Jump to content

జనమంచి శేషాద్రి శర్మ

వికీపీడియా నుండి
జనమంచి శేషాద్రిశర్మ
జనమంచి శేషాద్రిశర్మ చిత్రపటం.
జననంజనమంచి శేషాద్రిశర్మ
జూలై 4, 1882
కడపజిల్లా, పోరుమామిళ్లమండలం, వెంకటరామాపురంఅగ్రహారం
మరణంజూలై, 1950
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి,పండితుడు
మతంహిందూ
పిల్లలుజనమంచి శివ కుమార శర్మ (దత్త పుత్రుడు)
తండ్రిసుబ్రహ్మణ్యశర్మ
తల్లికామాక్షమ్మ

జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) ( జూలై 4, 1882 - జూలై, 1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు.

జీవిత సంగ్రహం

[మార్చు]

వీరు 1882 సంవత్సరంలో జూలై 4వ తేదీన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని, కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి, పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు తాలూకా వెంకటరాయపురం అగ్రహారం.శర్మగారికి బాల్యంలోనే మాతృ వియోగం కలిగింది.తండ్రి సుబ్రహ్మణ్య శర్మగారు మనోవైక్లయముతో కాశీ నగరమునకు వెళ్ళిపోయారు.బావగారైన గౌరిపెద్ది రామయ్యగారు శేషాద్రి శర్మ గారిని చేరదీసి చదువు చెప్పించారు.రెండేళ్ళ తరువాత శర్మగారి తండ్రి కాశినుండి తిరిగివచ్చి తమ కుమారిని తిరిగి చేరదీసిరి.అప్పటికే అవధాన విద్యానిధులై ప్రశస్తినార్జించి యుండిరి.కాని కందుకూరి వీరేశలింగం పంతులుగారి సూచన మేరకు అవధాన వుద్యమమునుండి తొలగి కావ్య రచనకు ఉపక్రమించినారు. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాతి కాలంలో కాశీ కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను, కసింకోట మొదలైన ప్రాంతాలలో విద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. వీరు మొదట సి.ఎస్.బి. హైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడపలో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.

శర్మగారి జీవిత విధానమత్యంత క్రమబద్ధమైనది.బ్రాహ్మీముహూర్తమున లేచి స్నాన సంధ్యాది అనుష్టానములను పూర్తి చేసుకొని, కావ్యరచన, తర్వాత అధ్యాపకత్వము, కొంతకాలము సాంసారిక కృత్యములు, మరల పురాణ పరిశోధనము సాయంకాలమున సద్గోష్ఠి ఇవి వారి నిత్య కృత్యములు.ప్రతి లేఖకు స్వయముగా వెంటనే బదులు ఇచ్చేవారు. ఎనిమిది గంటలపాటు పాఠశాలలో ఉద్యోగము, నాలుగు గంటల పాటు విశ్రాంతి తప్ప తక్కిన కాలమంతటిని కావ్యరచనకై వినియోగించిన మేధావులు శర్మగారు.


వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.

శర్మగారి గ్రంధములన్నింటిని వావిళ్ళవారు ప్రచురించి మహోపకారమొనరించిరి.శర్మగారి షష్ఠిపూర్తి సందర్భముగా సన్మానోత్సవ ప్రత్యేక సంచికను వెలువరించి గౌరవించారు కూడా. వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి','అభినవ నన్నయభట్టు', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ', 'మహాకవి', 'సంస్కృతసూరి', 'కైజర్ హింద్' మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు.[1][2] [3]

పోతనామాత్యులవలె సహజ పండితులైన శర్మగారు భాగవత దశమస్కందమును మాత్రమే 610 పుటలు 5200 పద్యములలో రచించిరి.మహాపండితులైన నాగపూడి కుప్పుస్వామయ్య, వేదం వేంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు వారలు శర్మగారినెంతగానో కొనియాడేవారు.కట్టమంచి రామలింగారెడ్డి గారు శర్మగారిని గురుంచి ప్రసంగిస్తూ వీరికవిత్వమునకు వీరి వినయాతిశయము శోభన కలిగించుచున్నది కవిత్వ పాండిత్యములకును, సౌజన్యమునకును నిత్యసంధి లేదనుట మనము ఎరింగిన విషయమే. వీరెవ్వరిని అధిక్షేపించినట్లు, ఎవ్వరితో గాని వాదమునకు పూనినట్లు కానరాదు. సౌజన్యము వీరి అలంకారము.ప్రఖ్యాతికై ప్రాకులాడువారు కారు. పండిత ప్రకాండులై, నిత్యసాహిత్యపరులై, పరోపకార పరాయణ చిత్తులై, పరదేవీ పదారవింద ధ్యానా సక్తులై మహాకావ్యములనెన్నింటినో రచించిన శ్రీ శేషాద్రిశర్మగారు 1950 జులైలో దివంగతులైనారు.

రచనలు

[మార్చు]

అనువాదాలు

[మార్చు]

శేషాద్రి శర్మ ఈ క్రింది సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువదించారు.[4]

స్వతంత్ర రచనలు

[మార్చు]
  • శ్రీమదాంధ్ర లలితోపాఖ్యానము
  • హనుమద్విజయము
  • సర్వమంగళా పరిణయం
  • ధర్మసార రామాయణం[6]
  • కలివిలాసం
  • సత్ప్రవర్తనము
  • శ్రీ రామావతార తత్త్వము
  • శ్రీ కృష్ణావతార తత్త్వము
  • శ్రీకృష్ణ రాయబార చరిత్రము
  • శ్రీ శంకరాచార్య చరిత్రము
  • తండ్లత
  • వనజాక్షి
  • హృదయానందం
  • దుష్ ప్రభుత్వము
  • నవరత్ర హారము
  • నీటుకత్తె
  • గిరీశవిజయము
  • విచిత్ర పాదుకాపట్టాభిషేకం
  • నీతిసింధువు
  • నీతిరత్నాకరము
  • మనుచరిత్ర పరిశోధనము
  • భగవద్గీత (వచనము)
  • ఉత్తమమార్గము
  • విచిత్రరామాయణము
  • ఉదయగిరిముట్టడి
  • కడపమండలచరిత్ర
  • శ్రీరామవనవాసము
  • విహంగవిజయము
  • స్వప్నయాత్ర
  • నీతికథావళి

మూలాలు

[మార్చు]
  1. Encyclpopaedia of Indian Literature. ISBN 8126012218
  2. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,. 2005.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  3. రాయలసీమ రచయితల చరిత్ర. Vol. 1. హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 101.
  4. "భారత డిజిటల్ గ్రంథాలయం (ఆర్కీవ్ నకలు) లో జనమంచి శేషాద్రిశర్మ రచనలు".
  5. Andhra Srimadramayanamu, Uttara Kandamu (1924) at Digital Library of India.
  6. ఆర్కీవ్.ఆర్గ్ లో భారత డిజిటల్ లైబ్రరీ నుండి చేర్చిన ధర్మసార రామాయణము పుస్తక ప్రతి.