దేశిని చిన్నమల్లయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేశిని చిన్నమల్లయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు[1] కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ మాజీ శాసనసభ్యుడు. గ్రామప్రథమ పౌరుడిగా ప్రారంభమైన అతని రాజకీయ ప్రస్థానం హుస్నాబాద్‌ సమితి ఉపాధ్యక్షుడిగా, ఇందుర్తి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుమార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించాడు. రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకంగా నికార్సయిన వ్యక్తిగానూ పేరొందారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

చినమల్లయ్య కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో దేశిని లచ్చయ్య, బుచ్చవ్వలకు 1932లో జన్మించాడు. అతని తండ్రి తాటిచెట్టు నుంచి పడి అకాల మరణం పొందడంతో మల్లయ్య కుటుంబ బాధ్యతలు భూజాన ఎత్తుకున్నాడు. పేద గీత కార్మికుడి కుటుంబంలో పుట్టిన అతను పిన్న వయస్సులోనే కుల వృత్తిని చేపట్టాడు. ఆరో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివిన ఆయన 1947 నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దళాలకు కొరియర్‌గా పని చేశారు. వెట్టి చాకిరి బానిసత్వ వ్యతిరేక భూ అక్రమణ ఉద్యమాలను చేపట్టి ప్రజలను చైతన్య పరిచారు. 1951లో అతను రాజేశ్వరమ్మను వివాహం చేసుకున్నాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ తనవంతు పాత్ర పోషించాడు. 1953లో సీపీఐ సభ్యత్వం తీసుకొని వ్యవసాయ కార్మిక సంఘాల నిర్మాణ బాధ్యతలు, కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపట్టాడు. 1953లో జనరల్‌ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేశాడు. అదే సంవత్సరం సీపీఐలో చేరి వ్యవసాయ కార్మిక సంఘం, భూపోరాటాల్లో పాల్గొన్నాడు. భూస్వాములు, ముస్తాజర్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. 1957లో స్వగ్రామం బొమ్మనపల్లి సర్పంచ్‌గా అక్కడి పటేల్‌, పట్వారీల ఆగడాలను ఎదిరించి ఎన్నికయ్యాడు. రెండుమార్లు సర్పంచ్‌గా పని చేశాడు. మరో రెండుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికై 1978 వరకూ 21ఏండ్లు సర్పంచ్‌గా, సమితి వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1978 జనరల్‌ ఎన్నికలలో అప్పటి ఇందుర్తి నియోజకవర్గం (హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం) నుంచి సీపీఐ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మరో మూడుమార్లు 1984 ,1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందాడు. సీపీఐలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడు. దాదాపు 51 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలో కార్య కర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవులు అలం కరించిన దేశిని మల్లయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనను వ్యతిరేకించినందున 2001లో సీపీఐకి రాజీనామా చేశాడు.[3][4]

ఆయన 1957 నుంచి 1978 వరకు బొమ్మనపల్లి గ్రామసర్పంచ్‌గా, హుస్నాబాద్‌ సమితి అధ్యక్షుడిగా, 1978, 1985, 1989, 1994లో నాలుగుసార్లు ఇందుర్తి(హుస్తాబాద్‌) శాసనసభకు సి.పి.ఐ తరపున శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. [5][6][7][8] ఆయన కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్త స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు వివిధ పదవులను నిర్వహించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ ముఖ్యనేతల్లో ఒకరు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా, పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాలు నచ్చక 2004లో ఆ పార్టీని వదిలి తెలంగాణ రైతాంగ సమితిని ఏర్పాటు చేశారు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయంలో కీలక పాత్ర[మార్చు]

సీపీఐకి రాజీనామా చేసిన అనంతరం చినమల్లయ్య 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ ముఖ్యుల్లో ఒకరిగా నిలిచాడు. టీఆర్‌ఎస్‌ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మెన్‌గా, పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నిర్మాణ కార్యక్రమాలు చేశాడు. కరీంనగర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సింహ గర్జన సభ జరిగిన రోజు తన తల్లి చనిపోయినా స్వగ్రామంలో అంత్య క్రియలు నిర్వహించి ఆ సభకు హాజరయ్యాడు.[9]

తెలంగాణ రైతాంగ సమితి ఏర్పాటు[మార్చు]

2004లో టీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాలను నచ్చక పార్టీని వదిలి తెలంగాణ రైతాంగ సమితిని ఏర్పాటు చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జనపరిషత్‌తో కలిసి వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా, జేఏసీ సభ్యుడిగా ప్రజాసంఘాల జేఏసీలో ఉంటూ అనేక పోరాటాలు చేశాడు. రైతు సమస్యలతో పాటు గీత కార్మికుల సమస్యలు ఇతర ప్రజాపోరాటాల్లో తుది శ్వాస విడిచే వరకు కొనసాగాడు.

నిరాడంబర జీవితం[మార్చు]

ఎన్ని పదవులు అలం కరించినా సామాన్యులు ధరించే దోతి, లాల్చినే వాడి సాదాసీదా జీవితాన్ని మాత్రమే గడిపాడు. నమ్ముకున్న సిద్దాంతాన్ని ఏనాడు మరువకుండా ప్రజాసేవ కోసం నిరంతరం పని చేశాడు. వెనుకబడిన ఇందుర్తి నియోజకవర్గంలో వేల ఎకరాల భూములు పేదలకు పంచాడు. గూడు లేని నిరుపేదలకు ఎమ్మెల్యే కోటాలో ఇళ్లను నిర్మించి ఇచ్చాడు. ఎమ్మెల్యేగా ఉండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవాడు. ప్రతి ఒక్కరిని వరుసలతో పిలుస్తూ ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు.

మరణం[మార్చు]

ఆయన అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం నవంబర్ 11 2017 తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.[10][11]

మూలాలు[మార్చు]

 1. http://www.andhrajyothy.com/artical?SID=490134
 2. "కమ్యూనిస్టు యోధుడు చినమల్లయ్య ఇకలేరు".
 3. "మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత".
 4. "మాజీ ఎమ్మెల్యే చినమల్లయ్య కన్నుమూత". namaste telangana.
 5. ఎన్నికల ఫలితాలు
 6. ఎన్నికల ఫలితాలు
 7. ఎన్నికల ఫలితాలు
 8. ఎన్నికల ఫలితాలు
 9. "టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన నేత మృతి".
 10. ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశినేని చిన్న మల్లయ్య కన్నుమూత
 11. "మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత". ఆంధ్రభూమి. 12 November 2017.

ఇతర లింకులు[మార్చు]