గాంధీ సెంటెనరీ మ్యూజియం
Established | 1969 |
---|---|
Location | కరీంనగర్, తెలంగాణ, భారతదేశం |
Visitors | ప్రజా |
Website | అధికారిక వెబ్సైటు |
గాంధీ సెంటెనరీ మ్యూజియం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న మ్యూజియం.[1] శతాబ్దాల నాటి పురాతన శాసనాలు, విగ్రహాలు, నాణేలు, ఆయుధాలు, చాళుక్యులు, కాకతీయులు, బుద్ధుల కాలంలో ఉపయోగించిన వస్తువులు, సిరామిక్, మట్టి కుండలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.[2]
చరిత్ర
[మార్చు]1969వ సంవత్సరంలో మహాత్మాగాంధీ శతజయంతి వేడుకల సందర్భంగా గాంధీజీ జ్ఞాపకార్థంగా ఈ మ్యూజియం స్థాపించబడింది.[3]
సేకరణలు
[మార్చు]ఈ మ్యూజియంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రాతి పనిముట్లు, నాణేలు, టెర్రకోట బొమ్మలు, ఆయుధాలు ఉన్నాయి. ఇందులోని వస్తువులలో కొన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూర్, ధూళికట్ట, కోటిలింగాల, నాగునూరు మొదలైన ప్రాంతాలతోపాటు కరీంనగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాలలో నిర్వహించిన తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ మ్యూజియంలోని ప్రధాన మందిరంలో 3000 సంవత్సరాల పూర్వం రాతి పనిముట్లు ప్రదర్శించబడ్డాయి. ఇందులోని 20-లక్షల సంవత్సరాల నాటికి చెందిన చేపల-చెట్ల శిలాజాలు వేమనపల్లి, ముక్నూర్, కామనపల్లి ప్రాంతాల నుండి తీసుకురాబడ్డాయి.
మరో గదిలోని శాతవాహన కాలానికి చెందిన గొడ్డళ్ళు, కత్తిపీటలు, రాళ్ళు, ఇటుకలు, కుండలు, బీట్‌లు, కంకర ముక్కలు, టెర్రకోట గుట్టలు, ఇనుము ముక్కలు, జాడి-బిద్రి వంటి చారిత్రక వస్తువులు అప్పటి ప్రజల సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మ్యూజియం సెంట్రల్ హాల్‌లో నాలుగు పెద్ద గ్యాలరీలు ఉన్నాయి. ఇక్కడ మౌరియన్ పూర్వ కాలం నుండి బ్రిటిష్ కాలం వరకు నాణేలను ప్రదర్శింపబడ్డాయి.
హైదరాబాదు నిజాం నవాబులు ఉపయోగించిన ఆయుధాలు, ఫిరంగి, మందుగుండు సామగ్రిని కూడా ఇక్కడ ప్రదర్శించారు. రెండవ శతాబ్దానికి చెందిన జైన, బౌద్ధమతాలకు చెందిన విగ్రహాలు, బౌద్ధ సున్నపు రాతి ప్యానెల్స్ ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. వాటి వివరాలు కూడా చెక్కబడ్డాయి. ధూళికట్టలోని తవ్విన ప్రాంతం నుండి తెచ్చిన శాతవాహన కాలపు స్థూపం కళాత్మక విలువను ప్రతిబింబిస్తోంది. పెద్దబంకూర్ నుండి తెచ్చిన 12వ శతాబ్దానికి చెందిన ఆంజనేయ విగ్రహం, గంగాధర నుండి తెచ్చిన 7వ శతాబ్దానికి చెందిన అరుదైన పార్శ్వనాథ సల్లేఖన భంగిమ ఉన్నాయి. శాతవాహన నాగ ముచలింద (ఐదు తలల కోబ్రా విగ్రహం) కూడా ఉంది.[4]
సందర్శన వివరాలు
[మార్చు]ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Department of Heritage Telangana, Museums. "Gandhi Centenary Museum". www.heritage.telangana.gov.in. Archived from the original on 2021-07-15. Retrieved 4 October 2021.
- ↑ Telangana Today, Karimnagar (6 October 2020). "'Karimnagar Archaeology museum will get facelift'". Archived from the original on 3 November 2020. Retrieved 4 October 2021.
- ↑ "Gandhi Centenary Museum, Karimnagar, Andhra Pradesh". IndiaNetzone.com. Retrieved 2021-10-04.
- ↑ The New Indian Express, Karimnagar (12 May 2013). "Satavahana inscription in Karimnagar museum". The New Indian Express. Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ "Gandhi Centenary Museum". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-10-04.