Jump to content

తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమం

వికీపీడియా నుండి
(రణరంగ చౌక్ తెనాలి నుండి దారిమార్పు చెందింది)
రణరంగ చౌక్ కాల్పులు
క్విట్ ఇండియా ఉద్యమం లో భాగం
రణరంగ చౌక్‌లో అమర వీరుల స్థూపాలు
తేదీ1942 ఆగస్టు 12
స్థలంతెనాలి
లక్ష్యాలుస్వాతంత్ర్యం
పద్ధతులుసమ్మె, నిరసన
ఫలితం7 గురి వీరమరణం
జననష్టం
మరణాలు7

1942లో భారత జతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12 న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళినాయకత్వంలో తెనాలి పట్టణంలో ఉద్యమం జరిగింది. ఆనాటి అందోళనలో జరిగిన పోలీసు కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. అమర వీరుల స్మృతి చిహ్నంగా 1959లో తెనాలిలో స్మారక కట్టడాన్ని నిర్మించి, ఆ స్థలానికి 'రణ రంగ చౌక్' అని పేరుపెట్టారు. [1]

క్విట్ ఇండియా ఉద్యమం

[మార్చు]

1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ పిలుపునిచ్చాడు. కాంగ్రెసును నిషేధించటంతో పాటు గాంధీ ఉపన్యాసం తరువాత 24 గంటల లోపే దాదాపు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించింది. దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రదర్శనలు అందోళనలు జరిగాయి. కార్మికులు పెద్దయెత్తున సమ్మె చేసారు. ఉద్యమంలో పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది.

1942 ఆగస్టు 9 నుండి 1942 సెప్టెంబరు 21 వరకు, క్విట్ ఇండియా ఉద్యమంలో 550 పోస్టాఫీసులు, 250 రైల్వే స్టేషన్లపై దాడి చేసారు. అనేక రైలు మార్గాలను దెబ్బతీసారు. 70 పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేసారు. 85 ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడమో, ధ్వంసం చెయ్యడమో చేసారు. టెలిగ్రాఫ్ వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు 2,500 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 68 ప్రదేశాలలో పోలీసుల కాల్పులు జరగగా ఆంధ్రలో 21 చోట్ల జరిగాయి. ఈ కాల్పులలో దేశ వ్యాప్తంగా 297 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రలో 39 మంది మరణించారు. తెనాలిలో ఏడుగురు ఉద్యమకారులు మరణించారు. ఈ ఆందోళనలలో తెనాలిలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

తెనాలి ఉద్యమం

[మార్చు]

బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గోన్న కల్లూరి చంద్రమౌళి తిరిగి తెనాలికి వచ్చాడు. ఆనాడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తెనాలిలో చంద్రమౌళి నిర్వహణలో ఉండేది. చంద్రమౌళి నాయకత్వంలో సమావేశమై స్థానిక నాయకులు ఆగస్టు 12న తెనాలి బందుకు పిలుపునిచ్చారు. [2]

1942 ఆగస్టు 12 పట్టణంలో క్విట్ ఇండియా ఊరేగింపు కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో వందలాది కార్యకర్తలతో శాంతి యుతంగా మొదలైంది. తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయిస్తూ పట్టణ వీధుల వెంట కొనసాగింది. బందుకు సహకరించని కొంతమంది వల్ల ఉద్యమంలో పాల్గొన్న యువకులలో అవేశం ఉప్పొంగింది. శాంతియుత అందోళన అదుపు తప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వే స్టేషన్ చేరుకున్న ఊద్యమకారులు రైలు పట్టాలు పీకి వేసారు, సేషన్ మాష్టర్ గదికి, రికార్డులకూ నిప్పు పెట్టారు. నాయకుల మాట వినే స్థితిలో ఉద్యమకారులు లేరు. అప్పుడే మద్రాసు నుండి వచ్చిన పూరి ఎక్స్‌ప్రెస్ రైలు బండికి నిప్పు పెట్టారు. అనుకోకుండా జరిగిన ఈ ఆందోళనను నిలువరించే పోలీసు బలగం తెనాలిలో లేదు. కలెక్టర్ అచ్చుత మీనన్ ఇతర ప్రదేశాల నుండి పోలీసు బలగాలను మూడు గంటలకు తెనాలి రప్పించాడు.

తెనాలి రైల్వై స్టేషన్ పూర్తిగా తగలపెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలుకా ఆఫీస్ ని ముట్టడించటానికి వస్తున్న వేళ ఇరు వర్గాలు వంతెన వద్ద ఎదురు పడ్డాయి. పోలీసుల హెచ్చరికలను ధిక్కరించి వందేమాతరం అంటూ ముందుకు దూసుకొస్తున్న ఉద్యమకారులపై పోలీసులు 21 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. ఎందరో ఉద్యమకారులు గాయపడ్డారు. [2]

ఆనాటి ఉద్యమ సారథి కల్లూరి చంద్రమౌళి

ఉద్యమ వీరులు

[మార్చు]

ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినందులకు కల్లూరి చంద్రమౌళితో పాటు అనేక మంది ఉద్యమ కారులను అరెస్టు చేసారు. అరెస్టైన వారిలో శరణు రామస్వామి చౌదరి, మోటుపల్లి బాబురావు, షేక్ ఇస్మాయిల్, చింతమనేని భావయ్య చౌదరి, రావి సత్యనారాయణ, వెలువోలు సీతారామయ్య ఉన్నారు. అవుతు సుబ్బారెడ్డి, పుతుంబాక శ్రీరాములు, యలమంచిలి వెంకటప్పయ్య మొదలగువారు ముందు వరసలో ఉండి ఉద్యమాన్ని నడిపారు. [2]

ప్రతేక న్యాయ స్థానాన్ని పెట్టి వీరందరిని విచారించారు. వీరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేసి రాయవెల్లూరు జైలుకు పంపారు. విధ్వంసం చేసినందులకు 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. విచారణ సమయంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గుత్తికొండ రామబ్రహ్మంతో పాటు మహిళా ఉద్యమకారులైన కల్లూరి తులశమ్మ, తుమ్మల దుర్గాంబ, కొడాలి కమలమ్మ, చిట్టూరి అన్నపూర్ణమ్మ, కంచర్ల మాణిక్యం, బోళ్ళ సీతారావమ్మలను 16 నెలలు రాయవెల్లూరు మహిళా సెంట్రల్ జైల్లో నిర్బంధించారు.

అమర వీరులు

[మార్చు]

తెనాలి క్విట్ ఇండియా ఉద్యమం లో పోలీసుల కాల్పులలో ప్రాణాలు అర్పించిన ఏడుగురు ఉద్యమకారులు[3]

  1. మాజేటి సుబ్బారావు
  2. శిరిగిరి లింగయ్య
  3. తమ్మినేని సుబ్బారెడ్డి
  4. గాలి రామకోటయ్య
  5. ప్రయాగ రాఘవయ్య
  6. జాస్తి అప్పయ్య
  7. భాస్కరుని లక్ష్మీనారాయణ

అమరవీరుల స్మారక చిహ్నం

[మార్చు]

క్విట్ ఇండియా అమర వీరుల స్మృతి చిహ్నంగా నిర్మించిన ఈ స్మారక కట్టడం, ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలతో ఉంటుంది. మద్యభాగంలో భారత మాత వడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది.

1959 డిసెంబరు 20న తెనాలిలో ఆనాటి శాసన సభ్యుడు ఆలపాటి వెంకట్రామయ్య స్మారక స్థూపాన్ని నిర్మించి ఆ స్థలానికి 'రణ రంగ చౌక్' అని నామకరణం చేసాడు. [3] దీనిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కె, కామరాజ్ నాడార్, ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డిల సమక్షంలో అవిష్కరించారు.

ఆధునికీకరణ

[మార్చు]

జాతీయ భావానికి, తెనాలి ప్రజల దేశ భక్తికి, పోరాట పటిమకు చిహ్నం అయిన ఈ అమరవీరుల స్థూపాన్ని శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరలా సుందరంగా తీర్చిదిద్ది పట్టణానికి వన్నెతెచ్చాడు. 2015 ఆగస్టు 12 న ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు సమక్షంలో క్విట్ ఇండియా వేడుకలు చేసారు. [1] ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న ఇక్కడ అమరవీరులను స్మరిస్తూ అధికార కార్యక్రమం జరుగుతుంది. [1]

భారతీయ తపాలా శాఖ, 2007 నవంబరు 1 న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్థూపం 'రణరంగ చౌక్' పై ఒక ప్రత్యేక పోస్టల్ కవరును విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో (APPEX -2007) విడుదల చేసింది. [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "త్యాగ చిహ్నం .. రణరంగ చౌక్". ఈనాడు దినపత్రిక. 12 ఆగస్టు 2021.
  2. 2.0 2.1 2.2 బొర్రా, గోవర్దన్ (2010). శ్రీ కల్లూరి చంద్రమౌళి జీవిత చరిత్ర. తెనాలి: కొడాలి సుదర్శన్. pp. 111–121.
  3. 3.0 3.1 The Hindu (14 August 2014). "'Ranarang Chowk', a symbol of freedom struggle". Retrieved 2021-06-29.
  4. "Special cover on Ranarang chouk -Tenali ,Guntur dist". STAMPS OF ANDHRA. 7 August 2015.