తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై
తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | టి.ఎన్.ఆర్. |
జననం | తిరునగర్ | 1906 ఏప్రిల్ 26
మరణం | 1986 ఫిబ్రవరి 18 | (వయసు 79)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | నాదస్వర విద్వాంసుడు |
వాయిద్యాలు | నాదస్వరం |
తిరువేంగడు సుబ్రహ్మణ్య పిళ్ళై ఒక కర్ణాటక నాదస్వర విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1906, ఏప్రిల్ 26వ తేదీన శీర్కాళి సమీపంలోని తిరునగర్‌లో పరమనాథ పిళ్ళై, సుందరాంబాళ్ దంపతులకు ఏకైక కుమారునిగా జన్మించాడు.[1] ఇతని తల్లిదండ్రులు సంగీత వారసత్వాన్ని కలిగినవారు. ఇతని తండ్రి పరమనాథ పిళ్ళై నాదస్వర విద్వాంసుడు. ఇతని తాత తిరువేంగడు ముత్తువీరు పిళ్ళై కూడా నాదస్వర విద్వాంసుడే. ఇతని బాల్యంలోనే ఇతని తల్లిదండ్రులు మరణించడంతో ఇతని చిన్నాన్న స్వామిదురై పిళ్ళై ఇతనిని పెంచి పెద్దచేశాడు. ఇతడు ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తెలుగు సంస్కృత భాషలను అభ్యసించాడు. ఇతడు తన చిన్నాన్న స్వామిదురై పిళ్ళై వద్ద 12వ యేటి నుండి నాదస్వరం అభ్యసించాడు. ఇతనికి 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇతడు ఆ ప్రాంతంలో మంచి నాదస్వర విద్వాంసునిగా పేరు పొందాడు. ఇతని నాదస్వరంపై మన్పూందియ పిళ్ళై, ఉమయల్పురం సుందరం అయ్యర్, కాంచీపురం నయన పిళ్ళై, కుంభకోణం అళగియనంబి పిళ్ళై, పళని ముత్తయ్య పిళ్ళై, పందనైనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై, కూరైనాడు నటేశ పిళ్ళై,సెంబర్‌కోయిల్ రామస్వామి పిళ్ళై, చిదంబరం వైద్యనాథ పిళ్ళై, నాగోర్ సుబ్బయ్య పిళ్ళై వంటి సంగీత విద్వాంసుల ప్రభావం ఉంది.
ఇతడు 1923లో రాజంబాళ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సెల్వరత్నం, సుందరనాథన్ అనే ఇద్దరు కుమారులు కలిగారు. 1955లో ఇతడు లక్ష్మీకాంతంను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీకాంతంతో ఇతనికి శివకుమార్ అనే కుమారుడు కలిగాడు.
ఇతడు శ్రీలంక, సింగపూర్, కౌలాలంపూర్, పెనాంగ్, మలక్కా మొదలైన ప్రదేశాలలో తన నాదస్వర కచేరీలు నిర్వహించాడు.
గౌరవాలు, పురస్కారాలు
[మార్చు]ఇతడు ధర్మపురం ఆధీనం (శైవమఠం)కు 12 సంవత్సరాలు ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇతనికి "శ్వేతారణ్య పున్నాగ నాదమణి" అనే బిరుదును ఇచ్చాడు. 1956లో కౌలాలంపూర్‌లో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ఇతనికి "ఇసై నాదజ్యోతి" బిరుదును ప్రదానం చేశారు. శ్రీలంక పౌరులు ఇతనికి "సంగీత భూషణ రత్నాకర నాదస్వర రాజ" బిరుదుతో సత్కరించారు. ఇంకా ఇతనికి "నాదస్వర కేసరి", "మహామహో ఇసై నాద సారసర మన్నార్" మొదలైన బిరుదులున్నాయి. 1965లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడికి నాదస్వరంలో మొట్టమొదటి అవార్డును ఇచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 1978లో ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ నాదస్వరంలో మొట్టమొదటి ఫెలోషిప్ ఇతనికే లభించింది. తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం నాదస్వరంలో మొట్టమొదటి డాక్టరేట్‌ను ఇతనికి ప్రదానం చేసింది.
మరణం
[మార్చు]ఇతడు 1986, ఫిబ్రవరి 18 వ తేదీన తిరువేంగడులో మరణించాడు.