చాట్ల శ్రీరాములు
చాట్ల శ్రీరాములు | |
---|---|
జననం | చాట్ల శ్రీరాములు డిసెంబరు 5, 1931 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
మరణం | డిసెంబర్ 18, 2015 హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | 1956 భారతీయ రైల్వే శాఖలో టిక్కెట్ కలెక్టర్ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు ప్రధానాచార్యులుగానూ |
ప్రసిద్ధి | తెలుగు నాటకరంగ నిపుణుడు , సినిమా నటుడు. |
చాట్ల శ్రీరాములు (డిసెంబరు 5, 1931 - డిసెంబర్ 18, 2015) తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు.
జీవిత విశేషాలు
[మార్చు]శ్రీరాములు గడ్డి అచ్చయ్య, అచ్చమ్మ దంపతులకు 1931 డిసెంబరు 5 తేదీన బెజవాడలో జన్మించాడు.[1] పన్నెండు సంవత్సరాల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశాడు. బి.కాం. చదువుతున్న రోజుల్లో నటుడు కావాలన్న కాంక్ష, నాటకం పట్ల ఉత్సాహాన్ని పెంచుకొన్నాడు. చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించే అభ్యుదయ నాటక ఉత్సవాల్లో ఎస్.ఆర్.ఆర్. కళాశాల పక్షాన ‘మాస్టర్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాములు ఉత్తమ నటుడిగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.[2]
వివాహం - పిల్లలు
[మార్చు]13 సంవత్సరాల వయసులో తన మేనమామ కుమార్తె ఆదిలక్ష్మితో 1944, ఏప్రిల్ 16న వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. గతంలోనే ఒక కుమార్తె, ఒక కుమారుడు మరణించారు. మరో కుయారుడు దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
నాటకాలు, బిరుదులు
[మార్చు]- గొల్లపూడి మారుతీరావు వ్రాసిన ‘లావాలో ఎర్రగులాబీ’ నాటకాన్ని చాట్ల దర్శకత్వం బంగారానికి తావి అబ్బడం లాంటిదని ఎందరో విమర్శకులు ప్రశంసించారు.
- చాట్ల. ఆనాటి ప్రముఖ నటుడు కె. వెంకటేశ్వరరావుతో కలిసి ‘కాళరాత్రి’ అనే నాటకానికి దర్శకత్వం వహించాడు. కొర్రపాటి గంగాధరరావు రచించిన ‘విషకుంభాలు’, ‘డిటెక్టివ్’, ‘భవబంధాలు’, ‘తెలుగు కోసం’ మొదలైన నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు.
- ఆంధ్ర నాటక కళాపరిషత్తు నుండి రెండు సార్లు ఉత్తమ నటుడి అవార్డు పొందారు.
- 1954 ప్రాంతంలో రససమాఖ్య ప్రదర్శించిన ‘దొంగవీరుడు’, ‘మాస్టర్జీ’ మొదలైన నాటకాలకు పన్నెండు బహుమతులు అందుకున్నాడు
- ఈయన ఆంగ్లంలో ఎం.ఎ. లిటరేచర్, బ్రిటీష్ డ్రామా లీగ్ నుండి నటన దర్శకత్వంలో సర్టిఫికెట్ పొందాడు.
వృత్తి, ఉద్యోగం
[మార్చు]- 1956లో భారతీయ రైల్వే శాఖలో టిక్కెట్ కలెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. పబ్లిక్ ఎడ్రసింగ్ సిస్టములో బొంబాయి ఆకాశవాణిలో శిక్షణ పొందాడు.
- చాట్ల 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్ ఎం.ఆర్. అప్పారావు కోరికపై స్టేజీ డైరెక్టర్ ఉద్యోగంలోకి ప్రవేశించాడు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలకు అదే నాంది అయింది. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు ప్రధానాచార్యుడుగానూ, వివిధ కళాసంస్థల్లో సభ్యుడుగానూ వ్యవహరిస్తున్నాడు.
- దాదాపు వందకు పైగా నాటకాలలో నటించి, దర్శకత్వం వహించాడు. చాట్ల నటించిన నాటకాలలో 'మరో మొహంజోదారో' చాలా ప్రసిద్ధి చెందింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వెంకటేశ్, నాగార్జున, రామ్ లాంటి అనేక మంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చాడు.
- ఆధునిక తెలుగు నాటకరంగ చరిత్రలో కృత్తివెంటి నాగేశ్వరరావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, అబ్బూరి రామకృష్ణా రావు, డాక్టర్ గరికపాటి రాజారావు, ఎ.ఆర్. కృష్ణ, కె. వెంకటేశ్వర రావు వంటి హేమాహేమీల జాబితాలో చాట్ల శ్రీరాములు పేరు కూడా కలిసిందంటే ఆయన నటనలో, దర్శకత్వంలో చేసిన అజరామరమైన కృషి, మేదస్సు రంగస్థలానికి నిలువెత్తు దర్పణం.
- దర్శకత్వంలో ఆయన చాలా ప్రయోగాలు చేశాడు.
అనేక విశ్వవిద్యాలయాలు తమ రంగస్థల శాఖకు అధిపతిగా నియమించాయి. ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి కళాశాలలో సుమారు 26 సంవత్సరాలపాటు నాటకరంగ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. లండన్ లోని బ్రిటీష్ డ్రామా లీగ్ లో 1970లో నాటక ప్రయోక్తగా, ఆచార్యునిగా శిక్షణ పొందారు.
నటించిన సినిమాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- ఆయనను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది.
- ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం: ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు చాట్ట శ్రీరాములును 2009 సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాల ముగింపు సందర్భంగా ఈ అవార్డును ఆయనకు రాష్ట్ర సమాచార, సినిమాటో గ్రఫీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి అందజేశారు. ప్రభుత్వ సత్కారంతో పాటు ప్రత్యేక జ్ఞాపిక, రూ.లక్ష నగదు అందజేశారు.
- 2003లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు వచ్చింది.
మరణం
[మార్చు]గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరాములు సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2015, డిసెంబర్ 18 శుక్రవారం మృతి చెందారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమిలో చాట్ల గురించిన వ్యాసం.[permanent dead link]
- ↑ 2.0 2.1 ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రయోగ నాటక పితామహుడు". Retrieved 6 August 2017.[permanent dead link]
- ↑ నాటక రంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు కన్నుమూత