Jump to content

దాసి (1952 సినిమా)

వికీపీడియా నుండి
దాసి
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి. రంగనాథదాస్
నిర్మాణం సి.లక్ష్మీరాజ్యం
తారాగణం ఎన్.టి.రామారావు,
సి.లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ రాజ్యం పిక్చర్స్
భాష తెలుగు
దాసి సినిమాలోని ఒక పాత్రలో ఎన్.టి. రామారావు

దాసి ఎల్వీ ప్రసాద్ పర్యవేక్షణలో సి.వి. రంగనాథదాస్ దర్శకుడిగా పరిచయమై 1952లో విడుదలైన తెలుగు సినిమా. నటి లక్ష్మీరాజ్యం ఈ చిత్రాన్ని రాజ్యం పిక్చర్స్ బేనర్‌పై నిర్మించింది. సుందర్ లాల్ నహతా ఆధ్వర్యంలోని అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ రాజశ్రీ పిక్చర్స్ ఈ చిత్రానికి ఆర్థికంగా సహకరించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కావడంతో లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధరరావు ఈ చిత్రాన్ని తమిళంలో వెలైకరి మగళ్ పేరుతో నిర్మించారు. అయితే ఆ చిత్రం అంతగా విజయవంతం కాలేదు.[1]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

రామయ్య జట్కా తోలుతుంటాడు. భార్య లక్ష్మి బద్రీనాథ్ ఇంట్లో పాచిపని చేస్తూంటుంది. వారికి సుబ్బడు అనే కొడుకు ఉంటాడు. బద్రీనాథ్ సంపన్నుడు. అతని భార్య పార్వతమ్మ. వారికి నడివయసు వచ్చినా సంతానం లేనందువల్ల వారి బంధువులు అందరూ బద్రీనాథ్‌ను సంతానం కోసం మరో వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారు. బద్రీనాథ్ మేనల్లుడు నారాయణరావు మాత్రం పెళ్ళి చేసుకోవద్దని మామకు బుద్ధిచెబుతాడు. కానీ బద్రీనాథ్ పెళ్ళిచూపులకోసం ఊరు వెళతాడు. పార్వతమ్మ అన్న రామారావు చెల్లెల్ని చూడటానికి వచ్చి జరిగిన కథ అంతా విని, బద్రీనాథ్ బంధువులు ఆయన ఆస్తి కోసం ఈ పన్నాగం పన్నారని తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు.

పార్వతమ్మ దాసి లక్ష్మి గర్భవతిగా ఉంటుంది. పార్వతమ్మ అన్న రామారావు పార్వతమ్మను, తను గర్భవతిగా ఉన్నట్లు నటించి దాసి లక్ష్మికి పుట్టబోయే బిడ్డను రహస్యంగా పెంచుకోమని సలహా ఇస్తాడు. కానీ సమయం వచ్చేవరకు ఈ సంగతి లక్ష్మికి తెలియనీయవద్దని చెబుతాడు. పార్వతికి మరోదారి లేక దానికి అంగీకరిస్తుంది. పెద్ద దాసి నర్సమ్మకు ఈ విషయమంతా చెప్పి తగినట్లు ప్రవర్తించమంటారు. రామారావు, తరళ అనే లేడీడాక్టరుకు లంచమిచ్చి పార్వతి గర్భవతిగా ఉన్నదని బద్రీనాథ్‌కు చెప్పిస్తాడు. దానితో బద్రీనాథ్ రెండో పెళ్ళి ప్రయత్నం మానుకొంటాడు.

లక్ష్మికి కలగబోయే బిడ్డనే తాను పెంచుకోదలచినందువల్ల పార్వతి లక్ష్మికి ప్రతిరోజూ పాలు, ఫలహారాలు ఇచ్చి ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటుంది. పార్వతి లక్ష్మిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి లక్ష్మి భర్త రామయ్య భార్యను అనుమానిస్తాడు.

లక్ష్మికి నవమాసాలు నిండుతాయి. ఒకనాడు పార్వతమ్మ పెద్దదాసి నర్సమ్మ, రామారావు లక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మితో తామొక రహస్యం చెబుతామని, ఆ రహస్యం తన భర్తకు కూడా చెప్పకూడదని,ఒక్కగానొక్క కొడుకు మీద ఒట్టువేసుకొమ్మని అడుగుతారు. లక్ష్మి ఒట్టువేసుకొంటుంది. పార్వతి గర్భవతి కాదని, లక్ష్మికి పుట్టబోయే బిడ్డను పార్వతికిచ్చి పార్వతి మానప్రాణాలను కాపాడమని రామారావు లక్ష్మి చేతులు పట్టుకొని బ్రతిమాలతాడు. అదే సమయానికి వచ్చిన రామయ్య తన భార్య చేతులు రామారావు పట్టుకొని ఉండడాన్ని చూస్తాడు. రామారావు ఎందుకు వచ్చాడో చెప్పమని భార్యను అడుగుతాడు. కొడుకు మీద ఒట్టు వేసినందున లక్ష్మి భర్తకు నిజం చెప్పలేకపోతుంది. రామయ్య లక్ష్మిని ఇంట్లో నుండి వెళ్లగొడతాడు. లక్ష్మి ఏడుస్తూ పోయి పార్వతమ్మ కాళ్లమీదపడుతుంది. తన భర్తకు నిజం చెప్పి తన కాపురం నిలబెట్టమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో నిజం చెబితా రామయ్య ఉద్రేకంలో ప్రపంచమంతా చాటుతాడని తర్వాత నెమ్మదిగా రామయ్యకు నిజం చెప్తానని పార్వతమ్మ లక్ష్మిని సముదాయించి తన బంగళాలోనే ఉంచుతుంది.

లక్ష్మికి పురిటి సమయం వస్తుంది. లేడీడాక్టరు తరళను పిలవడానికి పార్వతమ్మ అన్న రామారావు వెళతాడు. ఆ సమయంలో బద్రీనాథ్ మేనల్లుడు నారాయణరావు తరళ ఇంట్లో ఉంటాడు. నారాయణరావును ఆరాత్రి పార్వతమ్మ బంగళాకు రానీయకుండా చేయమని రామారావు తరళని బ్రతిమాలుతాడు. తరళ నారాయణరావును ఇంట్లో ఉంచి తాళం వేసి రామారావుతో పార్వ్తతమ్మ బంగళాకు వస్తుంది.

పార్వతమ్మ పెద్దదాసి నిజంగా నొప్పులు పడుతున్న లక్ష్మిని నోరెత్తి అరవనీయదు. నొప్పులు లేని పార్వతమ్మను బిగ్గరగా అరవమంటుంది. లక్ష్మికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లను తెచ్చి పార్వతమ్మ ప్రక్కలో పడుకోబెట్టి బద్రీనాథ్‌కు కూతురు పుట్టిందని చెబుతారు. అతడు సంతోషంతా ఉప్పొంగిపోతాడు. బిడ్డకు కమల అనే పేరు పెడతాడు.

గొడ్రాలికేమి తెలుసు బిడ్డ సుఖం అన్నట్లు పార్వతమ్మ ప్రక్కనున్న పిల్ల ఏడుస్తున్నా గమనించడు. బిడ్డ ఏడ్చినప్పుడెల్లా లక్ష్మి వచ్చి బిడ్డను తీసికొంటుంది. లక్ష్మి మాతృప్రేమ వల్ల ఎక్కడ అసలు రహస్యం బయట పడుతుందోనని పార్వతమ్మ తన ఒంట్లో బాగాలేదని, చికిత్స కోసం మద్రాసు వెళ్తానని భర్తతో చెప్పి లక్ష్మికి తెలియకుండా ఒకరాత్రి మద్రాసుకు వెళ్లిపోతుంది. తెల్లవారగానే లక్ష్మి పార్వతమ్మ ఇంటికి వచ్చి కమల కనబడకపోవడంతో కంగారుపడుతుంది. పెద్దదాసి నర్సమ్మ లక్ష్మిని తిట్టి ఇంటినుండి వెళ్ళగొడుతుంది.

లక్ష్మి ఏడుస్తూ భర్తదగ్గరకు వస్తుంది. భర్త రామయ్య ఆ సమయంలో దుర్గి అనే ఆమెను పెళ్ళి చేసుకోవడం చూస్తుంది. భర్త కాళ్లమీదపడి రక్షించమని బ్రతిమాలుతుంది. రామయ్య లక్ష్మి జుట్టు పట్టుకొని యీడ్చి యింటి నుండి వెళ్లగొడతాడు. ఇక తనకు చావే శరణ్యమనుకొని లక్ష్మి అక్కడి నుండి వెళ్లిపోతుంది.

సవతి కొడుకు సుబ్బడిని చూస్తే గిట్టని దుర్గి వాడిని నీళ్లలో తోసి వాడే నీళ్లలో పడ్డాడని గోలపెడుతుంది. రామయ్య కొడుకు కోసాం ఏటిలో దూకి వెదుకుతాడు కానీ కొడుకు దొరకలేదు. అదే సమయంలో జీవితం మీద విరక్తి చెంది లక్ష్మి ఇంకో ఒడ్డు నుండి ఏటిలో దూకుతుంది. ఆమెకు ప్రవాహంలో కొట్టుకొస్తూ కొన వూపిరిలో ఉన్న కొడుకు సుబ్బడు కనిపిస్తాడు. ఆమె వాడిని కాపాడి ఒడ్డుకు వచ్చి డాక్టరు దయాకర్ వద్దకు తీసుకువస్తుంది. దయాకర్ సుబ్బడిని బ్రతికిస్తాడు. లక్ష్మి దయాకర్ ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. సుబ్బడు దయాకర్ పిల్లల్తో కలిసి చదువుకుంటాడు.

రామయ్య రెండోభార్య దుర్గికి నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి. భర్తకు తెలియకుండా ఒక నటుడితో స్నేహంచేసి ఇంట్లోనుండి లేచిపోతుంది. మద్రాసులో పార్వతమ్మ కూతురు ఏడేండ్ల బిడ్డ అవుతుంది. ఇంటివద్ద బద్రీనాథ్ చనిపోతాడు. కమల దాసి లక్ష్మి కూతురు అని తెలిసి బద్రీనాథ్ బంధువులు ఆస్తికోసం దావా వేస్తారు. దేశం అంతా ఈ విషయం తెలిసిపోతుంది. లక్ష్మి నిర్దోషి అని రామయ్య తెలుసుకుంటాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి సన్యాసులలో కలిసిపోతాడు. డాక్టర్ దయాకర్ బద్రీనాథ్ ఆస్తి గురించిన దావావిషయాలు పేపర్లో చదివి భార్యతో చెప్తుంటే లక్ష్మి విని మద్రాసుకు బయలుదేరుతుంది. కోర్టులో కమల పార్వతమ్మ కూతురే కాని నా కూతురు కాదని లక్ష్మి సాక్ష్యం ఇస్తుంది. దానికి ఆధారంగా డాక్టర్ తరళ ఇచ్చిన కాగితాలను చూపుతుంది. దానితో కోర్టు కేసును కొట్టివేస్తుంది. తన ఆస్తిని కాపాడినందుకు పార్వతమ్మ లక్ష్మిని కౌగిలించుకొని తప్పును క్షమించమని కోరుతుంది. పార్వతమ్మ లక్ష్మిని మద్రాసులోనే వుండమని బ్రతిమాలుతుంది. లక్ష్మి అంగీకరిస్తుంది. దయాకర్‌తో చెప్పి లక్ష్మి మద్రాసు చేరుతుంది. సుబ్బడు దయాకర్ పిల్లలతోనే చదువుకుంటూ ఉంటాడు.

పది సంవత్సరాలు గడిచాయి. సుబ్బడు సుబ్బారావుగా మారి ప్లీడరు పాసై మద్రాసులో ప్రాక్టీసు పెడతాడు. కమల యుక్తవయస్కురాలు అవుతుంది. కాని లక్ష్మిని దాసిగానే భావిస్తుంటుంది. కమల రామారావు కొడుకు ప్రేమనాథ్‌ను ప్రేమిస్తుంది. రామారావు భార్య దేవకి దాసిపిల్ల అయిన కమలను తన కొడుకుకు చేసుకోవడానికి ఇష్టపడదు.

భిక్షాటన చేస్తూ సన్యాసి వేషంలో ఉన్న రామయ్య తన రెండవ భార్య దుర్గిని చూసి అసహ్యించుకొంటాడు. రాత్రి ఆమెను హతమార్చాలని అనుకొంటాడు. కానీ ఈ లోపుగానే దుర్గి ప్రియుడే ఆమెను హత్యచేసి పారిపోతాడు. రామయ్య మీదకు ఆ కేసు వస్తుంది. రామయ్యను సుబ్బారావు కేసునుండి తప్పిస్తాడా? లక్ష్మి తన కన్నతల్లి అని కమల తెలుసుకొంటుందా? రామారావు భార్య తన కొడుకు ప్రేమనాథ్ దాసి కూతురు కమలను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అనేవి మిగిలిన కథ[2].

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆచార్య ఆత్రేయ రచించగా సి.ఆర్.సుబ్బురామన్ సంగీత సారథ్యం వహించాడు. చిత్ర నిర్మాణ సమయంలో అతను మరణించగా సుసర్ల దక్షిణామూర్తి ఆ బాధ్యతను నిర్వహించాడు[3].

  1. చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు మానవే - పి.లీల
  2. జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే ఘోడా జల్దీ చలో - పిఠాపురం నాగేశ్వరరావు
  3. మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు బువ్వేమైన - కె. ప్రసాదరావు, పి.లీల
  4. ఏడువకమ్మా ఏడువకు ఏడుపులన్నీ పేదలకు -
  5. కలకలలాడే పండుగ నేడే బిరబిర రారండి మా పాపను చూడండి - జిక్కి బృందం
  6. కొత్త కాపురము నేడు నా మొగుడు మెత్తనైపోయాడు -
  7. తీరిపోయింది కన్నపిల్లలకు చేకొన్న మగనికి దూరమై -
  8. నా చిన్నారి బావ వెన్నెల మావా ఎన్నాళ్ళకోయీ బావ -
  9. వయసు సొగసు యువరాణీ నీ వలపునేలు దొరరాణి -
  10. సల్లంగ సుక్కని తిప్పరా అయిలెసా మెల్లంగ ఈ ఏరు దాటరా -
  11. సున్న సున్న కూడుకున్న సున్నేరా జంగం జంగం రాసుకున్న -

మూలాలు

[మార్చు]
  1. m.l.narasimham (26 May 2013). "Dasi (1952)". ది హిందూ. Retrieved 16 June 2016.
  2. దాసి (1952) సినిమా పాటల పుస్తకం ఆధారంగా
  3. "దాసి -1952". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 June 2016.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]