గుత్తికొండ రామబ్రహ్మం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తికొండ రామబ్రహ్మం
జననంగుత్తికొండ రామబ్రహ్మం
1915
గుంటూరు జిల్లా మోపర్రు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమర యోధుడు. నిస్వార్ధసేవాతత్పరుడు
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి బాలామణీ
పిల్లలుడా. రవీంద్రనాథ్
తండ్రిసుబ్బయ్య,
తల్లిగోవిందమ్మ

గుత్తికొండ రామబ్రహ్మం (1915- స్వాతంత్ర్య సమర యోధుడు. గాంధేయ వాది. నిస్వార్ధసేవాతత్పరుడు[1]. హేతువాది.

జననం

[మార్చు]

గుత్తికొండ రామబ్రహ్మం గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో సుబ్బయ్య, గోవిందమ్మ దంపతులకు 1915లో జన్మించాడు. బాలా మణి వీరి ధర్మపత్ని.

స్వాతంత్ర పోరాటంలో

[మార్చు]

దేశ పర్యటనలో భాగంగా 1929లో గాంధీజీ గుంటూరు జిల్లాలో పర్యటించు చున్నప్పుడు కల్లూరి చంద్రమౌళి గారు వారిని మోపర్రు గ్రామం తీసుకొచ్చి కొడాలి వెంకటప్పయ్య గారి ఇంటిలో బస కల్పించారు. 14 ఏళ్ళ చిరు ప్రాయములో గాంధీజీ ఉపన్యాసము విన్న రామబ్రహ్మం చదువుకు స్వస్తి చెప్పి ప్రజా జీవితానికి అంకితమయ్యాడు. కల్లూరి చంద్రమౌళి గారి శిష్యుడిగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోన్నాడు.

సామాన్య ప్రజానీకములో సామాజిక స్పృహ పెంచేందుకు గ్రంథాలయాన్ని స్థాపించాడు. గ్రామ పారిశుధ్య అవసరాన్ని గుర్తించి యువకులను చేరదీసి వీధులు ఊడ్చుట, మురికి గుంటలు పూడ్చుట మున్నగు పనులు చేసేవాడు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు ఇప్పించేవాడు. 'గ్రామ పత్రిక' అనే వ్రాత పత్రిక నిర్వహించి గ్రామీణులలో చైతన్యం కలిగించాడు. రాత్రి బడులు నిర్వహించి పలువురిని అక్షరాస్యులను చేశాడు. వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.

కల్లూరి చంద్రమౌళి గారి మార్గ నిర్దేశంలో కొడాలి కమలమ్మ, కల్లూరి తులశమ్మ, లుక్కా చింతాదాసు, షేక్ బికారి వంటి వారితో కలసి అనేక ఉద్యమాలలో పాల్గోన్నారు. దళితులతో సహపంక్తి భోజనాలు చేయించేవాడు. అందరూ ఒకే బావి నుండి నీరు తోడుకునే ఏర్పాటు చేశాడు. ఈ పనులు ఆ రోజుల్లో పెద్ద సంచలనము కలిగించాయి.

1940 లోమోదుకూరు గ్రామంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహములో పాల్గొన్నందుకు మూడు నెలల జైలు, 300 రూపాయల జరిమానా విధించబడింది. రామబ్రహ్మం రాజమండ్రి జైలుకు తరలింపబడ్డాడు. జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే ఇంట్లోని ధాన్యం జప్తు చేయబడింది.

క్విట్ ఇండియా ఉద్యమములో భాగంగా 1942 సెక్టంబర్ 19వ తేదిన తెనాలిలో కల్లూరి చంద్రమౌళి గారి నాయకత్వంలో కల్లూరి తులశమ్మ. కొడాలి కమలమ్మ. చిట్టూరి అన్నపూర్ణమ్మ, శాంత అనే మహిళలతో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు. ఆ ఉద్యమ సమయంలో జరిగిన పోలిసు కాల్పులలో ఎడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు.[2]

సంఘ సేవ

[మార్చు]

1948లో జయప్రకాశ్ నారాయణ్‌ను తన గ్రామం పిలిపించి వికాస కార్యక్రమాలకై ధనదానం చేశాడు. వినోబా భావే భూదాన ఉద్యమానికి తన వాటా 60 సెంట్ల భూమిని దానం చేశాడు.

స్వాతంత్ర్య ఉద్యమములో జైలుకి వెళ్ళిన వారికిచ్చే భూమి తీసుకోవడానికి నిరాకరించాడు. సమర యోధుల పింఛను పేద విద్యార్థులకు ఇచ్చేవాడు.

గోరా గారి ఆధ్వర్యములో హైదరాబాదు పబ్లిక్ గార్డెన్సులో పూల మొక్కలు పీకి కూరగాయల మొక్కలు పాతి 30 రోజులు జైలు శిక్ష అనుభవంచాడు.

డా. వెంపటి సూర్యనారాయణ సహకారముతో గ్రామంలో పలువురికి ఉచితముగా కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయించాడు.

అమెరికాలో ఉన్న తన కుమారుడు డా. రవీంద్రనాథ్ (తానా వ్యవస్థాపకుడు) చేయూతతో కోటి రూపాయలతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తన చేతిమీదుగా నిర్వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 283
  2. కొడాలి, , కమలాంబ. "విరామమెరుగని పురోగమనం" స్వీయ చరిత్ర.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)