జయమ్ము నిశ్చయమ్మురా (1989 సినిమా)
జయమ్ము నిశ్చయమ్మురా (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
నిర్మాణం | జి.వి.హెచ్. ప్రసాద్ |
కథ | ఆదివిష్ణు |
చిత్రానువాదం | జంధ్యాల |
తారాగణం | రాజేంద్రప్రసాద్ సుమలత చంద్రమోహన్ అవంతి |
సంగీతం | రాజ్-కోటి |
నేపథ్య గానం | చిత్ర, బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి |
నృత్యాలు | రఘు, తార |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | బాబ్జి |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | సుదర్శన్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
జయమ్ము నిశ్చయమ్మురా, 1989లో విడుదలైన ఒక తెలుగు సినిమా. చిత్ర విచిత్రాలైన పాత్రలు సృష్టించి ప్రేక్షకులకు నవ్వు అనే యోగాన్ని అందించడంల సిద్ధహస్తుడైన జంధ్యాల, హాస్యపాత్రల హీరోగా విశిష్టమైన గుర్తింపు తెచ్చుకొన్న రాజేంద్ర ప్రసాద్‌ల కాంబినేషన్లో వెలువడిన ఈ సినిమా బాగా విజయవంతమైన హాస్యచిత్రాలలో ఒకటి.[1]
శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట వంటి సినిమాలలో హాస్యయుతమైన క్యారెక్టర్లను సృష్టించి ఆ పాత్రల డైలాగులను తెలుగు భాష నుడికారంలో భాగంగా చేసిన జంధ్యాల ఈ సినిమాలో అదే ఒరవడిని కొనసాగించాడు.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]రాముడు (రాజేంద్ర ప్రసాద్), సూరిబాబు (చంద్రమోహన్) లు చేతనైనంతలో ప్రేమజంటలకు వివాహాలు జరిపించడమే తమ సేవా కార్యక్రమంగా పెట్టుకొన్నారు. కాని వారి ప్రేమకథలలకు మాత్రం అనేక అడ్డంకులు ఎదురవుతాయి. సూరిబాబు ప్రేమించిన సీత (అవంతి) తన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలూ (తమ్ముడి ఉద్యోగం, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తల్లి వైద్యం వంటి అనేక సమస్యలు) పరిష్కారమయ్యేదాకా (ఆరు నూరైనా నూరు ఆరైనా) పెళ్ళి చేసుకొనని సందు దొరికినప్పుడెల్లా శపథం చేసేస్తుంటుంది. రాముడు ప్రేమించిన శాంతి (సుమలత) ఏమో తన తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళి మాత్రమే సంప్రదాయబద్ధంగా చేసుకొంటానని భీష్మించుకొంటుంది. శాంతి తండ్రి (సుత్తివేలు) మిలిటరీ ఆఫీసర్ స్టైల్లో అందరినీ క్షుణ్ణంగా పరిశీలించందే నిర్ణయించుకోడు. అతని కుక్క (పేరు హిట్లర్) వాళ్ళ ఇంట్లో తిని పక్కింట్లో మొరుగుతుంది. శాంతి తల్లి ఎక్కువ రోజులు మౌనవ్రతంలో ఉంటుంది. సూరిబాబు తండ్రి (కోట శ్రీనివాసరావు) పైసాపైసా కూడబెట్టి మద్రాసువెళ్ళి గొప్ప "సైన్మ" తీయాలని సంకల్పించుకొన్నాడు. కనుక పైసల విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. తనింట్లో ఎవరైనా అతిధులు కాఫీ త్రాగితే కూడా వారికి వెంటనే బిల్లు ఇస్తుంటాడు. ఛాన్సు దొరికినప్పుడెల్లా దొరికినవారికి సినిమా కథలు (సవివర వ్యాఖ్యానంతో) వినిపిస్తుంటాడు.
ఇలా సినిమాలో ఇంకా అనేక పాత్రలు హాస్యానికి తమవంతు పుష్టి అందిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో శాంతి తండ్రిని మెప్పించి, ఒప్పించి, వారితోనే తనకు శాంతికి పెళ్ళి కుదిరేలా చేస్తానని రాముడు శాంతితో ఛాలెంజి చేస్తాడు. అలా జరగనివ్వనని శాంతి ఎదురు ఛాలెంజి చేస్తుంది. ఇద్దరూ తమ తమ పంతాలు నెగ్గించుకోడానికి చేసే ప్రయత్నాలే సినిమా కథలో ప్రధాన ఇతివృత్తం.
తారాగణం
[మార్చు]- రాముడుగా రాజేంద్రప్రసాద్
- శాంతిగా సుమలత
- సూరిబాబుగా చంద్రమోహన్
- సీతగా అవంతి
- కోట శ్రీనివాసరావు
- జగన్ గా సుత్తివేలు
- రంగనాథంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- గోపాలంగా బ్రహ్మానందం
- కాంతంగా శ్రీలక్ష్మి
- సుబ్బులుగా రాధాకుమారి
- అశోక్ రావు
- టెలిఫోన్ సత్యనారాయణ
విశేషాలు
[మార్చు]- శాంతి తండ్రి నాస్తికుడూ, తల్లి పరమ భక్తురాలు కావటంతో వారి ఇద్దరి వద్ద మంచి పేరు సంపాదించాలని రాముడు చేసే ప్రయత్నంలో భాగంగా, తల్లి వద్ద దేవుణ్ణి పొగుడుతూ "నీ పలుకే పరాశక్తి రా!" అని భక్తిగా, అదే పాటను తండ్రి వద్ద బ్రేక్ డ్యాన్స్ కి అనుగుణంగా పాడటం.
- కాంతం ఎవరైనా వారికి ఫలానాది ఇష్టం అని చెప్పగానే చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకొని "నాన్నా... చిట్టీ" అని కౌగిలించుకొనటం. అప్పుడు భర్త గోపాలం ప్రదర్శించే హావభావాలు
- శాంతి కోసం కాలేజీ ఎదుట పడిగాపులు కాస్తున్న రాముడి పర్సు క్రింద పడిపోవటం చూసిన శాంతి అతని భుజాన్ని తట్టి అతని పర్సును తిరిగివ్వటంతో, మరుసటి రోజు కూడా రాముడు అదే చోట కావాలని పర్సు పడేసుకోవటం. దానిని ఒక ముష్ఠివాడు తీసుకెళ్ళిపోవటం
- "గా సైన్మ జూశ్నావె" అని సూరిబాబు తండ్రి తెలంగాణా యాసలో అందరికీ చూసిన సినిమా కథను వివరించటం. ఆ యాస గోపాలానికి అర్థం కాక పోవటం.
సంభాషణలు
[మార్చు]- అవంతి: అమ్మా...
- సూరిబాబు: అమ్మో...
- అవంతి: ఇదే చెప్తున్నాను...
- సూరిబాబు: వద్దు.. నువ్వు చెప్పకు
- అవంతి: ఆరు నూరైనా సరే...
- సూరిబాబు: వద్దే...ఆరెప్పుడూ నూరు కాదే
- అవంతి: చెల్లెళ్ళ చదువు పూర్తయ్యేవరకు, తమ్ముడికి ఉద్యోగం దొరికేవరకు...నేను పెళ్ళి చేస్కోనని శపథం చేస్తున్నాను
- సూరిబాబు: ఇక ఈ జన్మలో మన పెళ్ళి అయినట్లే
పాటలు
[మార్చు]అబిమతమో అబినయమో, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
నీ మనసే మహాశక్తిరా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
ఓచిలకా , రచన: ముళ్ళపూడి శాస్త్రి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
అయ్యయో రామ , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్.పి శైలజ
జయమ్మునిశ్చయమురా ,రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.
మూలాలు
[మార్చు]- ↑ "పసందైన వినోదాల విందు - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-04. Retrieved 2020-08-29.