నందగిరి ఇందిరాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందగిరి ఇందిరాదేవి
NandagiriIndiradevi.jpg
నందగిరి ఇందిరాదేవి
జననంసెప్టెంబరు 22, 1919
హనుమకొండ, తెలంగాణ
మరణంజనవరి 22, 2007
షుగర్‌ల్యాండ్, టెక్సస్
ప్రసిద్ధితొలి తరం తెలంగాణ కథారచయిత్రి
భార్య / భర్తనందగిరి వెంకటరావు
తండ్రివడ్లకొండ నరసింహారావు

నందగిరి ఇందిరాదేవి (సెప్టెంబరు 22, 1919 - జనవరి 22, 2007) తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఇందిరాదేవి సెప్టెంబరు 22, 1919హనుమకొండలో జన్మించింది. ఈమె తండ్రి వడ్లకొండ నరసింహారావు సంఘ సేవకుడు. నారాయణగూడ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత ముంబై లోని శ్రీమతి నాతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో చదివి,[1] 1937లో బి.ఎ. పట్టబద్ధురాలైంది.

రచనా ప్రస్థానం[మార్చు]

పధ్నాలుగో ఏటే పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించింది. ఆమె అనేక సామాజిక, సాంసృతిక ఉద్యమాల్లో పాలు పంచుకునేది. ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ఇందిరాదేవి సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేసింది. వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహాల పట్ల నిరసన. అందువల్లనే తాను స్వయంగా యుక్తవయస్కురాలు అయిన తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నది.[1] 1937లో నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభకు అనుబంధంగా జరిగిన ఆంధ్రమహిళాసభలకు ఇందిరాదేవి అధ్యక్షత వహించింది.

నిజాం పాలనాకాలంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన ‘నషర్’ కార్యక్రమాల్లో పాల్గొనేది. చాలా రేడియో ప్రసంగాలు వ్రాసింది. సంసార, కుటుంబ సంబంధమైన ఇతివృత్తాలతో వ్రాసిన ఇందిరాదేవి కథలు, వ్యావహరిక భాషలో, సరళ శైలిలో ఉన్నాయి. తన కథల్లో వరంగల్ జిల్లా ప్రజా జీవితాన్ని చిత్రించింది.[2] తన కథలలో స్త్రీ పురుషుల మనస్తత్వాలను సుకురమారంగా చిత్రించింది. ఆమె వ్రాసిన కథలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజామిత్ర, వనితాజ్యోతి వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.[3] తను వ్రాసిన కథలను సంపుటిగా అచ్చు వెయ్యకపోయినా, దాదాపు ఆరు దశాబ్దాల (6 decades)పాటు రచించిన రేడియో ప్రసంగాల్లో ప్రముఖమైన వాటిని ఎంపికచేసి ఆమె “మసకమాటున మంచి ముత్యాలు” పేరుతో 1995లో అచ్చువేసుకుంది. కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుష సంబంధాల్లోని వైరుధ్యాలు, సామాజిక సమస్యలు, మనిషి మనస్తత్వ వైచిత్రి వంటి అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని ఆమె ‘వాయిద్యం సరదా’, ప్రథమ పరిచయం’, ‘ప్రాప్తం’, ‘ఏకాకి’ వంటి చాలా కథలు వ్రాసినా, సుమారు పాతిక మాత్రమే లభ్యమైనాయి. వాటిల్లో మనుషుల్లోని సున్నితమైన మానసిక విశ్లేషణని ఆవిష్కరిస్తూ వ్రాసిన కథ ‘పందెం’ ప్రముఖమైనది.[1]

ఈమె భర్త నందగిరి వెంకటరావు వృత్తి రీత్యా న్యాయవాది. తొలితరం తెలంగాణ కథకుల్లో అగ్రగణ్యుడు. ఆంగ్ల, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసిద్ధ కథా రచయిత. 1926-35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు వ్రాశాడు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. ఈయన 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాదులో నిర్వహించాడు.[4]

2006లో తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరాదేవిని హాస్యరచనలకుగాను ధర్మనిధి పురస్కారానికి ఎంపికచేసింది.[5]

రచించిన కథలు[మార్చు]

 1. ఆడవారికి అలుక ఆనందం
 2. ఎవరి తరమమ్మా ఉద్యోగితో కాపరం
 3. ఒక వానరోజున మా ఇంట్లో...
 4. గంగన్న
 5. పందెం
 6. మా వారితో బజారుకు
 7. మావారి పెళ్ళి
 8. రూల్సు ప్రకారం మాయిల్లు
 9. వాయిద్యం సరదా
 10. విషమ సంఘటన

వంటి కథలు రచించింది.[6]

మరణం[మార్చు]

ఇందిరాదేవి అవసానదశలో 1998 నుండి అమెరికాలో తన కుమారుల వద్ద ఉంది. జనవరి 22, 2007 న ఆమె షుగర్‌ల్యాండ్, టెక్సస్ (హ్యూస్టన్ సబర్బు) లో తుది శ్వాస విడిచింది.[7]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 విహారి (జూన్ 16, 2013). "ఆనాటి కథలు.. ఆణిముత్యాలు - 11". ఆంధ్రభూమి. Retrieved 5 November 2014. {{cite news}}: Check date values in: |date= (help)[permanent dead link]
 2. ముదిగంటి, సుజాతారెడ్డి. "తెలంగాణా గుండెచప్పుళ్ళు". స్త్రీవాద పత్రిక భూమిక. Retrieved 5 November 2014.
 3. ఐతా, చంద్రయ్య (February 7th, 2010). "దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ". ఆంధ్రభూమి. Retrieved 5 November 2014. {{cite news}}: Check date values in: |date= (help)[permanent dead link]
 4. సంగిశెట్టి, శ్రీనివాస్. "అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు". సారంగ సాహిత్య వారపత్రిక. Archived from the original on 29 నవంబర్ 2014. Retrieved 5 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 5. "Telugu varsity announces Dharmanidhi Awards". The Hindu. August 27, 2006. Retrieved 5 November 2014.
 6. కథానిలయం. "రచయిత: నందగిరి ఇందిరాదేవి". kathanilayam.com. Retrieved 10 June 2017.[permanent dead link]
 7. "Mrs. Indira Devi Nandagiri - Obituary". Southpark.Tributes.com. Retrieved 5 November 2014.[permanent dead link]