Jump to content

గొంతాలమ్మ అశ్వనృత్యం

వికీపీడియా నుండి

గొంతాలమ్మ అశ్వనృత్యం

[మార్చు]
అశ్వ నృత్యాలు ఎక్కువగా కృష్ణ , గుంటూరు జిల్లాలలో ఉన్నాయి. అశ్వ నృత్యాలను ముఖ్యంగా హరిజనులు దశరా సమయాలలో గొంతాలమ్మను పంట చేలో ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఉత్సవం జరిపి తరువాత గొంతాలమ్మను తృప్తి పరిచి ఉత్సవంతో సాగనంపుతారు. ఈ సందర్భంలో వారు వివిధ విచిత్ర వేషాలు ధరించి చుట్టు ప్రక్కల గ్రామాలన్నీ సంచారం చేసి డబ్బు, ధాన్యం వస్త్రాలు సంపాదిస్తారు.

అశ్వ నృత్యం

[మార్చు]

వీరి ప్రదర్శనల్లో ప్రాముఖ్యం వహించేది అశ్వ నృత్యం. మెడ వరకు గల ఒక గుఱ్ఱపు తలను పేడతో చేయించి వివిధ వార్నీషు రంగులతో అలంకరించి., ఇతర శరీర భాగాన్నంతా, తేలిక వెదురు బద్దలతో గుఱ్ఱపు ఆకారాన్ని తయారు చేసి చుట్టూ ఎర్ర చంగు చీరను కట్టి, ఆ గుఱ్ఱాన్ని చంకలకు తగిలించుకుని వెనకకూ, ముందుకూ నడుస్తూ, మధ్య మధ్య ఎగురుతూ, " కేలమ్మ కేల్ భాయి కేల్, అబ్బబ్బ రాయుడే అల్బాడి బుంగడే " అంటూ అద్భుతంగా నృత్యం చేస్తారు. వీరి నృత్యానికి ఉత్తేజం కలిగించేది డప్పుల వాయిద్యం. ఈ వాయిద్యపు వరుసల గమకాల ననుసరించి నృత్య గతిని మారుస్తూ ఉధృతంగా నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో డప్పు వాయిద్యాన్ని నిలిపి అందరూ సమష్టిగా చేతుల్లో చిడతలు ధరించి ఈ విధంగా పాట పాడుతూ నృత్యం చేస్తారు.

పాడే పాట

[మార్చు]

1. కంచెల చెరిగే చేడి కురులపై
లలన కురులపై
2. తుమ్మెద లాడిన ఓ లలనా,
ఘన తుమ్మెద లాడిన ఓ లలనా ..........||కం||
3. చెమటకు తడిసిన చెదిరిన గంధం
ఘుమ ఘుమ లాడిందో లలనా ...................||కం||
4. చెరిగేటప్పుడు చేతులు గాజులు
గల గల లాడిన ఓ లలనా ...................||కం||
5. గొప్పది రోకలి గుప్పున దంచగ
జబ్బలు కదిలిన ఓ లలనా
ఘన జబ్బలు కదిలిన ఓ లలనా ...................||కం||

ఈ విధంగా ఒక ప్రక్క నృత్యం జరుగుతూ వుంటే, చుట్టు ప్రక్కల ఇళ్ళలో వుండే స్త్రీ, పురుషులతో పాటు, పిల్లలు కూడా వుత్సా హంగా మూగుతారు. ఈ సమయంలో సోడిగాడు వంకర దుడ్డు కఱ్ఱను పిల్లల కాళ్ళకు పట్టి లాగుతూ, భయపెట్టి నవ్విస్తూ వుంటాడు. సోడిగాడు వేషధారణ నవ్విస్తూ వుంటుంది. (మరో చోట సోడిగాడి గురించి వేష ధారణతో సహా ఉదహరించ బడింది.)

ఓ చిన్న దాన

[మార్చు]

ఈ నృత్యంలోనే

ఓ చిన్నదానా, ఓ చిన్నదాన గుంటూరు చిన్నదానా గురుగూ మెట్టలమీద గజ్జాలుంటే షోకే...............................||ఓ చిన్నదానా?||

నల్ల నల్లటి దానా నడుము సన్నని దాన నడుమూ సన్నము మీద నగ లుంటే షోకే .............................||ఓ చిన్నదానా?|| అంటూ శృంగార మిళిత మైన పదాలను కూడా అద్భుతంగా పాడుతారు.

గుఱ్ఱాల కదం

[మార్చు]

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు పెళ్ళి సందర్భాలలో, పెండ్లి కొడుకులు, నిజమైన గుఱ్ఱమెక్కి పి పెళ్ళి కూతురు వూరికి పెద్దలతో తరలి వెళ్ళేవారు. ఇలా వెళ్ళే సందర్భంలో దారిలో వున్న గ్రామాలలో డప్పులు , వాయిద్యాలతో గుఱ్ఱాన్ని కదను త్రొక్కిస్తారు. డప్పు వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేయిస్తారు. దీనిని కదం త్రొక్కించటం అనేవారు. అందుకోసం గుఱ్ఱాలను తయారు చేసి, వాటిని చక్కగా అలంకరించి, వాటికి నృత్యం నేర్పే వారు. ఈ గుఱ్ఱపు నృత్యాన్ని చూడడానికి గ్రామ ప్రజలు గుమి కూడి ఆసక్తితో చూసే వారు. చెప్పినట్లు చేసే ఈ గుఱ్ఱపు నృత్యం కనుల పండువుగా వుంటుంది. ఈ గుఱ్ఱాల నృత్యాలను పెండ్లిండ్ల సమయాలలోనూ, కోటప్ప కొండ లాంటి తిరుణాళ్ళ సమయాల లోనూ సుందర గుఱ్ఱపు నృత్యాలు జరుగుతూ వుంటాయి.

మూలాలజాబితా

[మార్చు]