డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)
Acronym | DOST (Degree Online Services Telangana) |
---|---|
Type | ప్రవేశ ప్రక్రియ |
Year started | 2015 |
Duration | 3 గంటలు |
Offered | సంవత్సరానికి ఒకసారి |
Countries / regions | భారతదేశం |
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ వ్యవస్థ.[1] రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, స్వయంప్రతిపత్త కళాశాలలు, ప్రైవేట్, ఇతర కళాశాలలను ఒకే వ్యవస్థ క్రిందకు ఈ దోస్త్ ఆన్‌లైన్ సేవ తీసుకొస్తుంది.[2][3] ప్రతి సంవత్సరం మే, జూలై నెలల్లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో 1.84 లక్షల మంది విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికేడాది భారీగా అడ్మిషన్లు నమోదవుతున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య దొరుకుతుండటం, క్వాలిఫైడ్ అధ్యాపకులుండటం, డిగ్రీలో ఎప్పకటిప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండటం, కెరీర్‌గైడెన్స్, క్లస్టర్ కాలేజీలు వంటి సంస్కరణల బాటపడుతుండటంతో విద్యార్థులు భారీగా చేరుతున్నారు.
చరిత్ర
[మార్చు]రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అన్ని డిగ్రీ కళాశాలలోని ప్రవేశాలను అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2016లో ఈ దోస్త్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో బ్యాచిలర్ డిగ్రీకి ప్రవేశం పొందడానికి, విద్యార్థులు దోస్త్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయంల డిగ్రీ కళాశాలల ప్రవేశాలు ఈ దోస్త్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.[4][5][6]
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
[మార్చు]బయోమెట్రిక్‌కు బదులుగా రియల్‌టైమ్ డిజిటల్ ఫేస్ రికగ్నైజేషన్ టీ–యాప్ ఫోలియోను ప్రవేశపెట్టింది. విద్యార్థులు ఇంటర్ హాల్‌టికెట్ నెంబర్‌తో లాగిన్ అయ్యి, సెల్ఫీ ఫొటో ద్వారా దోస్త్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. ఇదివరకే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్నవాళ్ళు నేరుగా దోస్త్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ కాకపోతే తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ప్రవేశ ప్రక్రియ
[మార్చు]ఔత్సాహిక విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని వెబ్ ఎంపికల ద్వారా కళాశాలలను ఎంచుకుంటారు. ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన తరువాత, డిగ్రీ కళాశాలలో సీటు కేటాయించినప్పుడు విద్యార్థులకు మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేయబడుతుంది. 2017-18లో విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను బయోమెట్రిక్ విధానంతో, 2018-19 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఆధార్ కార్డుతో అనుసంధానించారు. విద్యార్థుల ప్రవేశ ప్రక్రియలో 3 దశలు ఉన్నాయి. రాష్ట్రంలోని సుమారు వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీల్లో బిఏ, బికామ్, బిఎస్సీ, బికామ్ ఒకేషనల్, బికామ్ హానర్స్, బిఎస్‌డబ్ల్యూ, బిబిఎం, బిసీఏ వంటి 200 కోర్సుల్లో సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
మొదటిసారి రిజిస్ట్రేషన్‌కు రూ. 200 చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థికి దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వస్తుంది. వాటిని ఉపయోగించి దరఖాస్తు ఫారం ఓపెన్ చేసి వివరాలు నింపాలి. ఆ తరువాత విద్యార్థులు కోర్సులవారీగా, కాలేజీలవారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా విద్యార్థి కన్‌ఫర్మ్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను కన్‌ఫర్మ్ చేసుకున్న విద్యార్థి నిర్ణీత గడువులోగా కళాశాలకి వెళ్ళి సర్టిఫికెట్లను సమర్పించి ఫీజు చెల్లించాలి. అప్పుడే ఆ విద్యార్థికి ఆ సీటు ఉంటుంది. మొదటి కౌన్సెలింగ్‌లో విద్యార్థికి వచ్చిన సీటు, కళాశాల నచ్చకపోయినా సీటు రిజర్వేషన్ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే ఫీజు చెల్లించాలి. ఆ తరువాత తదుపరి దశల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత గలవారు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. ఈ–సేవా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. విశ్వవిద్యాలయం/ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు లభించిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కు డబ్బలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందినవారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు రూ. 500 చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో రూ. 1,000 చెల్లించాలి.[7]
2021
[మార్చు]2021లో రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో రెండున్నర లక్షల మంది స్టూడెంట్లు వివిధ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలో 1,040 డిగ్రీ కాలేజీల్లో 4,24,703 సీట్లుండగా, 2021–22 విద్యాసంవత్సరంలో 2,49,899 (962 కళాశాలల్లో 2,26,403 మంది ప్రవేశం పొందారు. 53 రెసిడెన్షియల్ కళాశాలల్లో 10,064 మంది నాన్ దోస్త్‌తో పాటు ఇతర మైనారిటీ కళాశాలల్లో 13,614) అడ్మిషన్లు నిండాయి. కరోనా వల్ల ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులో ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. దాంతో ఇటు ఇంజినీరింగ్ తోపాటు డిగ్రీలోనూ భారీగా అడ్మిషన్లు రాగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు అన్నీ సీట్లు భర్తీ అయ్యాయి.[8][9]
2022
[మార్చు]2022లో రాష్ట్రంలో మొత్తం 1,080 డిగ్రీ కాలేజీల్లో 4,68,880 సీట్లు అందుబాటులో ఉండగా, ఇంటర్‌బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటినుండే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. సెల్ఫీ తీసి, ఫొటోను అప్‌లోడ్‌చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లుచేశారు. టీ యాప్ ఫొలియో రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ ద్వారాగానీ, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, తల్లిదండ్రుల మొబైల్ నంబర్, మీసేవా కేంద్రాల ద్వారాగానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలిపించారు.[10]
2022లో రాష్ట్రంలోని 14 కళాశాలల్లో వెయ్యికిపైగా చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందగా, వీటిలోని రెండు కళాశాలల్లో 1500కుపైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. హైదరాబాదులోని సిటీ కళాశాలలో అత్యధికంగా 1,610 మంది విద్యార్థులు, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1,548 మంది విద్యార్థులు చేరారు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "TS DOST admission 2018 to begin at dost.cgg.gov.in". The Indian Express. 10 May 2018. Retrieved 25 August 2020.
- ↑ Telangana (DOST) degree admissions 2018: Important dates, seat allotment and other details | The Indian Express
- ↑ DOST: Colleges step up demand for spot admissions- The New Indian Express
- ↑ Telangana DOST 3rd allotment list on 30 June, check at dost.cgg.gov.in | The Indian Express
- ↑ "Hyderabad: UG colleges want extension in degree admissions". Archived from the original on 2021-10-14. Retrieved 2020-08-25.
- ↑ https://timesofindia.indiatimes.com/city/hyderabad/private-colleges-demand-postponing-third-phase-of-dost-counselling/articleshow/64730276.cms
- ↑ ఈనాడు, ప్రతిభ. "డిగ్రీ .. సరికొత్తగా!". www.eenadupratibha.net. పెమ్మసాని బాపనయ్య. Archived from the original on 25 August 2020. Retrieved 25 August 2020.
- ↑ Velugu, V6 (2021-12-02). "డిగ్రీలో రికార్డు స్థాయి అడ్మిషన్లు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-02. Retrieved 2021-12-04.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఈ ఏడాది డిగ్రీలో చేరింది 2.49 లక్షల మంది". EENADU. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-04.
- ↑ telugu, NT News (2022-06-30). "సెల్ఫీతో 'దోస్త్' దరఖాస్తు". Namasthe Telangana. Archived from the original on 2022-06-30. Retrieved 2022-06-30.
- ↑ telugu, NT News (2022-11-03). "ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ ఫుల్". www.ntnews.com. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-04.