కె.హెచ్. ఆరా
కె.హెచ్. ఆరా | |
---|---|
జననం | బొల్లారం, సికింద్రాబాదు, తెలంగాణ | 1914 ఏప్రిల్ 16
మరణం | 1985 జూన్ 30 ముంబై, మహారాష్ట్ర | (వయసు 71)
ఉద్యమం | ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ |
చేసిన పనులు | Two Jugs |
కృష్ణాజీ హౌలాజీ ఆరా (1914, ఏప్రిల్ 16 - 1985, జూన్ 30) తెలంగాణకు చెందిన చిత్రకారుడు.[1] స్త్రీ నగ్నాన్ని ఒక సబ్జెక్ట్‌గా నిశితంగా ఉపయోగించిన మొదటి సమకాలీన భారతీయ చిత్రకారుడు.[2] బొంబాయిలో ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగిన ఆరా, తరువాతికాలంలో ముంబైలోని ఆర్టిస్ట్స్ సెంటర్ ను స్థాపించాడు. [3] 2017లో ముంబయిలో "ప్రైవేట్‌లీ ఆరా" అనే ఎగ్జిబిషన్‌లో ఖరూన్ థాపర్ అనే క్యూరేటర్, ఆరా గీసిన 22 చిత్రాల గురించి విశ్లేషణ చేశాడు.[4]
జీవిత విషయాలు
[మార్చు]ఆరా 1914, ఏప్రిల్ 16న తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదు సమీపంలోని బొల్లారంలో జన్మించాడు. ఆరా మూడు సంవత్సరాల వయస్సులో అతని తల్లి చనిపోయింది, తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ళ వయసులో ఇంటినుండి ముంబైకి పారిపోయిన ఆరా, 1985లో మరణించే వరకు ముంబై నగరంలోనే ఉన్నాడు.[2]
తొలినాళ్ళలో ముంబైలో కార్లు శుభ్రం చేయడం ద్వారా తన జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత ఒక ఆంగ్ల కుటుంబంలో ఇంటి అబ్బాయిగా ఉద్యోగంలో చేరాడు. అక్కడ చిత్రలేఖనాన్ని తన అభిరుచిగా మలుచుకున్నాడు. ఆరా గీసిన చిత్రాలు టైమ్స్ ఆఫ్ ఇండియా కళా విమర్శకుడైన రూడీ వాన్ లేడెన్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సంపాదకుడు వాల్టర్ లాంగ్‌హమ్మర్ తదితరుల దృష్టిని ఆకర్షించాయి. లాంగ్‌హమ్మర్ సహకారంలో జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరాడు.[5]
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న ఆరా, ఐదునెలలపాటు జైలు శిక్షను అనుభవించాడు. తర్వాత జపాన్ కంపెనీలో కార్ క్లీనర్‌గా ఉద్యోగంలో చేరాడు.[1] భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న భారత ప్రజల స్వాతంత్ర్య దినోత్సవ ఊరేగింపును చిత్రీకరించే పెద్ద కాన్వాస్‌ను రూపొందించాడు.[6]
చిత్రకారుడిగా
[మార్చు]ఆరా 1942లో బాంబేలోని చేతనా రెస్టారెంట్‌లో నిర్వహించిన తన మొదటి సోలో షో విజయవంతమైంది.[7] 1948లో ఎం.ఎఫ్. హుస్సేన్, హెచ్.ఏ. గాడే, ఎస్.హెచ్, రజా, ఎఫ్.ఎన్. సౌజా, సదానంద్ బక్రేల వంటి ప్రఖ్యాత చిత్రకారులతో కూడిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ గ్రూప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం వెనుక కాలా ఘోడా వద్ద కళాకారుల కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ ఆరా అనేక ప్రదర్శనలు నిర్వహించాడు. కానీ సౌజా, రజా, గాడే, బక్రే తదితరులు భారతదేశాన్ని విడిచిపెట్టడంతో ఆ గ్రూపు రద్దు చేయబడింది.
1948 నుండి 1955 వరకు ముంబై, అహ్మదాబాద్, బరోడా, కలకత్తా వంటి నగరాలలో అనేక సోలో, గ్రూప్ షోలను... తరువాత తూర్పు యూరప్, జపాన్, జర్మనీ, రష్యా అంతటా సోలో ప్రదర్శనలు నిర్వహించాడు. 1963లో ముంబైలో తన "బ్లాక్ న్యూడ్" సిరీస్‌ను ప్రదర్శించాడు. పుండోల్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభ ప్రదర్శనలో పాల్గొన్నాడు.[2] 1955-1960 మధ్యకాలంలో న్యూఢిల్లీలోని కుమార్ గ్యాలరీ ఆరా గీసిన చిత్రాలను ప్రదర్శించింది.[8]
కళాత్మక శైలి
[మార్చు]తొలినాళ్ళలో ల్యాండ్‌స్కేప్‌లు, సామాజిక-చారిత్రక ఇతివృత్తాలపై పెయింటింగ్‌లు చేయడం ప్రారంభించాడు. తరువాత నిశ్చల జీవితానికి సంబంధించిన చిత్రాలతోనూ, నగ్న చిత్రాలతోనూ ప్రసిద్ధి చెందాడు.[7] సహజత్వపు పరిమితుల్లో ఉంటూనే స్త్రీ నగ్నాన్ని ఒక సబ్జెక్ట్‌గా ఫోకస్ చేసిన మొదటి సమకాలీన భారతీయ చిత్రకారుడు అరా.
ఆరా చిత్రాలు స్టిల్ లైఫ్, హ్యూమన్ ఫిగర్ స్టడీస్‌తో కూడి ఉంటాయి. మొదట్లో తన చిత్రాలలో వాటర్‌కలర్‌లు, గౌచేస్‌లను ఉపయోగించాడు. ఇంపాస్టో ప్రభావం తరచుగా ఆయిల్ పెయింటింగ్‌లను పోలిఉండడంతో ఆయిల్ పెయింట్‌లు ఉపయోగించడం ప్రారంభించాడు.[9] ఆరా చిత్రాలు ఫ్రెంచ్ ఆధునిక కళాకారుల (ప్రత్యేకంగా పాల్ సెజాన్) లోతైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి.[10]
అవార్డులు
[మార్చు]- 1944లో చిత్రలేఖనానికి గవర్నర్ అవార్డు
- 1952లో "టూ జగ్స్" కు బొంబాయి ఆర్ట్ సొసైటీ నుండి బంగారు పతకం[2]
- విండ్సర్, న్యూటన్ నగదు ధర (బొంబాయి)[11]
విమర్శ
[మార్చు]ఆరా పెయింటింగ్‌లను పేలవంగా ఉన్నాయని, జీవితం గురించి ప్రస్తావించబడలేదని విమర్శకులలో కొందరు ఆరోపించారు.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆరా దత్తపుత్రిక రుక్సానా పఠాన్ వ్యాఖ్యల ప్రకారం, ఆరా జీవితాంతం బ్రహ్మచారిలానే మిగిలిపోయాడు.[7] తరువాతికాలంలో ఆరా తక్కువ ప్రదర్శనలు చేశాడు. ఆర్టిస్ట్స్ సెంటర్‌లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. తన వ్యక్తిగత నిధుల నుండి కళాకారులకు తరచుగా సహాయం చేసేవాడు. 1950లు, 60వ దశకంలో అనుభవించిన విజయానికి దూరంగా, తన జీవితంలోని చివరి దశాబ్దాలలో కష్టాల్లో జీవించాడు. సౌజా, రజా, హుస్సేన్‌ల వలె కాకుండా ఆరా పెయింటింగ్‌లు కీర్తి, ధరలను సమకూర్చడంలో విఫలమయ్యాయి.[7] ఆరా బాంబే ఆర్ట్ సొసైటీ[2] కొంతకాలం మేనేజింగ్ కమిటీలో పనిచేశాడు. తరువాత లలిత కళా అకాడమీకి ఫెలో అయ్యాడు.[12]
మరణం
[మార్చు]ఆరా 1985, జూన్ 30న ముంబైలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "K. H. Ara". Retrieved 2022-12-15.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "K. Ara - Profile". Saffronart. Retrieved 2022-12-15.
- ↑ "Nude studies central to Indian art history". The Times of India. 20 February 2013. Archived from the original on 11 April 2013. Retrieved 2022-12-15.
- ↑ "Privately Ara". mid-day (in ఇంగ్లీష్). 2017-04-09. Retrieved 2022-12-15.
- ↑ "Still waters run deep". The Hindu. 15 July 2005. Archived from the original on 15 July 2007. Retrieved 2022-12-15.
- ↑ "K.H.Ara". Indian Art Circle. Retrieved 2022-12-15.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 "The Ara conundrum". Business Standard. 16 June 2010. Retrieved 2022-12-15.
- ↑ "K.H. Ara - Biography". Archived from the original on 21 April 2013. Retrieved 2022-12-15.
- ↑ "Old Masters- Krishnaji Howlaji Ara". India Art. Retrieved 2022-12-15.
- ↑ "K.H. Ara and the TIFR Art Collection". Google Arts & Culture (in ఇంగ్లీష్). Retrieved 2022-12-15.
- ↑ "K.H.Ara". Archived from the original on 7 April 2013. Retrieved 2022-12-15.
- ↑ "List of Fellows". Lalit Kala Akademi. Archived from the original on 27 March 2014. Retrieved 2022-12-15.