Jump to content

దోమా వేంకటస్వామిగుప్త

వికీపీడియా నుండి
(దోమ వెంకట స్వామి గుప్త నుండి దారిమార్పు చెందింది)
దోమా వేంకటస్వామిగుప్త
దోమా వేంకటస్వామిగుప్త
జననందోమా వేంకటస్వామిగుప్త
1899
కర్నూలు
మరణం1962, ఫిబ్రవరి 13
గుంటూరు
వృత్తితెలుగు ఉపన్యాసకుడు,పచ్చయప్ప కళాశాల మద్రాసు
ప్రసిద్ధిఅవధాని, కవి
మతంహిందూ
తండ్రిగోవిందప్ప శెట్టి
తల్లికోటమ్మ

దోమా వేంకటస్వామిగుప్త దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి దంపతులకు కర్నూలు పట్టణంలో జన్మించాడు. సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు. స్కూలు ఫైనల్ ఇంగ్లీషు మీడియంలో చదివాడు. అష్టావధానాలు, శతావధానాలు చాలా చేశాడు. ఆశుకవిత్వం చెప్పాడు. అనేక చోట్ల ఇతడు సన్మానాలు పొందాడు. ఇతడు హరికథారచయిత, కవి, నాటక కర్త, విమర్శకుడు, శతకకర్త, నవలారచయిత. చంద్రిక అనే పత్రికకు సంపాదకుడు.

కవితా వ్యాసంగం

[మార్చు]

పదకొండు సంవత్సరాల వయసులోనే కవితావ్యాసంగం ప్రారంభించాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అనకాపల్లి వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంథం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంథం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, మద్రాసు క్రైస్తవ కళాశాలలో, పెరంబూరులోని కళాశాల, విజయవాడలో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల తెలుగు పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో మహాత్మా గాంధీని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళ గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు. సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, చిలుకూరి నారాయణరావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు. తిరుపతి వేంకటకవులు గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక పద్యము చెప్పి గురుస్తుతి చేసేవాడు. గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.

అవధాన ప్రస్థానం

[మార్చు]

ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో గుంటూరు ఆవధానాలు, చీరాల అవధానం, జాండ్రపేట అవధానం, మద్రాసు అవధానం, రాజమండ్రి అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు.[1]

ఇతడు పూరించిన కొన్ని అవధాన పద్యాలు:

  • సమస్య: నిద్రాదేవత నిన్ను బూనె గదరా! నిర్భాగ్యదామోదరా!

పూరణ:

భద్రంబౌ శశిబింబముం దెగడగా నేపాఱనౌమోము, న
క్షుద్రంబైన జలేజముల్ కనులు; సంకోచంబు లేకుండు ని
ర్ణిద్రం జెందెను యౌవనంబు సతికిన్; నీరీతి నిం గాంచ నీ
నిద్రాదేవత నిన్ను బూనె గదరా! నిర్భాగ్యదామోదరా!

  • సమస్య: ఈ శునకము కృష్ణుచేత నెన్నఁగఁబడియెన్

పూరణ:

పేశలతా రహితుఁడు భూ
మీఁశుడు ధృతరాష్ట్రు సభను నెడ పాండుక్ష్మా
ధీశు కుమారుల కొఱకై
యీశునకము కృష్ణుచేత నెన్నఁగఁబడియెన్

రచనలు

[మార్చు]
  1. శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణము: ఈ గ్రంథాన్ని 1929లో వ్రాయడం మొదలుపెట్టి 18 సంవత్సరాలు ఎంతో శ్రమకోర్చి సంస్కృతం నుండి తెలుగులోనికి అనువాదం చేశాడు. 1947లో ప్రచురింపబడింది. దీనిలో గణేశ ఖండము, ప్రకృతి ఖండము, శ్రీకృష్ణ జన్మఖండము మొదలైన ప్రకరణలతో 14వేల పద్యాలు ఉన్నాయి.
  2. శ్రీ పరకాల విలాసము : వెయ్యి పద్యాలతో కూడిన గ్రంథము. తిరుమంగై అళ్వారు చరిత్ర.
  3. ప్రేమాభిరామము : 600 పద్యాలు కలిగిన శృంగార ప్రబంధం.
  4. శ్రీ కన్యకాపురాణము: 18 సంవత్సరాలకు పైగా శ్రమించి అనేక గ్రంథాలను పరిశోధించి వ్రాసిన పద్యకావ్యము. 15వందల పద్యాలున్నాయి.
  5. అవధాన కవితామంజరి : అవధానాలలో చెప్పిన పద్యాలు.
  6. శ్రీ గోమాతృ గౌరవము: గోమాత గురించి వ్రాసిన 400 పద్యాలతో కూడిన కావ్యము.
  7. శ్రీ చంద్రకళా సుదర్శనము : దేవీభాగవతములోని ఒక కథ ఆధారంగా వ్రాసిన నాటకము
  8. దూతాంగదము : నాటకము. సంస్కృత నాటకానికి అనువాదము.
  9. శ్రీకృష్ణదేవరాయల చరిత్రము (విమర్శ)
  10. ఝంఝామారుతము (విమర్శ)
  11. విమలానందము (నవల)
  12. చంద్రిక (నవల)
  13. సీతాకళ్యాణము (హరికథ)
  14. శ్రీ కన్యకాపురాణము (హరికథ)
  15. శ్రీ సాయిబాబా చరిత్ర (హరికథ)
  16. శ్రీ త్రిపురదాసు చరిత్ర (హరికథ)
  17. శ్రీ లక్ష్మీనృసింహ ధ్వరీయం (శతకము)
  18. శ్రీ వీరరాఘవ శతకము
  19. శ్రీ కామేశ్వరి శతకము
  20. శ్రీ గంగాలహరి (అనువాదం)
  21. ముకుందమాల (అనువాదం)
  22. రోహిదాను
  23. శ్రీ బ్రహ్మేశ్వరపురాణము
  24. గౌతమీక్షేత్ర మాహాత్మ్యము
  25. సుజన త్రయము
  26. ఆత్మబోధ
  27. దిలీపుని చరిత్రము
  28. శ్రీ సాయి స్తవమంజరి
  29. ఆదవాని యవధానము
  30. శ్రీ సాయి గురుచరిత్రము[2]

బిరుదములు

[మార్చు]
  • శ్రీమదాంధ్ర విద్యావాచస్పతి
  • సాహిత్యసరస్వతి
  • విద్యావినోదకవిభూషణ
  • విద్యాసాగర
  • కవిరత్న
  • ఆశుకవితాధురీణ
  • ఆశుకవితల్లజ
  • అవధాని పంచానన
  • కవి చక్రవర్తి
  • అవధాన పితామహ
  • శతావధాని
  • వైశ్యకుల భూషణ

సన్మానాలు, పురస్కారాలు

[మార్చు]

2-5-1949 వ సంవత్సరంలో విజయవాడలో ఎందరో పెద్దల సమక్షంలో జరిగిన గజారోహణం, సన్మానపత్రం, కనక స్నానం, గండ పెండేరం, సువర్ణ పాత్ర, వెయ్యిన్నూటపదహార్ల నగదులతో జరిగిన అత్భుత సత్కార కార్యక్రమం ఇతని జీవితంలో మరపు రాని మధురమైన సువర్ణ ఘట్టం.

మరణం

[మార్చు]

దోమా వేంకటస్వామిగుప్త 1962వ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదిన గుంటూరు పట్టణంలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 165–170.
  2. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక జూలై 1946 పేజీ98
  • కర్నూలు జిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు - కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం