కల్లూరి చంద్రమౌళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kalluri Chandra Mouli.jpg

కల్లూరి చంద్రమౌళి (నవంబరు 15, 1898 - జనవరి 2, 1992) స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ,[1] ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. దేవాదాయ శాఖా మంత్రిగా పనిచేసిన చంద్రమౌళి కొంతకాలము తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.

జననం[మార్చు]

కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. 1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు.[2] బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు. 1937, 1946, 1955, 1962లలో శాసనసభకు ఎన్నికై మద్రాసు ప్రావిన్సు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ లలో మంత్రిగా పనిచేశారు. భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు.

భద్రాచలం[మార్చు]

చంద్రమౌళి గారి సేవలలో ముఖ్యమైనది భద్రాచలం గుడి పునర్నిర్మాణం. 1960 నాటికి గుడి బాగా శిథిలమైంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. వెంటనే గుడి పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. ముందుగా కల్యాణమండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపములోని తాటియాకుల గూడెంలో సేకరించారు. మహామండపాన్ని అష్టలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.

1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చంద్రమౌళిని రామాలయ ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా నియమించారు. వెంటనే విశేషంగా విరాళాలు సేకరించి చిత్రకూట మంటపాన్ని 127 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించారు. స్తంభాలపై అద్భుతమైన శిల్పలు చెక్కించారు. మంటపములో సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.

తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. స్వయంగా రామాయణసుధాలహరి, రామకథానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు.

మరణం[మార్చు]

1992 జనవరి 2న చంద్రమౌళి గుంటూరులో పరమపదించారు.[3]

మూలాలు[మార్చు]

  1. http://www.hindu.com/2005/03/29/stories/2005032900970900.htm
  2. ఆంధ్రసర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.598
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-06-15. Retrieved 2009-04-08.

బయటి లింకులు[మార్చు]