జాక్ మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జాక్ మా (Jack Ma)
2008, ప్రపంచ ఆర్థిక సదస్సు లో జాక్ మా
జననం
మా యున్

(1964-10-15) 1964 అక్టోబరు 15 (వయసు 59)
జాతీయతచైనా
విద్యాసంస్థహాంగ్జౌ విశ్వవిద్యాలయము
వృత్తిఅలీబాబా వ్యాపార సంస్థల ప్రారంభకుదు, అధిపతి
నికర విలువIncrease US $21.8 billion (2014)[1]
జీవిత భాగస్వామిజంగ్ యింగ్
పిల్లలు2

జాక్ మా చైనాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త. ఆలీబాబా.కామ్‌ ఇ-కామర్స్ పోర్టల్ అధినేత. చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

నేపధ్యము

[మార్చు]

జాక్ మా చిన్నప్పటి నుండే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇతను 12 ఏళ్లపుడే ఆంగ్ల భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు.[2] ఆంగ్లంలో కాస్త పట్టు సాధించాక సొంతూరుకి దగ్గర్లోని హాంగ్జౌ నగరంలోని ఒక హోటల్‌కు తొమ్మిదేళ్లపాటు రోజూ సైకిల్ మీద వెళ్లి... పర్యటనకోసం, వాణిజ్యం కోసం చైనా వచ్చే విదేశీయులకు గైడ్‌గా ఉచిత సేవలు అందించేవాడు. ఆంగ్లంలో తన నైపుణ్యాల్ని మెరుగు పరుచుకోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్. గైడ్‌గా పనిచేసిన తొమ్మిదేళ్లలో జాక్‌లో ఎంతో మార్పు వచ్చింది. అతడు చైనాలో ఉంటూనే ప్రపంచాన్ని అర్థంచేసుకున్నాడు. గురువుల దగ్గరా, పుస్తకాల్లోనూ నేర్చుకున్నవాటికి భిన్నమైన అంశాల్ని విదేశీ పర్యటకుల నుంచి నేర్చుకున్నాడు. 1979లో జాక్ జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబం చైనా పర్యటనకు వచ్చినపుడు వారితో జాక్‌కు పరిచయం ఏర్పడింది. మూడు రోజులపాటు జాక్ వారితో ఆడుతూ పాడుతూ గడిపాడు. ఆ తర్వాత వారు జాక్‌కు కలం స్నేహితులు అయ్యారు. 1985లో ఆ కుటుంబం ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా వెళ్లి నెలరోజులపాటు అక్కడ కొత్త ప్రపంచాన్ని చూశాడు.

ఆంగ్ల ఉపాధ్యాయుడు అవ్వాలనే లక్ష్యంతో 'హాంగ్జౌ టీచర్స్ యూనివర్సిటీ' ప్రవేశ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో మూడోసారి సఫలీకృతుడయ్యాడు. అక్కడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆంగ్ల ఉపాధ్యాయుడు అర్హతకు అవసరమయ్యే విద్యను అభ్యసించాడు. అదే సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా, నగరంలోని విదార్థి సంఘం నాయకుడిగానూ ఎన్నికయ్యాడు. విద్య పూర్తిచేశాక అదే విశ్వవిద్యాలయంలో సుమారు రూ.1000 నెల జీతానికి పాఠాలు చెప్పేవాడు. అక్కడ జీతం సరిపోక పెద్ద హోటల్‌లో లేదంటే బహుళజాతి సంస్థలో ఉద్యోగిగా చేరాలనే లక్ష్యంతో ఉండేవాడు జాక్. అప్పుడే ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలించవచ్చనేది అతడి ఆలోచన. 1992 నాటికి చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు జాక్. అందులో కేఎఫ్‌సీ జీఎంకి సెక్రటరీ పోస్టు ఒకటి. కానీ అతన్ని ఎవరూ తీసుకోలేదు. దాంతో సొంతంగా అనువాద సంస్థను ప్రారంభించాడు.

జాక్ 1995లో చైనా వ్యాపార బృందంతో కలిసి దుబాసీగా అమెరికాలో పర్యటించాడు. అక్కడే జాక్ స్నేహితుడు మొదటిసారి ఇంటర్నెట్‌లో సమాచారం ఎలా వెతకాలో చూపాడు. అదో మాయలా అనిపించింది అతడికి. ఇద్దరూ యాహూలో సర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. దాన్నో అవకాశంగా తీసుకొని రూ.1.2లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు.[3] అప్పటివరకూ జాక్ కీబోర్డుని కూడా తాకింది లేదు. ఇక పీసీలూ, ఈమెయిల్స్ వినియోగంలో అతడి ప్రతిభ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుకే తాను ప్రయాణం మొదలుపెట్టిన తీరుని 'ఒక గుడ్డివాడు గుడ్డిపులి మీద స్వారీ చేయడంలాంటిద'ని చెబుతాడు. అప్పట్నుంచీ జాక్ జీవితం ఇంటర్నెట్‌తో ముడిపడింది. తన వెబ్‌సైట్‌తో 'చైనా టెలికామ్' సంస్థ సైట్‌కి జాక్ గట్టి పోటీ ఇచ్చాడు. ఆ సమయంలో సుమారు కోటి రూపాయల పెట్టుబడితో సంస్థ పెడతాననీ కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. దాన్నో అవకాశంగా భావించి సరేనన్నాడు జాక్. 'కొత్త సంస్థ బోర్డులో ఆ జీఎమ్ మనుషులు అయిదుగురు, మేం ఇద్దరం ఉండేవాళ్లం. మేం ఏం చెప్పినా దానికి అడ్డుపుల్ల వేసేవారు. మా భాగస్వామ్యం ఏనుగుకీ, చీమకీ మధ్య భాగస్వామ్యంలా ఉండేది. లాభం లేదని సంస్థ నుంచి బయటకు వచ్చేశా' అంటాడు జాక్. అప్పుడే బీజింగ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించే అవకాశం వచ్చింది జాక్‌కి. కానీ సొంత సంస్థ ప్రారంభించాలనేది అతడి కల.

అలీబాబా వ్యాపార సంస్థ ఆవిర్భావము

[మార్చు]

1999లో ఒకరోజు 18 మంది పరిచయస్తుల్ని పిలిచి రెండు గంటలపాటు తన ఆన్‌లైన్ వ్యాపార ఆలోచనల్ని వివరించాడు జాక్. వారికి ఆలోచనలు నచ్చి తమ దగ్గరున్న డబ్బుని ఇచ్చారు. అలా 36 లక్షలు పోగయ్యాయి. జాక్ ఇదే ఆలోచనని అమెరికా పెట్టుబడిదారులతోనూ చెబితే ఎవరూ ముందుకు రాలేదు. తన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు ఎంచుకుందామని ఆలోచించి 'అలీబాబా'ను ఖరారు చేశాడు జాక్. 'అలీబాబా కథల్లో దాగిన నిధుల్ని వెలికితీస్తాడు. మేం ఈ-కామర్స్ సామ్రాజ్యంలో ఆ పని చేస్తామన్న అర్థమూ ఉంది' అంటాడు జాక్. చాలా ఐటీ కంపెనీల మాదిరిగానే అలీబాబా కూడా దాని వ్యవస్థాపకుడి ఇంట్లోనే మొగ్గ తొడిగింది. మిగతా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల మాదిరిగా వ్యాపారికీ, వినియోగదారుడికీ మధ్య వారధిగా కాకుండా వ్యాపారికీ-వ్యాపారికీ మధ్య వారధిగా ఏర్పడింది అలీబాబాడాట్‌కామ్. చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దుస్తులూ గృహోపకరణాల అమ్మకాలూ కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచస్థాయి సంత. ఆ విధానంతో మూడేళ్లపాటు వేగంగా అభివృద్ధి చెందింది అలీబాబా.[4]

అలీబాబా గ్రూప్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి. అలీబాబాడాట్‌కామ్‌తోపాటు యాహూతో కలిసి చైనాలో 'యాహూ చైనా' వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. అలాగే ఈబే తరహా ఆన్‌లైన్‌లో వస్తువుల వేలం నిర్వహించే 'టావోబవో'నూ, టీమాల్ పేరుతో రిటైల్ వెబ్‌సైట్‌నూ నడుపుతోంది. ఈ సంస్థకు టీమాల్, టావోబవో సైట్లద్వారా ప్రధానంగా ఆదాయం వస్తోంది. చాటింగ్ కోసం 'లైవాంగ్' ఆప్‌నీ, అలీమామా పేరుతో ఒక ఆన్‌లైన్ ప్రకటనల వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. వివిధ దేశాల్లో అలీబాబా స్థానిక ఈ-కామర్స్ వెబ్‌సైట్లనూ మొదలుపెట్టింది.

అలీబాబా నిలదొక్కుకోవడానికి మూడు ప్రధాన కారణాల్ని చెబుతాడు జాక్. 'మా దగ్గర డబ్బులేదు, టెక్నాలజీ లేదు, ప్రణాళిక లేదు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేశాం. ప్రతి రూపాయీ ఆలోచించి ఖర్చుపెట్టాం' అంటాడు. ఎదిగే క్రమంలో తానూ తప్పులు చేశానంటాడు జాక్. 'నాతోపాటు పెట్టుబడి పెట్టిన 18 మందీ కంపెనీలో మేనేజర్లుగా ఉండొచ్చని చెప్పాను. పెద్ద స్థానాల్లో బయటివారిని పెడదామని చెప్పి అలాగే చేశాను. ఏడాదిలోపే ఆ బయటివారు వెళ్లిపోయారు. దాంతో నా మిత్రులే తర్వాత ఆ ఖాళీల్ని భర్తీచేసి రాణించారు' అంటాడు జాక్.

వ్యక్తిగత జీవితము

[మార్చు]

హాంగ్జౌ యూనివర్సిటీలో సహధ్యాయి 'జంగ్ యింగ్'ని పెళ్లాడాడు జాక్. అలీబాబాలో ఆమె కొన్నాళ్లు పనిచేసింది. వీరికి ఇద్దరు పిల్లలు.

భవిష్యత్ లక్ష్యాలు

[మార్చు]

రానున్న ఐదు సంవత్సరాలలో అలీబాబాతో లక్షల ఉద్యోగాల్ని సృష్టించి తద్వారా చైనా సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి... అలీబాబాని ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా తీర్చిదిద్దాలి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Jack Ma Emerges as China's Richest Man Before Alibaba IPO". Forbes.
  2. http://www.inc.com/magazine/20080101/how-i-did-it-jack-ma-alibaba.html
  3. http://www.quora.com/How-did-Alibabas-Jack-Ma-become-a-successful-entrepreneur-despite-being-an-English-teacher-previously
  4. http://www.inc.com/eric-markowitz/alibaba-film-dawn-of-the-chinese-internet-revolution.html
  5. http://www.forbes.com/2009/05/07/alibaba-jack-ma-markets-equity-china.html

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జాక్_మా&oldid=3872271" నుండి వెలికితీశారు