కోటంరాజు రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోటంరాజు రామారావు
1997లో విడుదలైన తపాలాబిళ్లపై రామారావు
జననం9 నవంబరు 1896
మరణం24 మే 1953 (వయసు 56)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నేషనల్ హెరాల్డ్

కోటంరాజు రామారావు ప్రముఖ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1897, నవంబరు 9వ తేదీన చీరాలలో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో పట్టభద్రుడయ్యాడు. ఇతడు పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా కొంతకాలం పనిచేశాడు. పత్రికారంగంలో నిర్భయుడైన సంపాదకునిగా మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, చక్రవర్తి రాజగోపాలాచారి మొదలైన ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. మహాత్మాగాంధీ ఇతడిని ఫైటింగ్ ఎడిటర్ అని అభివర్ణించాడు. ఇతడు పలు గ్రంథాలను రచించాడు. ప్రముఖ సంపాదకుడు కోటంరాజు పున్నయ్య (1894-1950) ఇతనికి స్వయానా అన్నయ్య అవుతాడు.

పత్రికారంగం

[మార్చు]

ఇతడు మొదట బ్రహ్మసమాజం వారి "హ్యుమానిటీ" (Humanity) వారపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించాడు. తరువాత కరాచీ నుండి వెలువడే సింధ్ అబ్జర్వర్ (Sindh Observer) లో చేరి అటుపిమ్మట ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది లీడర్ (The Leader), ది పయనీర్ (The Pioneer), ఈస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ (Eastern express), డాన్‌ (Don), స్వరాజ్య (Swarajya), హిందుస్థాన్‌ టైమ్స్‌ (Hindustan Times), సర్చ్ లైట్ (Searchlight), ది పీపుల్ (The People) వంటి పత్రికలలో పనిచేశాడు[1]. ఇతడు పాత్రికేయుడిగా పత్రికా స్వాతంత్ర్యం కాపాడడం కోసం అనేక సందర్భాలలో పనిచేసే పత్రికాయాజమాన్యంతో వచ్చే విభేదాల వలన తన రాజీనామా చేయడానికి కూడా వెనుకంజవేసేవాడు కాదు. అందుకే ఇతడు 33 పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశాడు. ఇంగ్లాండు, బ్రెజిల్, ఫ్రాన్సు, స్విట్జర్లాండు, ఇటలీ, అమెరికా వంటి దేశాలలో పర్యటించి అక్కడ పత్రికా విధానం గురించి క్షుణ్ణంగా పరిశీలించాడు. అఖిల భారత దిన పత్రికల సంపాదకుల మహాసభ స్థాపనలో ఇతడు ప్రముఖ పాత్ర వహించాడు. అలాగే భారతీయ వర్కింగ్‌ జర్నలిస్టు సమాఖ్యలో ఇతడు కీలక పాత్ర వహించాడు.

నేషనల్ హెరాల్డ్

[మార్చు]

జవహర్‌లాల్ నెహ్రూ 1938లో స్థాపించిన "ది నేషనల్ హెరాల్డ్" (The National Herald) పత్రికలో ఇతడు ఆ పత్రికకు మొట్టమొదటి సంపాదకుడిగా నియమించబడ్డాడు. ఈ పత్రికలో అతడు రాణించి అందరికీ సుపరిచితుడైనాడు. బ్రిటిష్‌ దురంతాలను తీవ్రంగా ఈ పత్రిక సంపాదకీయాల ద్వారా విమర్శించేవాడు.

1942లో కె.రామారావు అరెస్టు వార్తను ప్రచురించిన నేషనల్ హెరాల్డు పత్రిక కటింగ్

యు.పి.గవర్నర్ సర్ మారిన్ హాలెట్ హయాంలో జరిగిన బాల్లియా హత్యాకాండ వార్తలను పతాక శీర్షికలో ప్రచురించాడు. బాల్లియా ఆజమ్‌గడ్‌లో సాగిన అకృత్యాలు, దోపిళ్ళు, దహనాలు, హననకాండను ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆకతాయి చర్యగా అభివర్ణించాడు.[2] ఇతడు సంధించిన అక్షరశరాలపై ప్రభుత్వం కక్షసాధింపుగా పెద్దమొత్తం ధరావత్తు చెల్లించాల్సిందిగా ఆదేశం జారీచేసింది. అందుకు స్పందించిన ప్రజలు భూరివిరాళాలు సేకరించి అంతకన్నా పెద్దమొత్తమే చెల్లించారు. ఈ చర్య ప్రభుత్వానికి పెద్ద తలవంపులు తెచ్చిపెట్టింది. 1942లో లక్నో సెంట్రల్ జైలులో సత్యాగ్రహులపై సాగిన దమనకాండను నిరసిస్తూ ఇతడు వ్రాసిన సంపాదకీయం "జైల్ ఆర్ జంగిల్"పై బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహం చెంది ఇతడిని జైలుకు పంపింది. జైలు నుంచి కోటంరాజు వందేమాతరం శీర్షిక ద్వారా బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రచురించే వ్యాసాలవల్ల బ్రిటిషు ప్రభుత్వం ఆ పత్రికను కూడా మూయించింది.[3]

రాజ్యసభ సభ్యత్వం

[మార్చు]

ఇతడు 1952లో మొట్టమొదటి రాజ్యసభకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి సభ్యుడిగాఅ ఎన్నుకోబడ్డాడు. నెహ్రూ ప్రభుత్వంలో ఇతడు ప్లానింగ్ & పబ్లిసిటీ సలహాదారుగా ఉన్నాడు.

రచనలు

[మార్చు]
  • The Pen As My Sword Memoirs Of A Journalist[4]

మరణం

[మార్చు]

ఇతడు 1961, మార్చి 9వ తేదీ అర్ధరాత్రి ప్రయాణిస్తున్న రైలు నుండి అకస్మాత్తుగా క్రిందపడి మరణించాడు[2].

మూలాలు

[మార్చు]
  1. విలేఖరి (10 November 2012). "పత్రికా స్వాతంత్ర్యంకోసం పోరాడిన కోటంరాజు రామారావు". సూర్య దినపత్రిక. మేజర్ న్యూస్. Retrieved 26 October 2016.[permanent dead link]
  2. 2.0 2.1 డి.ఆంజనేయులు (1 October 1993). "ఆంగ్లపత్రికా ప్రపంచంలో పేరుపొందిన ఆంధ్రులు". మిసిమి: 17–18. Retrieved 26 October 2016.
  3. త్రివేణి. "Kotamraju Rama Rao". Amazing Telugus. Archived from the original on 27 అక్టోబరు 2016. Retrieved 26 October 2016.
  4. కె.రామారావు (1 September 1965). The Pen As My Sword Memoirs Of A Journalist. బొంబాయి: భారతీయ విద్యాభవన్. p. 357. Retrieved 26 October 2016.