Jump to content

జ్యోతి నృత్యం

వికీపీడియా నుండి
(జ్యోతినృత్యం నుండి దారిమార్పు చెందింది)

జ్యోతి నృత్యం,కులపరమైన జానపద కళారూపం. రాయలసీమలో,తొగట వంశస్థులు భక్తితో తయారు చేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని చౌడేశ్వరీదేవిని వర్ణించే పాటల కనుగుణంగా చేసే నృత్యం జ్యోతి నృత్యం.ఈ నృత్యాన్ని, పల్లెల్లో జ్యోతుల బోనాలు అని అంటారు. ఈ నృత్యాని ఏడాదికి ఒక సారి మాత్రమే కుల వృత్తి పరంగా చేస్తుంటారు. నేసే కులస్థులంతా ఏకమై నృత్యం చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. (తొగట వంశస్థులే, నేసే కులస్థులు. ఈ నృత్యానికి కంచు తో చేసిన తాళాలు, తేతులు చప్పట్లు వుంటాయి. వీటి కనుగుణంగా పాట ననుసరించి తాళ గతిని మార్పు చేస్తూ వుంటారు. పాటలన్నీ శివుని పైనా, చౌడమ్మ పైనా వుంటాయి. ఇది వ్యష్టి నృత్యం. కానీ సామూహికంగా పాటలు పాడుతుంటే ఒక వ్యక్తి జ్యోతి నృత్యం చేస్తుంటాడు. చేనేత కులానికి చెందిన అనేక తెగలు ఉప కులాలలో ముఖ్యంగా పద్మ సాలె, పట్టుసాలె, తొగట వీర క్షత్రియ, దేవాంగులు మొదలైనవారు ఉన్నారు. ఈ తెగలు, ఉపకులాలు వారి వారి దైవారాధన సంప్రదాయాలను బట్టి విభజించడం జరిగింది. తొగట వీర క్షత్రియులు అన్న చేనేత తెగ చౌడేశ్వరీ దేవతను తమ కులదైవంగా పూజిస్తారు. కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడేశ్వరి అతి ప్రాచీనమైన దేవత.

పౌరాణిక చారిత్రక నేపథ్యం

[మార్చు]
లక్ష్మిదేవి

చౌడమ్మను గురించి పురాణ కథలు, చారిత్రక కథలు వాడుకలో ఉన్నాయి. తొగట వీర క్షత్రియులు చెప్పిన సారాంశం. సృష్టికి ముందు అంతా జలమయమై ఉంది. ఈ జలంలోనుండి కోటి సూర్య ప్రభాభాసురముగా జ్యోతి ఉద్భవించినది. ఈ జ్యోతి నుండి ఓం అను మహా మంత్రము పుట్టింది. తరువాత ఈ జ్యోతి ఆది పరంజ్యోతియందు ఐక్యమై సర్వశక్తివంతమైనది. ఈ శక్తియే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ , విష్ణు మహేశ్వరులను, సూర్య చంద్రాది దేవతలను, లక్ష్మి ఆదిగా గల దేవతలను సృష్టించింది. ఈమెయే చౌడేశ్వరీ దేవి, ఈమెయే మహిషాసుర మర్ధిని, రాక్షస సంహారానికి పుష్పాండజుడు అనే రాజునకు వరపుత్రియై జన్మించి 360 మంది వీర క్షత్రియులను హోమ గుండము నుండి సృష్టించింది. తొగట వీర క్షత్రియులకు ఈమె కులదేవత. చౌడేశ్వరి మహిమలను గురించి పద్య , గద్య, ఖడ్గ గేయ రూపాలలో ఆమెను స్తుతిస్తారు.

జ్యోతి తయారు చేసే విధానం

[మార్చు]

తొగట వీర క్షత్రియులు శ్రీ చౌడేశ్వరిదేవి దేవతను ఆరాధిస్తూ జ్యోతులెత్తుతారు. పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పల్లెల్లో జ్యోతుల బోనాలు అని పిలువబడే ఈ నృత్యం ఏడాదికొకమారు మాత్రమే చేస్తారు. ఆవు పేడతో అలికి స్నానం చేసి ఒక్కపొద్దు (ఉపవాసం) ఉండి జ్యోతిని తయారు చేస్తారు. గోధుమ పిండిని ముద్దలాగా కలిపి మధ్యలో కొత్త గుడ్డ ఉంచి (మైనపు వత్తి) జ్యోతిని తయారు చేస్తారు. క్రింది భాగంలో తలపై ఉంచుకోవడానికి వీలుగా వెడల్పుగా చేస్తారు. పైభాగంలో వత్తికి నెయ్యి పోయడానికి అనువుగా ఉంటుంది. చుట్టూ జ్యోతిని అందంగా తీర్చిదిద్దటానికి అట్టతో అందంగా అలంకరించి దానికి తళుకులు అద్దుతారు. జ్యోతులు రాత్రి పూట ప్రదర్శించడం చేత తళుకులు లోపలి వత్తికాంతికి అందంగా కనిపిస్తాయి. జ్యోతిని తలపై ఉంచుకోవటానికి గుడ్డతో గుండ్రంగా ఒత్తుగా ఉంచుకుంటారు. జ్యోతి నృత్యం చేస్తున్నపుడు జ్యోతికున్న వేలాడ దీసిన తళుకులు కదులుతూ మరింత అందాన్నిస్తూ చూపరులను ఆకట్టుకుంటాయి. జ్యోతిలోపలి భాగంలోని వత్తులను నెయ్యితో తడుపుతారు. ఈ జ్యోతులను ప్రత్యేకంగా చేసిన కలశము వంటి దీపపు సెమ్మెలో అమర్చుతారు. జ్యోతిని వెలిగించిన తరువాత చౌడమ్మ ముందు రతి పోసి (రతి పోయడం అంటే ముగ్గు పిండి తో చౌడమ్మ ప్రతిమ ను వేసి కలర్ కుంకుమలతో అలంకరించడం) జ్యోతిని రతి ముందు ఉంచుతారు. వంశపారంపర్యంగా జ్యోతిని ఎత్తుకొనే వాళ్ళు కడవలతో నీళ్ళు నెత్తిన పోసుకొని జ్యోతినెత్తుకుంటారు.అలా జ్యోతిని ఎత్తుకుని వుండగా ఆ జ్యోతి చుట్టూ గుండ్రాకారంగా ఆనందవేసేవారు నిలబడతారు. వీరిలో కొద్ది మంది తాళాలు పట్టుకొని వుంటారు. అందరూ గుండ్రాకారంగా తిరుగుతూ పాటలు పాడతారు.ఒకరు పాడుతూ వుండగా మిగిలిన వారంతా వంత పాడతారు. జ్యోతి నెత్తుకున్న వ్వక్తి పాట కనుగుణంగా అడుగులు వేస్తుంటాడు. జ్యోతులు రెండు మూడు కూడ వుంటాయి. నడి బజార్లో జ్యోతి నృత్యం జరుగుతూ వుండగా, ఆ జ్యోతికి బలిని ఇస్తూ వుంటారు.

వస్త్రాలంకరణ

[మార్చు]

జ్యోతిని ఎత్తుకున్న వాళ్ళు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, పంచెతో, పై వస్త్రము లేకుండా, నడుముకు ఎర్రటి గుడ్డ చుట్టుకొని ఉంటారు. వట్టి పయ్యతో ఉంటారు. అంటే అంగీ లాంటివి ధరించరు. మెడలో హారాలు వేస్తారు. నుదుట బండారు బొట్టు ఉంటుంది. తాళాలు, కంజీరాలు, డప్పు వాయించే వాద్యాలు.

జ్యోతినృత్యం పద్ధతులు

[మార్చు]

జ్యోతి నెత్తుకొన్న వారి చుట్టూ తొగట వీర క్షత్రియులు చాలా మంది నిలబడి తాళాలు, కంజీరలు వాయిస్తూ అమ్మవారికి సంబంధించిన పాటలు పాడతారు. ఒకరు ప్రధానంగా పాట పాడుతుండగా మిగిలిన వారు వంత ఎత్తుకుంటారు. జ్యోతి నెత్తిన వ్యక్తి పాటకు తాళాలకు అనుగుణంగా అడుగులు వేస్తాడు. డప్పు వాద్యాల శబ్దాలకు అనుగుణంగా ఇతని అడుగులుంటాయి. జ్యోతిని తలపై ఉంచుకున్న వ్యక్తి నాట్యం చేస్తూ గిర్రున తిరగడం, చేతులు వదలి గాలిలో ఊపుతూ తలపైనున్న జ్యోతి పడకుండా గిర్రున తిరగడం, నేలపై కూర్చొని లేవడం, నేలపైనున్న నిమ్మకాయలు, డబ్బులు జ్యోతి పడకుండా అందుకోవడం వంటి విన్యాసాలు చేస్తుంటారు. తాళాలు పాటకనుగుణంగా ఉంటాయి. తాళాలే కాకుండా చప్పట్ట్లు చరచడం, డప్పులు వాయించడం ఉంటుంది. మొదటగా తాళాన్ని వాయిస్తూ విఘ్నేశ్వరుని ప్రార్థన చేస్తారు. జ్యోతి నెత్తుకున్న వ్యక్తి అడుగులతో పాటు చుట్టు నిలబడి ఉన్న వారంతా అతని చుట్టు తిరుగుతూ అడుగులు వేస్తూ తాళాలు వేస్తూ నృత్యం చేస్తారు. ఫ్రార్థనానతరం చౌడేశ్వరీ దేవిని కొలుస్తూ జ్యోతులు సాగుతాయి. జ్యోతులను సుమారు రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎత్తుతారు. అంతకు ముందుగా సాయంత్రం చౌడమ్మను పూజించి ఊరేగింపుగా ఉత్సవంగా తీసుకెళ్ళి పురమ్మాను దగ్గర పల్లకీ దింపుతారు. ఇళ్ళలోనుండి జ్యోతులు బయలుదేరి చౌడేశ్వరీ దేవి వద్ద జ్యోతులాడతారు. ఊరేగింపుగా జ్యోతులు వెడుతున్నపుడు తొగట వీర క్షత్రియ కులానికి చెందిన వారింటి దగ్గర జ్యోతులాడిస్తారు. ఆ సమయంలో వీధి వెంబడి జ్యోతి నెత్తుకున్న వారికి కాళ్ళు కడిగి పూజ చేయడం కనిపిస్తుంది. దోవ వెంట నీళ్ళు చల్లుతూ భక్తులు వారి పాద సేవ చేసుకుంటారు. భిన్న ప్రాంతాలనుండి ఆ ఊరిలోని జ్యోతులన్నీ కదిలి వస్తూ కూడలి వద్ద కలిసి నృత్యం చేస్తారు. రాత్రి పూట కావడం చేత చీకటిలో వెలుగుతున్న జ్యోతులతో ఈ నృత్యం చూడ ముచ్చటగా ఉంటుంది. తాళాల చప్పుడులు, చేతి చప్పట్లు, డప్పు వాద్యాల హోరు, తొగట వీర క్షత్రియుల అరుపులు, పాటలు, కేకలు, గజ్జెల నినాదాలతో మొత్తం దృశ్యం రసభరితంగా ఉంటుంది.

చౌడమ్మ కదిలి వచ్చిందన్న పాటలోని దృశ్యం బిరబిర సాగుతుంది. అడుగులు వేగంగా వేయడం, గుండ్రంగా తిరగడం జరుగుతుంది.

కదిలె చౌడమ్మయత తొడను గాభీర్య నాదములతో
గొడుగులు పడిగెలు గోరా శంఖాలు యింతట్ సిద్దులు యిరుజడలు
రంగులునే మగరాడు చౌడమ రానువు కదలెను,
రమ్యముతొ ఎప్పుడు మనకు యిచ్చిన వరములు ఏకొదువాలేదు.
తప్పక కొలువుండి దారుని లోపుల దైవంబనలే చౌడమ్మ ఎప్పుడు మనకు

ఈ పాట చాలా వేగంగా సాగుతుంది. పాటలోని తాళాలు, డప్పు శబ్ధాలలోని వేగం జ్యోతి నృత్యంలో కూడా వేగాన్ని పెంచుతుంది. మరో పాటలో పల్లవి నృత్యానికొక తూగు నిస్తుంది. జ్యోతి నెత్తిన వ్యక్తి పల్లనిని పాడే సమయంలో రెండు చేతులను చాపి ఒక్కొక్క కాలినే నేలపై నిలిపి, పాటలోని భావానికి అనుగుణంగా నాట్యం చేస్తాడు. మిగినిన వారంతా వలయాకారంగా తిరుగుతూనే అడుగులు మార్చుకొంటారు. గేయంలో ప్రారంభంలోని పల్లవి కొన్ని చరణాల్లో వచ్చి మధ్యలో రెండో పల్లవి మొదలవుతుంది. జ్యోతి నృత్యం వేగం పుంజుకొంటుంది. మొదటి తాళ తా-తకిట తాళంలోనూ రెండో పల్లవి తకతక తగి అని నడుస్తుంది.

ప్రార్థన

[మార్చు]

ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాట కనుగుణంగా, చుట్టూ గుండ్రాకారంగా నిలబడి వున్న రారంతా అడుగులు మారుస్తూ తిరిగుతూ వుండగా గణపతి ప్రార్థన ప్రారంభమౌతుంది.

పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ
ఎలుక వాహన మెక్కి వెళ్ళే తన వేడ్క
అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు
సంతోషమున కల్గు సకల జనులకును.

అంటూ ఆందరి దేవుళ్ళనూ ప్రార్థించి, చౌడమ్మ కదిలే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు పాట త్వర త్వరగా సాగుతుంది. అడుగులు త్వర త్వరగా వేయటం, గుండ్రంగా తిరగటం, జ్యోతి నెత్తుకున్న వ్వక్తి గిరగిరా తిరుగుతూ, కళ్ళు పెద్దవి చేసి చౌదమ్మలా కనిపిస్తాడు. తరువాత ఇలా పాడతాడు.

కదిలెను చౌడమ యంత తోడను గాంభీర్య నాదములతో
రంతులునే మగరాడు చౌడమ రానువు కదిలెను రమ్యముతో
ఎప్పుడు మనకు ఇచ్చిన వరములు యేకొదువా లేదు
తప్పక కొలవండి దారుని లోపల దైవంబసలే చౌడమ్మ.

ఇలా చౌడమ్మ గూర్చి, ఆమె గొప్ప తనాన్ని గూర్చి వేనోళ్ళ పొగుడుతూ అనేక గేయాలు పాడతారు.

జ్యోతి నృత్యంలో బలులు

[మార్చు]

జ్యోతి నృత్యంతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళడాని మెరవణి అంటారు. మెరవణిలో అమ్మవారు వీధి వెంట వచ్చినపుడు బలులిస్తారు. ఇండ్లముందుకు వచ్చినపుడు అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రక్తంతో అమ్మవారిని పూజిస్తారు. ఇది ప్రాచీన ఆచారము. కానీ ప్రస్తుతం ఆ ఆచారం చాలా ప్రదేశాల్లో లేదు. తొగట వీర క్షత్రియుల ఇండ్ల దగ్గర అమ్మవార్ని నిలబెట్టినపుడు, జ్యోతి నెత్తినపుడు బలినిచ్చి ఆ రక్తం బొట్టుతో అలంకరిస్తారు.

రాయలసీమలో జ్యోతినృత్యం

[మార్చు]

కర్నూలు జిల్లా నందవరంలోని చౌడేశ్వరీ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే జ్యోతి ఉత్సవంలో దాదాపుగా వందలకొద్ది జ్యోతులాడతాయి. అనంతపురం జిల్లాలోని, ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాలలో చేనేతలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాలలో జ్యోతి నృత్యం ఉంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, దొమ్మరనంద్యాల, వేపరాల, మోరగుడి గ్రామాల్లోనూ, ప్రొద్దుటూరు పట్టణంలోనూ, అలాగే ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం, దొరసానిపల్లె గ్రామాలలో కూడా జ్యోతులెత్తుతారు.

రక్తపు బొట్ట

[మార్చు]

జ్యోతి నృత్యం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ నడి బజార్లో వెళుతూ వుండగా భక్తులు ఆమెకు జంతు బలుల్ని ఇస్తూ వుంటారు. ఆ చౌడమ్మ దేవతను రక్తపు బొట్టుతో అలంకరిస్తారు. ఒకరే ఒక్క వేటుతో పొట్టేలు తలను నరుకు తాడు. క్రింద బడిన రక్తం దాటుకుంటూ జ్యోతి వెళుతూ వుంటుంది. చివరికి దేవతలనూ, చౌడమ్మను స్తుతిస్తూ మంగళం పాడతారు. జ్యోతి నృత్యాన్ని సూస్తున్న శ్రోతలు రెండు చేతులెత్తి మ్రొక్కటం, భక్తితో ఇంటి దగ్గరకు వెళ్ళే టప్పుడు టెంకాయలు కొట్టి ఎవరికి వారు బలి ఇస్తారు. స్త్రీలు, పురుషులూ కూడ గుంపుతో కలిసి నృత్యం చేస్తారు. 'చౌడమ్మా' అంటూ బిగ్గరగా అరుస్తూ చేతులెత్తి మ్రొక్కుతారు. ఇలా నృత్యం చేసే గ్రామాలు............ ధర్మవస్రం, రేగాటి పల్లె, పిద్దకోట్ల,

మూలాలు

[మార్చు]