Jump to content

గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన

వికీపీడియా నుండి

మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు. బహుజన సంస్కృతి పరిరక్షకులు. సమాజంలోని బడుగు కులాల వారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతర ల వల్ల సాధ్యమయ్యింది. ప్రాచీనకాలంలో పురాతన మానవునిచే పూజింపబడ్డ దుష్ట గ్రామ దేవతలు కూడా కాలక్రమేణ శిష్ఠ దేవతల్లో కలిసి పోవడం జరిగింది. అయితే పూజా విధానంలో, గుళ్ళ నిర్మాణంలో గ్రామ దేవతలకు, శిష్ఠ దేవతలకు తేడాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. నిశితంగా పరిశీలిస్తే గ్రామ దేవతల పూజా విధానంలో కొన్ని శిష్ఠ దేవతల పూజా విధానాలు సమ్మిళితమై పోయాయని చెప్పక తప్పదు. అదే విధంగా శిష్ఠ దేవతల పూజా విధానాలు కొన్ని గ్రామ దేవతారాధనల్లో చోటు చేసుకున్నాయనుట సత్యం. గ్రామ సం రక్షణ కోసం యేర్పాటు చేసుకున్న గ్రామ దేవతల లక్షణాలు కొన్ని విలక్షణంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని

గ్రామదేవతల విలక్షణతలు

[మార్చు]
శ్రీ పెద్దింటి అమ్మ వారి ఆలయం గురించిన ఒక బోర్డు
  1. గ్రామదేవత భయంకర స్వరూపిణి. అంతేకాదు వికటదంత.
  2. బలిని తీసుకోవడం, రక్తపానం, ఆసవసేవనం ప్రీతికరాలు.
  3. గ్రామదేవత గ్రామాళ్ళో వేపచెట్లక్రింద, త్రాచుపుట్టలలోపల నెలకొని ఉంటుంది.
  4. తనను నిర్లక్ష్యం చేసిన జానపదులను పట్టి పీడించి రోగాలపాలు చేయడంలో ఈమెకు పట్టుదల మెండు.
  5. గ్రామాలను పరిరక్షించడం, చెలరేగిన వ్యాధులను అదుపులో ఉంచడం, తనను నమ్ముకొన్న పశువులను జానపదులను యీతి భాధలు, గ్రహ బాధల నుండి శత్రువుల నుండి రక్షించడం యీవిడ నిత్యకృత్యాలు.ఊరి పొలిమేరలను, పంటపొలాలను, చెరువులను, నీటి వనరులను కాపాడుట యీమె కర్తవ్యం.
  6. గ్రామదేవతల పూజార్లు, బ్రాహ్మణేతరులై వుంటారు.
  7. గ్రామదేవతల పూజార్లకు సంస్కృత మంత్రాలు రావు. ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లో వుంటాయి.
  8. గ్రామదేతల పూజాలను స్త్రీలు కూడా చేస్తారు.

గ్రామదేవతల స్వరూప స్వభావాలను అనుసరించి, పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా వుండటం జరుగుతొంది. చాలావరకు గ్రామదేవతలు చిన్న రాయిగానో, శూలంగానో చెట్టు రూపంలో గాని, గరగగా గానీ దర్శనమిస్తుంటారు. చౌడమ్మ, యెల్లమ్మ, దుర్గమ్మ వంటి దేవతలు భయంకర స్వరూపులుగా కనిపిస్తారు

శిష్ట దేవతల స్వారూపాలు

[మార్చు]

ఈ దేవతల లక్షణాలు భిన్నాంగా ఉంటాయి. వీరి స్వరూపం ప్రసన్నంగా ఉంటుంది. వీరిని అన్ని కులాలవారు పూజిస్తారు. సామాన్యంగా శిష్ఠదేవతలకు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు. వీరు అంతటా వ్యాపించి వుంటారు. వీరి స్తోత్రాలు సంస్కృత మంత్రాలతో మిళితమై ఉంటాయి..

గ్రామదేవతల, శిష్ఠ దేవతల గుళ్ళు

[మార్చు]
దస్త్రం:APvillage Tadikalapudi 2.JPG
తడికలపూడి గ్రామంలో గ్రామదేవత గుడి - ద్వారంపై ఇలా వ్రాసిఉన్నది "శ్రీ అంకాలమ్మ, గంగానమ్మ, 101 దేవతలు ఉండు ఆలయం"

గ్రామదేవతల గుళ్ళు ఊరిపొలిమేరల్లో, పంటపొలాలమధ్య, చెరువు గట్లలో, వేపచెట్లక్రింద ఉంటాయి. నాలుగు బండ రాళ్ళను చేర్చి చతురస్రాకారంలో గుడి నిర్మిస్తారు. గ్రామదేవతలకు ప్రతిరూపమైన గరగను, వేపమండలను జోడించి దేవతలముందుంచి పూజిస్తారు. శక్తి దేవతల గుళ్ళు సామాన్యంగా అన్నీ తీరాల్లో ఉంటాయి. ఇవి శాస్త్రానుసారంగా నాగర్, ద్రావిడ, వేసర శైలిలో నిర్మింపబడి ఉంటాయి. ఇందులో దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా, నియమానుసారంగా ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. వీరి గుళ్ళు విశాలంగా, ఆర్షణీయంగా వుంటాయి. గోపురాల మీద శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి దేవత గుడికి పుష్కరిణి ఉంటుంది. శిష్ఠ దేవతల గుళ్ళు గ్రామదేవతల గుళ్ళ కంటే కొంచెం భిన్నంగా కనిపించినా, కొన్ని సామాన్యంగా కనిపిస్తాయి.

గ్రామదేవతల గుళ్ళు సామాన్యంగా తూర్పు వైపు ద్వారం కలిగి ఉంటాయి. సూర్యుని కిరణాలు గర్భగుడిలో విగ్రహం మీద పడాలనే వుద్దేశ్యంతో తూర్పు వైపు ద్వారం కల్గి ఉండేలా గుళ్ళను నిర్మిస్తారు. శిష్ఠ దేవతల గుళ్ళు కూడా తూర్పువైపు మహాద్వారం కలిగి ఉంటాయి. గ్రామదేవతల గుళ్ళు చతురస్రాకారంలో కానీ, దీర్ఘచతురస్రాకారంలో కానీ ఉంటాయి. శిష్ఠ దేవతల గుళ్ళుకూడా అలాగే ఉంటాయి. చతురస్రాకారం స్థిరత్వానికి ప్రతీక. గుండ్రని ఆకారం అస్థిరత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అందువలన్ గుళ్ళు గుండ్రనివి కాకుండా వుంటాయి.

గ్రామదేవతలు శిష్ఠదేవతల పూజల్లో పోలికలు

[మార్చు]

గ్రామ దేవతల, శిష్ఠదేవతల పూజాపద్ధతులను పోల్చి చూస్తే శిష్ఠులు గ్రామదేవతల పూజాపద్ధతులను కొన్నింటిని తమలో మిళితం చేసుకొన్నట్లుగా గమనిచవచ్చు. శిష్ఠులు రావి, తులసి, వేప వంటి వృక్షాలను ఆరాధిస్తారు. గ్రామదేవతల గుళ్ళవద్ద ఈ నాటికి రావి, వేప, తులసి చెట్లను జానపదులు పూజించడం చూస్తున్నాము. శిష్టులు నదులను ముఖ్యంగా గంగ, యమున, సరస్వతీ నదులను పవిత్రంగా భావించి పూజించడం కనిపిస్తుంది.

శిష్ఠ దేవతలకు, గ్రామదేవతలకు మతపరంగా, సాహితీపరంగా కొన్ని కాలాలపాటు ప్రచ్ఛన్నగా యుద్ధాం జరిగివుండవచ్చు. గ్రామదేవతల ఆధిపత్యం వుండే విధంగా శిష్టులు రచనలు సాగించారు. ద్రావిడులు సఫలతను ఆశించి స్త్రీ దేవతను పూజించడం వీరిమధ్య స్పర్థలకు కారణాలని చరిత్ర చెబుతోంది. కొన్ని ద్రావిడ సంప్రదాయాలు శిష్ఠుల ఆచార వ్యవహారాల్లో కిలిసిపోయినట్లుగా, శిష్టుల ఆచార వ్యవహారాలను మతపద్ధతులను తమలో జీర్ణించుకొన్నారు. అయితే తమ మతాన్ని మాత్రం విడువలేదు. కాలానుగుణంగా తమ దేవతలను పూజిస్తూ, శిష్ఠ దేవతలను పూజించడానికి అలవాటు పడ్డారు. ఈ మార్పిడిలో భాగంగా పురాణాల్లోని ఆచార వ్యవహారాలను, నమ్మకాలను జానపదుని దైనందిన జీవితంలో భాగాలయ్యాయి. ఫలితంగా ద్రౌపది జానపదుని మదిలో శక్తి స్వరూపిణిగా స్థిరపడింది ( చిత్తూరు జిల్లాలోని ద్రౌపదమ్మ తిరుణాల ఇందుకు నిదర్శనం)

శిష్ఠ సంప్రదాయానికి విరుద్దంగా పురాణాల్లో ఈమె ఐదు మందికి భార్య కాని ఈమెలో ఉన్న శక్త్యంశం జానపదున్ని బాగా ఆకట్టుకుంది. అందుకే జానపదులు పాండవుల కంటే ద్రౌపదినే యెక్కువగా పూజిస్తారు. శిష్ఠులచే కొలవబడుతున్న సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఆంజనేయుడు, నవ గ్రహాలు లాంటి దేవతలు పురాణ పఠనంవల్ల జానపదుని మతంలో చోటు చేసుకుని పూజలందుకొంటున్నారు. కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. షికారీలు తమ కులదైవమైన వెంకటేశ్వరునికి మాంసాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఇక్కడ ద్రావిడ దేవతలు శిష్టులచే పూజింపబడుతూ శిష్ఠ దేవతలై జనపదాలలో ఆరాధింపబడుటను గమనించాలి.

శిష్ఠ సాహిత్యంలో గ్రామదేవతల ప్రభావం కనిపిస్తోంది. మహా భారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు దుర్గను స్తుతిస్తాడు. ఈమె భయంక రూపం కలిగి, దున్నపోతు రక్తం, యుద్ధమంటే ఎక్కువ ఇష్ఠపడుతుందని అర్జునుడు ప్రశంశిస్తాడు. అలాగే ధర్మరాజు మరో చోట ఈమె ఆయుధాలు కలిగి జంతుబలితో తృప్తిపడి భక్తులకు విజయాన్ని చేకూరుస్తుందని స్తుతిస్తాడు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వీరబ్రహ్మంగారు గ్రామదేవతైన పోలేరమ్మను చుట్ట కాల్చేందుకు నిప్పు తెమ్మని ఆఙ్ఞాపిస్తాడు. శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలో నాయకుడైన చారుదత్తుడు ప్రతిదినం గ్రామదేవతకు బలి యిచ్చేవాడని తెలుస్తోంది. రామాయణ కాలంలో నాగులకు తల్లిగా చెప్పబడే సురస అనే దేవత కనిపిస్తుంది. ఈమెను కామరూపిణి అని కూడా పిలిచేవారట. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నాప్పుడు నీటిలో సింహిక అనే దేవతను చూస్తాడు. ఈమె సముద్రం మీదుగా వెళ్ళేవారిని చంపుతుండేదట. అలాగే రావణుని రాజ్యమైన లంకను ఒక రాక్షస దేవత కాపాడుతున్నట్లు చెప్పబడింది.

ఈ విధంగా గ్రామదేవతల సాంప్రదాయ పూజా విధానాలు కొన్ని శిష్ఠ దేవతల సంప్రదాయాలలోనికి, శిష్ఠ దేవతల సంప్రదాయాలు కొన్ని గ్రామ దేవతల సంప్రదాయాలలోనికి కలిసి పోవడం జరిగింది. అయితే కాలగమనంలో నాగరికత పెరుగుతున్నకొద్దీ జానపదులు శిష్ఠ మతపద్ధతులను, ఆచార వ్యవహారాలను తమకు తెలియకుండానే అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]