Jump to content

చిన్ననాటి కలలు

వికీపీడియా నుండి
చిన్ననాటి కలలు
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.లెనిన్ బాబు
నిర్మాణం తమ్మారెడ్డి భరద్వాజ,
ఇ.యస్.రెడ్డి
నిర్మాణ సంస్థ ధృవ చిత్ర
భాష తెలుగు

చిన్ననాటి కలలు తమ్మారెడ్డి లెనిన్ బాబు దర్శకత్వంలో ధృవచిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ, ఇ.ఎస్.రెడ్డిలు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1975, ఫిబ్రవరి 28న విడుదలైంది.[1]

తారాగణం

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]
  • దర్శకుడు: టి.లెనిన్ బాబు
  • కథ : భీశెట్టి లక్ష్మణరావు
  • మాటలు : పినిశెట్టి
  • పాటలు : సినారె, ఆరుద్ర, దాశరథి
  • సంగీత దర్శకుడు: తాతినేని చలపతిరావు
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
  • కళ : వి.కృష్ణమూర్తి
  • నిర్మాతలు : తమ్మారెడ్డి భరద్వాజ, ఇ.ఎస్.రెడ్డి
  • నిర్మాణ సంస్థ: ధృవ చిత్ర
  • సమర్పణ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • విడుదల: 1975

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం పాట రచయిత గాయకులు
1 ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మదినిండా నీవే వుంటే సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 ఒక శీలం చితికి పోయింది ఒక దీపం ఆరిపోయింది సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 ఓ చెలీ ఓహో చెలీ ఓ చల్లని నవ్వుల జాబిలి దాశరథి ఎస్. జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 నీవే నీవే నా మదిలో దాగున్నావు ఊహల కౌగిలిలో నీవే ఉన్నావు సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 నువ్వెందు కొచ్చావో నాకు తెలుసు నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు ఆరుద్ర ఎల్. ఆర్. ఈశ్వరి
6 సీతాకోక చిలకల్లారా సింగారించుకు వచ్చారా దాశరథి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం

కథా సంగ్రహం

[మార్చు]

మాధవరావు బర్మాలో స్థిరపడిపోయిన భారతీయ వ్యాపారస్థుడు. భార్య కమల, సీత, రాధ యిద్దరు ఆడపిల్లలతో పండంటి సంసారాన్ని సాగిస్తున్నాడు. కన్నకూతురు రాధను లాయర్ చేయాలని మాధవరావు ఆశయం. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. బర్మా భారతీయుల ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వం వశం చేసుకోవటంవలన ఆ షాక్‌తో మాధవరావు మరణించాడు. మాధవరావు మరణంతో దిక్కులేక అనాథలైన తల్లీ, కూతుళ్ళు నమ్మినబంటు ధర్మన్నతో స్వదేశానికి చేరారు. అయితే విధి యింకా దురదృష్టవంతులమీద తన కసిని వదిలి పెట్టలేదు. ఒక రైలు ప్రయాణంలో నలుగురూ రెండు జట్లుగా విడిపోయారు. ఫలితంగా సీత తల్లి దగ్గర - రాధ ధర్మన్న దగ్గర పెరగసాగారు. న్యాయమూర్తి నరేంద్రరావు మాధవరావుకి సన్నిహితుడు. మాధవరావు మరణం విషయం ఆయన కుటుంబం భారతదేశానికి చేరుకున్న విషయం విని వారికోసం గాలించాడు. అయితే ఆయన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనాలయినాయి. యజమాని ఆశయాల మేరకు తనదగ్గర పెరుగుతున్న రాధను లాయర్ చెయ్యటం కోసం కాయ కష్టంచేసి కాలేజీలో చేర్పించాడు ధర్మన్న. న్యాయమూర్తి నరేంద్రరావు ఏకైక పుత్రుడు భాస్కర్ కూడా అదే కాలేజీలో "లా" చదువుతున్నాడు. ఎవరో తెలియకుండానే భాస్కర్ వైపు ఆకర్షితురాలైంది రాధ. తల్లి ఆలన పాలనలో పెరిగిన సీత ఒక గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా చేరింది. అక్కడికి స్నేహితులతోపాటు తరుచు వచ్చే భాస్కర్ ఆమెకు మనసిచ్చాడు.

ఆ వూళ్లోనే భైరవమూర్తి అనే పాపాలభైరవుడు వుంటున్నాడు. వాడి పాపిష్టి దృష్టి సీతమీద పడింది. భైరవమూర్తి అందమైన అమ్మాయిలను నయానో భయానో వలలో వేసుకుని తాళికట్టి భార్యగా చేసుకుని వాళ్ళ యవ్వనాన్ని కొల్లగొట్టి తన 'భార్య'లతోనే ఓ పెద్ద వ్యభిచారి గృహాన్ని నడుపుతున్నాడు. ఆ వ్యాపారంలో అతనికి మరో ఆడో తేడా తెలియని "పాపి"గాక, సావిత్రి అతనికి కుడి ఎడమ భుజాలయినారు. సీతకోసం ప్రయత్నాలు చెయ్యసాగాడు భైరవమూర్తి. తన ప్రయత్నాలకు భాస్కర్ అడ్డుగా వున్నట్లు తెలుసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు భైరవమూర్తి. సీత, భాస్కర్‌ల ప్రణయం న్యాయమూర్తి నరేంద్రరావు చెవిన పడింది. సీత మాధవరావు కూతురనే విషయం తెలియక నరేంద్రరావు ఇద్దరి వివాహానికి విముఖత చూపి ఉన్నత విద్యాభ్యాసం కోసం భాస్కర్ని విదేశాలకు పంపించాడు. బయలుదేరబోయేముందు భాస్కర్ సీతను కలుసుకుని,తను తిరిగి వచ్చి ఆమెను తప్పకుండా పెళ్లాడతానని మాట యిచ్చాడు. అయితే విధి మరోవిధంగా ఊహించింది. నయాన లొంగని సీతను భైరవమూర్తి బలవంతంగా ఎత్తుకుపోయి మైకంలో వున్న ఆమెను చెరచి మెడలో తాళిగట్టాడు. స్పృహ వచ్చిన సీత జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యకోసం ప్రయత్నిస్తుంది. ధర్మన్న ఆమెను ఆ ప్రయత్నం నుండి కాపాడుతాడు. సీత ధర్మన్నను గుర్తుపట్టి చెల్లెలి విషయం అడుగుతుంది. రాధను తను పెంచి పెద్ద చేశానని మాధవరావు ఆశయం మేరకు ఆమెను లాయర్ చెయ్యాలని ప్రయత్నించానని అయితే అందుకు అవసరం అయిన శక్తి సామర్థ్యాలు ఆర్ధికంగానూ, శారీరకంగానూ తనకు లేదని చెపుతాడు. చెల్లెలి శ్రేయస్సు కోసం సీత అపుడే ఒకే నిర్ణయానికి వస్తుంది. ఆమె ఏ నిర్ణయం తీసుకుంది, భైరవమూర్తి పాపాలకు అంతం ఏమిటి మొదలైన ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.[2]

మూలాలు

[మార్చు]
  1. web master. "Chinnanaati Kalalu (Thammareddy Lenin Babu) 1". indiancine.ma. Retrieved 9 January 2023.
  2. 2.0 2.1 ఈశ్వర్ (26 February 1975). Chinnanaati Kalalu (1975)-Song_Booklet (1 ed.). p. 12. Retrieved 9 January 2023.

బాహ్యలంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చిన్ననాటి కలలు