చదలవాడ ఉమేశ్ చంద్ర
చదలవాడ ఉమేశ్ చంద్ర | |
---|---|
జననం | చదలవాడ ఉమేశ్ చంద్ర మార్చి 29, 1966 |
మరణం | సెప్టెంబరు 4, 1999 |
ఇతర పేర్లు | కడప పులి |
వృత్తి | వైఎస్ఆర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పేరు గాంచిన పోలీసు ఉన్నతోద్యోగి, |
తల్లిదండ్రులు |
|
చదలవాడ ఉమేశ్ చంద్ర (1966 మార్చి 29- 1999 సెప్టెంబరు 4) ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అనే పేరు తెచ్చుకున్నాడు.
బాల్యం, విద్య
[మార్చు]ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడు. తండ్రి హైదరాబాదు ఆల్విన్ సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుండి బి. ఎ. (1987), ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందాడు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి బంగారు పతకాలు సాధించాడు.[1]
ఉద్యోగ పర్వం
[మార్చు]1991లో భారత పోలీస్ సేవకు ఎన్నికై, జాతీయ పోలీస్ అకాడెమీ లో శిక్షణ పొందాడు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశాడు. జన జాగృతి అనే కార్యక్రమం ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యాడు. 1994 అక్టోబరులో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానం చూరగొన్నాడు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి ప్రత్యేక విధుల అధికారిగా పని చేశాడు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘంలోగల దురభిప్రాయాలు తొలగించాడు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యాడు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చాడు. జూన్ 1997 నుండి ఏప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించాడు. 1998 నవంబరు లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమం, ఆటలు) గా పదోన్నతి పొందాడు.
హత్య
[మార్చు]ఉమేశ్ చంద్ర మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. ఈ క్రమంలో అతనిని వారు టార్గెట్ చేసారు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరిపారు. అతని అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. అతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి, సమీపం నుండి కాల్చి పారిపోయారు.[2] 2000 సెప్టెంబరు 4 న ఉమేశ్ చంద్ర విగ్రహం సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.