ఖమర్ జలాలబడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖమర్ జలాలబడి
జననం(1917-03-09)1917 మార్చి 9
మరణం2003 జనవరి 9(2003-01-09) (వయసు 85)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, పాటల రచయిత

ఖమర్ జలాలబడి (1917, మార్చి 9 - 2003, జనవరి 9),[1] పంజాబ్ కు చెందిన కవి, హిందీ సినిమాల పాటల రచయిత.[2][3] విక్రమ్ ఔర్ బేతాల్ అనే టెలివిజన్ సీరియల్ కు టైటిల్ ట్రాక్‌ని కంపోజ్ చేశాడు. ఖమర్ జలలాబాడి సినీ జీవితంలో దాదాపు 156 సినిమాలలో మొత్తం 700 పాటలు రాశాడు.[2]

తొలి జీవితం[మార్చు]

ఇతడు 1917, మార్చి 9న[2] పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్ జిల్లాలోని బియాస్ సమీపంలోని జలాలాబాద్ అనే గ్రామంలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇతడి అసలు పేరు ఓం ప్రకాష్ భండారి. ఏడేళ్ళ వయసు నుంచే ఉర్దూలో కవిత్వం రాయడం ప్రారంభించాడు.[3] అమర్ చంద్ అమర్ అనే సంచరించే కవి ఇతనిని స్వగ్రామంలో కలిసి, ఆతని అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని గుర్తించి రాయడానికి ప్రోత్సహించాడు.[2] ఇతనికి ఖమర్ (చంద్రుడు) అనే పేరును కూడా ఇచ్చాడు. జలాలబడి అతని స్థానిక పట్టణం పేరు. ఆ రోజుల్లో రచయితలు తాము పుట్టిన ఊర్ల పేరు పెట్టుకునేవారు. అమృత్‌సర్‌లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన తర్వాత, లాహోర్‌లోని డైలీ మిలాప్, డైలీ ప్రతాప్, నిరాలా, స్టార్ సహకార్ వంటి వార్తాపత్రికలకు రాయడం ద్వారా తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు.[3]

రచనారంగం[మార్చు]

సినిమారంగానికి ఆకర్షితుడై, ఖమర్ జలాలబడి 1940ల ప్రారంభంలో పూణే నగరానికి వెళ్ళాడు. 1942లో పంచోలీ పిక్చర్స్ నిర్మాణంలో వచ్చిన జమీందార్‌ సినిమాకు తన మొదటి పాట రాశాడు.[3]

తదనంతరం, బొంబాయికి మకాం మార్చి, అక్కడ దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పాటల రచయితగా పనిచేశాడు. ఇతడి పాటలను ఎస్డీ బాతీష్, నూర్ జెహాన్, జిఎం దురానీ, జీనత్ బేగం, మంజు, అమీర్బాయి కర్నాటకి, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, గీతా దత్, సురయ్యా, ముఖేష్, మన్నా డే, కిషోర్ కుమార్, ఆశా భోస్లే, లతా మంగేష్కర్ సహా అనేకమంది ప్రముఖ గాయకులు పాడారు. ఎస్డీ బర్మన్, సర్దార్ మాలిక్‌తో సహా చాలామంది ప్రముఖ స్వరకర్తలతో కలిసి పనిచేశాడు.

ప్యార్ కీ జీత్ (1948) సిపిమాలో కిషోర్ కుమార్ నటుడిగా పాడిన "గుణి జానో, భక్త్ జానో..." పాటను రాశాడు.[4]

హౌరా బ్రిడ్జ్ (1958) సినిమాకు రాసిన పాటలు ఇతడికి మంచి గుర్తింపును, కెరీర్‌ను ఇచ్చాయి. " మేరా నామ్ చిన్ చిన్ చు " (గీతా దత్), "ఆయే మెహెర్బాన్, బైతియే జానేజాన్...." వంటి పాటలు (ఆశా భోంస్లే) అత్యంత ప్రజాదరణ పొందాయి.[2]

ముంబైలోని ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ & ఐపిఆర్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[3]

ప్రశంసలు పొందిన కవిగా భారతదేశం అంతటా అనేక ముషాయిరాలలో తన కవిత్వాన్ని వినిపించాడు.[3]

మరణం[మార్చు]

ఇతడు 2003, జనవరి 9 మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Qamar Jalalabadi dead
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Profile of Qamar Jalalabadi on indiasamvad website Archived 13 జూన్ 2018 at the Wayback Machine, Published 10 March 2017, Retrieved 2023-07-14
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Profile of Qamar Jalalabadi on cinestaan.com website Archived 2018-04-08 at the Wayback Machine, Retrieved 2023-07-14
  4. [1]Subhashini Swar (Daughter) Archived 3 ఆగస్టు 2018 at the Wayback Machine

బయటి లింకులు[మార్చు]