కల్లూరి తులశమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కల్లూరి తులశమ్మ (డిసెంబరు 25, 1910 - అక్టోబరు 5, 2001) ప్రముఖ సంఘసేవకురాలు, స్వాతంత్ర్య సమర యోధురాలు.గాంధేయ వాది, ఖాదీ, సర్వోదయ ఉద్యమ నాయకురాలు.[1]

కల్లూరి తులశమ్మ
స్వాతంత్ర సమర యోధురాలు.గాంధేయ వాది
జననండిసెంబరు 25, 1910
పెదరావూరు గ్రామం, గుంటూరు జిల్లా
మరణంఅక్టోబరు 5, 2001
సంస్థఖాధీ,సర్వోదయ సంస్థలు
రాజకీయ ఉద్యమంస్వదేశీ ఉద్యమం
మతంహిందువు
భార్య / భర్తకల్లూరి రంగయ్య ,మోపర్రు గ్రామం
తల్లిదండ్రులుకొడాలి కృష్ణయ్య, సీతమ్మ

బాల్యం,విద్య[మార్చు]

తులశమ్మ గారు 1910, డిసెంబరు 25 తేదీన కొడాలి కృష్ణయ్య, సీతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామంలో జన్మించింది. సామాన్య రైతు కుటుంభానికి చెందిన తులశమ్మ చదువులో ఉన్నతపాఠశాల వరకూ కూడా పూర్తిచేయలేకపోయింది. 14 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది.

గాంధీజీ ‘ఆత్మకథ’ చదివి తన జీవిత సాధనకు మార్గదర్శికంగా నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే నాలుగు ముఖ్యాంశాలను స్వీకరించారు. స్వావలంబనకై చరఖాను చేత పట్టారు. బ్రహ్మచర్యానికై గృహస్థ జీవితాన్ని త్యాగం చేసారు. తెనాలిలో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, హేతువాది యలమంచిలి వెంకటప్పయ్య గారి వద్ద హింది భాషలో ప్రావీణ్యత సాధించారు.

వివాహ జీవితం[మార్చు]

‘నేను గాంధీజీ బోధించిన బ్రహ్మచర్యం అవలంభించాలనుకుంటున్నాను. మిమ్ములను నేను దైవంగా ఆరాధిస్తాను. నన్ను మీరు ఒక సోదరివలె చూసుకుంటారా ?’’ అని ఒక భార్య భర్తను అడిగితే, అతడు నిర్ఘాంతపోయి ‘‘అలాగైతే మన దాంపత్య జీవితానికి అర్థమేముంది? జన్మిం చిన ఏకైక పుత్రుడ్రు కూడా గతించాడు కదా! మనకు వంశోద్ధారకుడు లేకపోతే ఎలా ?" అని అడిగాడు. అపుడు భార్య ‘‘ఏమైనా సరే నేను గాంధీజీ చెప్పిన బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి తీరుతాను’’ అని తన దృఢ సంకల్పాన్ని తెలియజేసారు.

గృహస్త జీవనం పై ఆసక్తి కనబరిచిన భర్త కోర్కెపై ఒక వధువుని వెదికి తెచ్చి స్వయంగా తన భర్తకు వివాహం జరిపి గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్యం స్వీకరించిన మహిళే తులశమ్మ . ఆమె భర్త మోపర్రు వాసులు శ్రీ కల్లూరి రంగయ్య గారు. అపరిగ్రహం అనే ధర్మాన్ని పాటిస్తూ భర్త నుండి మనోవర్తిని కూడా స్వీకరించని ఉత్తమోత్తమ ఆదర్శ గాంధేయ మహిళ

స్వాతంత్ర పోరాటంలో[మార్చు]

మోపర్రు గ్రామవాసి, ఆనాటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కల్లూరి చంద్రమౌళి గారి ఉపదేశాలతో తులశమ్మ గారు గాంధేయ మార్గంలోకి వెళ్ళారు. గాంధీజీ ‘ఆత్మకథ’ చదివి తన జీవిత సాధనకు మార్గదర్శికంగా నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే నాలుగు ముఖ్యాంశాలను స్వీకరించి సంసారాన్ని త్యజించింది.[2]

స్వావలంబనకై చరఖాను చేత పట్టారు. బ్రహ్మచర్యానికై గృహస్థ జీవితాన్ని త్యాగం చేసారు. అపరిగ్రహ వ్రత నిష్ఠకై భర్త నుండి మనోవర్తిని నిరాకరించింది. తనతల్లి తనకిచ్చిన నగలు, ఖరీదైన వస్తువులు అన్నిటినీ ఇచ్చివేసి వచ్చేసారు. తన మెడలోనున్న అరకాసు బంగారాన్ని అమ్మగా వచ్చిన దానిలో రూ.4/లతో రాట్నం, రూ.3/లతో ఖద్దరు చీర, రూ.2/లతో నూకలు కొనుక్కొని స్వాలంబన సిద్ధాంతాన్ని అనుసరించి జీవితం గడిపారు. మోపర్రులోనే ఉంటూ ప్రతిదినమూ రాట్నం వడుకగా వచ్చిన 3 అణాల మజూరీతో నూకల అన్నం, చింతకాయ పచ్చడి, దమ్మిడీ మజ్జిగతో భోజనం చేస్తూ చరఖాసంఘంలో జీవితం గడుప సాగారు. ఎవరి నుండి నయాపైసా అయిన స్వీకరించేది కాదు.

అహింస ధర్మాన్ని పాటిస్తూ జంతువులను చంపి వాటి చర్మాలతో చెపలు తయారు చేస్తారని నమ్మి చెప్పులు ధరించటం మానేశారు. సాటి మానవుని కష్టపెట్టరాదని మనుషులతో లాగించుకునే రిక్షాలు ఎక్కడం మానివేశారు.

తులశమ్మ గాంధీగారి పిలుపు విని 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942లో తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నందుకు అరెస్టయి వారంరోజులు జైలులో ఉన్నారు. ఆ ఉద్యమ సమయంలో రణరంగ చౌక్ వద్ద జరిగిన పోలిసు కాల్పులలో ఎడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. విచారణ సమయంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆమెతో పాటు ఉద్యమకారులైనా తుమ్మల దుర్గాంబ, కొడాలి కమలమ్మ, కంచర్ల మాణిక్యం, వాసిరెడ్డి సీతారత్నం గార్లను 16 నెలలు రాయవెల్లూరు మహిళాసెంట్రల్ జైల్లో నిర్భంధించారు.

1944 అక్టోబరులో బందరు చరఖా సంఘం (ఆంధ్రశాఖ) వారు నడుపుతున్న కవారుూ కార్యకర్తల శిక్షణ పొందడానికి తులశమ్మగారు వెళ్ళారు. అక్కడి హాస్టల్‌ వార్డెన్‌ మాపులేటి సత్యనారాయణరాజు గారి సహకా రంతో ప్రకృతి చికిత్సా పద్ధతులను నేర్చుకున్నారు. తిరిగి వచ్చాక కావురు'వినయాశ్రమం' ప్రముఖురాలు తుమ్మల దుర్గాంబతో కలసి గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ, దావులూరి వెంకట నరసమ్మ మొదలైన సోదరీమణుల సహకారంతో హరిజన వాడలను పరిశుభ్రం చేయడానికి వెళ్ళేవారు.

1946 లో గాంధీజి ఆంధ్రా పర్యటనలో తెనాలి వచ్చినప్పుడు తులశమ్మగారు గాంధీజీని దర్శించారు. తరువాత మహారాష్ట్ర లోని గాంధీజీ స్థాపించిన 'సేవాగ్రాం' ఖాదీ విద్యాలయంలో చేరారు. మహాత్ముని ఆశ్రమంలో ప్రముఖ స్థానం సంపాదించిన ప్రభాకర్‌జీ తులశమ్మగారిని గాంధీజీకి పరిచయం చేశారు. తులశమ్మ మహాత్మునికి నమస్కరించి, తనదగ్గర ఉన్న ఓంకారపు బంగారు బిళ్ళ, వెండి పళ్ళెం (పూజ కొరకు), సౌభాగ్య చిహ్నమైన 15 తులాల వెండి మట్టెలు, కాలి పట్టాలు సమర్పించింది. వాటిని అమ్మి స్వాతంత్ర్య పోరాటానికి వాడమని కోరింది. సేవాగ్రాంలో నెల రోజులు శిక్షణ పొంది స్వగ్రామం చేరుకున్నారు. అక్కడనుండి అనేక జాతీయోద్యమ కార్యక్రమాల్లో చురుగా పాల్గొని అనేక సార్లు జైళ్ళకు వెళ్ళారు.

ఖాదీ ఉద్యమం[మార్చు]

తులశమ్మ గారు గ్రామాల్లో ఖద్దరు బట్టలు ధరించాలని ప్రచారం చేసి ప్రజల్లో ఖద్దరు మీద ఆసక్తిని పెంచారు. దేశ స్వాతంత్ర్యం కొరకు నిస్వార్దంగా పనిచేసానని చెప్పి స్వాతంత్ర్య యోధులకు ఇచ్చే ఫించన్ నిరాకరించారు.

ఆచార్య వినోబా భావే ప్రారంబించిన 'సర్వోదయ ఉద్యమం'లో కార్యకర్తగా పనిచేసారు. ఆ రోజుల్లో ఊరురూ కాలి నడకన తిరిగి ఖద్దరు అమ్మకంపై వచ్చిన ఆదాయం మూడు వేల రూపాయలతో పెదరావురు గ్రామంలో కొనుగోలు చేసిన సొంత ఇంటిని 1977లో గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు (THE GUNTUR ZILLA KHADI GRAMODYOG SAMASTHA) విరాళంగా అప్పగించారు.

ఈనాడు ఆ ఖద్దరు ఉత్పత్తి కేంద్రంలో నూలు, నూలు వస్త్రాలు, ముతక ఖాదీ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కేంద్రం ద్వారా అనేక మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇదంతా తులశమ్మ గారి త్యాగఫలమే.

మరణం[మార్చు]

చివరి వరకు సర్వోదయమే తన జీవిత ధ్యేయంగా భావించిన నిజమైన గాంధేయ మహిళ తులశమ్మ. నిడాంబర జీవితం కొనసాగించిన ఈమె 2001 అక్టోబరు 5 తేదీన పెదరావూరులో పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. తులశమ్మ, కల్లూరి (1910-2001), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ.235-6.
  2. ధర్మారావు గారి అమ్మాయి. "స్వాతంత్రోద్యమ సమర యోధురాలు శ్రీమతి కల్లూరి తులశమ్మ గారు". YouTube. Retrieved 24 జూన్ 2021. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)