గండవరం సుబ్బరామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండవరం సుబ్బరామిరెడ్డి
గండవరం సుబ్బరామిరెడ్డి.jpg
గండవరం సుబ్బరామిరెడ్డి
జననంసుబ్బరామిరెడ్డి
1937
నెల్లూరు జిల్లా, గూడూరు
మరణంజూన్ 18, 2017
హైదరాబాద్
ప్రసిద్ధినాటక రచయిత, నటులు, దర్శకులు, నిర్వహకులు, విమర్శకులు.
మతంహిందూ
తండ్రిబలరామిరెడ్డి
తల్లిజానకమ్మ

గండవరం సుబ్బరామిరెడ్డి (1937 - జూన్ 18, 2017) ప్రముఖ నాటక రచయిత, నటులు, దర్శకులు, నిర్వహకులు, విమర్శకులు.

జననం[మార్చు]

ఈయన 1937 సంవత్సరంలో జానకమ్మ, బలరామిరెడ్డి దంపతులకు నెల్లూరు జిల్లా లోని గూడూరులో జన్మించారు.

విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]

ఉన్నత పాఠశాల చదువు గూడూరులో పూర్తిచేసి, నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ పట్టభద్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయ కార్యదర్శిగా పనిచేసి, 1995లో పదవీ విరమణ చేశారు.

రంగస్థల ప్రవేశం[మార్చు]

1952లోనే రంగస్థలంతో అనుబంధం ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడే మమత అనే నాటిక రాసి స్కూలు వార్షికోత్సవాలలో ప్రదర్శింపచేసారు. నెల్లూరులో నిర్వహించిన రాష్టస్థ్రాయి నాటక పోటీల్లో ఏది మార్గం అనే నాటిక రాసి ప్రదర్శింపచేసి, ఉత్తమ నిర్వహణ బహుమతి పొందారు. నాటక రచన, పాత్ర పోషణ, విమర్శ, పరిశోధన వీరి ప్రత్యేకతలు.

ఇతర రచనలు[మార్చు]

‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’ అనే రంగస్థల నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకం అనే పుస్తకంగా 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన వరవిక్రయం, నిజం, గయోపాఖ్యానం పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.

ఆంధ్రదేశంలోని తెలంగాణా, ఆంధ్రా రాయలసీమ జిల్లాలలోనే కాక రాష్ట్రేతర పరిషత్తుల్లో కూడా నిర్వహించిన ఎన్నో నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక ప్రతిష్ఠాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు అమెరికాలో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన గ్రంథానికి సంగ్రహ సంపాదకులుగా వ్యవహరించి నాటక విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్నినాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు.

సన్మానాలు, అవార్డులు[మార్చు]

  • ఉత్తమ సాహితీ విమర్శకుడుగా ఆరాధనా జవ్వాది ట్రస్ట్
  • లలిత కళాసమితి వారి ఉగాది పురస్కారం
  • విశేష నాటక రంగ కృషివలుడుగా నార్ల ఫౌండేషన్‌వారి పురస్కారం
  • అభినయ స్టేజ్ అవార్డ్
  • తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు

గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలపాటు రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహించారు.

మరణం[మార్చు]

ఈయన 2017, జూన్ 18న హైదరాబాద్ లో మరణించారు.

మూలాలు[మార్చు]