Jump to content

గూడూరు వెంకటాచలం

వికీపీడియా నుండి
గూడూరు వెంకటాచలం
GUDURU VENKATACHALAM
జననం1909
ఆంధ్ర ప్రదేశ్ లోని గుడివాడ
మరణం1967 మే 8(1967-05-08) (వయసు 58)
పౌరసత్వంభారతీయత
జాతీయత భారతీయుడు
రంగములువ్యవసాయ శాస్త్రము
వృత్తిసంస్థలుకేంద్ర వరి పరిశోధనా సంస్థ
చదువుకున్న సంస్థలుపిఠాపురం రాజా కళాశాల, కాకినాడ
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,వారణాశి
ప్రసిద్ధిT-1145, T-141, T-1242, SR 26B, TN-1 రకం వరివంగడాలు
ప్రభావితం చేసినవారుగూడూరు రామచంద్రరావు (మేనమామ)
ముఖ్యమైన పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
2010 స్టాంపుపై గూడూరు వెంకటాచలం

జి.వి.చలంగా సుపరిచితుడైన గూడూరు వెంకటాచలం (1909–1967),[1] ఒక ప్రముఖుడైన భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, పరిశోధకుడు. ఇతని సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

గూడూరు వెంకటాచలం 1909వ సంవత్సరంలో కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతని 8 యేళ్ల వయసులో తన తండ్రి మరణించాడు. ప్రముఖ గాంధేయవాది, సంఘసంస్కర్త అయిన తన మేనమామ గూడూరు రామచంద్రరావు వద్ద ఇతడు పెరిగాడు[1]. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం గుడివాడ, రాజమండ్రిలలో నడిచింది. తరువాత ఇతడు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో చదివి పట్టభద్రుడయ్యాడు. తన మేనమామ చేత ప్రభావితుడై ఇతడు సంఘసంస్కరణల వైపు మొగ్గు చూపాడు. కుల,మత,వర్గ రహిత సమాజానికై పాటుపడే "సోదరసమాజం" అనే సంస్థతో కలిసి పనిచేశాడు. బ్రిటీషువారికి వ్యతిరేకంగా ఇతడు స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. కాకినాడలో డిగ్రీ చదివే కాలంలో ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యాన్ని పంచుతూ అరెస్టయి వేలూరు జైలులో 14 నెలలు కారాగారశిక్షను అనుభవించాడు. జైలుశిక్ష వలన ఇతని చదువుకు కొంత ఆటంకమేర్పడినా ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి వృక్షశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను సాధించాడు.

శాస్త్రవేత్త

[మార్చు]

ఇతడు చదువు ముగించిన తరువాత కొంతకాలం ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్ ఇన్‌స్టిట్యూట్ (IARI)లో పనిచేశాడు. ఆ తర్వాత ఇతడు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో ఉన్న కేంద్ర వరి పరిశోధనా సంస్థలో రీసర్చ్ అసిస్టెంట్‌గా చేరాడు. రీసర్చ్ అసిస్టెంట్‌గా ఇతడు వరిధాన్యం వర్గీకరణపై పరిశోధించి పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1943లో డాక్టరేట్ పట్టాసాధించాడు. వ్యవసాయ శాస్త్రంలో బీహారు, ఒరిస్సా రాష్ట్రాలనుండి ఇదే మొట్టమొదటి పి.హెచ్.డి కావడం విశేషం. వరిధాన్య శాస్త్రవేత్తగా ఇతడు అనేక రకాలైన వరివంగడాలను అభివృద్ధి చేశాడు. అవి ఒరిస్సా, కోస్తాంధ్ర, శ్రీలంక, కోన్ని ఆగ్నేయ ఆసియా దేశాలలో ముఖ్యమైన పంటలను పండిస్తున్నాయి. ఇతడు అభివృద్ధి చేసిన వరివంగడాలలో T-1145, T-141, T-1242, SR 26B రకాలు ముఖ్యమైనవి. వ్యవసాయ భూపునరుద్ధరణ, విత్తనాభివృద్ధి డైరెక్టర్ కార్యాలయంలో ఇతడు అసిస్టెంట్ డైరెక్టరు హోదాలో 1967లో అటవీ భూములను పునరుద్ధరించి రెండు భారీ వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేశాడు. ఇవి ఒరిస్సా రాష్ట్రానికి అవసరమైన వరి విత్తనాలలో 50 శాతాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇతడు జపానికా, ఇండికా అనే సంకర వరి విత్తనాలను సృష్టించాడు. ఇతని నిర్విరామ కృషి ఫలితంగా ఇంకా అనేక సంకరజాతి వరివిత్తనాలను సృష్టించి ఒరిస్సా ప్రభుత్వం ద్వారా రైస్ ఇన్ ఒరిస్సా అనే మోనోగ్రాఫును ప్రచురించి అంతర్జాతీయ రైస్ కమిషన్‌కు సమర్పించాడు. రైతులకు 'రెండవ సాగు' అంటే తెలియని రోజులలో ఇతడు అనేక రకాలైన పంటలను రెండవ సాగు క్రింద ప్రవేశపెట్టి హీరాకుడ్ డ్యాం పరీవాహక ప్రాంతంలో రెండవ సాగు పంటను జనబాహుళ్యానికి తెచ్చాడు.

హరిత విప్లవ పథగామి

[మార్చు]

భారత ప్రభుత్వం నవంబరు 1960లో జి.వి.చలాన్ని ఆహార, వ్యవసాయ మంత్రిత్వశాఖలో డిప్యుటీ వ్యవసాయ కమీషనర్‌గా నియమించింది.ఈ హోదాలో ఇతడు దేశంలో అనేక విత్తన ఉత్పత్తి, శిక్షణా కార్యక్రమాలను రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థల సహకారంతో నిర్వహించాడు. జాతీయ విత్తన చట్టం (1966) రూపకల్పనలో ఇతడు కీలకపాత్రను పోషించాడు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి 1963లో నెలకొల్పిన జాతీయ విత్తన కార్పొరేషన్‌కు ఇతడు మొదటి జనరల్ మేనేజర్‌గా నియమించబడ్డాడు. ఈ సంస్థ 1960 దశకం చివరి దశలో ప్రారంభమైన హరిత విప్లవానికి నాందిగా నిలిచింది. కేంద్ర విత్తన కమిటీకి ఇతడు మొదటి మెంబర్ సెక్రెటరీగా పనిచేశాడు. జాతీయ విత్తన కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత 1964లో ఇతడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ (ICAR)లో చేరాడు. న్యూజిలాండ్లో జరిగిన అంతర్జాతీయ విత్తన పరీక్ష సెమినార్‌లో పాల్గొని తిరిగి వస్తూ చలం మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థను స్వంత ఖర్చులతో సందర్శించాడు. అక్కడ తైచుంగ్ నేటివ్ -1 (TN-1) అనే రకం వరి విత్తనాన్ని [2] భారతదేశానికి అత్యంత అనుకూలమైన విత్తనంగా గుర్తించాడు.[3] ఇతడు ఆ విత్తనాలను కేవలం ఒక కిలోగ్రాము మాత్రం సేకరించగలిగాడు. ICAR అనుమతితో ఇతడు నాలుగుచోట్ల TN-1 విత్తనాలతో ప్రయోగాలను చేపట్టాడు. ఆ ప్రయోగాలు అనుకొన్న దానికన్నా ఎన్నోరెట్ల మెరుగైన ఫలితాలను ఇచ్చింది.[3] ఈ ప్రయోగాలద్వారా భారతదేశంలో వరిసాగు కొత్తపుంతలను తొక్కింది. ఇతర వ్యవసాయ శాస్త్రవేత్తలనుండి, ప్రపంచ బ్యాంకు అధికారులనుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ఇతడు చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలలో TN-1 రకం విత్తనాలతో ప్రయోగాలను చేపట్టాడు. ఎకరాకు 3 టన్నుల వరి దిగుబడి దాదాపు అసాధ్యమైన సమయంలో TN-1 విత్తనాలతో ఆ దిగుబడి భారతదేశంలో సర్వసాధారణం అని నిరూపించాడు. తరువాత ఈ TN-1 రకం విత్తనాలను 11000 ఎకరాలలో ఉత్పత్తి చేసి 1966 ఖరీఫ్ నాటికి ఒక మిలియన్ ఎకరాలలో వరిసాగును పండించడానికి సరఫరా చేయగలిగాడు. ఆవిధంగా ఒక కిలోగ్రాము విత్తనాలతో ఒక మిలియన్ ఎకరాలలో వరిని సాగుచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిచూపాడు. ఇతడు TN-1 రకం వరి విత్తనాలవల్ల సుప్రసిద్ధుడయినా మెక్సికన్ రకం గోధుమలు, అనేక సంకరజాతి జొన్న, వేరుశెనగ విత్తనాల రకాలను కూడా ప్రవేశపెట్టి అధిక దిగుబడికి కారకుడయ్యాడు. ఇతడు జాతీయ విత్తన కార్పొరేషన్‌కు జనరల్ మేనేజర్‌గా తిరిగి నియుక్తుడయ్యాడు. ఇతని హయాంలో జాతీయ విత్తన కార్పొరేషన్ ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వరంగ సంస్థగా తీర్చిదిద్దబడింది.

రచయిత

[మార్చు]

ఇతడు తెలుగు, ఒరియా, ఇంగ్లీషు భాషలలో రచనలు చేశాడు. విద్యార్థి దశలో జైలు జీవితం గడిపిన సమయంలో ఇతడు తెలుగులో కొన్ని కథలను వ్రాశాడు. అవి కృష్ణా పత్రికలో ప్రచురితమయ్యాయి. వృత్తి సంబంధమైన అనేక వ్యాసాలనే కాకుండా 40కి పైగా శాస్త్రీయ పత్రాలను, అనేక పాపులర్ సైన్స్ వ్యాసాలను రచించాడు. ఇతడు రచించిన "వరిసాగు" అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రశంసను పొందగలిగింది.

ఇతడు వ్రాసిన వ్యవసాయశాస్త్ర సంబంధమైన గ్రంథాలు కొన్ని:

  • ఇంట్రొడక్షన్ టు అగ్రికల్చరల్ బోటనీ ఇన్ ఇండియా : జె.వెంకటేశ్వర్లుతో కలిసి
  • సాయిల్ మేనేజ్‌మెంట్ ఇన్ ఇండియా : హెచ్.ఆర్.అరకెరి, పి.సత్యనారాయణ, రాయ్ ఎల్. డొనొహ్యులతో కలిసి.
  • సీడ్ టెస్టింగ్ మాన్యువల్: ఎ.సింగ్, జె.ఇ.డౌగ్లాస్‌లతో కలిసి.

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]
  • వ్యవసాయ రంగంలో ఇతడు చేసిన కృషిని గుర్తిస్తూ 1967లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
  • ఇతడు రచించిన వరి సాగు పుస్తకానికి కవికోకిల పురస్కారం లభించింది.
  • ఇతని జ్ఞాపకార్థం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం 2009లో ప్రత్యేకమైన ఫస్ట్ డే కవర్‌ను విడుదల చేసింది.
  • ఇతని జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ 2010లో ఒక ప్రత్యేక తపాలాబిళ్లను విడుదలచేసింది.

మూలాలు

[మార్చు]
  1. Sivaraman, B (1991). Bitter sweet: governance of India in transition : memoirs of B. Sivaraman. New Delhi: Ashish Pub. House. p. 318. ISBN 978-81-7024-403-5. OCLC 25658553.
  2. "The New year book". Calcutta: S.C. Sarkar & Sons Ltd: 304. OCLC 2566723. {{cite journal}}: Cite journal requires |journal= (help); Cite uses deprecated parameter |authors= (help)
  3. Venkitaramanan, S. (9 January 2006). "Reflections on turning points in the economy". The Hindu BusinessLine. Retrieved 5 March 2010.

బయటి లింకులు

[మార్చు]