చార్లీ చాప్లిన్
చార్లెస్ చాప్లిన్ | |
చార్లీ చాప్లిన్ "ట్ర్యాంప్" దుస్తులలో | |
జన్మ నామం | Charles Spencer Chaplin, Jr. |
జననం | Walworth, లండన్, ఇంగ్లాండు | 1889 ఏప్రిల్ 16
మరణం | 1977 డిసెంబరు 25 (వయసు 88) Vevey, స్విట్జర్లాండు |
క్రియాశీలక సంవత్సరాలు | 1895–1976[1] |
భార్య/భర్త | మెల్డెర్డ్ హారిస్ (1918 - 1921) లిటా గ్రే (1924 - 1927) పాలెట్టె గొడ్డార్డ్ (1936 - 1942) ఊనా ఓ'నెయిల్ (1943 - 1977) |
పిల్లలు | 11 మంది, చార్లెస్ చాప్లిన్ జూనియర్, సిడ్నీ చాప్లిన్ (అమెరికన్ నటుడు), జెరాల్డిన్ చాప్లిన్, మైఖేల్ చాప్లిన్ (నటుడు), జోసెఫిన్ చాప్లిన్, ఉజీన్ చాప్లిన్, క్రిస్టోఫర్ చాప్లిన్ లతో కలసి |
చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.
బాల్యం - బతుకు పోరాటం
[మార్చు]చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి- వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.
రంగస్థలం
[మార్చు]పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి "From Rags to Riches " అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు.
మూగ సినిమాల చక్రవర్తి
[మార్చు]చాప్లిన్ మెదటి వన్ రీలు సినిమా 1914 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైనది. రెండవది ఆ పిదప అయిదు రోజులకే ఫిబ్రవరి 7వ తేదీన, మూడవది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైనాయి. ఆ ఏడాది 1914 లో అతనివి మొత్తం 35 వన్ రీల్, టూ రీల్ చిత్రాలు విడుదలైనాయి. అంటే సగటున సుమారు పది రోజుల కొకటి చొప్పున. ఒక ఏడాది గడిచేసరికి 1915 లో ఎస్సెనే అనే కంపెనీవారు వారానికి 1240 డాలర్ల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1916-1917 సంవత్సరాలలో మ్యూచువల్ అనే కంపెనీవారు చాప్లిన్‌ను వారానికి 10వేల డాలర్ల జీతానికి తీసుకున్నారు. ఆ రోజులలో హాలీవుడ్‌లో అంత జీతం తీసుకునే నటుడు, అంత డిమాండ్ వున్న నటుడు మరొకడు లేడు. 1916-1917 సంవత్సరాల నాటికి - అంటే సినిమాలలో ప్రవేశించిన రెండు మూడేళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంత మారుమోగిపోయిందంటే 1918లో ఫస్ట్ నేషనల్ సర్కూట్ అనే కంపెనీ వారు అతడిని 18 నెలలలో 8 చిత్రాలు తీసిపెట్టమని 10 లక్షల డాలర్ల ఒప్పందం కుదురుచుకున్నారు.
ఆ తరువాత 1923 ప్రాంతాలలో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ, స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత సుమారు 30 ఏళ్లలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు. వాటిలో ఆఖరిది " ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ ".
ట్రాంప్ (దేశద్రిమ్మరి) - కొత్త అవతారం
[మార్చు]ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్, క్లౌనింగ్, మైమింగ్, బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే, అన్ని పేర్లూ అతనివే.
ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడుగా బితుకుబితుకు మంటూ వుండేవాడు. అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరికతలో సామాన్య మానవుడు నిస్సహాయుడుగా వుండిపోతున్నాడు. ఈ అల్పమావుడి ద్వారా అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు. అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి. సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది . ట్రాంప్ అలాంటి చిత్రం: కిడ్ లాంటి చిత్రం, సిటీ లైట్స్ కూడా అలాంటిదే. సినీ జీవిత చరమ దశలో తీసిన లైమ్ లైట్ ' లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది.
విజయ పథం
[మార్చు]అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోను ఒక చార్లీ వుండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ వుండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్‌తో ఆగిపోలేదు . దానికి మానవతా వాదమనే కొత్త డైమెన్షన్‌ను కల్పించాడు. ఒక అర్థశతాబ్థానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, పిఛీథన్నననిక, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు.
ఆణిముత్యాలు
[మార్చు]- కిడ్
అతని అజరామర కీర్తికి అధార చిత్రాలలో ఒకటి 1921 నాటి " కిడ్ " . దానిలో అనాథ బాలుడుగా జాకీ కూగన్, అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్‌ల నటన చిరస్మరణీయమైనది.
- గోల్డ్ రష్
మానవుడి పేరాసను, దురాశను వ్యంగ్యంగా చిత్రించిన " గోల్డ్ రష్ " (1925) ను పలువురు విమర్శకులు చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రంగా పేర్కొంటారు. చాప్లిన్ కూడా అలాగే భావించాడని అంటారు. ఆ చిత్రంలో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో చాప్లిన్ అద్భుతంగా చూపించాడు. ఒక సన్నివేశంలో చాప్లిన్ తన కాలి జోడును మాంస ఖండంగా పరిగణించి ఉడకబెట్టి చాకు, ఫోర్కు ఉపయోగించి తినడానికి ప్రయత్నిస్తాడు. మరొక సన్నివేశంలో ఆకలిగా వున్న అతని స్నేహితుడు చాప్లిన్‌ను కోడి అని భ్రమించి, చంపి ఆరగించడానికి ప్రయత్నిస్తాడు. వీటి రూపకల్పన చాప్లిన్ కళకు పరాకాష్ఠలాంటిది. మోడరన్ టైమ్స్ 1936 నాటిది. దానిలో యంత్ర నాగరికత మానవులను యంత్రాలుగా, నిస్సహాయులుగా ఎలా మార్చివేస్తుందో చాలా శక్తిమంతంగా చూపిస్తాడు.
- గ్రేట్ డిక్టేటర్
ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన గ్రేట్ డిక్టేటర్‍లో చాప్లిన్ హిట్లర్‍ను అద్భుతంగా సెటైర్ చేశాడు. కాని కేవలం సెటైర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర. రెండవది ఒక సామాన్య క్షురకుని పాత్ర. ఇద్దరూ ఒకే పోలికలో వుంటారు. నియంతగా అందరు పొరబడిన క్షురకుని అధ్బుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది. " మబ్బులు విడిపోతున్నాయి, మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు, చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నము. అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు, దురాశను జయిస్తారు. పాశవికతను ఉయిస్తారు. మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్కుంది. ఎట్టకేలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఒక ఆశల ఇంద్రధనుస్సులోనికి, ఒక కాంతివలయంలోకి, ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు. ఆ భవిష్యత్తు నీది , నాది, మనందరిది....... " అని మహావేశంతో ప్రసంగం ముగిస్తాడు.
గ్రేట్ డిక్టేటర్ 1940లో వెలువడింది. అది చాప్లిన్ మెదటి టాకీ. అప్పటికి టాకీల యుగం ప్రారంభమై 12 ఏళ్లు అయింది. అయినా అప్పటి వరకు చాప్లిన్ తీసినవన్నీ సైలెంట్ చిత్రాలే. అతని చిత్ర నిర్మాణ శైలి, కథా కథనసైలి, అభినయ శైలి ప్రత్యేకించి సైలెంట్ చిత్రాలకు అనువైనది. సైలెంట్ సినిమాలే సినిమాలని అతడు భావించాడు. ఎందరు ఎంతగా కోరినా టాకీల జోలికి పోలేదు. కాని చివరికి అతడు టాకీల పోటీని తట్టుకోలేక గ్రేట్ డిక్టేటర్‍ను టాకీగా నిర్మించాడు. అది గొప్ప విజయం పొందింది.
- మొష్యూర్ వెర్దూ
ఆ తర్వాత మరి ఏడేళ్లకు గాని చాప్లిన్ మరొక చిత్రం తీయలేదు. అది మొష్యూర్ వెర్దూ 1947. మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు. నేర ప్రవృత్తి మనిషిలో స్వతహాగా వుందా, లేక సాంఘిక పరిసరాల ప్రేరణ వల్ల అది కలుగుతుందా? అసలు ఏది నేరం? మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్‍కు పేరు తెచ్చిపెట్టి, విజయం పొందినప్పటికీ, అమెరికన్‍లకు పెద్దగా రుచించలేదు. అందులో అతడు తన ట్రాంప్ పాత్రను పూర్తిగా వదిలిపెట్టి ఒక నేరస్థునిపాత్ర ధరించడం, పెట్టుబడిదారీ సమాజం మీద వ్యంగ్య బాణాలు విసరడం వారి వ్యతిరేకతకు కారణం.
- లైమ్‍లైట్
చాప్లిన్ 1952లో నిర్మించిన లైమ్‍లైట్ అతని చలన చిత్ర జీవితానికి మకుటాయమానమైనది. ఒకప్పుడు మ్యూజిక్ హాల్ కమెడియన్‍గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి గొప్ప విజయం సాధించిన ఒక క్లౌన్ రానురాను నవ్వించే శక్తిని కోల్పోయి విస్మృతి గర్భంలో పడిపోయి నిరాశకు లోనవుతాడు. అదే సమయంలో తన కంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్యచేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపచేస్తాడు. తాను తిరిగి నిరాశకు లోనవుతాడు. అదే సమయంలో తన కంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపచేస్తాడు. తాను తిరిగి నిరాశలో కూరుకుపోయి చనిపోతాడు. ఈ చిత్రంలో చాప్లిన్ స్వీయ జీవితం చాయలు గోచరిస్తాయి. దీన్ని ట్రాజీ-కామెడీగా కాదు. దాదాపు ట్రాజెడీగానే పరిగణించవచ్చు. ఆ చిత్రాన్ని మొదటిసారిగా లండన్‍లో విడుదల చేసిన రోజున చూసిన ఎలిజబెత్ రాణి " చిత్రం చూస్తున్నంత సేపు నా గొంతుకకు ఒక విషాదపు ఉండ అడ్దుపడినట్టయింది " అని వ్యాఖ్యానించింది.
అమెరికాకు వీడ్కోలు
[మార్చు]జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభని గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా . మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల, రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం, విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాలలో అతడు అమెరికాను శాశ్వతంగా వదలిపెట్టి స్విట్జర్లెండ్‌లో స్థిరపడవలసి వచ్చింది. ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. పత్రికలవాళ్ళు అతడ్ని వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గూడా ఇబ్బందులపాలు చేస్తూనే ఉన్నారు. అతడ్ని అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్టని చాలా ఘోరంగా ప్రచారం చేసారు. " యిన్ అమెరికన్ యాక్టివిటీస్ కమెటీ, విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్‌కు తాఖీదులు పంపడం తరచూ జరిగేది. అతడు అమెరికాలో అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నప్పటికీ, చాప్లిన్ బ్రిటీష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతడ్ని వేధించడం మొదలేశారు. అయితే చాప్లిన్ వాదమేమంటే , తాను కళాకారుడనని, అందువల్ల ఏ దేశ పౌరుడయినా పట్టించుకోవలసింది కాదని, తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడనని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చెప్పాడు. కాని కమిటీ ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించింది. ఫలితం దక్కలేదు. పత్రికలవాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివధ ప్రయత్నాలు చేశారు. వారికి ఒకే ఒక కోరిక అతడ్ని ఎలాగైనా రష్యా పంపించివేయాలని.
దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు 1952 లో అమెరికాను వదలి ఇంగ్లండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లెండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు , ప్రఖ్యాత రచయితలు , కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు, అతన్ని ప్రశంసించేవారు. అతడ్ని " గ్రేట్ హ్యూమనిస్ట్ ' ( గొప్ప మానవతావాది) అని చెప్పుకునేవారు. అప్పటికి చాప్లిన్‌కు 64 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతని కోరికల్ల చివరి ఈ కాస్త జీవితం ప్రశాంతంగా గడపాలని, పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Trivia for A Woman of Paris: A Drama of Fate (1923)". Internet Movie Database. Retrieved 22 June 2007.
బయటి లింకులు
[మార్చు]
- Pages using the JsonConfig extension
- AC with 18 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- అమెరికా వ్యక్తులు
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1889 జననాలు
- 1977 మరణాలు
- ఇంగ్లాండు వ్యక్తులు
- సినిమా నటులు
- గాయకులు
- నాస్తికులు
- ఆంగ్ల రచయితలు