Jump to content

తమిళ గంట

వికీపీడియా నుండి
గంటపై శాసనం, దాని అనువాదం

తమిళ గంట అనేది ఓ విరిగిన కంచు గంట. దీన్ని సుమారు 1836 లో విలియం కొలెన్సో అనే మిషనరీ కనుగొన్నాడు. న్యూజీల్యాండ్ ఉత్తర ప్రాంతం లోని వ్హాంగరెల్ సమీఫంలో అతను దాన్ని చూసినపుడు అక్కడి మావోరీ స్త్రీలు దాన్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకునే కుండ లాగా వాడుతున్నారు.

ఈ గంట 13 సెం.మీ పొడవు, 9 సెం.మీ లోతుతో ఉంది. దానిపై ఒక శాసనం లిఖించి ఉంది. గంట అంచు చుట్టూ ఉన్న శాసనం పాత తమిళ భాషలో ఉందని గుర్తించబడింది. శాసనంలో "ముకయ్యతిన్ వక్కుచు. ఉతయ . . కప్పల్ ఉతయ మణి" అని తమిళంలో రాసి ఉంది. దాని అర్థం "మొహోయిడెన్ బక్స్ నావకు చెందిన గంట" అని. [1] ఈ శాసనంలోని కొన్ని అక్షరాలు ఆధునిక తమిళ లిపిలో లేవు. అవి ప్రాచీన లిపిలో ఉండేవి. అందువల్ల ఈ గంట దాదాపు 500 సంవత్సరాల నాటిదని, బహుశా మలి పాండ్య కాలం నాటిది కావచ్చునని అంచనా వేసారు. [1] దీన్ని కొన్నిసార్లు బయటి నుండి వచ్చిన కళాఖండం అని పిలుస్తారు.

మరో చిత్రంలో బెల్

ఇండాలజిస్ట్ VR రామచంద్ర దీక్షితార్ తన ది ఆరిజిన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ తమిళ్‌లో ప్రాచీన తమిళ సముద్ర యాత్రికులకు ఆస్ట్రేలియా, పాలినేషియాల గురించి తెలిసి ఉండవచ్చని పేర్కొన్నాడు. [2] గంట ఆవిష్కరణతో న్యూజిలాండ్‌లో తమిళ ఉనికి గురించిన ఊహాగానాలు వచ్చాయి. అయితే న్యూజిలాండ్‌తో తమిళులకు ఉన్న పరిచయానికి ఈ గంట మాత్రమే రుజువు కాదు. [3] వన్నీ దేశం, ఆగ్నేయాసియాల మధ్య వాణిజ్యం పెరిగిన కాలంలో ట్రింకోమలీ నుండి నావికులు న్యూజిలాండ్ చేరుకున్నారు. భారతీయులకు సన్నిహితులైన నావికులున్న పోర్చుగీసు ఓడ ఆ గంటను ఒడ్డు వద్ద పడవేసి ఉండవచ్చు. [4] అలాగే, ఈ కాలంలో అనేక భారతీయ నౌకలను యూరోపియన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంట, అలాంటి ఓడల్లో న్యూజిలాండ్ తీరంలో వదిలేసిన ఏదైనా ఓడకు చెందినదైనా కావచ్చు కూడా. [5]

విలియం కొలెన్సో ఈ గంటను డొమినియన్ మ్యూజియమ్‌కు అందజేసాడు. ఇప్పుడు ఆ మ్యూజియంను మ్యూజియం ఆఫ్ న్యూజిలాండ్ టె పాపా టోంగరేవా అని అంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Sridharan, K. (1982). A maritime history of India. Government of India. pp. 45–46, 405. Retrieved 4 September 2021.
  2. Dikshitar, V. R. Ramachandra (1947). Origin and Spread of the Tamils. Adyar Library. p. 30.
  3. Kerry R. Howe (2003). The Quest for Origins: Who First Discovered and Settled New Zealand and the Pacific Islands? pp 144–5 Auckland:Penguin.
  4. New Zealand Journal of Science. Wise, Caffin & Company. 1883. p. 58. Retrieved 3 June 2013.
  5. New Zealand Institute (1872). Transactions and Proceedings of the New Zealand Institute. New Zealand Institute. pp. 43–. Retrieved 3 June 2013.

 

[[వర్గం:తమిళ సంస్కృతి]]

"https://te.wikipedia.org/w/index.php?title=తమిళ_గంట&oldid=4339803" నుండి వెలికితీశారు