Jump to content

టి.జీవన్ రెడ్డి

వికీపీడియా నుండి
తాటిపర్తి జీవన్ రెడ్డి
టి.జీవన్ రెడ్డి


తెలంగాణ శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
30 మార్చి 2019 నుండి 29 మార్చి 2025
నియోజకవర్గం కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి
పదవీ కాలం
14 మే 2004 – 2 మార్చి 2009

పదవీ కాలం
1983–1985
1989–1994
1996–2009
2014–2018
నియోజకవర్గం జగిత్యాల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-01) 1952 మే 1 (వయసు: 74)
బతికపల్లి .
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
సంతానం
  • రామచంద్రా రెడ్డి
  • బాలకృష్ణా రెడ్డి
  • చంద్రకృష్ణా రెడ్డి
నివాసం బతికపల్లి: గ్రామం, పెగడపల్లి: మండలం, కరీంనగర్ : జిల్లా.

తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం బత్కేపల్లిలో 1952 మే 1న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు.

కుటుంబం

[మార్చు]

జీవన్ రెడ్డి అహల్య దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్ర కృష్ణారెడ్డి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

జీవన్ రెడ్డి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఎన్‌టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గొడిశెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయాడు.

జీవన్ రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికలో గెలిచి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఆయన 2004 మే 14 నుండి 2009 మార్చి 2 వరకు వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1] ఆయన 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు.[2][3] ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. టీ జీవన్‌రెడ్డికి 56,698 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ బలపరిచిన మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌కు 17,268 ఓట్లు , సుగుణాకర్ రావుకు 15,077 ఓట్లు రాగా, నవ తెలంగాణ పార్టీకి చెందిన రాణి రుద్రమకు 5,192 ఓట్లు వచ్చాయి.[4][5]

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్. సంజయ్ కుమార్ పై 61,185 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

జీవన్ రెడ్డి 2023లో శాసనసభ, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి 2026 మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[6] ఆయనను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన తన నిర్ణయంలో మార్పు చేయలేదు.

బీఆర్ఎస్​లో చేరిక

[మార్చు]

జీవన్ రెడ్డి 2026 ఏప్రిల్ 20న జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్‌ పార్టీ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[7] జీవన్ రెడ్డికి కేసీఆర్ స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, అదే వేదికపై నుండి బీఆర్ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాడు.[8]

జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  2. Sakshi (19 May 2014). "సీఎల్పీ లీడర్.. టీపీసీసీ చీఫ్!". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  3. Sakshi (30 November 2018). "జగిత్యాల జీవన జ్యోతి". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  4. HMTV (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  5. Sakshi (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి జీవన్ రెడ్డి విజయం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  6. "కాంగ్రెస్‌కు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా". Eenadu. 26 March 2026. Archived from the original on 26 March 2026. Retrieved 26 March 2026.
  7. "జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్". NT News. 20 April 2026. Archived from the original on 20 April 2026. Retrieved 20 April 2026.
  8. "జీవన్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా: కేసీఆర్‌". Eenadu. 20 April 2026. Archived from the original on 20 April 2026. Retrieved 20 April 2026.

వెలుపలి లంకెలు

[మార్చు]