Jump to content

టర్కీ జలసంధులు

వికీపీడియా నుండి
(డార్డనెల్లెస్ నుండి దారిమార్పు చెందింది)
టర్కీ జలసంధులు is located in Europe
బాస్పోరస్
డార్డనెల్లెస్
జలసంధులను చూపించే మ్యాపు. బాస్పోరస్ ఎరుపు రంగు లోను, డార్డనెల్లెస్ పసుపు రంగు లోనూ ఉన్నాయి. టర్కీ సార్వభౌమిక ప్రాంతం ఆకుపచ్చ రంగులో ఉంది.
బోస్ఫరస్ (ఎరుపు), డార్డనెల్లెస్ (పసుపు), మధ్యలో ఉన్న మర్మారా సముద్రం, వీటిని సమష్టిగా టర్కిష్ జలసంధులు అని పిలుస్తారు.

టర్కిష్ జలసంధులు అనేవి, వాయవ్య టర్కీలో ఉన్న, అంతర్జాతీయంగా ముఖ్యమైన రెండు జలమార్గాలు. ఈ జలసంధులు ఏజియన్ సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్నీ నల్ల సముద్రానికి కలిపే అంతర్జాతీయ జల మార్గాలను కలిగిస్తున్నాయి. ఈ జలసంధుల్లో అవి డార్డనెల్లెస్, బోస్ఫరస్ అనే రెండూ జలసంధులున్నాయి. ఈ జలసంధులు మర్మారా సముద్రానికి రెండు చివరల్లో ఉన్నాయి. ఈ జలసంధులు, మర్మారా సముద్రం టర్కీ సార్వభౌమిక సముద్ర జలాల్లో భాగం. ఇవి అంతర్గత జలాల నియమాలకు లోబడి ఉంటాయి.

యురేషియా భూభాగపు పశ్చిమ భాగంలో ఉన్న ఈ జలసంధులను సాంప్రదాయికంగా ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సరిహద్దుగా పరిగణిస్తారు. అలాగే యూరోపియన్ టర్కీ, ఆసియా టర్కీల మధ్య విభజన రేఖగా కూడా పరిగణిస్తారు. అంతర్జాతీయ వాణిజ్యంలో, రాజకీయాల్లో, యుద్ధాల్లో వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా, ఈ జలసంధులు ఐరోపా చరిత్ర లోను, ప్రపంచ చరిత్ర లోనూ ముఖ్యమైన పాత్ర పోషించాయి. 1936 నుండి, అవి మాంట్రీక్స్ కన్వెన్షన్‌కు అనుగుణంగా ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

టర్కిష్ జలసంధులు తూర్పు మధ్యధరా, బాల్కన్, నియర్ ఈస్ట్ పశ్చిమ యురేషియాల వెంబడి వివిధ సముద్రాలను కలుపుతుంది. ప్రత్యేకించి, ఇవి నల్ల సముద్రం నుండి ఏజియన్, మధ్యధరా సముద్రాలు, జిబ్రాల్టర్ ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం, సూయజ్ కెనాల్ ద్వారా హిందూ మహాసముద్రం వరకు సముద్రాల అనుసంధానాలకు వీలు కలిగిస్తుంది. తద్వారా అంతర్జాతీయ జలమార్గాలకు ముఖ్యంగా రష్యా నుండి వచ్చే సరుకు రవాణాకు వీలు కల్పిస్తాయి.

బోస్ఫరస్ - 2004 ఏప్రిల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తీసిన చిత్రం. ఎగువన ఉన్నది నల్ల సముద్రం, దిగువన ఉన్నది మర్మారా సముద్రం. బోస్ఫరస్ ఈ రెండింటినీ కలిపే జలమార్గం. బోస్ఫరస్‌ పశ్చిమ తీరం ఐరోపా ఖండపు ప్రారంభ బిందువు కాగా, తూర్పు ఒడ్డుతో ఆసియా ఖండం మొదలవుతుంది. ఇస్తాంబుల్ నగరం రెండు వైపులా ఉంటుంది.

టర్కిష్ జలసంధుల్లో కింది జలమార్గాలున్నాయి:

  • ది బాస్ఫోరస్ (బాస్పోరస్ అని కూడా పిలుస్తారు. ఇస్తాంబుల్ జలసంధి అని కూడా అంటారు), సుమారు 30 కిలోమీటర్లు (19 మై.) పొడవు, కేవలం 700 మీటర్లు (2,300 అ.) వెడల్పుతో మర్మారా సముద్రాన్ని ఉత్తరాన ఉన్న నల్ల సముద్రంతో కలుపుతుంది. ఇది ఇస్తాంబుల్ నగరం మధ్య గుండా వెళుతుంది. దాంతో ఇది రెండు ఖండాలలో ఉన్న నగరం అయింది. దీనిపై మూడు సస్పెన్షన్ వంతెనలు (బాస్పోరస్ వంతెన, ఫాతిహ్ సుల్తాన్ మెహ్మెట్ వంతెన, యవుజ్ సుల్తాన్ సెలిమ్ వంతెన), రెండు నీటి అడుగున సొరంగాలు (మర్మారే రైలు సొరంగం, యురేషియా రహదారి సొరంగం) ఉన్నాయి. మరిన్ని మార్గాల నిర్మాణం కోసం ప్రణాళికలున్నాయి.
  • డార్డనెల్లెస్, 68 కి.మీ. (42 మై.) పొడవు, 1.2 కి.మీ. (0.75 మై.) వెడల్పుతో మర్మారా సముద్రాన్ని నైరుతిలో చానక్కేల్ నగరం సమీపంలో మధ్యధరా సముద్రంతో కలుపుతుంది. దీన్ని చానక్కేల్ జలసంధి అని కూడా అంటారు. ప్రాచీన కాలంలో దీన్ని హెల్లెస్‌పాంట్ అని పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగిన గల్లిపోలి యుద్ధం ఈ జలసంధి లోనూ దాని పశ్చిమ గట్టున ఉన్న గల్లిపోలి లోనూ జరిగింది. 2022 మార్చి 18 న ట్రాఫిక్‌కు తెరవబడిన చానక్కేల్ 1915 వంతెన, ఈ జలసంధిపై కట్టిన మొదటి వంతెన.[1]

ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి వలన స్థానిక డాల్ఫిన్లు, హార్బర్ పోర్పోయిస్‌లతో సహా మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. [2]

జలసంధుల సమస్య

[మార్చు]
ఐరోపా, ఆసియాలను కలుపుతూ డార్డనెల్లెస్ జలసంధిపై ఉన్న 1915 చానక్కేల్ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్ వంతెన . [3]

ఏజియన్ సముద్ర ప్రవేశ ద్వారం దగ్గర కాంస్య యుగం నాటి సైన్యాలు ట్రోజన్ యుద్ధంలో పోరాడినప్పటి నుండి ఈ జలసంధులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఆసియా, ఐరోపాల మధ్య ఉన్న ఈ సన్నటి జల మార్గాలు, ఇంకా ముందునుండే వలసలకు, దండయాత్రలకూ (ఉదాహరణకు పర్షియన్లు, గలతీయులు, టర్కులు) చక్కటి మార్గాలుగా నిలిచాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం క్షీణిస్తున్న రోజుల్లో, "జలసంధుల సమస్య" ఐరోపా, ఒట్టోమన్ల దౌత్యవేత్తల మధ్య నలుగుతూ ఉండేది.

ఐరోపాలో ఒకనాటి గొప్ప శక్తులైన రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ప్రష్యాల మధ్య 1841 జూలై 13 న లండన్ స్ట్రెయిట్స్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం, యుద్ధ సమయంలో ఒట్టోమన్ సుల్తాన్ మిత్రదేశాలవి తప్ప, మిగతా అన్ని యుద్ధనౌకలకూ జలసంధిని మూసివేస్తారు. తద్వారా, ఒట్టోమన్ సామ్రాజ్యపు "పురాతన పాలన"ను తిరిగి స్థాపించారు.[4] బాస్పోరస్, మర్మారా సముద్రం, డార్డనెల్లెస్‌ల గుండా ప్రయాణాలను నియంత్రించే అనేక చర్యలలో ఈ ఒప్పందం ఒక భాగం. ఇది 1833 నాటి రహస్య హంకర్ ఇస్కెలేసి (అన్‌కియార్ స్కెలెసి) ఒప్పందం నుండి ఉద్భవించింది. ఈ ఒప్పందం ద్వారా ఒట్టోమన్ సామ్రాజ్యం, యుద్ధ సమయంలో "నల్ల సముద్ర శక్తుల" (అంటే, ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం) యుద్ధనౌకలు మాత్రమే ఈ జలసంధులను వాడుకునేలా హామీ ఇచ్చింది.

2006 సెప్టెంబరులో ల్యాండ్‌శాట్ 7 ఉపగ్రహం నుండి తీసిన డార్డనెల్లెస్ జలసంధి చిత్రం. ఎగువ ఎడమ వైపున ఉన్న నీటి భాగం ఏజియన్ సముద్రం కాగా, ఎగువ కుడి వైపున ఉన్నది మర్మారా సముద్రం . పొడవుగా, సన్నగా ఉన్న ఎగువ ద్వీపకల్పం గల్లిపోలి. దిగువ ద్వీపకల్పం ట్రోడ్. డార్డనెల్లెస్ అనేది ఈశాన్యం నుండి నైరుతి వరకు రెండు ద్వీపకల్పాల మధ్య ఐమూలగా నడుస్తున్న నీటి మార్గం. దిగువ ద్వీపకల్పం ఒడ్డున చానక్కేల్ నగరం కనిపిస్తుంది,

మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) సమయంలో మిత్ర రాజ్యాల (ట్రిపుల్ ఎంటెంటె) తూర్పు, పశ్చిమ సరిహద్దుల మధ్య లింకుగా ఈ జలసంధులు చాలా ముఖ్యమైనవిగా నిలిచాయి. ఆంగ్లో-ఫ్రెంచ్ నావికా దళాలు డార్డనెల్లెస్ (1915 ఫిబ్రవరి - మార్చి) ను నియంత్రణలో ఉంచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే 1915 మార్చి - ఏప్రిల్ నాటి రహస్య జలసంధుల ఒప్పందం దౌత్యంలో, ట్రిపుల్ ఎంటెంటె సభ్యులు - మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినట్లైతే ఒట్టోమన్ భూభాగాన్ని జలసంధిపై నియంత్రణతో సహా రష్యా సామ్రాజ్యానికి అప్పగించేందుకు అంగీకరించాయి. ఆంగ్లో-ఫ్రెంచ్ దళాలు గల్లిపోలి ద్వీపకల్పంలో (1915 ఏప్రిల్ నుండి 1916 జనవరి వరకు) ఉభయచర ల్యాండింగ్‌ల తరువాత జలసంధులను నియంత్రించడానికి ఆపరేషన్ గల్లిపోలి ప్రారంభించాయి. 1917లో పెట్రోగ్రాడ్‌లో జరిగిన విప్లవాల వలన చివరికి జలసంధులను స్వాధీనం చేసుకోడానికి రష్యా వేసిన ప్రణాళికలు నిలిచిపోయాయి.[5][6]

ఈ జలసంధి లోకి ప్రవేశాన్ని నియంత్రించే ఆధునిక ఒడంబడిక, 1936 నాటి మాంట్రీక్స్ కన్వెన్షన్‌. ఇది 2024 నాటికి ఇది అమలు లోనే ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, జలసంధిలోకి యుద్ధనౌకల ప్రవేశంపై రిపబ్లిక్ ఆఫ్ టర్కీకి నియంత్రణ ఉంటుంది. అయితే శాంతి సమయంలో పౌర రవాణా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించడానికి హామీ ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Butler, Daren (18 March 2022). "Erdogan opens huge suspension bridge linking Europe and Asia". Reuters. Retrieved 18 March 2022.
  2. Khan, S. (17 June 2013). "An Economic Boom in Turkey Takes a Toll on Marine Life". Yale Environment 360. Retrieved 6 September 2017.
  3. "Groundbreaking ceremony for bridge over Dardanelles to take place on March 18". Hürriyet Daily News. 2017-03-17. Retrieved 2017-03-19.
  4. Rozakis, Christos L.; Stagos, Petros N. (1987). The Turkish Straits. Martinus Nijhoff Publishers. pp. 24–25. ISBN 90-247-3464-9.
  5. Windchy, Eugene G. (2014). "World War I (1917 to 1918)". Twelve American Wars: Nine of Them Avoidable (2nd ed.) (published 2015). p. 283. ISBN 9781491730546. Retrieved 14 August 2020. Saz[o]nov made plans for a seizure of the Turkish straits.
  6. McMeekin, Sean. July 1914: Countdown to War. ISBN 9781848316096. Retrieved 14 August 2020. Sazonov, Sukhomlinov, and Grigorevich had drawn up a detailed plan for readying Russia to seize Constantinople and the Ottoman Straits in case of war. The plan covered [...] the acceleration of the mobilisation timetable, which would see the first day troops could be put ashore at the Bosporus speeded up from Mobilisation Day (M) + 10 to M + 5 [...]. [...] After learning the news from Sarajevo, Sazonov [...] wanted to know whether, in accordance with measures ordered in February [1914], the first Russian troops would now be able to land in the Bosphorus within 'four or five days' of mobilisation. [...] Sazonov was preparing for a European war, in which Russia's key strategic objective was to seize Constantinople and the Straits.