చామంతి
చేమంతి ఒక అందమైన పువ్వు. పుష్పించే మొక్కలలోని క్రిసాంథిమం (Chrysanthemum) ప్రజాతికి చెందిన సుమారు 30 జాతుల మొక్కలు. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చేమంతి శీతాకాలంలో పూస్తుంది. సాగులో ఉన్న చేమంతి రకాలను నక్షత్ర చేమంతి (చిన్నపూలు), పట్నం చేమంతి (మధ్యస్థపూలు), పెద్దసైజు పూలు గలవిగా విభజించవచ్చు.
రకాలు
[మార్చు]- పసుపు పూల రకాలు: ఎల్లో గోల్డ్, రాయచూర్, సిల్పర్ (హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సాగుచేసే రకాలు)
- తెలుపు పూల రకాలు: రత్లామ్ సెలక్షన్, బగ్గి, ఐ.ఐ.హెచ్. ఆర్ 6.
- ఎరుపు పూల రకాలు: రెడ్‌గోల్డ్, కో2
సాగుచేయు విధానం
[మార్చు]- వాతావరణం, నాటే సమయం
చేమంతి మొక్కలు పగటి సమయంలో శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చేమంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్, జూలై మాసాలలో మొక్కలను నాటినట్టయితే నవంబరు, డిసెంబరు మాసాలలో పూస్తాయి.
- నేలలు
తేలికపాటి నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుండి 7 మధ్య ఉండాలి. మురుగునీటి పారుదల సరిగా లేకపోతే మొక్కలు చనిపోతాయి.
- ప్రవర్థకం
పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధకం చేస్తారు. పూలకోతలు అయిన తర్వాత ఫిబ్రవరి. మార్చినెలలలో మొక్కల నుంచి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి. మొక్కలను కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధకం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకలను జూన్, జూలై నెలలలో నాటుకోవాలి.
- నాటడం - ఎరువులు
మొక్కలను 20-30 సెం.మీ ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 55 వేల నుండి 60 వేల మొక్కలు అవసరమవుతాయి. నాటడానికి ముందు ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, 60 నుండి 80 కిలోల పొటాష్ వేసుకోవాలి.
- నీటి యాజమాన్యం
నాటిన మొదటి నెలలో వారానికి రెండు నుండి మూడు సార్లు, అటుతర్వాత వారానికి ఒక తడి ఇవ్వాలి.
- ఊతమివ్వటం
చేమంతి మొక్కలు వంగిపోకుండా వెదురు కర్రతో ఊతమివ్వడం మంచిది.
- దిగుబడి
నారు నాటిన తర్వాత సుమారు నెలరోజులకు చేమంతి మొక్కల తలలు త్రుంచివేయడం వల్ల పక్క కొమ్మలు ఏర్పడి అధిక పూల దిగుబడి పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుండి 75 నుండి 120 పూలను పొందవచ్చు.
- తలలు తుంచడం
నారు నాటిన నాలుగు వారాల తర్వాత చేమంతి మొక్కల తలలను తుంచివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నిలువు పెరుగుదల ఆగి, పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది. పంట కూడా కొంత ఆలస్యంగా వస్తుంది.
- హార్మోన్ల వాడకం
వంద పి.పి.యం (100 మి.గ్రా. లను లీటరు నీటిలో) నాఫ్తలిన్ ఎసిటిక్ ఆవ్లూన్ని మొగ్గ దశకంటె ముందుగా పిచికారి చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. వంద నుండి 150 పి.పి.యం జిబ్బరిలిక్ ఆవ్లూన్ని పిచికారి చేస్తే 15 నుండి 20 రోజులలో త్వరగా పూతకొస్తుంది.
- పూలకోత
జూన్, జూలైలో నాటిన మొక్కలు డిసెంబరు, జనవరి వరకు పూతపూసి కోతకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10 నుండి 15 సార్లు పూలు కోయవచ్చు. ఎకరాకు 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది.
సస్యరక్షణ
[మార్చు]చేమంతి పంటకు ముఖ్యంగా పచ్చపురుగు, ముడత, ఆకు తొలుచు పురుగు ఎక్కువగా నష్టం కలగచేస్తాయి.
పచ్చపురుగు: ఈ గొంగళి పురుగులు ఆకులను తినివేయడమే కాక పువ్వును కూడా పాడుచేస్తాయి. నివారణకు మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలను గాని లేక క్వినాల్‌ఫాస్ పొడి 8 కిలోలు ఎకరం విస్తీర్ణంలో చల్లుకోవాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకుని నివారించవచ్చు.
త్రిప్పు: ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు ముడుతలు పడి ఉండిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. నివారణకు డైమిధోయేట్ 1.5 మి.లీ. లేక కార్బరిల్ 50 శాతం పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు: నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడటం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణకు మంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.