Jump to content

మహాడ్ సత్యాగ్రహం

వికీపీడియా నుండి
(చవ్‌దార్‌ చెరువు ఉద్యమం నుండి దారిమార్పు చెందింది)
మహాడ్ సత్యాగ్రహం నేపథ్యంతో ఉన్న బి.ఆర్. అంబేద్కర్ బొమ్మతో భారతదేశంలో విడుదల చేసి 1991 నాటి స్టాంపు

మహాడ్ సత్యాగ్రహం ఊరి చెరువు నుండి మంచినీరు తాగడానికి బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో దళితులు చేసిన శాంతియుత విప్లవం. ఇది ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాడ్ ప్రాంతంలో 1927లో మార్చి 21వ తేదీన జరిగింది. దీనినే చవదార్ చెరువు సత్యాగ్రహం అనీ, మహాడ్ ముక్తిసంగ్రామం అనీ పిలుస్తారు. ఈ సంఘటనని తలుచుకుంటూ ఈరోజుని భారతదేశంలో సామాజిక సాధికారికత దినోత్సవంగా జరుపుకుంటారు.[1]

నేపథ్యం[2]

[మార్చు]
బి.ఆర్.అంబేద్కర్ చే నిర్వహించబడిన ఈ ఉద్యమం గురించి వివరించే కాంశ్య శిల్పం.

సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాద్‌లో నివాసాలు ఏర్పరచుకున్నారు. మహాద్‌లో బాబా సాహెబ్‌ మూడు సూత్రాలను సూచించాడు. అవి -1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఆలోచన మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. భారతీయ కుల వ్యవస్థలో దళితులు ఎన్నో విధాల వివక్షకు గురయ్యారు. ఇందులో ఒకటి జనం నీళ్ళు తాగడం కోసం ఉన్న చెరువులను వాళ్ళని వాడుకోనివ్వకపోవడం. దీనికి వ్యతిరేకంగా బాంబే రాష్ట్ర శాసనమండలి 1923 ఆగస్టులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉన్న చెరువులలో ఎవరైనా నీళ్ళు తాగవచ్చని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది[3]. `మహాద్‌ చెరువు సార్వజనికమైనది, దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు' అని ఈ తీర్మానం సారాంశం. అయితే, సవర్ణ హిందువుల నుండి వచ్చిన వ్యతిరేకత వల్ల ఈ తీర్మానం ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు. మహాద్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలనే లక్ష్యంతో బాబాసాహెబ్‌ ముందు నడవగా ఐదువేల మందితో దళిత సమాజం చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో కొలాబా జిల్లా అణుగారిన వర్గాల సంఘం వారు దళిత సానుభూతిపరులైన స్థానిక సవర్ణ హిందువులతో కలిసి మహాడ్ లో 1927 మార్చి 19-20 మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించదలుచుకుని బి.ఆర్. అంబేద్కర్ను దానికి ఆహ్వానించారు[4][5]. ఈ సమావేశం గురించి తెలుసుకుని దాదాపు పదివేల మంది వివిధ వయసుల దళిత ప్రజలు మహారాష్ట్ర, గుజరాత్ లలోని చాలా ఊళ్ళ నుండి తరలి వచ్చారు. వీరందరికీ మంచినీటి సరఫరాకి వసతి లేక సవర్ణ హిందువుల నుండి నలభై రూపాయలకి నీటిని కొనుక్కున్నారు సమావేశ నిర్వహకులు.

సమావేశం తొలి దినం అంబేద్కర్ సహా పలు ప్రముఖుల ప్రసంగాలు ముగిశాక, తమ సానుభూతిపరులైన సవర్ణ హిందువుల అభిప్రాయాలు కూడా సేకరించాక మరుసటి రోజు అందరూ కలిసి మహాడ్ లో ఉన్న చవదార్ చెరువు వద్దకు వెళ్ళి దళితుల నీటి హక్కును సత్యాగ్రహ పద్ధతిలో ఉద్ఘాటించాలని నిర్ణయించుకున్నారు.[6]

బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై అకస్మాత్తుగా అగ్రవర్ణ గుండాలు దండెత్తి వచ్చి లాఠీల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన దళిత ప్రతినిధులను కొట్టారు. 1927 జూన్‌ 6వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఆ తర్వాత అగ్రకులస్తులు చవ్‌దార్‌ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చవ్‌దార్‌ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి పేడ, గోమూత్రం పోగుచేసి పాలు, పెరుగుతో సహా బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చవ్‌దార్‌ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. అనంతరం ఆగస్టు 4వ తేదీన మహాద్‌ మున్సిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యను అంబేద్కర్‌ వ్యతిరేకించి చవ్‌దార్‌ చెరువు నీళ్ళను సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాడు. పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు. వారు చనిపోయేదాకా సమానంగా ఉండాలి' అంటూ తీర్మానించారు.

సత్యాగ్రహం

[మార్చు]

మార్చి 20 వ తేదీ ఉదయం ముందు రోజు రాత్రి అనుకున్నట్లే అంబేద్కర్ నేపథ్యంలో అందరూ కలిసి తమ నీటి హక్కుని ప్రకటించడానికి చవదార్ చెరువుకు వెళ్ళారు. తొలుత అంబేద్కర్ చెరువు నుండి నీళ్ళు తాగాడు. తరువాత ఒకరి వెంట ఒకరు తక్కిన దళితులు కూడా ఈ చెరువులోని నీళ్ళు తాగి, శాంతియుతంగా తిరిగి సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇది జరిగిన రెండు గంటలకి దళితులు దగ్గర్లోని వీరేశ్వర దేవాలయంలోకి కూడా వెళ్ళబోతున్నారన్న పుకారు వల్ల అది గిట్టని సవర్ణ హిందువులు కొందరు సమావేశ వేదికను చేరి అక్కడున్న వారిపై దాడి చేశారు. అంబేద్కర్ వారించడంతో దళితులు అహింసను అవలంబించారు. తరువాత పోలీసులు వచ్చి దాడి చేసిన వారిపై చర్య తీసుకున్నారు.[7]

సంఘటనానంతరం

[మార్చు]

సమావేశం తర్వాత తమ తమ గ్రామాలకి తిరిగి వెళ్ళిన దళితులపై అక్కడ కూడా ఈ సత్యాగ్రహాన్ని వ్యతిరేకించిన సవర్ణ హిందువులు దాడి చేశారు. మహాడ్ లోని సంప్రదాయవాదులు తమ ఊరి చెరువు మలినమైపోయిందని, బ్రాహ్మణ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య దానికి శుద్ధి సంస్కారాలు చేసి, మళ్ళీ సవర్ణ హిందువులు ఈ చెరువు నీటిని తాగొచ్చని ప్రకటించారు.[3]

చరిత్రలో మహాడ్

[మార్చు]

మహాడ్ సత్యాగ్రహాన్ని తొలి దళిత విప్లవంగా భావిస్తారు.[8] ఈ ఉదంతాన్ని గురించి ఆనంద్ తెల్తుంబ్డే అన్న రచయిత "Mahad: The Making of the First Dalit Revolt, with the Account of Comrade R.B. More, the Chief Organizer of the First Conference" అన్న పుస్తకం రాశాడు. ఈ సంఘటనను ఉప్పు సత్యాగ్రహంతో పోలుస్తూ బొజ్జా తారకం "Mahad: The March That's Launched Everyday"[9] అన్న మరో పుస్తకం రాశాడు.

మూలాలు

[మార్చు]
  1. "March 20 observed as social empowerment day to commemorate Mahad Satyagrah by Dr. Ambedkar" (Press release). Press Information Bureau. 20 March 2003. Retrieved 31 March 2014.
  2. Dr. Babasaheb Ambedkar Writings & Speeches Vol. 17, Part 1
  3. 3.0 3.1 Sangharakshita (1 January 2006). Ambedkar and Buddhism. Motilal Banarsidass. pp. 53–55. ISBN 978-81-208-3023-3.
  4. Omvedt, Gail (1994-01-30). Dalits and the Democratic Revolution: Dr Ambedkar and the Dalit Movement in Colonial India. p. 138. ISBN 9788132119838.
  5. Chatterjee, N. (2011). The Making of Indian Secularism: Empire, Law and Christianity, 1830-1960. p. 66. ISBN 9780230298088.
  6. Ranjit Kumar De; Uttara Shastree (1996). Religious Converts in India: Socio-political Study of Neo-Buddhists. Mittal Publications. p. 10. ISBN 978-81-7099-629-3.
  7. Shailaja Paik (1 January 2005). Dalit Women's Education in Modern India: Double Discrimination. Routledge. pp. 168, 169. ISBN 9781317673316.
  8. Teltumbde, Anand. Mahad: The Making of the First Dalit Revolt, with the Account of Comrade R.B. More, the Chief Organizer of the First Conference. India, Aakar Books, 2016.
  9. Bojja, Tharakam. Mahad: The March That’s Launched Every Day. The Shared Mirror Publishing House, 2018.

బాహ్య లంకెలు

[మార్చు]