ఖచ్చితత్వ వ్యవసాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖచ్చితత్వ వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్ ద్వారా సృష్టించిన మిథ్యావర్ణ మిశ్రమ చిత్రాలు (ఫాల్స్ కలర్ కాంపోజిట్ ఇమేజెస్) మిక్కిలి ఉపయోగకరం.[1]
ట్రాక్టర్‌పై అమర్చిన యారా ఎన్-సెన్సార్ ALS - ఇది పంటల కాంతి ప్రతిబింబాన్ని నమోదు చేసి, ఎరువుల సిఫార్సులను లెక్కించి, దాని ప్రకారం ఎరువుల కొలతలను మారుస్తుంది.
ఖచ్చిత వ్యవసాయం NDVI 4 cm/pixel GSD

ఖచ్చితత్వ వ్యవసాయం అనేది, వ్యవసాయంలో వచ్చే కాలాత్మక, ప్రాదేశిక వైవిధ్యాన్ని గమనించడం, కొలవడం, దానికి ప్రతిస్పందించడం ద్వారా వ్యవసాయోత్పత్తి స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి చేసే వ్యవసాయ నిర్వహణ వ్యూహం.[2] ఇది వ్యవసాయోత్పత్తితో పాటు పశుపోషణలోనూ ఉపయోగపడుతుంది. ఖచ్చితత్వ వ్యవసాయంలో వ్యవసాయ కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి, వాటి విషయంలో నిర్ణయం తీసుకోవడనికి, లేదా పనితీరును మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.[3][4] ప్రకృతి వనరులను సంరక్షిస్తూ అత్యధిక రాబడులను పొందడమే ధ్యేయంగా ఒక డెసిషన్ సపోర్ట్ సిస్టెమ్‌ను తయారు చేయడమే ఖచ్చితత్వ వ్యవసాయ పరిశోధన లక్ష్యం.[5][6]

అనేక సంవత్సరాల పంట సమాచారాన్ని (అంటే మొక్కల పెరుగుదల లక్షణాలు, స్థిరత్వం) భూమి స్వరూపంతో పోల్చి, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితత్వ వ్యవసాయానికి ఒక ఫైటోజియోమార్ఫలాజికల్ విధానంగా వాడుతారు. పంట పొలం జలధర్మం (ఆ పొలంలో నీరు ఎంత ఉన్నాయి, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి) భూమి స్వరూపంపై ఆధారపడటం వల్ల ఈ విధానంపై ఆసక్తి ఎక్కువ.

జీపీఎస్, జీఎన్‌ఎస్‌ఎస్‌ల వంటి నావిగేషన్ వ్యవస్థల రాకతోనే ఖచ్చితత్వ వ్యవసాయం సాధ్యమైంది. రైతులు, పరిశోధకులు వారి వారి పొలాల ఖచ్చితమైన స్థానాల్ని (అక్షాంశ రేఖాంశాల్ని) తెలుసుకోగలగడం వల్ల మొక్కలు, నేలకు సంబంధించిన అనేక లక్షణాల ప్రాదేశిక మార్పుల మానచిత్రాలను తయారుచేయడం వీలుపడింది. అలాంటి లక్షణాల్లో కొన్ని మఖ్యమైనవి పంట దిగుబడి, భూమి స్వరూపం, సేంద్రియ పదార్థ నిలువలు, నేలలో తేమ స్థాయులు, నత్రజని స్థాయులు, pH, నేల విద్యుత్ వాహకత, మెగ్నీషియం, పొటాషియం, తదితరాలు.[7] ఇదే సమాచారాన్ని కంబైన్ హార్వెస్టర్లపై అమర్చిన జీపీఎస్ అనుసంధానిత సెన్సార్ శ్రేణులు కూడా సేకరిస్తాయి. ఈ రియల్-టైమ్ సెన్సార్లు బహుళ వర్ణపట (మల్టీస్పెక్ట్రల్) చిత్రాలు సహా పత్రహరితం (క్లోరోఫిల్) స్థాయిల నుండి మొక్కల నీటి స్థితి వరకు ప్రతిదీ కొలుస్తాయి.[8] ఈ సమాచారాన్నీ, ఉపగ్రహ చిత్రాలనీ కలిపి సీడర్లు, స్ప్రేయర్ల లాంటి ఉపకరణాల సహాయంతో చరరీతి సాంకేతికత (వేరియబుల్ రేటు టెక్నాలజీ) ద్వారా వనరులను సరైన మోతాదుల్లో పంపిణీ చేస్తారు. అయితే, ఇటీవలి కాలంలో వచ్చిన సాంకేతిక పురోగతితో నేరుగా మట్టిలోనే రియల్ టైమ్ సెన్సార్లను స్థాపించడం సంభవమైంది. ఇవి మానవ ప్రమేయం అవసరం లేకుండా సమాచారాన్ని వైర్‌లెస్‌గా ప్రసారం చేయగలవు.[9][10][11]

ఖచ్చితత్వ వ్యవసాయం మానవరహిత వైమానిక వాహనాల (డ్రోన్లు) రాకతో మరింత సులువైంది. ఇవి చవకగా ఉండడమే కాక అనుభవం లేని పైలెట్‌లు కూడా వీటిని నడపగలరు. ఈ వ్యవసాయ డ్రోన్లు బహుళ వర్ణపట లేదా ఆర్‌జీబీ కెమెరాలతో అమర్చబడి, ఒక స్థలాన్ని అనేక కోణాల నుంచి చిత్రిస్తాయి. వీటి నుంచి ఫోటోగ్రామెట్రిక్ పద్ధతుల ద్వారా ఆర్తోఫోటోలను[a] సృష్టించవచ్చు. ఈ బహుళ వర్ణపట చిత్రాల్లో మామూలుగా ఉండే ఎరుపు, ఆకుపచ్చ, నీలివర్ణ పరిమాణాలే కాకుండా సమీప పరారుణ, ఎరుపు-అంచు వర్ణపట పరిమాణాలు కూడా ఉండడం వల్ల ఎన్‌డీవీఐ వంటి వృక్షసంపద సూచికలను లెక్క కట్టి, విశ్లేషించేందుకు వీలుంటుంది.[12] ఈ డ్రోన్లు చిత్రాలను తీయడమే కాకుండా ఎత్తు (ఎలివేషన్) వంటి భౌగోళిక ప్రమాణాలను కూడా అందించగలవు. ఇవి భౌగోళిక సాఫ్ట్‌వేర్లలో ఖచ్చితమైన స్థలాకృతి పటాలను రూపొందించే బీజగణితోక్తులకు ఇన్‌పుట్లుగా పనిచేస్తాయి. ఈ పటాల ద్వారా పంట ఆరోగ్యాన్ని స్థలాకృతితో అనుసంధానించి, నీరు, ఎరువులు, కలుపు సంహారకాల వంటి రసాయనాలు, వృద్ధి నియంత్రకాలను చరరీతి సాంకేతికత ద్వారా పంటకి ఎప్పుడు ఎంత అవసరమో ఖచ్చితంగా లెక్క కట్టి అందించవచ్చు.

చరిత్ర

[మార్చు]

మూడవ ఆధునిక వ్యవసాయ విప్లవంలో ఖచ్చితత్వ వ్యవసాయానిది కీలక స్థానం. 1900 నుండి 1930 వరకు జరిగిన మొదటి వ్యవసాయ విప్లవంలో వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగింది. ఈ సమయంలో ఒక్కో రైతు 26 మందికి సరిపడా ఆహారాన్ని పండించాడు. 1960ల్లో సరికొత్త జన్యు సవరణ పద్ధతులతో హరిత విప్లవం చోటుచేసుకుంది. దీని ఫలితంగా ఒక్కో రైతు 156 మందికి సరిపడా ఆహారం పండించాడు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని, ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలంటే ఆహారోత్పత్తి ప్రస్తుత స్థాయికి రెట్టింపు అవ్వాలని ప్రస్తుత గణాంకాలు సూచిస్తున్నాయి. సాంకేతిక పురోగతి తెచ్చిపెట్టిన ఖచ్చితత్వ వ్యవసాయ విప్లవంతో ఒక్కో రైతు 265 మందికి సరిపడా ఆహారం పండించగలడని అంచనా.[13]

సారాంశం

[మార్చు]

ఖచ్చితత్వ వ్యవసాయ విప్లవం మొట్టమొదటగా ఉపగ్రహ, వైమానిక చిత్రాలు, ముందస్తు వాతావరణ సూచనలు, చరరీతి ఎరువుల ప్రయోగం, పంట ఆరోగ్య సూచికల రూపంలో వచ్చింది.[14] ఆ తరువాత యాంత్రిక సమాచారాన్ని కూడా కలుపుతూ మరింత ఖచ్చితంగా విత్తులు నాటడం, స్థలాకృతి మ్యాపింగ్, మట్టి సమాచారం సేకరించడం సంభవమైంది.[15]

ఖచ్చితత్వ వ్యవసాయం ఈ కింది విషయాల్లో క్షేత్ర స్థాయి పంట నిర్వహణను మెరుగుపరుస్తుంది:

 • పంట శాస్త్రం: ఎరువుల పంపిణీ వంటి వ్యవసాయ పద్ధతులను పంట అవసరాలకు మరింత దగ్గరగా జత చేయడం.
 • పర్యావరణ పరిరక్షణ: పర్యావరణ హాని తగ్గించడం, వ్యవసాయ పాదముద్రను (అగ్రికల్చరల్ ఫూట్‌ప్రింట్) తగ్గించడం (ఉదా. నత్రజని ప్రక్షాళనను అరికట్టడం)
 • ఆర్థిక శాస్త్రం: మరింత సమర్థవంతమైన పద్ధతుల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచడం (ఉదా: ఎరువుల వాడకం, ఇతర ఇన్పుట్ల మెరుగైన నిర్వహణ)

ఖచ్చితత్వ వ్యవసాయ పద్ధతులు రైతులకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. దానితో:

 • వారి పొలం రికార్డు నిర్మించుకోవచ్చు
 • మెరుగ్గా నిర్ణయాలు తీసుకోవచ్చు
 • వ్యవసాయ కార్యకలాపాలను సులువుగా తిరిగి చూసుకోవచ్చు
 • వ్యవసాయోత్పత్తుల క్రయ-విక్రయాలు మెరుగు పరచవచ్చు
 • లీజు ఏర్పాట్లను, భూస్వాములతో సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు
 • వ్యవసాయోత్పత్తుల స్వాభావిక నాణ్యతను మెరుగుపరచవచ్చు (ఉదా: గోధుమపిండి తయారుచేసే గోధుమలలో ప్రోటీన్ స్థాయి పెంచడం)

ఆదేశిక విత్తే పద్ధతి (ప్రిస్క్రిప్టివ్ ప్లాన్టింగ్)

[మార్చు]

సెన్సార్లు, బహుళ వర్ణపట చిత్రాలు అందించే సమాచారాన్ని ఉపయోగించి తయారుచేసే విత్తన సూచనలను అనుసరించి చేసేదే ఆదేశిక విత్తే పద్ధతి. ఈ ప్రక్రియలో పంట దిగుబడిని పెంచేందుకు, ఒకే పొలంలోని వేర్వేరు స్థానాల్లోని మట్టి, నీరు పరిస్థితులను బట్టి చరరీతి సాంకేతికత ద్వారా మొక్కల సాంద్రత మారుస్తూ విత్తుతారు. దీన్ని "పొలంలో బిగ్ డేటా"గా అభివర్ణించారు.

ముఖ్యసూత్రాలు

[మార్చు]

ఖచ్చితత్వ వ్యవసాయం అనేక సాధనాలను ఉపయోగిస్తుంది. వాటిలో ట్రాక్టర్లు, కంబైన్‌లు, స్ప్రేయర్లు, ప్లాంటర్లు, డిగ్గర్లు ఆటో-గైడెన్స్ సిస్టమ్స్‌గా పరిగణించేవీ, మౌలికమైనవీ. వ్యవసాయ సాధనాల్లో అమర్చే, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)ను ఉపయోగించే చిన్న చిన్న పరికరాలే అసలు ఖచ్చితత్వ వ్యవసాయాన్ని నిర్వచిస్తాయి. భౌగోళిక సమాచార వ్యవస్థే ఖచ్చితత్వ వ్యవసాయానికి మెదడు. దీన్ని అనుసరించడానికి వ్యవసాయ సాధనాల్లో సరైన సాంకేతికత, సమాచార సంగ్రాహక వ్యవస్థలను అమర్చడం అవసరం. చరరీతి సాంకేతికత, జీపీయస్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్రిడ్ శాంప్లింగ్రి, మోట్ సెన్సార్లు మొదలైనవి ఖచ్చితత్వ వ్యవసాయంలో ఉపయోగపడే మరికొన్ని సాధనాలు.[16]

ప్రపంచవ్యాప్తి

[మార్చు]
Pteryx UAV, రోల్ స్టెబిలైజ్ చేసిన కేమేరానుపయోగించి వైమానిక ఫొటోగ్రఫీ, ఫొటో మ్యాపింగ్ చేయగల పౌర వైమానిక వాహనం

1980వ దశకం మొదట్లో అమెరికాలో ఖచ్చితత్వ వ్యవసాయం ఆవిర్భవించింది. 1985లో యూనివర్సిటీ ఆఫ్ మినెసోటా పరిశోధకులు పంట పొలాల్లో సున్నం ఉపయోగాన్ని చరరీతిన మార్చి చూపించారు. ఇదే సమయంలో జాలక నమూనా సేకరణ (గ్రిడ్ శాంప్లింగ్) విధానం కూడా ఆవిర్భవించింది. 1980వ దశకం చివర్లో ఈ పద్ధతిని ఎరువులు, pH సవరణ సూచనా మానచిత్రాలను తయారుచేయడానికి మొదటిసారి వాడారు. ఆ తరువాత పంట దిగుబడి సెన్సార్లు, జీపీయస్ రిసీవర్ల వాడకం ఊపందుకుంది. ఈ రోజున ఇలాంటి వ్యవస్థలు లక్షల ఎకరాల పంట భూమిలో ఉపయోగంలో ఉన్నాయి.

పర్యావరణహిత వ్యవసాయంపై మక్కువతో కన్నా తమ రాబడులను పంచుకోవడానికే అమెరికాలో రైతులు మొదట్లో ఖచ్చితత్వ వ్యవసాయ విధానాన్ని అవలంబించారు. పొలంలో అవసరమైన మేర మాత్రమే ఎరువులు ఉపయోగించడం వల్ల వారికి అధిక లాభాలు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఖచ్చితత్వ వ్యవసాయం అంచెలంచెలుగా వ్యాపించింది. ముందుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో వ్యాప్తి చెందింది. ఐరోపాలో 1997-98 ప్రాంతంలో ముందుగా యునైటెడ్ కింగ్‌డం, తరువాత ఫ్రాన్స్‌లో ఖచ్చితత్వ వ్యవసాయం ప్రవేశించింది. లాటిన్ అమెరికాలో ముందున్న దేశం అర్జెంటీనా. అక్కడ నేషనల్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఇంస్టిట్యూట్ సహకారంతో 1990వ దశకం మధ్యలో ప్రవేశించింది. బ్రెజిల్ పర్యవరణహిత వ్యవసాయాన్ని పరిశోధించి అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వరంగ సంస్థను స్థాపించింది.

యాంత్రీకరించిన వ్యవసాయంలో సరికొత్త డిజిటల్ సాంకేతికతలు ఎంతో పురోగతిని తెచ్చిపెట్టినా, యంత్రాల వాడకం లేని సాంప్రదాయ వ్యవసాయమే దిగువ-, మధ్య-ఆదాయ దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది.[17][18] యంత్రాల ఉపయోగం లేని వ్యవసాయంలో కూడా ఖచ్చితత్వ వ్యవసాయ లభాలను పొందేలా పరిశోధనలు జరుగుతున్నాయి, కొంతవరకు అనుసరణా మొదలైంది.[19][20][21] ఆగ్రోకేర్స్ చేతి సాయిల్ స్కానర్, వైమానిక వాహనాల ఉపయోగం, నావిగేషన్ వ్యవస్థల ఉపయోగం వంటివి ఈ కోవకు చెందినవే.[22][23]

ఖచితత్వ పశుపోషణ రైతులకు రియల్-టైమ్‌లో ఉత్పాదకత, పర్యావరణంపై ప్రభావాలు, పశువుల ఆరోగ్యం వంటి వాటి గురించిన సమాచారం ఇస్తుంది.[24] పశువులకు, పశుశాల సామగ్రికి అమర్చే సెన్సార్లు పశువుల కదలికలను, అవసరాలని, ఆరోగ్యాన్ని అనునిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాయి.[25] ప్రపంచవ్యాప్తంగా ఆటోమ్యాటిక్ పాలు పితికే యంత్రాల అమ్మకాలు పెరిగినా, వాటి వాడకం ఉత్తర ఐరోపాలోనే కనిపిస్తుంది. అలాగే ఆటోమ్యాటిక్ మేత యంత్రాలు విపణిలో ఉన్నా వాటి వాడకం అంతంతమాత్రమే.

చైనాలోనూ ఖచ్చితత్వ వ్యవసాయ లాభాలు కనబడినా, అక్కడ ఎక్కువ శాతం చిన్న పొలాలు, సన్నకారు రైతులు ఉండడం వల్ల ఐరోపా, అమెరికా తరహాలో ఖచ్చితత్వ వ్యవసాయం చొచ్చుకుపోలేదు. పర్యావరణ సంరక్షణ, ఆర్ధిక లాభాలను దృష్టి ఉంచుకుని ఖచ్చితత్వ వ్యవసాయ విస్తృతి పెంచడానికి చైనా కసరత్తులు చేస్తోంది.[26]

2014 డిసెంబరులో రష్యా అధ్యక్షుడు నేషనల్ టెక్నాలజీ ఇనిషియేటివ్‌లో భాగంగా వారి పార్లమెంట్లో ఫూడ్‌నెట్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులోని ముఖ్యాంశాల్లో ఖచ్చితత్వ వ్యవసాయం ఒకటి.[27][28]

భారతదేశంలో ఖచ్చితత్వ వ్యవసాయం ఇంకా అంకురదశలోనే ఉంది. పోషకపదార్థ వినియోగ సామర్థ్యం, నీటి వినియోగ సామర్థ్యాల కోసం మాత్రమే ప్రస్తుతం ఖచ్చితత్వ వ్యవసాయ పద్ధతుల ఉపయోగం జరుగుతుంది. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు భారతదేశంలో అత్యంత విరివిగా కనిపించే ఖచ్చితత్వ వ్యవసాయ పద్ధతులు. అయితే, పరిశోధనా సంస్థలు తక్కువ ఖర్చుతో అవలంబించదగ్గ పద్ధతులను కనుగొనడంపై దృష్టి పెట్టి కొంత వరకు విజయం సాధించాయి కూడా. భారత వరి పరిశోధన సంస్థ వరి పంటలో నత్రజని స్థాయుల నిర్వహణ కోసం అభివృద్ధి చేసిన కస్టమైజ్డ్ లీఫ్ కలర్ చార్ట్ మెరుగైన ఫలితాలను ఇచ్చి భారతదేశంలో చవకైన ఖచ్చితత్వ వ్యవసాయ పద్ధతుల అవకాశాల్నీ, అవసరాన్నీ తెలిజేసింది. 2004-2005లో మొదలైన తమిళనాడు ప్రిసిషన్ ఫార్మింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో బిందు సేద్య వ్యాప్తిని ముందుకు తీసుకెళ్ళింది. సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విధానాలు, పథకాలు ప్రవేశపెట్టింది.[29]

ఆర్థిక, పర్యావరణ ప్రభావాలు

[మార్చు]

ఖచ్చితత్వ వ్యవసాయంలో అవసరమైన చోట అవసరమైన మేర మాత్రమే నీరు, ఎరువులు, కీటకనాశినులను వాడడం వల్ల పెట్టుబడి తగ్గి, రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయి.

అంతే ముఖ్యంగా, పర్యవరణంపై చెడు ప్రభావాలు తగ్గుతాయి. నీటి నిల్వలు నశించకుండా ఉంటాయి, రసాయనాలను తక్కువ మోతాదుల్లో ఉపయోగించడం వల్ల మట్టి, నీరు, పంట నాణ్యత క్షీణించకుండా ఉంటుంది.[30] వ్యవసాయ యంత్రాలను మెరుగ్గా నిర్వహించడం ద్వారా కూడా ఖచ్చితత్వ వ్యవసాయం పర్యావరణానికి మేలు చేస్తుంది. జీపీయస్ వంటి దూర నియంత్రణ సాధనాల ఉపయోగం ఇంధన వాడకం తగ్గిస్తుంది. సస్టెయినబుల్ వ్యవసాయంలో ఖచ్చితత్వ వ్యవసాయానిదే పెద్ద భూమిక.

అధునాతన సాంకేతికతలు

[మార్చు]

రోబోలు

[మార్చు]

ఇప్పటికే వాడుకలో ఉన్న సెల్ఫ్-స్టీరింగ్ ట్రాక్టర్లు రైతు ప్రమేయం దాదాపు లేకుండా పని చేసేస్తాయి.[31] పొలం దున్నడం, ఎరువులు చల్లడం వంటి పనులకు జీపీయస్ వాడే డ్రైవర్ లేని యంత్రాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కలుపు మొక్కలను గుర్తించి లేజర్‌తో గానీ హెర్బిసైడ్‌తో గానీ వాటిని నాశనం చేసే, సౌర విద్యుత్తుతో నడిచే రోబోలు అత్యాధునిక సాంకేతికతకు ఒక ఉదాహరణ. ఇప్పటికే వాడుకలో ఉన్న ఆగ్‌బాట్స్ అనే వ్యవసాయ రోబోలకు అదనంగా పండిన పళ్ళను గుర్తించి చెట్ల నుంచి కోసే సామర్థ్యాన్ని ఇచ్చే పని కూడా జరుగుతుంది.[30][32][33]

డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు

[మార్చు]

డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలది ఖచ్చితత్వ వ్యవసాయంలో ముఖ్య భూమిక. డ్రోన్లు అధిక విశ్లేషంతో చిత్రాలు తీస్తే, ఉపగ్రహాలు అధిక విస్తీర్ణాన్ని చిత్రాలు తీస్తాయి. ఈ రెండు రకాల చిత్రాల నుంచి ప్రస్తుత జీవద్రవ్య (బయోమాస్) స్థాయులు, ఆపై భవిష్యత్తు దిగుబడీ అంచనా వేసే వీలుంది. ఈ చిత్రాల నుంచే భూ ఆకృతి పటాల (కాంటూర్ మ్యాప్స్) ద్వారా నీటి పారుదలను గుర్తించడం, చరరీతిన విత్తడం, క్షేత్రస్థాయి దిగుబడి పటాలు తయారు చేయడం వంటివి సాధ్యపడతాయి.[34]

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

[మార్చు]

వివిధ వస్తువులకు ఎలెక్ట్రానిక్ పరికరాలను అమర్చి, వాటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ఆ వస్తువుల ద్వారా జరిగే పనిని మరింత మెరుగ్గా చెయ్యవచ్చు. అలా ఎలెక్ట్రానిక్ పరికరాలతో అనుసంధానించిన వస్తువుల సమూహాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. సెన్సార్లు, సాఫ్ట్‌వేర్లను వ్యవసాయ పనిముట్లకు అమర్చడం ద్వారా వ్యవసాయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఆచరణలో పెట్టవచ్చు.[35] మట్టిలో తేమ సెన్సార్లు అమర్చితే అవి నీరు ఎప్పుడు పెట్టలో చెప్తాయి.[36]

మొక్కల పెంపకంలోనే కాకుండా పశుపోషణలోనూ అనేక ఆవిష్కరణలు వచ్చాయి. పశువులకు ఆమ్లపిత్తము (స్టమక్ ఎసిడిటీ), జీర్ణక్రియ సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి సెన్సార్లు ఉన్నాయి. అలాగే వాటి కదలికలను, ఆరోగ్యాన్ని, భౌతిక గాయాలను పసిగట్టడానికి బాహ్య సెన్సార్లు ఉన్నాయి.[37] ఈ సెన్సార్ల డేటాను సమగ్రంగా విశ్లేషించి పశుపోషణలో గానీ ఏదైనా ఒక పశువులో గానీ ఏవైనా స్థిరమైన ధోరణులు ఉంటే తెలుసుకునే వీలుంది. ఉదాహరణకు, ఒక ఆవుకు జీర్ణ సమస్యలు వస్తే, ఆ ఆవుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి యే ఆహారం తీసుకున్నప్పుడు సమస్యలు వస్తున్నాయో స్పష్టంగా, సులువుగా తెలుసుకోవచ్చు.

తేనెటీగల పెంపకంలోనూ సెన్సార్లు అనివర్యమనే చెప్పవచ్చు. తేనెటీగలు తిరిగే ప్రదేశంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కార్బన్ డయాక్సైడ్‌లను సెన్సార్లు నిత్యం పర్యవేక్షిస్తూ తేనెటీగల ఆరోగ్యం క్షీణించకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడనికి ఉపకరిస్తాయి. మొత్తం తేనెపట్టుకే నష్టం చేకూర్చే సమస్యలను మొదట్లోనే పసిగట్టి విషమించకుండా చూసుకునే వీలు కల్పిస్తాయి. తేనెటీగల ఉత్పాదకత మెరుగ్గా ఉండడానికి దోహదపడతాయి.[38]

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

[మార్చు]

ఖచ్చితత్వ వ్యవసాయంలో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ అప్లికేషన్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిలో స్వతహాగా ఉండే కెమేరా, మైక్రోఫోన్, జీపీయస్, అక్సెలెరోమీటర్ వంటి అప్లికేషన్లు ఎంతో ఉపయోగకరం. ఇవే కాకుండా ప్రత్యేకంగా వ్యవసాయ అవసరాల కోసం మ్యాపింగ్, పశువుల ట్రాకింగ్, వాతావరణ/ పంట సమాచారం అందించే అప్లికేషన్‌లూ ఉన్నాయి. ఇవి ఒక పరికరం నుంచి ఇంకో దానికి మార్చుకోడానికి వీలుగా, చవకగా, ఎక్కువ కంప్యూటింగ్ పవర్‌తో ఉంటాయి.[39]

మెషీన్ లెర్నింగ్

[మార్చు]

మెషీన్ లెర్నింగ్‌ను సాధారణంగా డ్రోన్లు, రోబోలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో కలిపి వాడుతారు. ఈ పరికరాలన్నిటి నుంచి సమాచారాన్ని సేకరించి వాటికణుగుణంగా ఏం చెయ్యాలో తిరిగి ఆ పరికరాలకు సూచిస్తుంది. అంతే కాకుండా భవిష్యత్ అవసరాలు అంచనా వేయడం కూడా చేస్తుంది. ఖచ్చితత్వ వ్యవసాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక అది ఎంత సమర్థవంతంగా ఉంది అనేది మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికత పైనే ఆధారపడి ఉంటుంది.

గమనికలు

[మార్చు]
 1. వైమానిక చిత్రాలనూ (విమానాలు, వైమనిక వాహనాల నుంచి తీసిన చిత్రాలు), ఉపగ్రహ చిత్రాలనూ క్షేత్రగణితం ప్రకారం సరిచేసినప్పుడు వాటిని ఆర్థోఫోటోలంటారు. ఇలా సరిచేసిన చిత్రాలు ఒక పటప్రక్షేపణాన్ని (మ్యాప్ ప్రొజెక్షన్) అనుసరిస్తాయి, చిత్రాల్లోని వస్తువులన్నీ ఒక స్కేలును అనుసరిస్తాయి. ఆర్థోఫోటోను ఉపయోగించి అందులోని యే రెండు బిందువుల మధ్య దూరాన్నైనా సరిగ్గా లెక్కించవచ్చు. కెమేరా వంపు, అందులోని లెన్స్ వక్రత (దిస్టార్షన్), భూమి స్వరూపంలో సహజంగా ఉండే ఎత్తుపల్లాల వల్ల చిత్రంలో వచ్చే వక్రతలు మొదలైనవన్నీ ఆర్థోఫోటోలో సవరించబడతాయి.

మూలాలు

[మార్చు]
 1. "Precision Farming : Image of the Day". earthobservatory.nasa.gov. 30 January 2001. Retrieved 12 October 2009.
 2. "Precision Ag Definition | International Society of Precision Agriculture". www.ispag.org. Retrieved 20 December 2021.
 3. The State of Food and Agriculture 2022 − Leveraging agricultural automation for transforming agrifood systems. Rome: Food and Agriculture Organization of the United Nations (FAO). 2022. doi:10.4060/cb9479en. ISBN 978-92-5-136043-9.
 4. In Brief to The State of Food and Agriculture 2022 − Leveraging automation in agriculture for transforming agrifood systems. Rome: Food and Agriculture Organization of the United Nations (FAO). 2022. doi:10.4060/cc2459en. ISBN 978-92-5-137005-6.
 5. McBratney, A., Whelan, B., Ancev, T., 2005. Future Directions of Precision Agriculture. Precision Agriculture, 6, 7-23.
 6. Whelan, B.M., McBratney, A.B., 2003. Definition and Interpretation of potential management zones in Australia, In: Proceedings of the 11th Australian Agronomy Conference, Geelong, Victoria, 2–6 Feb. 2003.
 7. McBratney, A. B.. "Estimating Average and Proportional Variograms of Soil Properties and Their Potential Use in Precision Agriculture".
 8. Reyns, P., Missotten, B., Ramon, H. et al. Precision Agriculture (2002) 3: 169. https://doi.org/10.1023/A:1013823603735
 9. M. Sophocleous et al., "A Stand-Alone, In Situ, Soil Quality Sensing System for Precision Agriculture," in IEEE Transactions on AgriFood Electronics, doi: 10.1109/TAFE.2024.3351953.
 10. M. Sophocleous and J. Georgiou, “Precision agriculture: Challenges in sensors and electronics for real-time soil and plant monitoring,” 2017 IEEE Biomed. Circuits Syst. Conf., pp. 1–4, 2017. https://doi.org/10.1109/BIOCAS.2017.8325180
 11. Sophocleous, M. (2016). "IoT & Thick-Film Technology for Underground Sensors in Agriculture".
 12. Anderson, Chris (May–June 2014). "Agricultural Drones Relatively cheap drones with advanced sensors and imaging capabilities are giving farmers new ways to increase yields and reduce crop damage". MIT Technology Review. Archived from the original on 7 March 2017. Retrieved 21 December 2016.
 13. "Digital agriculture: Helping to feed a growing world". 23 February 2017. Archived from the original on 15 October 2018. Retrieved 3 April 2018.
 14. [Haneklaus, Silvia/Lilienthal, Holger/Schnug, Ewald (2016): 25 years Precision Agriculture in Germany – a retrospective. In: Proceedings of the 13th International Conference on Precision Agriculture : 31 July – 3 August 2016, St. Louis, Missouri, USA. Online unter: https://www.openagrar.de/receive/openagrar_mods_00039296]
 15. Arama Kukutai (27 April 2016). "Can Digital Farming Deliver on its Promise?". www.agnewscenter.com.
 16. "Important tools to succeed in precision farming" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 31 October 2019. Retrieved 20 November 2019.
 17. The State of Food and Agriculture 2022 − Leveraging agricultural automation for transforming agrifood systems. Rome: Food and Agriculture Organization of the United Nations (FAO). 2022. doi:10.4060/cb9479en. ISBN 978-92-5-136043-9.
 18. In Brief to The State of Food and Agriculture 2022 − Leveraging automation in agriculture for transforming agrifood systems. Rome: Food and Agriculture Organization of the United Nations (FAO). 2022. doi:10.4060/cc2459en. ISBN 978-92-5-137005-6.
 19. Nyaga, Justine M.; Onyango, Cecilia M.; Wetterlind, Johanna; Söderström, Mats (2021-08-01). "Precision agriculture research in sub-Saharan Africa countries: a systematic map". Precision Agriculture (in ఇంగ్లీష్). 22 (4): 1217–1236. doi:10.1007/s11119-020-09780-w. ISSN 1573-1618. S2CID 254944417.
 20. Onyango, Cecilia M.; Nyaga, Justine M.; Wetterlind, Johanna; Söderström, Mats; Piikki, Kristin (2021-01-22). "Precision Agriculture for Resource Use Efficiency in Smallholder Farming Systems in Sub-Saharan Africa: A Systematic Review". Sustainability (in ఇంగ్లీష్). 13 (3): 1158. doi:10.3390/su13031158. ISSN 2071-1050.
 21. "Proceedings of 1st African Conference of Precision Agriculture – African Plant Nutrition Institute (APNI)" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-23.
 22. Lowenberg-DeBoer, James; Erickson, Bruce (2019). "Setting the Record Straight on Precision Agriculture Adoption". Agronomy Journal (in ఇంగ్లీష్). 111 (4): 1552–1569. Bibcode:2019AgrJ..111.1552L. doi:10.2134/agronj2018.12.0779. ISSN 0002-1962. S2CID 182858544.
 23. Van Beek, C (2020). Adoption level is the most underestimated factor in fertiliser recommendations (PDF). AgroCares. Archived from the original (PDF) on 13 December 2022. Retrieved 23 December 2022.
 24. Schillings, Juliette; Bennett, Richard; Rose, David Christian (2021). "Exploring the Potential of Precision Livestock Farming Technologies to Help Address Farm Animal Welfare". Frontiers in Animal Science. 2. doi:10.3389/fanim.2021.639678. ISSN 2673-6225.
 25. Schillings, Juliette; Bennett, Richard; Rose, David Christian (2021). "Exploring the Potential of Precision Livestock Farming Technologies to Help Address Farm Animal Welfare". Frontiers in Animal Science. 2. doi:10.3389/fanim.2021.639678. ISSN 2673-6225.
 26. . "Precision Agriculture in China: Exploring Awareness, Understanding, Attitudes and Perceptions of Agricultural Experts and End-Users in China".
 27. Osmakova, Alina; Kirpichnikov, Michael; Popov, Vladimir (2018). "Recent biotechnology developments and trends in the Russian Federation". New Biotechnology. 40 (Pt A): 76–81. doi:10.1016/j.nbt.2017.06.001. PMID 28634066.
 28. "Рынки Нти".
 29. "Precision Farming in India". Retrieved 2024-05-06.{{cite web}}: CS1 maint: url-status (link)
 30. 30.0 30.1 "The future of agriculture". The Economist. 9 June 2016.
 31. "The future of agriculture". The Economist. 9 June 2016.
 32. Papadopoulos, Loukia (21 October 2022). "This new farming robot uses lasers to kill 200,000 weeds per hour". interestingengineering.com. Retrieved 17 November 2022.
 33. "Verdant Robotics launches multi-action agricultural robot for 'superhuman farming'". Robotics & Automation News. 23 February 2022. Retrieved 17 November 2022.
 34. "The future of agriculture". The Economist. 9 June 2016.
 35. M. Sophocleous, Thick-Film Underground Sensors. LAP LAMPERT Academic Publishing, 2016. ISBN 978-3-659-95270-8 https://www.morebooks.de/store/us/book/thick-film-underground-sensors/isbn/978-3-659-95270-8
 36. M. Sophocleous and J. K. Atkinson, “A novel thick-film electrical conductivity sensor suitable for liquid and soil conductivity measurements,” Sensors Actuators, B Chem., vol. 213, pp. 417–422, 2015. https://doi.org/10.1016/j.snb.2015.02.110
 37. "The future of agriculture". The Economist. 9 June 2016.
 38. "Precision beekeeping with wireless temperature monitoring". IoT ONE. Retrieved 27 April 2018.
 39. Suporn Pongnumkul, Pimwadee Chaovalit, and Navaporn Surasvadi, “Applications of Smartphone-Based Sensors in Agriculture: A Systematic Review of Research,” Journal of Sensors, vol. 2015.