థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్ మీనా నాటక ప్రదర్శన
అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి

రంగస్థల కళల శాఖ - హైదరాబాదు విశ్వవిద్యాలయము, సర్ రతన్ టాటా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు.) ఏర్పాటు చేయడం జరిగింది.[1]

ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది. అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలు అన్వేషించి, తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేస్తున్న డా. పెద్ది రామారావు ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరించారు.

తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం ఈ సంస్థ కృషిచేస్తుంది. విద్యార్థులకు చిన్న వయస్సులోనే నాటకకళ పట్ల అసక్తిని కలిగించగలిగితే వారిలోని సృజనాత్మకత మరింతగా రాణించి మంచి పౌరులుగా తయారుకాగలరు. నాటకకళలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిషత్తు నాటక సమాజాల సహకారంతో విద్యార్థులకోసం రకరకాల శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడం థియేటర్ ఔట్రీచ్ యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం.

థియేటర్ లక్ష్యాలు[మార్చు]

 1. థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది
 2. భారతదేశంలో ప్రధాన నగరాలాలో కేవలం నాటకరంగం కోసం అంకితమై పనిచేస్తున్న ప్రదర్శన శాలలు అనేకం ఉన్నాయి. పృథ్వి థియేటర్ (ముంబాయి), రంగశంకర (బెంగళూరు), శ్రీరామ్ సెంటర్ (న్యూ ఢిల్లీ) ఇందుకు ఉదాహరణలు. ఆంధ్ర ప్రదేశ్ లో అలాంటి సౌకర్యం లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ లోటును భర్తీచేయడానికి హైదరాబాద్ అబిడ్స్ లోని "గోల్డెన్ త్రెషోల్డ్"ని ఒక సాంస్క్రతిక కేంద్రంగ అభివృద్ధి చేయాలి. అనునిత్యం నాటక ప్రదర్శనలు, సదస్సులు, శిక్షణ శిబిరాలతో ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ సాంస్క్రతిక రంగంలో ముఖ్యపాత్ర పోషించేలా కృషి చేయాలి.
 3. తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేయాలి. వారు చేస్తున్న కృషిని రంగస్థల విద్యార్థులు తెలుసుకోవాలి. శాఖకున్న అన్ని రకాల వనరులను వారికి అందించాలి. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పరచాలి. శాఖతో కలిసి పనిచేసే పరిషత్తులకు సాంకేతిక పరిపుష్టిని అందించాలి.
 4. పరిషత్తు ప్రేక్షకుల సంఖ్యను వివిధ పద్ధతుల ద్వారా గణనీయంగా పెంచగలగాలి. వాటిని "మోడల్ పరిషత్తు"లుగా రూపొందించాలి.
 5. రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేయాలి. వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పించాలి.
 6. నాటక కళ పట్ల ఆసక్తిని చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో శిక్షణ శిబిరాలను ఏర్పరచి, విద్యార్థుల ప్రదర్శనలతో నాటకోత్సవాలు నిర్వహించాలి. శిక్షణ శిబిరాలకు అధాపకులుగా పనిచేయడానికి ఆయా ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక నాటక బృంధాలచే తర్ఫీదు ఇవ్వాలి.
 7. నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి.
 8. తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్ లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
 9. ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా మిస్ మీనా[2],[3] అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది.

నిర్వహించిన కార్యక్రమాలు[మార్చు]

ఆంధ్ర ప్రాంత నాటక మిత్రుల సమావేశం, విజయవాడ[మార్చు]

జులై 28, 2012 లో ' సుమధుర కళానికేతన్ ', విజయవాడ వారి ఆధ్వర్యంలో స్థానిక 'తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం'లో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ మొదటి ' నాటక మిత్రుల సదస్సు ' జరిగింది. ఈ సదస్సుకు సుమధుర కళానికేతన్ అధ్యక్షులు శ్రీ నరసరాజు గారు అధ్యక్షత వహించారు. యూనివర్సిటీ రంగస్థలకళల శాఖాధిపతి డా. ఎన్.జె. బిక్షు ప్రారంభోపన్యాసం చేస్తూ 'ఇన్నాళ్ళు కేవలం యూనివర్సిటీ నాలుగు గోడలకే పరిమితమైన రంగస్థల కళలశాఖ కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ వలన మరింత విస్తృతమౌతున్నయనీ, ఈ ప్రాజెక్ట్ వలన తెలుగు నాటకరంగంలో ఎనలేని కృషిచేస్తున్న సంస్థలగురించి, నటీనటుల గురించి తెలుసుకునే అవకాశం తమ శాఖ అధ్యాపకులకు మరియూ విద్యార్థులకు కలుగుతుందని' పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డా. పెద్ది రామారావు ఈ ప్రాజెక్ట్ నేపథ్యం, అవసరం తెలియజేస్తూ రాబోయే రెండు సంవత్సరాల్లో తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరిస్తూ.. . మిగతా రాష్ట్రాల నాటకాల్లా మన నాటకాలు ఉండడంలేదు. ఇతర రాష్ట్రాల్లో నాటక సమాజాలకు ప్రభుతం సహాయం చేస్తుంది. మన నాటకాల్ని రిప్రజెంట్ చేసే సమాజాలు లేవు. ఉన్న సమాజాలకు ప్రభుత్వ సహాయం అందడం లేదు. ఎన్.ఎస్.డి. జాతీయ నాతకోత్సవాలకి అప్లై చేయడానికి మన వాళ్ళు ముందుకు రాలేదు. తెలుగు నాటకరంగం అడ్రస్ తెలియజెప్పే ఒక సంస్థ రావాలనే ఉద్దేశంతో రతన్ టాటా వారి సహకారంతో ఈ 'థియేటర్ ఔట్రీచ్ యూనిట్' ను స్థాపించడం జరిగింది. మేం 7 కార్యక్రమాలను రూపొందించాం. వీటిల్లో 3,4 కార్యక్రమాల్లో మాత్రమే స్పష్టమైన అవగాహన ఉంది. మిగతా 3,4 కార్యక్రమాలపై మీ సలహాలను తీసుకోవడానికి ఈ మీటింగ్ ను ఏర్పాటు చేయడమైనది అని అన్నారు. అనంతరం ప్రాజెక్ట్ నిర్వహించదలచిన కార్యక్రమాల గురించి వివరించారు. 50 మందికిపైగా నాటక మిత్రులు హాజరైన ఈ సదస్సులో # నరసరాజు (సుమధుర కళానికేతన్, విజయవాడ)

 1. అడవి శంకర్ (మేకప్ ఆర్టిస్ట్)
 2. కె.కె.ఎల్. స్వామి (శ్రీకాకుళం)
 3. ఎం.ఎస్. చౌదరి (న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్,విజయవాడ)
 4. పి.వి. రమణమూర్తి (నవరస థియేటర్ ఆర్ట్స్)
 5. ఎమ్ డి.ఎస్. పాషా (నరసరావుపేట రంగస్థలి)
 6. హేమ (భాగ్యశ్రీ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, వైజాగ్) వంటి ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

నాటక ప్రముఖుల సమ్మేళనం, గోల్డెన్ త్రెషోల్డ్, హైద్రాబాద్[మార్చు]

05.08.2012 రోజున సాయంత్రం 6.35 ని.లకు గోల్డెన్ త్రెషోల్డ్లో నాటక ప్రముఖుల సమ్మేళనం జరిగింది. ఈ సభకు రాష్ట్ర సాంస్కృతిక సలహాదారులు కె.వి. రమణాచారి గారు, సెంట్రల్ యూనివర్శిటీ ఎస్.ఎన్. స్కూల్ పీఠాధిపతి ఆచార్య అనంతకృష్ణన్, శాఖాధిపతి శ్రీ బిక్షు, నాటకరంగ ప్రముఖులు శ్రీ చాట్ల శ్రీరాములు, శ్రీ అడబాల, శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, శ్రీ డి.ఎస్.ఎన్. మూర్తి, శ్రీ భాస్కర్ శివాల్కర్ మరికొంతమంది నాటకమిత్రులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఆచార్య అనంతకృష్ణన్ వివిధ రాష్ట్రాల నాటకరంగాలగురించి, వాటి అభివృద్ధి గురించి వివరించి, తెలుగు నాటకరంగాన్ని Professional నాటకరంగంగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ పెద్ది రామారావు ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందించారు.

నాటక మిత్రుల అభిప్రాయాలు[మార్చు]

1. ప్రతి జిల్లాలో నాటకసమాజాలకు వర్క్ షాప్స్ నిర్వహించి, శిక్షణ ఇప్పించాలి.

2. యువకులను, పిల్లలను నాటకరంగంలో భాగస్వామ్యం చేయాలి. పాఠశాల స్థాయినుండే రంగస్థల కోర్సురావాలి.

3. నాటకం అనుకున్న సమయానికి ప్రారంభమయ్యేలా సభలు, సన్మానాలు జరక్కుండా చూడాలి.

4. Theatre Graduates ని Resource Persons గా తయారుచేయాలి.

ఆర్టిస్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం[మార్చు]

తెలుగు నాటకరంగంలో పాల్గొనే యువత చాలా తక్కువగా ఉన్నందువలన యువతను ప్రోత్సహించి నాయకరంగానికి చేయూత ఇవ్వాలన్న ఆశయసాధనకొరకు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ 2013 ఏప్రిల్ మాసంలో " ఆర్టిస్ట్ రెసిడెంసీ ప్రోగ్రాం" పేరుతో ఒక కార్యక్రమం రూపొందించాలని ఆలోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతటా ఉన్న ఔత్సాహిక కళాకారులను ఎంపిక చేసి వారుకి నాలుగు మాసాల నాటకరంగ శిక్షణ ఇస్తారు. శిక్షణా కాలంలో మాసానికి 15,000 రూపాయల ఉపకారవేతనం ఇవ్వబడుతుంది. శిక్షణ ముగించిన తరువాత కళాకారులకు తాము శిక్షణ పొందిన నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. కళాకారుల నైపుణ్యం ఈ శిక్షణ వలన మెరుగౌతుంది.

చిత్రమాలిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]

audio
 1. "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్". Archived from the original on 2013-04-20. Retrieved 2013-03-08.
 2. ఈనాడు, ఈతరం (18 May 2013). "కుర్రకారు...నాటకాల జోరు!". Archived from the original on 27 December 2016. Retrieved 6 August 2016.
 3. సూర్య, నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌ (5 February 2013). "ఆద్యంతం రక్తి కట్టించిన 'మిస్‌మీనా' నాటక ప్రదర్శన". Retrieved 6 August 2016.[permanent dead link]