జాసూ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాసూ పటేల్
దస్త్రం:Jasubhai Patel.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాసూభాయ్ మోతీభాయ్ పటేల్
పుట్టిన తేదీ(1924-11-26)1924 నవంబరు 26
అహ్మదాబాదు, గుజరాత్
మరణించిన తేదీ1992 డిసెంబరు 12(1992-12-12) (వయసు 68)
అహ్మదాబాదు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm off-break
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 74)1955 ఫిబ్రవరి 26 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1960 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 7 68
చేసిన పరుగులు 25 780
బ్యాటింగు సగటు 2.77 12.78
100లు/50లు 0/0 1/3
అత్యధిక స్కోరు 12 152
వేసిన బంతులు 1,725 5,382
వికెట్లు 29 248
బౌలింగు సగటు 21.96 21.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 19
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 5
అత్యుత్తమ బౌలింగు 9/69 9/69
క్యాచ్‌లు/స్టంపింగులు 2 26
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3

జాసుభాయ్ మోతీభాయ్ పటేల్ (1924 నవంబరు 26 - 1992 డిసెంబరు 12) భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఆఫ్ స్పిన్నర్ .

ప్రారంభ రోజుల్లో[మార్చు]

పదేళ్ల వయసులో చెట్టుపై నుంచి పడి జాసూకు చేయి విరిగింది. ఈ గాయం కారణంగా అతని బౌలింగు యాక్షనులో ఒక కుదుపు ఉంటుంది. ఈ బౌలింగు యాక్షన్ను కొందరు అనుమానాస్పదంగా ఉందని భావించారు.[1] [2] అతను సంప్రదాయ ఆఫ్ బ్రేక్‌ల కంటే ఎక్కువగా ఆఫ్-కట్టర్‌లను బౌలింగ్ చేశాడు. అతను చక్కగా టర్నయ్యే వికెట్లపై ప్రమాదకరంగా ఉంటాడు.

అతను 1943-44లో తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించి, 1950-51 సీజన్‌లో అప్పుడప్పుడు గుజరాత్ తరపున ఆడాక, తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు. అతను బరోడాపై 43 పరుగులకు 5, 61కి 6 సర్వీసెస్ జట్టుపై 53 పరుగులకు 8, 28కి 5 వికెట్లు తీసుకున్నాడు. అతని బ్యాటింగు చెప్పుకోదగ్గదేమీ కాదు. కానీ 1950-51లో హోల్కర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో, రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టు 8 వికెట్లకు 167 పరుగుల వద్ద బ్యాటింగుకు వచ్చి, రెండు గంటల్లో 152 పరుగులు చేశాడు. హసన్ నఖుదాతో కలిసి పదో వికెట్‌కు 90 నిమిషాల్లో 136 పరుగులు జోడించాడు. ఇది అతని ఏకైక సెంచరీ.

అతను 1953-54లో కామన్వెల్త్ XI కి వ్యతిరేకంగా భారతదేశం తరపున ఒకసారి ఆడాడు. ఆ తర్వాతి సీజన్‌లో పాకిస్తాన్‌లో చేసిన పర్యటనలో, 10.71 సగటుతో 35 వికెట్లు తీశాడు. ఇందులో పాకిస్తాన్ విశ్వవిద్యాలయాలపై 22 పరుగులకు 4 వికెట్లు, 25కి 8 వికెట్లు ఉన్నాయి. ఐదో టెస్టులో తన తొలి టెస్టు ఆడి, మూడు వికెట్లు పడగొట్టాడు. 1955-56లో న్యూజిలాండ్‌తో మరో టెస్టు ఆడాడు. ఆ తర్వాత 1956-57లో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడాడు. ఈ నాలుగు టెస్టుల్లో 31.00 సగటుతో 10 వికెట్లు తీసాడు.


1959-60 లో 35 ఏళ్ళ వయస్సులో, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సమయంలో జాసూ, కాన్పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక గొప్ప విజయాన్ని ఆస్వాదించాడు.

ఇంగ్లండ్, పాకిస్థాన్ లపై సునాయాస విజయాలు సాధించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా భారత్ కు వచ్చింది. సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్‌ పొందిన ఓటమి ఈ ఏడాది భారత జట్టుకు ఐదో ఇన్నింగ్స్‌ ఓటమి. కాన్పూర్‌లో పిచ్‌ అప్పుడే కొత్తగా వేసారు. సెలెక్టర్ల ఛైర్మన్ లాలా అమర్‌నాథ్ పట్టుబట్టడంతో పటేల్‌ను జట్టు లోకి తీసుకున్నారు.

"పటేల్ టెస్ట్"[మార్చు]

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 152 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఉదయం పెద్ద హిట్‌కి ప్రయత్నించిన గావిన్ స్టీవెన్స్‌ను క్యాచ్‌ పట్టుకుని పటేల్, తన మొదటి వికెట్‌ను అందుకున్నాడు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 128 పరుగులతో ఉంది. అప్పటి వరకు, పటేల్ సిటీ ఎండ్ నుండి బౌలింగ్ చేసాడు. అక్కడ అతను ఎడమ చేతి బౌలర్లు అలాన్ డేవిడ్సన్, ఇయాన్ మెకిఫ్ సృష్టించిన ఫుట్‌మార్క్‌లను ఉపయోగించుకోలేకపోయాడు. విరామం తర్వాత పటేల్ పెవిలియన్ ఎండ్‌కు మారాడు.

లంచ్ తర్వాత పటేల్ వేసిన మొదటి బంతి కోలిన్ మెక్‌డొనాల్డ్ బ్యాట్, ప్యాడ్ల మధ్య గుండా వెళ్లి స్టంపులను తాకింది. అతని స్థానంలో వచ్చిన నార్మన్ ఓ'నీల్ జాసూను ఆడేందుకు కష్టపడ్డాడు. మిడ్‌వికెట్‌లో బాపు నద్కర్ణికి సులభమైన క్యాచ్ అందించాడు గానీ, అతను దానిని పట్టుకోలేకపోయాడు. దీంతో మొత్తం పది వికెట్లు పడగొట్టే అవకాశాన్ని పటేల్ కోల్పోయాడు. నీల్ హార్వే యాభై పూర్తి చేసి బౌల్డ్ అయ్యాడు. ఎడమచేతి వాటం కలిగిన హార్వే ఆఫ్-స్టంప్ వెలుపల పటేల్ బాగా పిచ్ చేశాడు. హార్వే బ్యాట్‌ని పైకి లేపి వదిలేశాడు కానీ బంతి కట్ అయి స్టంప్‌లను తాకింది.

హార్వే అవుట్ అయిన తర్వాత, మిగతావాళ్ళు త్వరత్వరగా నిష్క్రమించారు. చివర్లో డేవిడ్‌సన్ కాస్త బ్యాటింగు చేసి స్కోరును 219కి తీసుకెళ్లాడు. చందు బోర్డే వేసిన ఫుల్-టాస్‌కు బౌల్డ్ అయిన ఓ'నీల్ మాత్రమే పటేల్‌కు పడని ఏకైక వికెట్. ఆ ఇన్నింగ్సులో అతని గణాంకాలు 69కి 9.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను 400 నిమిషాల్లో 225 పరుగులు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ముగిసేలోపు పటేల్ స్టీవెన్స్‌ను అవుట్ చేయగా, పాలీ ఉమ్రిగర్ హార్వే వికెట్‌ను తీశాడు. చివరి రోజు ఉదయం ఉమ్రిగర్ మరో రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 4 వికెట్లకు 61 పరుగులకు తగ్గించాడు. మిగిలిన ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు పటేల్ తీయగా, గోర్డాన్ రోర్కే బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా 105 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది తొలి విజయం.

పటేల్ తీసిన 124 పరుగులకు 14 వికెట్ల పంట, నరేంద్ర హిర్వానీ మెరుగుపరచే వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు భారత బౌలరు చేసిన అత్యుత్తమ టెస్ట్ బౌలింగ్ గణాంకాలుగా మిగిలిపోయింది. ఒక ఇన్నింగ్సులో పటేల్ తీసిన 69 పరుగులకు 9 వికెట్ల పంట, నలభై ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే 74 పరుగులకు 10 వికెట్లు తీసే వరకు ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బౌలరు అత్యుత్తమ బౌలింగ్‌గా నిలిచింది.

అనంతర కెరీర్[మార్చు]

పటేల్ టెస్ట్ కెరీర్‌లో కాన్పూర్ టెస్ట్ ఏకైక ప్రకాశవంతమైన బిందువుగా మిగిలిపోయింది. అతను ఆ సిరీస్‌లో మరో రెండు టెస్టులు ఆడి ఐదు వికెట్లు తీసాడు. అవే అతని చివరి టెస్టు మ్యాచ్‌లు.

జాసూ మరో రెండు సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి, రంజీ ట్రోఫీలో గుజరాత్ తరపున 140 వికెట్లు పడగొట్టాడు. జాసూ, విజయ్ హజారేలు పద్మశ్రీ పురస్కారం పొందిన మొదటి క్రికెటర్లు.

మూలాలు[మార్చు]

  1. Ramnarayan, V. (23 September 2014). "Don't shed tears for chuckers". Cricinfo. Retrieved 14 December 2015.
  2. Gideon Haigh, The Summer Game, Text, Melbourne, 1997, p. 132.