ్ : విరాట్ వ్యక్తిత్వ విశ్లేషణ, భగత్ సింగ్ జీవన ‘చిత్రణ (ఫోటోల సంకలనం), జలియన్ వాలాబాగ్, కార్గిల్ గాథ లకు సంబంధించిన అనేక కథనాలు ఇందులో ఉన్నాయి.
సంపాదకుడిగా..
[మార్చు]‘సదా స్మరామి’ : ప్రఖ్యాత భాషావేత్త, అధ్యాపకుడు, రచయిత బూదరాజు రాధాకృష్ణ మరణానంతరం ఆయన స్మృతి సంచికగా వెలువడిన ‘సదాస్మరామి’ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. సురేష్ పిళ్లె డిప్లమో ఇన్ జర్నలిజం చదివిన ఈనాడు జర్నలిజం స్కూలు (ఈజేఎస్)కు బూదరాజు రాధాకృష్ణ ప్రిన్సిపల్. ఆయన మరణించినప్పుడు గురువుగారితో ఉన్న ఈజేఎస్ కొందరు విద్యార్థుల అనుబంధాన్ని వ్యాసాలుగా రాయించి.. ఒక టేబ్లాయిడ్ ను ప్రత్యేకసంచికగా తీసుకువచ్చి.. ఆయన అంత్యక్రియల సమయంలోనే హాజరైన అందరికీ పంచిపెట్టారు. ఆప్రయత్నాన్ని మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో.. బూదరాజు రాధాకృష్ణ కుటుంబసభ్యులు, ఆత్మీయులు, మిత్రులు, రచయితలు, శిష్యులు అన్ని వర్గాల వారితో ప్రత్యేక వ్యాసాలు రాయించి ‘సదాస్మరామి’ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని బూదరాజు మరణానంతరం దశదిన కర్మ నాడే ఆవిష్కరించడం విశేషం.
గురుశిఖరం : ఈనాడు జర్నలిజం స్కూలులో డిప్లమో చదువుతున్న రోజుల్లో పొలిటికల్ సైన్స్ పాఠాలు బోధించిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి మరణానంతరం శిష్యుల వ్యాసాలతో తీసుకు వచ్చిన స్మృతి సంచిక ‘గురు శిఖరం’! దీనికి సురేష్ పిళ్లె సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అనన్యమైన మేథా సంపత్తిగల నిగర్వి, నిరాడంబరుడు అయిన తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి స్మృతిసంచికను కూడా ఆయన మరణానంతరం కేవలం పదిరోజుల వ్యవధిలో ప్రచురించి, దశదిన కర్మ నాడే ఆవిష్కరించడం విశేషం.
అక్షరమైన మట్టిమనిషి : ప్రఖ్యాత తెలుగు కథ, నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి టీచరుగా పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా ఆయన మిత్రులు, ఆత్మీయులు కలిసి వెలువరించిన పుస్తకానికి సంపాదకుడిగా వ్యవహరించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి జీవన విశేషాలు, ఆయనతో పలువురి అనుబంధాలను ప్రస్తావించే అనేక వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
సినిమా రచయితగా..
[మార్చు]ఆటగదరా శివ
[మార్చు]కన్నడలో విడుదల అయి మంచి పేరు తెచ్చుకున్న లోబడ్జెట్ చిత్రం ‘రామ రామ రే’కు తెలుగు రీమేక్ ఆటగదరా శివ. సుప్రసిద్ధ దర్శకులు చంద్రసిద్ధార్థ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంభాషణలు అందించడంతో పాటు, దర్శకత్వ విభాగంలో సురేష్ పిళ్లె పనిచేశారు. విరామజీవితం గడుపుతున్న తలారి (hangman) కు జైలు నుంచి ఉరి తీయాల్సిన పని ఉన్నదని పిలుపు వస్తుంది. ఆయన బయల్దేరే వేళకు, ఖైదీ జైలునుంచి తప్పించుకుంటాడు. పారిపోయే ప్రయత్నంలో, జైలుకు బయల్దేరిన తలారి వాహనమే ఎక్కుతాడు. ఆ ప్రయాణం ఇద్దరిలో మనస్తత్వంలో మార్పు తీసుకువస్తుంది. ‘క్రీడార్థమ్ సృజసి ప్రపంచమ్ అఖిలమ్ క్రీడామృగా తే జనాః, యత్కర్మాచరితం మయా చ ప్రీత్యై భవత్యేవ తత్’ అనే ఆనంద లహరి లోని శంకరాచార్యుడి శ్లోకాన్ని ఇందులో వాడారు. ‘నీ ఆట నాతో ఆడిస్తున్నావు.. నీ బరువు నాతో మోయిస్తన్నావు.. చిక్కులేమీ రాకుండ కాసుకో సామీ’ అంటూ తలారి జంగయ్య, లయకారుడైన శివుడిని ఈ శ్లోకం చదివిన తర్వాత వేడుకుంటాడు.
పురస్కారాలు - బహుమతులు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- పుత్రికా శ్రతుః నవలకు చిత్తూరులోని ‘కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు’ (నవలా విభాగం) -2023
- గారడీవాడు కథా సంపుటికి పలమనేరులోని ‘శివేగారి దేవమ్మ కథా పురస్కారం -2023
- మునివాక్యం సంపాదకీయ కథనాల సంపుటికి శ్రీమక్కెన రామసుబ్బయ్ ఫౌండేషన్ వారి మనో వికాస/ విజ్ఞాన సాహితీపురస్కారం -2024
- గారడీవాడు కథా సంపుటికి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారిద్వారా విశిష్ట పురస్కారం - 2023
బహుమతులు
[మార్చు]- రాతితయారీ కథకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కథల పోటీలలో ప్రథమ బహుమతి -2005
- తడిచిన సోఫా కథకు ప్రజాశక్తి వారి కథల పోటీలో బహుమతి -2006
- తపసుమాను కథకు రామోజీ ఫౌండేషన్ కథావిజయం పోటీలలో ప్రథమబహుమతి -2019
- వరాలత్త గాజులు కథకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కథల పోటీలో మూడో బహుమతి -2019
- గారడీవాడు కథకు నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాటా) వారి పోటీలలో ప్రథమ బహుమతి 2023
- గేణమ్మ కథకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి -2022
- లడ్డూపెడతా గోవిందా కథకు జాగృతి వారపత్రిక కథల పోటీలలో విశిష్ట బహుమతి -2023
- సర్కిల్ కథకు టాల్ రేడియో వారి పోటీలలో బహుమతి -2023
- షష్ఠముడు కవితకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) వారి కవితల పోటీలో ప్రథమ బహుమతి -2022
- సుపుత్రికా ప్రాప్తిరస్తు నవలకు స్వాతి వారపత్రిక 16వారాల సీరియల్ పోటీలో బహుమతి -2000
- పుత్రికా శత్రుః నవలకు స్వాతి వారపత్రిక 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి -2002