కొన్నె
కొన్నె తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని గ్రామం.[1]
కొన్నె | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°48′58″N 78°57′24″E / 17.815997°N 78.956606°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ |
మండలం | బచ్చన్నపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,532 |
- పురుషుల సంఖ్య | 1,270 |
- స్త్రీల సంఖ్య | 1,262 |
- గృహాల సంఖ్య | 632 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన బచ్చన్నపేట నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 632 ఇళ్లతో, 2532 జనాభాతో 1606 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1270, ఆడవారి సంఖ్య 1262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 424 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577653[3].పిన్ కోడ్: 506221.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల బచ్చన్నపేటలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చేర్యాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ వరంగల్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జనగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్ లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]కొన్నెలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]కొన్నెలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.
ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]కొన్నెలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 12 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 51 హెక్టార్లు
- బంజరు భూమి: 847 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 684 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1515 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 67 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]కొన్నెలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 67 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]కొన్నెలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]బీడీలు
కొత్త చారిత్రక వెలుగులు
[మార్చు]కొన్నెలో జరిపిన చారిత్రక యాత్రలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, కొన్నె గ్రామసర్పంచ్ వేముల బాలనారాయణ గౌడ్, రామాంజ నేయులు, ఇద్దరు శ్రీనివాసులు, టి.మురళి (నమస్తే తెలంగాణ), ఎం.వీరగౌడ్ (ఆంధ్రజ్యోతి, జె.భిక్షపతి (సాక్షి, జి.తిర్మల్ రెడ్డి (ఆంధ్రభూమి) పాల్గొన్నారు. బచ్చన్నపేట సబ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసులు గారందించిన సహకారం మరువలేనిది.కొన్నెగ్రామానికి ఉత్తరాన చెరువుంది.ఆ చెరువును గోనె చెరువని పిలుస్తారు అక్కడి ప్రజలు.అక్కడున్న కట్టమైసమ్మను గోనెకట్టమైసమ్మ అనే పిలుస్తారు.గోనె ఆ ఊరునేలిన వారి వంశనామం కావచ్చు.ఆ గోనె రానురాను కొన్నెగా కుదించుకు పోయుండొచ్చు.దానితో ఈఊరుకు కొన్నె అనే పేరువచ్చివుంటుంది.ఈ గ్రామం వెయ్యేళ్ళ కింద కొత్తగా కట్టిన ఊరు కావడానికి అవకాశముంది.పాతఊరు వేరేచోట వుండేదని గ్రామస్థులు చెపుతున్నారు.ఈ ఊరుకు పాతఊరు పాటిగడ్డవుందని పాతశివాలయం అక్కడిదేనంటారు.ఆ శివాలయం పురాతనమైనది.అది శివాలయంగా మార్చబడక ముందు జైనబసది అయివుంటుందని ఆ ఆలయగర్భగుడి ద్వారబంధాల మీదున్న కలశాలొక నిదర్శనం, అట్లే ఆలయం ప్రధానద్వారం దక్షిణాభిముఖంగా వుండడం మరొక కారణంగా చెప్పొచ్చు.ఇపుడు గర్భగుడిలో ఎత్తైన పానవట్టం మీద శివలింగం ఉంది.దేవాలయం విమానగోపురం తర్వాత కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తున్నది.మొదట రాళ్ళు పరిచి సున్నం, పలుగురాళ్ళ కాంక్రీటుతో చేసిన దేవాలయం కప్పు మీద పాలాస్త్రి వంటి ఇటుకలతో, రాళ్ళతో విమాన నిర్మాణం చేయబడ్డది.దేవాలయపు అర్ధమంటపం తూర్పుదిశరాళ్ళ మధ్య ప్రతిష్ఠించిన ఉమాసహిత దక్షిణామూర్తి కొలువైనాడు.అది కూడా మధ్యలో చేసిన పనే.ఆ పక్కన తలలేని రాజోచిత వేష, భూషణాలతో ఒక శిల్పం ఉంది. బహుశః అతడు దేవాలయ నిర్మించిన రాజగునేమొ.గుడి వెనక ఒక వీరగల్లు, రెండు ఆడ, మగ నాగ విగ్రహాలు ఉన్నాయి. మరికొన్ని భూమిలో ఉన్నాయి.
ప్రసిద్ధి చెందిన రామాలయం
[మార్చు]రామాలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహం సుందరంగా ఉంది.ఆలయం కప్పుమీద అగ్నిదేవుని శిల్పమొకటి మాకు లభించింది.గ్రామంలోని మరొక శివాలయంలో చిన్న గర్భగుడిలో శివలింగం, బయట భైరవుడున్నారు.ఆ గుడి ముందర తక్కువ గ్రామాల్లో కనిపించే సారగమ్మ విగ్రహముంది. చెరువులో వీరగల్లుంది.దుర్గమ్మ గుడిదగ్గర భైరవుడు, వీరగల్లు, తలలేని దుర్గ శిల్పాలున్నవి.గ్రామపంచాయతి దారిలో ఏనుగులను కట్టేసే రంధ్రమున్న రాతి స్తంభముంది.ఇట్లాంటిది నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం చాడలో ఉంది.ఆంజనేయుని గుళ్ళు చాలా చోట్ల ఉన్నాయి.పాత శివాలయం దారిలో పానవట్టంతో శివలింగం, నంది, ముందర హనుమంతుడు (ప్రాచీనశిల్పం) ఉన్నాయి.గ్రామంలో పాతగడి ఆనవాళ్ళే కాక వూరిచుట్టూరా కట్టిన గోడ శిథిలాలు కనిపిస్తున్నాయి.గ్రామానికి నైరుతిలో పాతకోట ఆనవాళ్ళు లభిస్తున్నాయి.అక్కడ చాలా రాళ్ళు మట్టిలో కూరుకునివున్నవి.వాటిని బయటికి తీస్తే ఇంకా ఎక్కువ సమాచారం దొరికే అవకాశముంది.అక్కడికి కొద్దిదూరంలో దేవుని మాన్యందారిలో చింతచెట్టు కింద నల్లసరపురాతి శాసనం ఉంది.దానిమీద సూర్యచంద్రులు, మధ్యలో శివలింగం చెక్కివున్నవి. దానికి పశువులను కట్టేయడంవల్ల అక్షరాలు కనిపించడంలేదు. శాసనం పూర్తిగా అరిగిపోయింది.వున్న ఒక్క చారిత్రక లిఖితాధారం దక్కకుండాపోయింది.గ్రామంలోని దేవాలయాలను గమనిస్తే ఇక్కడ రాష్ట్రకూటులకాలం నుండి దేవాలయాలున్నాయని, తర్వాత కాలంలో చాళుక్యులు, కాకతీయులు వాటిని పునరుద్ధరించడం, మార్చడం చేసారని పిస్తున్నది.వూరిలో భైరవులు ఎక్కువచోట్ల ఉన్నారు.భైరవారాధన ఎక్కువగా కాపాలికులు, పాశుపతుల్లో ఉంది.కనుక జైనం, శైవాలకు సంఘర్షణ జరిగివుంటుందనిపిస్తుంది.ఆ సందర్భంలోనే ఆలయాలమార్పు జరిగి వుంటుందనిపిస్తున్నది.గ్రామంలోని ఆ శాసనం తప్పకుండా శైవమఠాలకు సంబంధించిందై వుండడానికి అవకాశముంది.వూరిలో చాలాచోట్ల మాన్యాలుగా పిలువబడే పొలాలున్నవి.
గజగిరిగుట్ట
[మార్చు]కొన్నె, రామచంద్రాపురం గ్రామాలనడుమ వున్న500మీ.ల ఎత్తున్న ఈగుట్ట ఆకారంలో ఏనుగునుపోలివుంటుంది.ఒకప్పటి అగ్నిపర్వతమనిపించేలా గుట్టమీద గుండ్లు అనేకం, సొరంగాలు లెక్కకు మిక్కిలి.గట్టిరాళ్ళ కొండ ఇది.క్వారీలో ధ్వంసమైపోతున్నది.సహజసిద్ధంగా ఏర్పడిన కొలనునే ప్రజలు సూర్యుడు చూడని కుండం అని పిలుస్తున్నారు.దీనిలోని నీరు తాగితే రోగాలు పోతాయని చెప్పడం ఆ నీళ్ళ స్వచ్ఛతకు, ఖనిజధాతువుల సంపన్నతకు నిదర్శనం.గుట్టకు పడమట, కొన్నెవైపు ఒక పెద్ద పట్టణం వున్న ఆనవాళ్ళు దొరుకుతున్నవి.దర్గా వెనక కోటవంటి నిర్మాణానికి సంబంధించిన పునాదిరాళ్ళచాళ్ళు కనిపిస్తున్నవి.అక్కడ లభిస్తున్న గాబులు, కుండలు, టెర్రకోటబొమ్మల ముక్కలు, నూరుడురాళ్ళు, పెద్ద (14, 8, 4 అంగుళాల కొలతలు) ఇటుకలు శాతవాహనుల కాలంనుండి ఇక్కడ నగరమొకటి వుండేదనడానికి ఆధారాలు.ప్రజలు ఈ ప్రాంతాన్ని గజగిరి పట్టణం అని పిలుచుకుంటారు.గుట్టకు నైరుతిన కింద ఒక పడగరాయికి ఆదిమానవులువేసిన రాతిచిత్రాలు కొన్ని దొరికాయి.ఆ పడగరాయిని పగులచీరడంవల్ల రాతిచిత్రాలు దక్కకుండాపోయినవి.వున్నవాటిలో మానవాకారాలు, అస్పష్టంగా జంతువుల బొమ్మలు ఒకటి, రెండు కనిపిస్తున్నవి.ఇట్లాంటి రాతిచిత్రాల ప్రదేశాలు (చిత్రిత శిలాశ్రయాలు రంగారెడ్డిలోని కోకాపేట, తుర్కపల్లి, లాల్ గడి మలకపేట, మెదక్ జిల్లా అస్తలాపూర్, శివారువెంకటాపూర్, ధర్మారం, యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తులలో ఒక వరుసలో నెలకొనివున్నాయి.అంటే ఈ ప్రాంతమంతా ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలని చెప్పవచ్చు.ఈ ప్రదేశాలలో లభిస్తున్న వారి రాతిపనిముట్లను, రాతిగొడ్డండ్లు, కత్తులు, సుత్తెలు, వడిసెలరాళ్ళు, నాగళ్ళవంటి వంపురాళ్ళు, చిల్లరాళ్ళు వంటి వాటిని పరిశీలిస్తే ప్రాచీనశిలాయుగం, మధ్యశిలాయుగం, నవీనశిలాయుగం, బృహచ్ఛిలాయుగాలలో క్రమంగా ఇక్కడే సమృద్ధిగా పురాతన మానవావాసాలుండేవని తేలుతున్నది.గజగిరిగుట్టపైన, కింద రాసులకొద్ది వివిధ రాతియుగాల రాతిపనిముట్లు కొల్లలుగా దొరుకుతున్నవి.అంటే ఈ గజగిరిగుట్ట కూడా ఆదిమానవులకు ఆశ్రయమిచ్చిన ప్రాచీన చారిత్రకప్రదేశమే.గుట్టపైన గుహల్లో ప్రాచీనశిలాయుగపు మొరటు రాతిపనిముట్లు పలుగురాళ్ళతో, చెక్కముకిరాళ్ళతో, పెచ్చురాళ్ళతో చేసిన పెద్దపనిముట్లు లభిస్తున్నవి.కొండపైన, దిగువన మధ్యశిలాయుగపు వడిసెలరాళ్ళు, చిల్లరాళ్ళు, ఒకపక్కన చెక్కిన రాతిగొడ్డళ్ళవంటివి, కత్తుల రూపంలో అనేకంగా రాతిపనిముట్లు దొరుకుతున్నవి. నవీనశిలాయుగానికి చెందిన నునుపైనవి రెండువైపుల చెక్కిన రాతిగొడ్డండ్లు, కత్తులు, నూరుడురాళ్ళే గాకుండా అక్కడక్కడ పలుచని రాతి పనిముట్లు అరుదుగా లభిస్తున్నవి.గుట్టచుట్టూ తొలగించినవి పోగా బృహచ్ఛిలాయుగపు రాకాసిగుళ్ళని జనం పిలిచే సిస్తులు, కైరన్లు విరివిగా కనిపిస్తున్నవి.
రంగనాయకుని గుడి
[మార్చు]గుట్టకు పడమట కిందవైపున కొంచెం ఎత్తునవున్న గుహాలయాన్ని రంగనాయకుని గుడి అంటారు.ఇపుడైతే గుడిలో ఒకప్పుండుండిన సుందర శేషతల్పశాయి రంగనాయకుని విగ్రహం లేదు.ఏమైందో చెప్పేవారు లేరు.గుడికి ఇరువైపుల బండలమీద ఆంజనేయ, గరుత్మంతుల శిల్పాలు చెక్కివున్నవి.వెనకవైపు ఆల్వారులు, చెక్కబోయి నిలిపిన వినాయకుని శిల్పాలున్నవి. ఈ ఆలయపు ఉత్తరాశిమీద లలాటబింబంగా గజలక్ష్మి చెక్కబడివుండడం, ఆలయద్వారం దక్షిణాభిముఖంగా వుండడం చూస్తే ఇది కూడా ఒకప్పుడు జైనబసదికావచ్చుననిపిస్తున్నది.ఆలేరులో వున్న రంగనాయక దేవాలయం కూడా జైనమని చెప్పడానికి అదికూడా దక్షిణాభిముఖ ద్వారమే కలిగివుంది.ఇవన్ని ఒకప్పటి జైన, శైవ, వైష్ణవాల మధ్యపోటీ, ప్రాభవాల వల్లనే జరిగివుంటాయి.
కపాలభైరవుడు, కాళికాదేవి ఆలయాలు
[మార్చు]గజగిరికొండకు తూర్పున ఆగ్నేయంలో చిన్నగుహలెక్క కనిపించేచోట కపాలభైరవుడు, కొంచెం దూరంలో కాళికాదేవి గుట్ట రాళ్ళకు చెక్కివున్నాయి.ఇవి కాపాలికుల ఆరాధనాస్థలాలని చెప్పవచ్చు.
గజగిరిగుట్ట మీద బౌద్ధం
[మార్చు]వాయవ్యదిక్కునుండి వెళితే పైన పెద్ద ఇటుకల నిర్మాణాల శిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడ లభిస్తున్న పెంకులు, ఇటుకల (14, 8, 4 అంగుళాల కొలతలతో) వలయాల వరుసలు, కొన్ని పాలాస్త్రికి వాడే పలుచని ఇటుకలబిళ్ళలు ఆధారంగా ఇది తప్పకుండా బౌద్ధుల ఉద్దేశిక స్తూపమైవుంటుందని చెప్పవచ్చు.ఆ నిర్మాణాలు పక్కన ఏనుగుకుండం, ఆ పక్కన చాలాచోట్ల ఇటుకలచేత కట్టిన నివాసాల (ఆరామాల) ఆనవాళ్ళు, రాతిస్తంభాలు, రాతిపలకలు...ఇవన్నీ బౌద్ధుల ఆవాసాలని ధ్రువపరుస్తున్నవి. అంతేగాకుండా కొన్నెవాగు బచ్చన్నపేటవాగులో కలిసి కొలనుపాక వద్ద ఆలేరువాగు (భిక్కేరు) గా మారుతున్నది.ఆలేరువాగుకున్న భిక్కేరనే పేరు ఈ ప్రాంతంలో బౌద్ధులు విహరించారని స్తూపాలు, ఆరామాలు నిర్మించారని (ఉదాహరణకు నల్లగొండ ఆత్మకూరు మండలంలోని చాడ, ఫణిగిరి, తిర్మలగిరులలో బౌద్ధస్తూపాలున్నవి) రాజపేట మండలం రఘునాథపురం రామస్వామిగుట్టకు బౌద్ధం బొమ్మలున్నవి.ఈ వరుసలో గజగిరిగుట్ట కూడా బౌద్ధుల ఆవాసమనడానికి సందేహం లేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".