వినయాశ్రమము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పనగా, దాతల దాతృత్వానికి మారుపేరుగా చెరుకుపల్లి వినయాశ్రమం నిలిచింది. ఆనాడు బాపూజీ దేశంకోసం సర్వస్వం త్యాగం చేయమన్న పిలుపునందుకొని, శ్రీ తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు. 1933 డిసెంబరు -23న జాతిపిత మహాత్మాగాంధీజీ చేతులమీదుగా ప్రారంభమైనది. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా గాంధీజీ వినయాశ్రమంలో రెండురోజులు గడిపినారు. ఇక్కడ ఉండి ప్రజలలో స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రేరణ కలిగించారు. ఆనాడు ఆయన నాటిన మొక్క నేడు మహావృక్షమైనది. బాపూజీ విశ్రాంతి తీసికున్న కుటీరం, నేడు ఆలనాపాలనకు దూరమైనది. ఆ తరువాత రైతుబాంధవుడు శ్రీ ఎన్.జి.రంగా పేరుతో వినయాశ్రమంలో, కృషి విఙానకేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసికొన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో 1992లో, "ఎన్.జి.రంగా కృషి విఙాన కేంద్రం" ఏర్పాటయినది. దీనిలో ప్రధానంగా వ్యవసాయ, వ్యవసాయేతర వృత్తివిద్యలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టినారు. నూతన సాంకేతిక పరిఙానం రైతులకు చేర్చేటందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. మొదట్లో ఈ కేంద్రములో సాగుశిక్షణ కార్యక్రమాలు చేపట్టినారు. వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించటం, కిసాన్ మేళాలు, రైతు సదస్సులు, రైతు దినోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 2008 వరకు పకడ్బందీగా అమలుపరచిన పలు పథకాలకు పురస్కారాలు వరించినవి. ఉత్తమ పనితీరుతో దేశంలోనే మూడోదిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక్కడ శిక్షణ తీసికున్న రైతులు జాతీయస్థాయిలో ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్ర నుండి వానపాములనుతెచ్చి, ఎరువును తయారుచేసిన మొదటి కేంద్రం ఇదే. పంజాబునుండి తెచ్చిన తేనెటీగలతో తేనెపరిశ్రమ, మల్బరీ ఆకులను పెంచడం ద్వారా పట్టుపరిశ్రమ అభివృద్ధికీ, బి.టి.ప్రత్తి విత్తన ప్రదర్శన, 2716 వరివంగడాల అభివృద్ధి, ఇక్కడే జరిగినవి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కృషి విఙాన కేంద్రం ఆధిపత్య పోరులో మూతబడింది. ఇక్కడ కార్యక్రమాలు నిలిచిపోవడంతో భవనాలు శిథిలమైనవి. [ఈనాడు గుంటూరు రూరల్; 2014, అక్టోబరు-29; 11వ పేజీ]