అవంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సా.పూ 6వ శతాబ్దంలో అవంతి సామ్రాజ్యం

అవంతి ఒక ప్రాచీన భారతీయ జనపదం. ఇది ప్రస్తుతం మాళ్వా ప్రాంతంగా వ్యవహరించబడుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. సా.పూ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథం అంగుత్తర నికయాలో అవంతిని 16 మహాజనపదాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ మహాజనపదాల్ని వింధ్య పర్వతాలు రెండు భాగాలుగా విభజించాయి. ఈ పర్వతాలకు ఉత్తరంగా ఉన్న రాజ్యాలకు ఉజ్జయిని రాజధానిగానూ, దక్షిణంగా ఉన్న రాజ్యాలకు మాహిష్మతి రాజధాని గానూ ఉండేవి.[1][2]

ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలను మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో మహాబలులు అని వ్యవహరించేవారు.[3] విష్ణు పురాణం (II.3), భాగవత పురాణం (XII.I.36), బ్రహ్మ పురాణం (XIX.17) ప్రకారం మాళవ, సౌరాష్ట్ర, అభిర, శూరులు, కరుషులు,, అర్బుదాసులను అవంతీయులుగా వ్యవహరించే వారు. వీరు పరియాత్ర లేదా పరిపాత్ర పర్వతాల (వింధ్య పర్వతాల పశ్చిమ విభాగం) వెంబడి నివసించేవారు.[4][5]

హైహయ వంశం

[మార్చు]

పురాణాల ప్రకారం అవంతీ సామ్రాజ్యాన్ని నాగ వంశం దగ్గర నుంచి చేజిక్కించుకుని పరిపాలించారు. మొదట్లో మాహిష్మతి నుంచి పరిపాలించారు. తరువాత ఈ జనపదాన్ని రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగానికి మాహిష్మతి, మరో విభాగానికి ఉజ్జయినిని రాజధానిగా చేసినట్లు తెలుస్తోంది. హైహయులు నిజానికి వితిహోత్ర, భోజ, అవంతి, తుండికేరులు,, శార్యతులు అనే ఐదు జాతుల సంగమం. తర్వాత వీటిలో బలమైన జాతియైన వితిహోత్రుల పేరే ఈ వంశానికి స్థిరపడింది. ఉజ్జయినికి చివరి వితిహోత్ర పాలకుడైన రిపుంజయుడు తన మంత్రి పులిక చేతిలో ఓడిపోయి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పులిక తన కుమారుడైన ప్రద్యోతుడిని సింహాసనంపై కూర్చుండబెట్టాడు.[6][7] కొన్ని గ్రంథాల్లో ఉజ్జయిని నగరాన్నే అవంతి సామ్రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు.[8]

బౌద్ధ గ్రంథం దిఘ నికాయ లోని మహాగోవిందసుత్తాంతలో అవంతి రాజు వెస్సభు (విశ్వభు) గురించి అతని రాజధాని మహిస్సతి (మహిష్మతి) గురించి ప్రస్తావించారు. బహుశా అతను వితిహోత్ర పరిపాలకుడు అయ్యుండవచ్చు.[9]

ప్రద్యోత వంశం

[మార్చు]

ప్రద్యోతుడు గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. ఇతనికి చంద్రప్రద్యోత మహాసేనుడని కూడా పేరు. ప్రద్యోతుడు వత్స దేశ రాజైన ఉదయనుడిని ఓడించి తన కుమార్తె వాసవదత్తను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. మహావగ్గ ఇతనిని ఓ క్రూరుడిగా వర్ణించింది. మజ్జిమ నికాయ ప్రకారం మగధ సామ్రాజ్యాధీశుడైన అజాత శత్రువు ప్రద్యోతుడి నుంచి రక్షించుకోవడం కోసం తన రాజగ్రహాన్ని పటిష్ఠపరిచినట్లు తెలుస్తుంది. ప్రద్యోతుడు తక్షశిల రాజైన పుష్కరశారిన్ మీద కూడా దండెత్తాడు.[10] ప్రద్యోతుడి ప్రధాన భార్య గోపాలమాత బౌద్ధ సన్యాసి యైన మహా కాత్యాయనుడికి శిష్యురాలిగా ఉండేది. ఆమె ఉజ్జయినిలో ఒక స్థూపాన్ని కూడా నిర్మించింది.

ప్రద్యోతుడికి గోపాలుడు, పలకుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇందులో పలకుడు ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. జైనుల రచనల ప్రకారం పలకుడు మహావీరుడు నిర్యాణం పొందిన రోజే అతను గద్దెనెక్కాడు. కథా సరిత్సాగరం, అవశ్యక కథానక ప్రకారం వత్స సామ్రాజ్యం పలకుడు రాజయ్యేటప్పటికి అవంతిలో భాగంగా ఉంది. ఆ రాజ కుటుంబీకుడు కోశాంబికి గవర్నరుగా ఉండేవాడు. మృచ్చకటికంలో పాలకుడు ప్రజాకంటకుడుగా ఉండడం వల్ల విప్లవం చెలరేగి అతన్ని దింపేశారనీ ఉంది. ఈ విప్లవం తర్వాత ఉజ్జయిని రాజ్యానికి ఆర్యకుడు రాజయ్యాడు. పురాణాల ప్రకారం ఆర్యకుడి తర్వాత నాడీవర్ధనులు, వర్తివర్ధనులు ఆర్యకుడి తర్వాత రాజ్యమేలారు.కానీ ఈ పేర్లు అవంతీవర్ధనుడు అనే పేరుకు రూపాంతరాలు అయి ఉండవచ్చు. కథా సరిత్సాగరం ప్రకారం అవంతీ వర్ధనుడు పలకుని కొడుకు. లేదా నేపాలీ బృహత్కథ ప్రకారం గోపాలుని కొడుకు. ఇతనిని మగథ రాజైన శిశునాగుడు ఓడించాడు.[11]

మగథ రాజుల పాలన

[మార్చు]

శిశునాగ వంశం, నంద వంశ రాజులు మగధను పరిపాలిస్తున్న కాలంలో అవంతి అవంతి మగధలో భాగంలో ఉండేది. మౌర్యుల పరిపాలనా కాలంలో అవంతి ఉజ్జయిని రాజధానిగా అవంతీ రాట్టం అయ్యింది.[12][13] రుద్రడమానుడు వేసిన జునాఘడ్ రాతిశాసనం (150 CE) ప్రకారం చంద్రగుప్త మౌర్యుడి పరిపాలనలో పశ్చిమ ప్రావిన్సుకు పుష్యగుప్తుడు పరిపాలకుడుగా ఉన్నాడు.[14] తర్వాతి రాజైన బిందుసారుడి పరిపాలనలో అశోకుడు ఈ ప్రాంతానికి పరిపాలకుడుగా ఉన్నాడు.[15] మౌర్యుల పతనం తర్వాత పుష్యమిత్ర శుంగుని పరిపాలనలో అతని కుమారుడు అగ్నిమిత్రుడు విదీష రాజ్యానికి మగధ తరపున స్వతంత్ర పాలకుడిగా ఉన్నాడు..[16]

మాళవ రాజ్యం

[మార్చు]

మధ్య, పశ్చిమ భారతదేశంలో యాదవ వంశ రాజులు పరిపాలించిన ఎన్నో రాజ్యాలలో మాళవ రాజ్యం ఒకటని మహాభారతంలో చెప్పిఉన్నది.[17] కొన్ని సార్లు అవంతి,, మాళవ సామ్రాజ్యాలు ఒకటే అని కూడా పేర్కొన్నారు. భారతదేశపు లిఖిత చరిత్రలో మాళవ వంశానికి చెందిన రాజవంశం గురించి వివరణ ఉంది. వాళ్ళను మాళవ వంశ రాజులుగా విశ్వసిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Mahajan, V.D. (1960, reprint 2007). Ancient India, New Delhi:S. Chand, ISBN 81-219-0887-6, p.233
  2. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.85,129-30
  3. Law, B.C. (1973). Tribes in Ancient India, Bhandarkar Oriental Series No.4, Poona: Bhandarkar Oriental Research Institute, pp.337-43
  4. Law, B.C. (1973). Tribes in Ancient India, Bhandarkar Oriental Series No.4, Poona: Bhandarkar Oriental Research Institute, p.63
  5. Gokhale, B. G. (1962). Samudra Gupta: Life and Times. New Delhi: Asia Publishing House. p. 18.
  6. Raizada, Ajit (1992). Ujjayini (in Hindi), Bhopal: Directorate of Archaeology & Museums, Government of Madhya Pradesh, p.21
  7. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.130-1
  8. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 74.
  9. Bhattacharyya, P. K. (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Delhi: Motilal Banarsidass. pp. 118–9.
  10. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.179-81
  11. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.192-5
  12. Raychaudhuri, H.C. (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, p.256
  13. Thapar, R. (2001). Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.237
  14. Thapar, R. (2001). Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.13
  15. Thapar, R. (2001). Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.21
  16. Lahiri, B (1974). Indigenous States of Northern India (Circa 200 B.C. to 320 A.D.) , Calcutta: University of Calcutta, p.49
  17. Kisari Mohan Ganguli, The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose, 1883-1896.
"https://te.wikipedia.org/w/index.php?title=అవంతి&oldid=3145540" నుండి వెలికితీశారు