తిరుమలనాథ స్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీదేవి సమేత తిరుమలనాథుడు

తిరుమలనాథ స్వామి దేవాలయం వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడి అడవుల్లో ఎత్తైన గుట్టలపై స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడి స్వామిని తిరుమలనాథ స్వామిగా, తిరుమలయ్యగా పిలుచుకుంటారు. స్వామి వెలసిన గుట్టను తిరుమలయ్య గుట్టగా వ్యవహరిస్తారు. మొదట్లో ఇక్కడ పెద్ద గుట్ట మీద స్వామి వారి విగ్రహం మాత్రమే ఉండేది. ఈ స్వామి ఇక్కడ సుమారు రెండున్నర శతాబ్ధాల కిందట వెలిసినట్లు చెప్తారు[1]. మ వనపర్తి సంస్థానాధీశులచే ఇక్కడి స్వామికి పూజలు జరిగినట్లు తెలుస్తుంది. మొదట్లో ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా కష్టపడేవారు. అడవిని దాటుకుంటూ, కొండలపైకి రెండు మూడు కిలోమీటర్ల ఎక్కి, అపై పెద్ద బండల నడుమ ఉన్న స్వామిని దర్శించుకోవడానికి ఇనుప నిచ్చెన మీదగా పైకి ఎక్కి దర్శించుకొనేవారు. కానీ కాల క్రమంలో గుడిని నిర్మించారు. రహదారిని ఏర్పాటు చేశారు. గుడి సమీపం వరకు వాహనాలు వెళ్ళెందుకు వీలుగా దారిని ఏర్పాటు చేశారు. గుట్టపైకి సులభంగా చేరుకోవడానికి మెట్లను నిర్మించారు.

ఆలయ అభివృద్ధి కారకులు[మార్చు]

వనపర్తి మండలంలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు డాక్టర్ సూర్యారెడ్డి, అరుణా శ్రీరెడ్డిలు ఆలయ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, అభివృద్ధికి విశేష కృషిచేశారు[2]. ఎం.ఎస్. చంద్రయ్య వనపర్తి, కర్నూలు రహదారి మార్గంలో ఆలయ ముఖద్వారాన్ని నిర్మించారు. వనపర్తి శాసనసభ్యులు చిన్నారెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో 30 లక్షల రూపాయలతో బి.టి.రోడ్డు వేయించారు.

గుడికి మెట్లదారి

ప్రముఖుల సందర్శన[మార్చు]

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మార్గం[మార్చు]

వనపర్తి నుండి కర్నూలుకు వెళ్ళుదారిలో, వనపర్తికి ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దగూడెం స్టేజి దగ్గర అటవీ ప్రాంతంలో ఉంటుంది. పెబ్బేరు నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

ఉత్సవాలు[మార్చు]

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ప్రతి శ్రావణ శనివారం ఇక్కడ జాతరలాగే ఉంటుంది[3].

నిత్య పూజలు[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పూజలు జరుగుతాయి.

ప్రకృతి ప్రేమికుల స్థలం[మార్చు]

ఇక్కడి కొండల మీద నుండి చూస్తే, చుట్టూ కొండలు, అడవులు, చుట్టు ప్రక్కల గ్రామాలు అన్నీ కనువిందు చేస్తాయి. కొండపై నీటి గుండాలు కూడా ఉన్నాయి.

సందర్శకులకు సూచనలు[మార్చు]

  1. సందర్శకులు ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్ళడం మంచిది.
  2. తగినన్ని నీళ్ళు, ఆహారం తీసుకపోవడం ఉత్తమం.

చిత్రమాల[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వనపర్తిలో వెలిసిన తిరుమలనాథుడు,సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 36
  2. 1వ ఆధారమైన పై సంచికలోనే...
  3. తిరుపతిని తలపించే తిరుమలయ్య గుట్ట,ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 58